బెంగాల్ క్షామం: లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఆనాటి దుర్భిక్షాన్ని అనుభవించిన వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు, వారు ఏమంటున్నారు?

బెంగాల్ క్షామం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1943లో బెంగాల్ కరువు కారణంగా లక్షలాదిమంది చనిపోయారు
    • రచయిత, కవిత పురి
    • హోదా, బీబీసీ న్యూస్

బెంగాల్ క్షామం... 1943లో తూర్పు భారతదేశంలో 30 లక్షలమందికి పైగా పొట్టన పెట్టుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో మిత్రరాజ్యాల తరపున జరిగిన ప్రాణ నష్టాలలో ఇదే అత్యంత దారుణమైనది.

కరవు కారణంగా మరణించిన జనం గురించి స్మారక మందిరాలు లేవు, మ్యూజియంలు లేవు, కనీసం ఓ ఫలకం కూడా లేదు.

కానీ, ఆ దుర్భిక్షాన్ని కళ్ళారా చూసిన కొందరు ఇంకా బతికే ఉన్నారు. వారిలో ఒకతను తమ కరవు గాథలను ఇంకా ఆలస్యం చేయకుండా సేకరించాలనే నిర్ణయానికి వచ్చారు.

‘‘కరవు విసిరిన పంజా దెబ్బకు ఎంతోమంది గుప్పెడు మెతుకుల కోసం తమ అమ్మాయిలను, అబ్బాయిలను అమ్ముకున్నారు. మరెంతోమంది పెళ్ళయిన స్త్రీలు, యువతులు అపరిచిత పురుషుల చేతిలో చేయి వేసి తమకు తెలియని దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు’’ అని బిజోయ్ కృష్ణ త్రిపాఠి బెంగాల్ కరువురోజులను గుర్తు చేసుకున్నారు.

ఆరోజుల్లో జనం కడుపు నింపుకోవడానికి ఎంతటి బాధాకర నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందో వివరించారు.

బెంగాల్ కరవు

ఫొటో సోర్స్, SAILEN SARKAR

బిజోయ్ కృష్ణ త్రిపాఠికి తన వయసెంతో కచ్చితంగా తెలియదు. కానీ, ఆయన దగ్గరున్న ఓటరుకార్డు ఆయన వయసు 112 ఏళ్ళని చెబుతోంది.

బెంగాల్ కరవు కరాళ నృత్యాన్ని అనుభవించి, బతికున్న అతికొద్ది మందిలో ఆయన కూడా ఒకరు.

బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లాలో తనెలా పెరిగింది వణుకుతున్న స్వరంతో ఆయన మెల్లిగా చెప్పడం మొదలుపెట్టారు. వరి ధాన్యమే తమకు ప్రధాన ఆహార వనరు అని, కానీ 1942 వేసవిలో దాని ధర ఎల్లలు లేనట్టుగా పెరగడం మొదలైందని చెప్పారు.

ఆ ఏడాది అక్టోబర్‌లో తుపాను వచ్చిన మా ఇంటి పై కప్పును ధ్వంసం చేసింది. అలాగే వరి పంటను నామరూపాల్లేకుండా చేసింది. దీంతో బియ్యం ధరలు పెరిగి, వాటిని కొనలేని స్థితికి చేరామని తెలిపారు.

‘‘ఆకలి మమ్మల్ని వేధించింది. ఆకలితో పాటు అంటురోగాలు చుట్టుమట్టాయి. అన్ని వయసుల వారు చనిపోవడం మొదలైంది. అప్పట్లో కొంత ఆహార సహాయక చిర్యలు అందాయి. కానీ అవి ఏ మూలకూ సరిపోలేదు. ప్రతి ఒక్కరూ సగం నిండిన కడుపుతోనే బతుకీడ్చాల్సి వచ్చింది’’ అని ఆయన చెప్పారు.

‘‘తినడానికి ఏమీ దొరక్క గ్రామంలో చాలామంది చనిపోయారు. దీంతో జనం ఆహారం కోసం వెదుకుతూ దోపిడీలు చేయడం మొదలుపెట్టారు’’ అని తెలిపారు.

బిజోయ్ కృష్ణ తన ఇంటి వరండాలో కూర్చుని చెబుతున్న విషయాలను ఆయన కుటుంబానికి చెందిన నాలుగు తరాలవారు వింటున్నారు. వారితోపాటు సైలెన్ సర్కార్ కూడా ఉన్నారు. ఈయన గత కొన్ని సంవత్సరాలుగా బెంగాల్ కరవులో బతికి బట్టకట్టినవారి వివరాలు సేకరిస్తూ వారి నుంచి అప్పటి సమాచారాన్ని సేకరించడానికి బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో తిరుగుతున్నారు.

కరవు గాథలను రికార్డ్ చేస్తూ..

బెంగాల్ కరవు
ఫొటో క్యాప్షన్, బిజోయ్ కృష్ణ త్రిపాఠి, సైలెన్ సర్కార్

సైలెన్ సర్కార్ వయసు 72 ఏళ్ళు. నెరసిన జుట్టు, అలవోకగా మొహంపై కదలాడే చిరునవ్వు..ఇదీ ఆయన ఆహార్యం. బహుశా అందుకేనేమో బిజోయ్ కృష్ణలాంటివారు ఈయన వద్ద తేలికగా తమ మనసులోని మాటను బయటపెడుతుంటారు.

సెలైన్ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలలో వాతావరణం ఎలా ఉన్నా పట్టించుకోకుండా భుజాన ఓ సంచి తగిలించుకుని, గుప్పెడు సిగరెట్లతో ఈ వివరాలు సేకరించేందుకు తిరుగుతుంటారు. తను కలిసినవారు చెప్పే కరవునాటి సంగతులను సెల్‌ఫోన్, లేదా ఏ రికార్డర్‌లోనో రికార్డు చేయకుండా పెన్నుతో పేపర్ పై రాసుకుంటూ ఉంటారు.

సైలెన్ సర్కార్ తన చిన్నతంలో ఇంట్లో చూసిన ఫోటో ఆల్బమ్ కారణంగా తరచూ బెంగాల్ కరవు గురించిన ఆలోచనల్లో మునిగిపోవడం మొదలుపెట్టారు.

ఆయన కలకత్తాలో (ఇప్పుడు కోల్‌కతా) తన చిన్నతనంలో కరవు కారణంగా కుంగిపోయిన జనం ఫోటోలను తదేకంగా చూస్తూ ఉండిపోయేవారు.

ఈ ఫోటోలను ఆయన తండ్రి తీసేవారు. ఆయన స్థానికంగా కరవు సహాయాన్ని అందించే ఓ దాతృత్వ సంస్థతో కలిసి పనిచేసేవారు.

తన తండ్రి చాలా పేదవాడని సైలెన్ చెప్పారు. ‘‘ నా చిన్నతనంలో ఆకలిదప్పుల భయాన్ని ఆయన కళ్ళలో గమనించేవాడిని’’ అని చెప్పారు.

సైలెన్ ఇప్పుడొక రిటైర్డ్ టీచర్. కరవుగాథలను తెలుసుకునేందుకు ఆయన వేట మొదలుపెట్టారు. మిడ్నాపూర్‌లో ఆయన నడుచుకుంటూ వెళుతున్న ఓ 86 ఏళ్ళ వృద్ధుడితో కరవు గురించి మాట కలిపారు.

బెంగాల్ కరవు

ఫొటో సోర్స్, SAILEN SARKAR

ఫొటో క్యాప్షన్, శ్రీపాటిచరణ్ లాంటివారిని కరువు ఉన్నఊరు విడిచి, నగరం బాటపట్టేలా చేసింది.

బిజోయ్ కృష్ణ లానే శ్రీపతిచరణ్ సమంతా కూడా ఆనాటి భయంకరమైన తుపాను గురించి గుర్తుపెట్టుకున్నారు.

అప్పటికే జీవితం గండంగా మారిందని, బియ్యం ధరలు స్థిరంగా పెరుగుతూ పోయాయని గుర్తు చేసుకున్నారు.

ఆకాశన్నంటుతున్న బియ్యం ధరల కారణంగా 1942 అక్టోబరు నాటికి శ్రీపాటి చరణ్ రోజంతటికి కలిపి కొద్దిపాటి భోజనం మాత్రమే తినేపరిస్థితి ఏర్పడింది.

అప్పుడే తుపాను చుట్టుముట్టింది. తుపాను తరువాత బియ్యం ధరలు ఇంకెంతగా పెరిగాయో శ్రీపాటిచరణ్‌కు గుర్తుంది.

వ్యాపారులు బియ్యాన్ని ఎంత ధర వరకు మిగుల్చుకున్నారో కూడా గుర్తు చేసుకున్నారు.

‘‘మా గ్రామంలో బియ్యం గింజ అనేది లేకుండా పోయింది’’ అని సైలెన్‌కు చెప్పారు.

‘‘ తమ వద్ద ఉన్న కొద్దిపాటి బియ్య నిల్వలతో కొద్దిరోజులు గడిపాం. కానీ తరువాత బియ్యం కొనడానికి ఏకంగా భూములు అమ్ముకోవాల్సి వచ్చింది’’ అని చెప్పారు.

తుపాను వచ్చిన తరువాత ఇంట్లో ఉన్న బియ్యం కొద్దిరోజుల వరకే వచ్చాయి. ఆ తరువాత అంతా ఆకలే.

వేలాదిమంది బాధితుల్లానే శ్రీపాటిచరణ్ కూడా కరువు నుంచి ఏదైనా ఉపశమనం దొరక్కపోతుందా అనే ఆశతో గ్రామాన్ని వీడి కలకత్తా బాటపట్టారు.

అదృష్టవశాత్తూ ఆయనకు కలకత్తాలో తలదాచుకునేందుకు ఓ బంధువుండటంతో బతికి బయటపడ్డారు.

కానీ, చాలామంది ఇటువంటి అదృష్టానికి నోచుకోక రోడ్డుపక్కనో చెత్త కుప్పల పక్కనో కళ్ళు తిరిగి పడిపోయేవారు. ఫుట్‌పాత్‌లపైనే చనిపోయేవారు.

తమకు సాయం అందుతుందని గంపెడాశతో నగరానికి వచ్చి అపరిచితుల్లానే కన్నుమూసేవారు.

కరవుకు కారణమేంటి?

బెంగాల్ కరవు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1943 చివర్లలో గంజి కోసం కలకత్తాలో బారులు తీరిన జనం

అసలు బెంగాల్ కరవు ఎలా వచ్చిందనే విషయం తెలుసుకోవడం కష్టమైనది. అందుకే, ఇప్పటికీ దీనిపై విస్తృతంగా చర్చ సాగుతుంటుంది.

బెంగాల్లో 1942లో ధాన్య సరఫరా తీవ్రమైన ఒత్తిడిలో పడింది. ఆ ఏడాది మొదట్లో బెంగాల్‌కు సరిహద్దుగా ఉన్న బర్మాపై జపాన్ దండెత్తింది.

దీంతో, బర్మా నుంచి బియ్యం దిగుమతులు అర్థంతరంగా ఆగిపోయాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కలత్తాలో వేలాదిమంది మిత్రరాజ్యాల సైనికులతోపాటు యుద్ధకాల పరిశ్రమలలో పనిచేసే కార్మికులు ఉండటంతో ధాన్యానికి డిమాండ్ పెరిగింది.

యుద్దం కారణంగా ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరడంతో బియ్యం ధరలు కొండెక్కాయి. దీనివల్ల అప్పటికే కష్టాలుపడుతున్న జనానికి బియ్యం పూర్తిగా అందుబుటలో లేకుండా పోయింది.

మరోపక్క తూర్పు భారతదేశం మీదకు జపాన్ దండెత్తుతుందని బ్రిటీషర్లు భయపడ్డారు. అందుకే, వారు ‘నిరాకరణ’ విధానాన్ని అవలింబించాలనుకున్నారు.

దీనివల్ల బెంగాల్ తీర ప్రాంతంలోని పట్టణాలు, గ్రామాల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని, పడవలను జప్తు చేశారు. దీని ఉద్దేశం ఏమిటంటే తూర్పు తీరప్రాంతంపైకి దండెత్తి వచ్చే సైనికులకు ఎటువంటి ఆహారం అందకుండా చేయడమే.

కానీ ఈ చర్య అప్పటికే కుదేలైన స్థానిక ఆర్థిక వ్యవస్థను మరింతగా కుంగదీసి, బియ్యం ధరలు ఇంకా ఇంకా పెరగడానికి దారితీసింది.

ఆహార భద్రత పేరుతో లాభాలు సంపాదించుకునేందుకే కూడా బియ్యం నిల్వ చేశారనే విమర్శలు ఉన్నాయి. దీనికితోడు, 1942 అక్టోబరులో వచ్చిన తుపాను వరి పంటలను కూడా తుడిచిపెట్టింది. ఆ తరువాత చాలా కాలంపాటు పంటచీడలు కొనసాగాయి.

బెంగాల్ కరవు

ఫొటో సోర్స్, KUSHANAVA CHOUDHURY

ఫొటో క్యాప్షన్, కుశనవ్ చౌదరితో సైలెన్ సర్కార్

బెంగాల్ కరవుకు కారణమెవరు అనే విషయంపై తరచూ వేడి వేడి చర్చలు జరుగుతుంటాయి.

ప్రత్యేకించి నాటి బ్రిటీషు ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ తగినంత సాయం చేయలేదని, బెంగాల్ కరవు తీవ్రత తెలిసి కూడా ఆయన పట్టించుకోలేదనే విమర్శ ఉంది.

అయితే, 1943 చివరినాటికి కొత్త వైస్రాయ్ ఫీల్డ్ మార్షల్ లార్డ్ వావెల్ రాకతో సహాయక చర్యలు తీసుకోవడం మొదలైంది. కానీ, అప్పటికే చాలామంది చనిపోయారు.

కరవుకు ఎవరిని నిందితులుగా చేయాలనే చర్చ కారణంగా బాధితుల కథలు తరచూ మరుగునపడిపోతున్నాయి.

సైలెన్ ఇప్పటిదాకా 60 మంది ప్రత్యక్ష సాక్షుల వివరాలు సేకరించారు. వారిలో చాలా మంది నిరక్షరాస్యులు కావడంతో కరవు గురించి తక్కువగా మాట్లాడారు.

కరవు నుంచి బతికి బయటపడ్డవారి వాంగ్మూలాలు సేకరించడానికి ఎటువంటి ఏర్పాటూ జరగలేదు.

కరవు బాధితులు కథలను పట్టించుకోకపోవడానికి కారణం వారంతా పేదలు, నిస్సాహాయులు కావడమేనని సైలెన్ నమ్ముతున్నారు.

నిరాతన్ బేడ్వాను సైలెన్ కలిసేనాటికి ఆమె వయసు 100 ఏళ్ళు. పిల్లలను చూసుకునేందుకు తల్లులు ఎంత వేదనపడ్డారో ఆమె వివరించారు.

‘‘తల్లులకు తగినంత చనుబాలు ఉండేవి కావు. వారి శరీరాలు ఎముకల గూడులా మారాయి. చాలామంది పిల్లలు తల్లితో పాటు పురిట్లోనే చనిపోయారు. ఆరోగ్యంగా పుట్టిన బిడ్డలు కూడా కొద్దిగా పెద్దయ్యాక ఆకలితో చనిపోయాారు. ఆ సమయంలో చాలామంది మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని నిరాతన్ చెప్పారు.

కొంతమంది మహిళలు తమ భర్తలు తమను పోషించలేని స్థితిలో ఉండడంతో వేరే వారితో వెళ్ళిపోయారని ఆమె సైలెన్‌కు చెప్పారు. ‘‘నీ కడుపులో ఇంత తిండి లేనప్పుడు, ఎవరూ తిండిపెట్టే స్థితి లేనప్పుడు, ఎవరైనా ఎలా తప్పుపడతాం’’ అని ఆమె ప్రశ్నించారు.

అయితే, కరవు వల్ల లాభపడిన వారితో కూడా సైలెన్ మాట్లాడారు. బియ్యం, పప్పు, కొంత డబ్బు ఇచ్చి చాలా భూమిని కొన్నట్టు ఒక వ్యక్తి అంగీకరించారు. ‘‘వారసులు ఎవరూ లేని ఒక వ్యక్తి చనిపోవడంతో అతడి భూమిని తీసేసుకున్నా’’ అని చెప్పారు.

కరవు బాధితులు కలవడానికి సైలెన్‌తోపాటు అమెరికన్ బెంగాలీ రచయిత కుశనవ చౌదరి కూడా ఒకసారి వెళ్ళారు.

‘‘మేం వారి కోసం వెతకాల్సిన పనిలేదు. వారేమీ దాక్కోలేదు. వారంతా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలోని గ్రామాలలో ఉన్నారు. వారంతా ప్రపంచంలోనే అత్యంత పెద్ద పురాతన జ్ఞాపకంలా కూర్చుని ఉంటారు’’ అని ఆయన చెప్పారు.

‘‘వాళ్ళతో మాట్లాడానికి ఎవరూ ఇబ్బంది పడలేదు. నాకు వారితో కరవు గురించి మాట్లాడటానికి చాలా సిగ్గనిపించింది’’ అంటారాయన.

బెంగాల్ కరవును భారతీయ సినిమాలలో చూపించారు. ఫోటోలు తీశారు. బొమ్మలు గీశారు. కానీ బాధితుల స్వరాల నుంచి ఆనాటి పరిస్థితులను వినడమనేది అరుదుగా జరిగిందని కుశనవ్ చెప్పారు.

‘‘కరవు బాధితులు కానివారు, బాధితుల కథ రాశారు. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో వారే తమ కథలు చెప్పడం, వారే వాస్తవాన్ని నిర్మించడమనేది ఆసక్తికలిగిస్తుంది’’ అని తెలిపారు.

కరవు బాధితుల సంగతి మరుగునపడటానికి కారణం బహుశా 1940నాటి సమయం ‘‘మృత దశాబ్దం’’ కావడమే అయి ఉండొచ్చని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ శృతి కపిల చెప్పారు.

1946లో కలకత్తాలో పెద్ద ఎత్తున మతకలహాలు రేగి వేలాదిమంది చనిపోయారు. ఒక ఏడాది తరువాత బ్రిటీషువారు హిందూ మెజార్టీ దేశంగా భారత్‌ను, ముస్లిం మెజార్టీ దేశంగా పాకిస్తాన్‌ను విడగొట్టారు.

స్వాతంత్య్రం వచ్చినందుకు ఆనందం ఉన్నా దేశ విభజన రక్తపుటేరులను పారించింది. పదిలక్షలమంది ప్రజలు చనిపోయారు. దాదాపు కోటిమందికిపైగా ప్రజలు కొత్త సరిహద్దును దాటారు.

బెంగాల్ కూడా ఇండియా, తూర్పు పాకిస్తాన్‌గా విడిపోయింది. ఆ తరువాత తూర్పు పాకిస్తానే బంగ్లాదేశ్‌ అయింది.

‘‘దేశ విభజన, వరుసగా జనం భారీ సంఖ్యలో చనిపోవడం వంటి సంఘటనల మధ్య బెంగాల్ కరవు విషాదాన్ని పట్టించుకునేవారే లేకుండా పోయారు’’ అని ప్రొఫెసర్ కపిల విశ్లేషించారు.

అయితే, కరవు బాధితుల కథలు పెద్దగా వినపడనప్పటికీ, కరవు, ఆకలి అన్నవి బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి వారసత్వంగా లభించిన అంశాలుగా చాలామంది భారతీయులు చూస్తారని ఆమె చెప్పారు.

‘చరిత్రను మరిచిపోదామా?’

బెంగాల్ కరవు

ఫొటో సోర్స్, SAILEN SARKAR

ఫొటో క్యాప్షన్, ఆనంగమోహన్ దాస్

ఎనభై ఏళ్ళ తరువాత కరవునుంచి బతికి బట్టకట్టినవారు కొందరు కనిపిస్తున్నారు. 91 ఏళ్ళ అనంగ మోహన్ దాస్ తో మాట్లాడానికి సైలెన్ వెళ్ళారు. తాను ఎందుకు వచ్చిందీ సైలెన్ ఆయనకు వివరించారు. ఆ వృద్ధుడు కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు.

తరువాత ఆయన కళ్ళ నీళ్ళు ముడతలుపడ్డ ఆయన బుగ్గలపైనుంచి జారసాగాయి. ఆయన, ‘‘నువ్వెందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు’’ అని అడిగారు.

లక్షలాది మంది ప్రజల చావుకు కారణమైన కరవుకు సంబంధించి సైలెన్ సేకరించిన ప్రత్యక్షసాక్షుల వివరాలు నిజానికి చాలా స్వల్పం.

మీరు చరిత్రను మరిచిపోవాలనుకుంటే... పూర్తిగా మరిచిపోవాల్సిందే. కానీ, సైలెన్ అలా జరగకూడదని నిశ్ఛయించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)