కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్‌ పియర్లను ఏం చేస్తారు?

కాళేశ్వరాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రులు

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించిన తెలంగాణ మంత్రులు
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్ పిల్లర్లు కుంగిన ఘటనలో వాస్తవాలు ప్రజల ముందు పెడతామని అధికార కాంగ్రెస్ నాయకులు కొన్ని రోజులుగా చెబుతూ వస్తున్నారు. డిసెంబర్ 29న మేడిగడ్డ బరాజ్ దగ్గర అధికారులతో ఈ ప్రాజెక్ట్ పూర్వాపరాలు, ప్రస్తుత స్థితిపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇరిగేషన్ శాఖ అధికారులు తమ ఇంజనీరింగ్ బాధ్యతలు విస్మరించి గత ప్రభుత్వానికి కీలుబొమ్మలుగా వ్యవహరించారని, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా మాట్లాడలేదని ఈ సందర్భంగా మంత్రుల బృందం తీవ్ర ఆరోపణలు చేసింది.

ప్రాజెక్ట్ పనికిరాని స్థితిలో తీవ్రమైన ఆర్థిక భారం మోపిందని, ప్రాజెక్ట్ డిజైన్లు, మన్నిక, నిధుల దుర్వినియోగం ఇలా అనేక అంశాలపై మంత్రుల బృందం పలు అనుమానాలు వ్యక్తం చేసింది.

మేడిగడ్డ బరాజ్ సమీక్ష

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్ వద్ద జరిగిన సమీక్షా సమావేశంలో ప్రసంగిస్తున్నఉత్తమ్ కుమార్ రెడ్డి

చీఫ్ ఇంజనీర్ ఏమన్నారంటే...

ఈ ఏడాది నవంబర్ 21 న కాళేశ్వరం ప్రాజెక్ట్ మల్టిస్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ బరాజ్‌లో కొంత భాగం కుంగిపోయింది. మేడిగడ్డ బరాజ్‌కు జరిగిన డ్యామేజీ గురించి ఇంజినీర్-ఇన్-చీఫ్ సి. మురళీధర్ రావు ఇలా వివరించారు.

"అక్టోబర్ 21వ తేదీన సాయంత్రం 6 గంటల 20 నిమిషాల ప్రాంతంలో బరాజ్ వద్ద బాంబు పేలినట్లుగా పెద్ద శబ్దం వచ్చింది. 7వ బ్లాకులోని 19, 20, 21 పియర్ల వద్ద డ్యామేజీ జరిగినట్లు ఇంజినీర్లు గుర్తించారు. 20వ పియర్‌తోపాటు దానికి అటు ఇటూ ఉండే 18, 19, 21 పియర్లు కుంగాయి. వాటి శ్లాబులు కూడా కుంగాయి.

రాత్రి 11 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకున్న రామగుండం చీఫ్ ఇంజినీరు మరింత నష్టం జరగకుండా ఉండేందుకు బ్యారేజీలోని నీటిని వదిలేశారు.

డిసెంబరు 24వ తేదీన పియర్ కుంగడం ఆగింది. మొత్తం మీద 1.256 మీటర్లు మేర పియర్ కుంగింది. దెబ్బతిన్న పియర్ల మధ్య గేట్లు జామ్ అయ్యాయి. 16వ పియర్ నుంచి 21వ పియర్ వరకు బ్యారేజీ వంతెన మీద కూడా పగుళ్లు వచ్చాయి.

బాంబు పేలినట్లుగా శబ్దం రావడంతో ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి ఇంకా విచారణ, సమస్య నిర్ధారణ ఇంకా కొనసాగుతోంది."

మేడిగడ్డ బరాజ్ సమీక్ష

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, దెబ్బతిన్న పియర్ 21,20,19,18,17,16 భాగాలను చూపుతున్న చిత్రం
కాళేశ్వరం

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, నెర్రెలు బారిన పియర్ నెంబర్ 20

ఫౌండేషన్ మీద ఒక ప్రైవేటు ఏజెన్సీ పని నిన్ననే ప్రారంభించిందని, ఫౌండేషన్ కింద ఏం జరిగిందనే దాని మీద వాళ్లు దాదాపు రెండు వారాల్లో రిపోర్ట్ ఇస్తారని మురళీధర్ రావు తెలిపారు.

బరాజ్ కు సంబంధించిన 7వ బ్లాక్ లో మూడు గేట్లు, మూడు స్లాబ్ లను పూర్తిగాతొలగించాలని దీనికి ఎక్కువసమయం పడుతుందని ఆయన చెప్పారు. బ్లాస్టింగ్ ద్వారా వీటిని తొలగించేందుకు అవకాశం ఉన్నా మిగతా నిర్మాణానికి నష్టం జరుగుతుందని డైమండ్ కటింగ్ విధానంలో కాంక్రీట్ ను తొలగిస్తున్నామన్నారు.

ఈ పద్ధతిలో అయితే మిగతా వాటి మీద పెద్ద ప్రభావం పడదని చెబుతున్నారు. ఒక్కో పియర్‌ను ఎంత తీయాలన్నదాని మీద స్టడీ చేస్తున్నాం. స్టడీ ప్రకారం మూడు పియర్లను కట్ చేసి, ఆ మేరకు ఫౌండేషన్ వేయాలన్నది ఆలోచన. ఇది స్థూలమైన ప్రణాళిక మాత్రమే.

దెబ్బతిన్న వాటికి మరమ్మతులు చేయడం అంత సులభం కాదు. కాబట్టి మూడు గేట్లను తీసేసి మళ్లీ వాటిని నిర్మించాల్సి ఉంది.

మేడిగడ్డ సమీక్ష

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, అన్నారం బరాజ్

గతంలో అన్నారం బ్యారేజీ కింద కూడా నీటి లీకేజీ కనిపించింది. 33, 34, 44 వెంట్ వద్ద శ్లాబుల్లో నీళ్లు రావడాన్ని అందరూ చూశారు. మూడు నాలుగు చోట్ల బాగా కనిపించింది. తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా ఇసుక సంచులు, రాళ్లతో రింగ్ బండ్ వేశారు. దాదాపు బ్యారేజీ అంత సీసీ బ్లాకులు పక్కకు జరిగాయి. నీళ్లను బయటకు వదలి జరిగిన బ్లాకులను సరి చేసి మళ్లీ నీళ్లు నింపుతాం. ఈ పని కూడా ఇప్పుడు మొదలు పెడుతున్నామని ఆయన వివరించారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఇంకా 3వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉందని, నీటిపారుదల శాఖలో మరో 9 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు.

మేడిగడ్డపై సమీక్ష

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ వద్ద తెలంగాణ మంత్రులు

మేడిగడ్డ ఎఫెక్ట్ మొత్తం ప్రాజెక్టుపై ఎలా ఉంటుంది?

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మూడు బరాజ్ లలో 16 టీఎంసీల సామర్థ్యం తో నిర్మితమైన మేడిగడ్డ కీలకమైనది. ఇక్కడి నుంచే గోదావరి నీటిని ఎగువ ప్రాంతాలకు ఎత్తి పోస్తుండటంతో మొత్తం ప్రాజెక్ట్ నిర్వహణ పై ప్రభావం పడింది.

ఈ ఘటన జరిగిన సమయంలో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో సహజంగానే ఇది రాజకీయ రంగు పులుముకుంది.

ఇంకా గ్యారంటీ పీరియడ్ ముగియలేదని , బరాజ్ నిర్మాణ సంస్థ ఎల్అండ్ టీ తన సొంత ఖర్చులతో దెబ్బతిన్న నిర్మాణాన్ని తిరిగి నిర్మిస్తుందని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అప్పట్లో చెప్పారు. ఇదే విషయాన్ని మేడిగడ్డ బరాజ్ ను సందర్శించిన సమయంలో ఆ కంపెనీ ప్రతినిధులు కూడా ధృవీకరించారు.

అయితే ఆ తర్వాత ఎల్ అండ్ టీ ప్రతినిధులు తమ గ్యారంటీ పీరియడ్ (లయబులిటీ పీరియడ్) ముగిసిందని, తమ వంతు పనులు ముగించినట్టుగా ఎక్స్ పీరియన్స్ సర్టిఫికేట్ కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు ఇచ్చారని చెప్పినట్టు వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ లో ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

కాళేశ్వరం

ఫొటో సోర్స్, I&PR Telangana

జ్యుడీషియల్ ఎంక్వైరీ...

మేడిగడ్డ బరాజ్ అంశంలో పూర్తిస్థాయి విషయాలను ప్రజల ముందు ఉంచుతామని అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతూ వచ్చింది.

శాసన మండలిలో జరిగిన ఒక చర్చ సందర్భంగా మేడిగడ్డ పై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశిస్తుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వ పనితీరు , నిధులు వంటి అంశాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ లో శ్వేతపత్రం ప్రకటించింది.

మేడిగడ్డ సందర్శనకు మంత్రుల బృందం వెళ్లాలని , ఈ ప్రాజెక్ట్ లో ఏం జరిగిందన్న అంశాన్ని పవర్ పాయింట్ ప్రజంటేషన్ రూపంలో అక్కడి నుంచే తెలంగాణ ప్రజలకు వివరించాలన్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రుల బృందం ఈ రోజు ( డిసెంబర్ 29) మేడగడ్డ ను సందర్శించింది.

ఇక్కడే, తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్వాపరాలు, ప్రస్తుత మేడిగడ్డ బరాజ్ పరిస్థితి పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

కాళేశ్వరం

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్‌ను పరిశీలిస్తున్న తెలంగాణ మంత్రులు, అధికారులు

ఉత్తమ్ కుమార్... ఇతర మంత్రులు ఏమన్నారు?

బరాజ్ ఖాళీ చేయాల్సి రావడం బాధిస్తోంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం ప్రాజెక్ట్ లో నిర్మాణం పై గతం నుండి తాము లేవనెత్తుతున్న అనుమానాలు ఈ రోజు జరిగిన ఇరిగేషన్ అధికారుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో నిజం అయ్యాయని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్. రాజశేఖర్ రెడ్డి హయాంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 38 వేల కోట్ల ఖర్చుతో 16 లక్షల ఎకరాలకు నీరందేలా రూపొందించిన డాక్టర్. బీఆర్. అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ప్రాజెక్ట్ ను పేరు, ప్లాన్, నిర్మాణ స్థలాన్ని బీఆర్ఆస్ మార్చేసిందని ఆరోపించారు.

కేంద్ర జలసంఘం ఈ ప్రాజెక్ట్ కు 80 వేల కోట్ల ఖర్చు పెట్టేందుకు అనుమతిస్తే దాన్ని లక్షన్నర కోట్లకు పెంచారని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ తీరు, కొత్త డిజైన్ ల సాధ్యాసాధ్యాలపై అప్పుడే సందేహాలు వ్యక్తం చేశామని, అయితే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటూ అప్పటి సీఎం కేసీఆర్ గొప్పలకు పోయారని, బరాజ్ కు డ్యామేజీ జరిగినా కనీసం సందర్శించకపోగా, రివ్యూ కూడా చేయలేదని, ప్రజలకు నిజం ఏమిటో చెప్పలేదన్నారు.

ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్ట్ కు 95 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా సాగులోకి తీసుకువచ్చింది కేవం 97 వేల ఎకరాలే అని , కాగ్ కూడా ఈ ప్రాజెక్ట్ పై తీవ్ర విమర్శలు చేసిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి తెచ్చిన రుణాలపై సంవత్సరానికి 13 వేల కోట్లను తిరిగి చెల్లించాల్సిన భారం పడిందని , ఇంత ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయిందని, ఇప్పుడు మూడు బరాజ్ లను ఖాళీ చేయాల్సిన పరిస్థితి రావడం బాధిస్తోందన్నారు.

ఇది తుగ్లక్ చర్య: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

గురుత్వాకర్షణ శక్తి తో( గ్రావిటీ) తక్కువ ఖర్చు తో ఎక్కువ నీటి తరలించే వీలున్న గతంలో ప్రతిపాదించిన ప్రాణహిత సుజల స్రవంతిని కాదని గోదావరి పై మూడు బరాజ్ లతో నీటిని వెనక్కి తోడిపోయడం తుగ్లక్ చర్య అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

పాత ప్లాన్ ప్రకారం తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్ట్ నిర్మించి ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీర్ల పాత్ర పై తీవ్రవిమర్శలు చేసారు. కేసీఆర్ తప్పు చేస్తుంటే ఇంజనీర్లుగా ఎందుకు సమర్థించారని, మాట వినకపోతే సెలవులు పెట్టి వెళ్లిపోయి ఉండాల్సిందని అన్నారు.

తెలంగాణకు మానసపుత్రిక అయిన కాళేశ్వరం భవిష్యత్తు పై వాస్తవాలు తెలిసిన తర్వాత బాధకలుగుతోందని , బరాజ్ కుంగి పోవడం లో బాంబుదాడి, ఉగ్రకోణం లాంటివి ఏమీ లేవని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

వ్యక్తిగత అవసరాల కోసమే ప్రాజెక్ట్ కట్టారు-పొంగులేటి

కాళేశ్వరం నిర్మాణంలో రాష్ట్ర ప్రయోజనాలు అప్పటి ప్రభుత్వం, ఇంజనీరింగ్ అధికారులు గాలికి వదిలేసారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం దెబ్బతిన్న స్థితిలో ఉన్న మూడు పియర్స్ తోనే ఇది ఆగుతుందని తాను అనుకోవడం లేదని అనుమానం వ్యక్తం చేశారు.

నాసిరకం నిర్మాణ జరిగిన తీరు మేడిగడ్డ తో పాటు సుందిళ్ల, అన్నారం బరాజ్ లకు కూడా వర్తిస్తుందన్నారు. వయబులిటీ పీరియడ్ లో ( గ్యారంటీ పీరియడ్) ఉంటే ఎల్ అండ్ టీ సంస్థ ఆధ్వర్యంలో తిరిగి నిర్మాణ పనులు ఎందుకు చేపట్టలేదని అడిగారు.

తలదించుకునే పరిస్థితితెచ్చారు-జీవన్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిన ప్రాణహిత సుజల స్రవంతి లో సగం పనులు పూర్తయ్యాక డిజైన్లను మార్చారని, కట్టిన ఐదేళ్లకే ప్రాజెక్ట్ కుంగిపోవడం ఏంటనీ, ఇది తలిదించుకునే పని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ లు ఇప్పటికి చెక్కుచెదరలేదన్నారు.

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ల రిపోర్ట్ పై ఆధారపడవద్దని, ప్రజలకు వాస్తవ పరిస్థితి తెలిపేందుకు ఇతర ఏజన్సీలతో సమగ్ర విచారణ జరిపించాలని జీవన్ రెడ్డి అన్నారు.

రూపాయికి 55పైసలే ప్రయోజనం: శ్రీధర్ బాబు

బడ్జెట్ అంచనాలు పెంచేసి నిర్మించిన కాళేశ్వరంతో రెండు పంటలకు నీరు అందే పరిస్థితులు కూడా లేవని, నీటిని లిఫ్ట్ చేసేందుకు చేసే ప్రతి రూపాయి ఖర్చుకు కేవలం 55 పైసలు మాత్రమే ప్రయోజనం కనిపిస్తోందని, ఈ ప్రాజెక్ట్ కింద ఎకరాకు నీరందించేందుకు 46 వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు.

మేడిగడ్డ బరాజ్ సమీక్ష

ఫొటో సోర్స్, I&PR Telangana

ఫొటో క్యాప్షన్, మేడిగడ్డ బరాజ్

ఇరిగేషన్ శాఖను ప్రక్షాళన చేస్తాం...

కాళేశ్వరంలో నిర్మాణంలో కచ్చితంగా లోపం జరిగిందని ప్రాజెక్ట్ పూర్తయినా అది ఫెయిల్ అయినట్టే అని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

ఈప్రాజెక్ట్ జాతీయహోదా కోసం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరలేదనే విషయం తాను పార్లమెంటు సభ్యునిగా అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చిందన్నారు.

ఈ ప్రాజెక్ట్ విషయంలో లక్ష కోట్ల ప్రజాధనం వృధా అయ్యే అవకాశం ఉందని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటామని, జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపిస్తామన్నారు. నీటి లభ్యత కంటే ఇతర రాజకీయ కారణాలే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వెనక కనిపిస్తున్నాయన్నారు. తక్కువ ఖర్చు తో అయ్యే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మిస్తామని తెలిపారు.తెలంగాణ ఇరిగేషన్ శాఖను ప్రక్షాళన చేస్తామని చెప్పారు.

'ఇంజనీర్లను నిందించడం సరికాదు'

‘’పరిస్థితులు ఇప్పుడు గతంలో లాగా లేవు. ఇంజనీరింగ్ లో రాజకీయ జోక్యం పెరిగిన మాట వాస్తవం. ఇక్కడ రాజకీయజోక్యం ఉండటం మంచిది కాదు. లోపం జరిగినప్పుడు ఇంజనీర్లను బ్లెయిమ్ చేయడం సరికాదు" అని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ సానా మారుతి బీబీసీ తో అన్నారు.

దీనిపై స్వతంత్ర ఏజన్సీసలతో విచారణ జరిపితే విషయం ఏంటో బయటకు వస్తుందని చెప్పిన సానా మారుతి, "మేడిగడ్డకు రిపేర్ ఖర్చు నిర్మాణ ఖర్చు కంటే ఎక్కువే అవుతుంది. మళ్లీ అంత ఖర్చు పెట్టడానికి ఎవరూ అప్పు ఇవ్వరు. ప్రభుత్వం దగ్గర అన్ని నిధులూ లేవు’’ అని అన్నారు.

కడియం శ్రీహరి

ఫొటో సోర్స్, KadiyamSrihari/FB

బీఆర్ఎస్ ఏమంటోంది?

మంత్రుల ఆరోపణల పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఇచ్చిన హామీల అమలు నుంచి ప్రజలను పక్కతోవ పట్టించడానికే శ్వేతపత్రాలు, జ్యుడీషియల్ ఎంక్వైరీ, ప్రాజెక్ట్ సందర్శన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆయన అన్నారు.

"కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో ప్రజలకు వాస్తవాలు తెలియడానికి మేమే జ్యుడీషియల్ ఎంక్వైరీని కోరాం. లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈరోజు ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇప్పటివరకు 93 వేల కోట్లే ఖర్చయిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పారు, అలాంటప్పుడు లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వమే చెప్పాలి" అని కడియం ప్రశ్నించారు.

"కాళేశ్వరం కింద ఉమ్మడి నల్గొండ వరకు 16 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని, 98 వేల ఎకరాల కొత్త ఆయకట్టు వచ్చిందని ఈ రోజు వారే ఒప్పుకున్నారు అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన వారు చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అని తేలింది’’ అని అన్నారు.

తుమ్మిడిహెట్టి వద్ద గ్రావిటీ తో నీరందేలా ప్రాజెక్ట్ నిర్మిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం సరికాదని, అక్కడ కూడా లిఫ్ట్ లను ఏర్పాటుచేయాల్సి ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)