ఐశ్వర్యా రాయ్‌ పేరును రాహుల్ గాంధీ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?

మైక్ పట్టుకొని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

ఫొటో సోర్స్, FB/RAHULGANDHI

కాంగ్రెస్ మాజీ చీఫ్, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ పేరును పదేపదే ప్రస్తావించడం విమర్శలకు దారితీస్తోంది.

రాహుల్ తన రెండో విడత భారత్ జోడో యాత్రను భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని యాత్రలో ఆయన అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే ఐశ్యర్యా రాయ్ పేరును రాహుల్ పదే పదే ప్రస్తావించడం విమర్శలకు తావిస్తోంది.

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పేదలను, ఓబీసీలను చూడలేదని, బాగా డబ్బున్నవారంతా అందులో కనిపించారని రాహుల్ వ్యాఖ్యానించారు.

జనవరి 22న జరిగిన ఈ కార్యక్రమంలో పేదలు, వెనుకబడినవారు, దళితులు, ఆదివాసీలు ఎవరూ కనిపించలేదని, కానీ బడా పారిశ్రామికవేత్తలు, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్ , గౌతమ్ అదానీలాంటివారు కనిపించారని ఆయన చెప్పారు.

నిజానికి, ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఐశ్వర్యా రాయ్, గౌతమ్ అదానీ పాల్గొననే లేదు.

అయినా ఐశ్యర్య పేరును రాహుల్ ప్రస్తావించడంపై కేంద్ర మంత్రి స్మతి ఇరానీ, గాయని సోన మహాపాత్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఐశ్వర్యా రాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వాస్తవానికి అయోధ్య రామాలయంలో జరిగిన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ఐశ్వర్యా రాయ్ పాల్గొనలేదు.

ఐశ్వర్య గురించి రాహుల్ ఏమన్నారు?

ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బాలో ఫిబ్రవరి 12న రాహుల్ మాట్లాడుతూ- ‘‘మీరంతా రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమం చూసే ఉంటారు. అక్కడ మీకెవరైనా పేదవారు కనిపించారా? అమితాబ్, ఐశ్వర్యతోపాటు అదానీలాంటి వ్యాపారవేత్తలు అక్కడ కనిపించారు. నాకైతే కనీసం ఓ రైతు కానీ, కార్మికుడు కానీ, నిరుద్యోగి గానీ, టీ అమ్ముకునే వ్యక్తి కానీ, లేదంటే ఓ చిన్న దుకాణంతో బతుకుబండి లాగించే సామాన్యులెవరూ నాకు కనిపించలేదు. అక్కడకు వచ్చినవారంతా కోటీశ్వరుల్లానే ఉన్నారు’’ అని అన్నారు.

దీని తరువాత కూడా రాహుల్ పలు సందర్భాలలో ఐశ్వర్య గురించి మాట్లాడారు. ‘‘మీడియా మా అభిప్రాయాలను చూపడం లేదు. కానీ 24 గంటలూ మోదీజీ టీవీల్లో కనిపిస్తారు. ఐశ్వర్యా రాయ్ కూడా కనిపిస్తారు’’ అని వ్యాఖ్యానించారు.

ఒకానొక సందర్భంలో రాహుల్ మాట్లాడుతూ- ‘‘ భారతదేశంలోని పేదలను మీడియా చూపించదు. మీరు అలా చూపించాలనుకుంటే ఐశ్వర్య డ్యాన్స్ చూపించాల్సిందే’’ అని వ్యాఖ్యానించారు.

మరో సందర్భంలో రాహుల్ ఓ యువకుడిని పిలిచి మైక్ ఇచ్చి, ‘‘జేబు దొంగతనాలు ఎలా చేస్తారో మీరు తెలుసుకోవాల్సిందే. అటు వైపు చూడండి పాకిస్తాన్, ఇటు వైపు చైనాను చూడండి. అక్కడ చూడండి ఐశ్వర్యా రాయ్. అలా అటు ఇటూ చూపిస్తూనే, మీ జేబు కొల్లగొట్టేస్తారు’’ అని చెప్పారు.

రాహుల్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో అనేక ప్రతిస్పందనలు వచ్చాయి.

స్మృతి ఇరానీ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ఒకప్పుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ ఎంపీగా ఉన్నారు

స్మృతి ఇరానీ, సోనా మహాపాత్ర ఏమన్నారు?

ఉత్తర్ ప్రదేశ్‌లో ఒకప్పుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథీ నుంచి ఇప్పుడు బీజేపీ సీనియర్ నేత స్మృతి ఇరానీ లోక్‌సభ సభ్యురాలిగా ఉన్నారు. ఆమె 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌పై గెలిచారు. ఆయన వ్యాఖ్యలపై ఆమె ఓ ప్రైవేటు చానల్‌తో మాట్లాడారు. ‘‘ఇది చాలా దారుణం’’ అని వ్యాఖ్యానించారు.

‘‘ఇప్పటిదాకా నేనిలాంటి మాట రాహుల్ గురించి చెప్పలేదు. తన తండ్రి స్నేహితుడి కోడలిని కూడా కామెంట్ చేసే వ్యక్తి నుంచి ఏమాశించగలం? ఇది కచ్చితంగా రాహుల్ గురించి మాట్లాడుతున్న మాటే. నేనీ విషయంలో ఆయనకు ఎటువంటి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. రాహుల్ తల్లి సోనియా గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా వాద్రా నిశ్శబ్దంగా కూర్చుంటారు. రాహుల్‌కు తను మాట్లాడుతోంది తన తండ్రి స్నేహితుడి కోడలి గురించి అనే విషయం ఎవరు చెప్పాలి’’ అని స్మృతి ప్రశ్నించారు.

‘‘తన కుటుంబానికి సన్నిహితులైనవారికే గౌరవం ఇవ్వనివారు, దేశంలోని అక్కాచెల్లెళ్లను, కూతుళ్ళను ఎలా గౌరవించగలుగుతారు? రాహుల్ తీరు చాలా దారుణంగా ఉందని సోనియాకు చెప్పదలుచుకున్నాను’’ అని చెప్పారు.

రాహుల్ వ్యాఖ్యలపై గాయని సోనా మహాపాత్ర స్పందిస్తూ- ‘‘కొంత మంది రాజకీయ నాయకులు స్వలాభం కోసం తమ ప్రసంగాలలో మహిళలను కించపరుస్తున్నారు. డియర్ రాహుల్, మీ తల్లినో, సోదరినో ఎవరైనా గతంలో ఇలాగే అవమానించి ఉంటే ఆ బాధేమిటో మీకు బాగా తెలిసి ఉండేది. అవును నిజమే. ఐశ్వర్యా రాయ్ నిజంగానే బాగా డాన్స్ చేస్తారు’’ అని తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు.

కర్ణాటక బీజేపీ కూడా రాహుల్ తీరును సోషల్ మీడియా వేదికగా ఖండించింది.

‘‘ఐశ్వర్యా రాయ్ 1994లో ‘మిస్‌ వరల్డ్’ టైటిల్ సాధించారు. ఆమె హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు. భారత్‌కు ఎంతో కీర్తి తీసుకువచ్చిన ఐశ్వర్యా రాయ్‌‌ను రాహుల్ ఎలా అవమానిస్తారు’’ అని బీజేపీ ప్రశ్నించింది.

ఐశ్వర్యరాయ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1982 నాటి ఫోటోలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ, రాహుల్ గాంధీ, అమితాబ్ బచ్చన్

గాంధీ, బచ్చన్ కుటుంబాల స్నేహం

బచ్చన్, ఇందిరా గాంధీ కుటుంబాలు గతంలో ఎంతో సన్నిహితంగా ఉండేవి. కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరుగుతూ వస్తోంది.

ఇందిరా గాంధీకి పెళ్ళి కాక ముందు నుంచే అమితాబ్ బచ్చన్ తల్లి తేజీ బచ్చన్, ఇందిర స్నేహంగా ఉండేవారు. తరువాత ఈ ఇరు కుటుంబాల పిల్లల మధ్య మంచి స్నేహం ఉండేది. వీరంతా వేరు వేరు స్కూళ్ళలో చదువుకున్నా, సెలవులప్పుడు కలిసి గడిపేవారు.

రాజీవ్ గాంధీని వివాహం చేసుకోక ముందు సోనియా ఇటలీ నుంచి భారత్‌కు వచ్చినప్పుడు ఆమె కొన్నిరోజులపాటు బచ్చన్ కుటుంబంతో గడిపారు.

ఓ అచ్చమైన భారతీయ కుటుంబంతో గడపడమనేది సోనియాకు అప్పుడే అనుభవంలోకి వచ్చింది.

సోనియా, రాజీవ్ పెళ్ళికి సంబంధించి అనేక క్రతువులు బచ్చన్ కుటుబంలోనే జరిగాయి.

ఇందిర ప్రోద్బలంతో తేజీ బచ్చన్, భారతీయ జీవన విధానం ఎలా ఉంటుందో సోనియాకు వివరించేవారు.

రాజీవ్‌కు వివాహం అయిన తరువాత ఇందిర మకాం దిల్లీ సఫ్దార్ జంగ్ రోడ్డులోని ఇంటికి మారింది. ఈ ఇంటికి సమీపంలోనే బచ్చన్ కుటుంబం నివసించేది.

‘కూలి’ సినిమా షూటింగ్‌లో గాయపడి ముంబయిలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమితాబ్‌ను చూసేందుకు రాజీవ్ గాంధీ అమెరికా నుంచి రాగా, ఇందిర దిల్లీ నుంచి వచ్చారు.

ఇందిర అంత్యక్రియల సమయంలో రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితంగా అమితాబ్ కనిపించారు.

ఇందిర మరణం తరువాత రాజీవ్ కోరిక మేరకు అమితాబ్ అలహాబాద్ నుంచి పోటీ చేసి రాజకీయ ఉద్ధండుడు హెచ్.ఎన్. బహుగుణ లాంటివారిని ఓడించారు.

ఐశ్వర్యరాయ్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్, ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్

బోఫోర్స్: పెరిగిన దూరం

రాజీవ్ గాంధీ హయాంలో బోఫోర్స్ శతఘ్నుల కొనుగోలులో మధ్యవర్తిత్వం వహించారంటూ వచ్చిన విమర్శల అనంతరం అమితాబ్ రాజకీయాలకు దూరమయ్యారు.

కానీ వారిద్దరి స్నేహం కొనసాగింది. తరువాత వీరిద్దరికి ఈ కేసులో క్లీన్ చిట్ లభించింది.

రాజీవ్ మరణం తరువాత కూడా అమితాబ్, ఇందిర కుటుంబంతో స్నేహాన్ని కొనసాగించారు.

తరువాత కాలంలో అమితాబ్ బచ్చన్ ఏబీసీఎల్ అనే సొంత కంపెనీని పెట్టి, అప్పుల్లో కూరుకుపోయారు.

అప్పట్లో అమితాబ్ చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పుడే బచ్చన్ కుటుంబం అమర్ సింగ్‌కు దగ్గరైంది.

తరువాత అమర్ సింగ్‌కు కూడా వీరు దూరమయ్యారు.

దీని తరువాత కూడా బచ్చన్ కుటుంబానికి, రాజీవ్ కుటుంబానికి మధ్య దూరం స్పష్టంగా కనిపించేది.

అయితే 2015లో బచ్చన్ కుటుంబంలో జరిగిన ఓ వివాహ వేడుకకు రాజీవ్ కుటుంబం తరపున ప్రియాంక మాత్రమే హాజరయ్యారు.

నటుడు కృణాల్ కపూర్ అమితాబ్ బచ్చన్ కుమార్తె నైనాను వివాహం చేసుకున్నారు. ప్రియాంక, రాబర్ట్ వాద్రా ఈ వేడుకకు హాజరయ్యారు.

అమితాబ్ బచ్చన్ 2012లో ఓ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ- ‘‘నా మనసులో ఎలాంటి మార్పూ లేదు. నేను ఎప్పుడూ ఆయనను గౌరవిస్తాను. కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్‌లో ఆయనను కలిశాను. నాకు ఎలాంటి విభేదాలూ కానీ, కోపం కానీ లేవు. మా సంబంధాలు మామూలుగానే ఉన్నాయి’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)