రాచ్‌డేల్ గ్రూమింగ్: 'నన్ను వందకంటే ఎక్కువసార్లు రేప్ చేశారు'

- రచయిత, విక్టోరియా డెర్బీషైర్, సియన్ క్లేర్, హోలీ కోల్
- హోదా, బీబీసీ న్యూస్
హెచ్చరిక: ఈ కథనంలోని కొన్ని విషయాలు మిమ్మల్ని కలచివేయొచ్చు.
పన్నెండేళ్ల వయసు నుంచి ఇప్పటి వరకూ తనను వందకంటే ఎక్కువసార్లు రేప్ చేశారని రాచ్‌డేల్ గ్రూమింగ్ బాధితురాలు ఒకరు చెప్పారు.
బాధితురాలు రూబీ(పేరు మార్చాం) బీబీసీ న్యూస్‌లైట్‌తో మాట్లాడుతూ, గర్భస్రావం చేసిన తన పిండాన్ని తనకు చెప్పకుండానే పోలీసులు డీఎన్ఏ పరీక్ష కోసం తీసుకెళ్లారని చెప్పారు.
రూబీపై లైంగిక వేధింపులు జరిగి ఏళ్లు గడిచిపోయాయని, కానీ దేశవ్యాప్తంగా పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయని మాజీ డిటెక్టివ్ మ్యాగీ ఆలివర్ అన్నారు.
బాధితులకు సాయం చేయడంలో విఫలమైనందుకు ''మనస్ఫూర్తిగా క్షమాపణలు'' చెబుతున్నట్లు గ్రేటర్ మాంచెస్టర్ పోలీసులు(జీఎంపీ) తెలిపారు.
''దాదాపు పాతికేళ్ల కిందట 2000 సంవత్సరం ప్రాంతంలో పోలీస్ సేవలు ఇప్పుడంత మెరుగ్గా లేవు, అది విచారకరం, పిల్లలపై లైంగిక దోపిడీని అరికట్టలేకపోయాం. అయితే, అధికారులు భయం, పక్షపాతం లేకుండా పోలీసింగ్‌ను కొనసాగిస్తున్నారు' అన్నారు.
వేధింపులకు గురైన ఇతర పిల్లలకు సాయం చేయాలనుకున్నట్లు రూబీ చెప్పారు. నేరం గురించి పిల్లలు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు మన బాధ విన్నారు, అర్థం చేసుకున్నారని భావన వారికి కలగాలని ఆమె అన్నారు.
పోలీసు విచారణల తర్వాత కౌన్సెలింగ్ కూడా ఇవ్వాలని ఆమె కోరారు.

రాచ్‌డేల్ కౌన్సిల్ ఉన్నతాధికారులు, సీనియర్ పోలీసుల వైఫల్యాల కారణంగా రాచ్‌డేల్‌లోని బాలికలు ఏళ్ల తరబడి ఫెడోఫైల్ గ్రూమింగ్ గ్యాంగ్ (చిన్నారులతో వ్యభిచార దందా) చేతుల్లో చిక్కుకుపోయారని జనవరిలో విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది.
ఈ నివేదిక 2004 నుంచి 2013 వరకూ రాచ్‌డేల్ పట్టణంలో జరిగిన 111 కేసులపై దృష్టి పెట్టడంతో పాటు, దర్యాప్తులో పోలీసులు విఫలమైన ఘటనలు, ఇప్పటికీ పిల్లలకు ప్రమాదకరంగా ఉన్న 96 మంది పురుషులను గుర్తించింది.
"ఈ భయంకరమైన వైఫల్యాలు మళ్లీ జరగకుండా చూసేందుకు నిశ్చయించుకున్నట్లు" రాచ్‌డేల్ కౌన్సిల్ తెలిపింది.

ఫొటో సోర్స్, PA MEDIA
తనను, తన స్నేహితులను కొంతమంది ఆహారం, మద్యం తీసుకుందామని చెప్పి రెస్టారెంట్‌కు, వారి ఫ్లాట్‌లకు తీసుకెళ్లిన తర్వాత లైంగిక వేధింపులు జరిగేవని రూబీ చెప్పారు.
చట్టపరమైన అంశాల కారణంగా ఆమె తన అసలు పేరును వెల్లడించలేదు.
అలా కొన్ని వారాల పాటు జరిగింది.
కానీ, ఒక రోజు ఫ్లాట్‌లో ''మమ్మల్ని గది లోపలికి రానివ్వలేదు'' ఎందుకంటే, అక్కడ వేరే వాళ్లు ఉన్నారని ఆమె చెప్పారు.
"మాకు ఒక లీటర్ వోడ్కా, పది ప్యాకెట్ల సిగరెట్లు ఇచ్చారు. అందువల్ల ఆ పక్క గదిలోకి వెళ్లే సమయానికి మేమంతా తాగేసి ఉన్నాం."
'మొద్దుబారిపోయా'
"అక్కడ మా కోసం 30 నుంచి 40 మంది పురుషులు వేచివున్నారు." ఆ తర్వాత "వాళ్లు నన్ను రేప్ చేశారు, ఆపకుండా...'' అని రూబీ చెప్పారు.
"ఒకరి తర్వాత మరొకరు లోపలికి వచ్చి.. అలా రాత్రంతా చేస్తూనే ఉన్నారు."
ఇక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు ''ఎలాంటి మార్గం లేదు'' అని గ్యాంగ్ బెదిరించిందని, అందువల్ల ఆ దారుణం అలా కొనసాగిందని ఆమె చెప్పారు.
"వాళ్లు మా నంబర్లు తీసుకుంటారు, స్కూల్ దగ్గరికి వచ్చేవాళ్లు, మా ఇంటి దగ్గరికి, ప్రతిచోటుకీ వచ్చేవారు, మమ్మల్ని వెతికి పట్టుకుంటారు.''
దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన పురుషులు, నాలుగేళ్ల కాలంలో దాదాపు వందసార్లకు పైగా తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పారు.
"అందులో బ్రాడ్‌ఫోర్డ్, నెల్సన్, బర్మింగ్‌హామ్, బ్లాక్‌పూల్ తదితర ప్రాంతాల పురుషులు ఉన్నారు, ఆ గ్యాంగ్ మమ్మల్ని ప్రతిచోటుకీ తీసుకెళ్లేది" అని ఆమె తెలిపారు.
"దానితో నేను మొద్దుబారిపోయాను."

ఫొటో సోర్స్, REUTERS
2008లో రూబీ ఒక సెక్సువల్ హెల్త్ క్లినిక్‌కు వెళ్లారు.
‘సామాజిక సేవా సంస్థలకు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలుసు. అయినా ఏమీ లేదు. అందువల్ల మేం మళ్లీ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది, మాకు సువాసన వచ్చే కండోమ్‌లు ఇచ్చి పంపించారు’ అన్నారామె.
తన పాత ప్రియులు వోడ్కా తాగించి, తనను లైంగికంగా వినియోగించుకున్నట్లు రూబీ అంతకుముందు క్రైసిస్ ఇంటర్వెన్షన్ టీమ్‌కి చెప్పారని ఈ నివేదిక ధ్రువీకరించింది.
అదే ఏడాది ఆమెను చైల్డ్ ప్రొటెక్షన్ ప్లాన్ ద్వారా సంరక్షణలో ఉంచారు. 2009 ప్రారంభం నాటికి ఆమె పరిస్థితి గురించి పోలీసులకు తెలిసింది.
రూబీకి 13 ఏళ్ల వయసులో అబార్షన్ జరిగింది, దర్యాప్తులో భాగంగా అనుమానితులను గుర్తించేందుకు డీఎన్‌ఏ టెస్టుల కోసం ఆ పిండాన్ని జీఎంపీ స్వాధీనం చేసుకుంది.
పిండాన్ని పోలీసులు తీసుకున్నారని రూబీకి చెప్పకపోవడం ''ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు'' అని నివేదికలో పేర్కొన్నారు.
గర్భస్రావం చేసిన పిండానికి అంత్యక్రియలు చేయాలా? అని అడగడానికి పోలీసులు తనను సంప్రదించారని ఆమె చెప్పారు.
ఆసియాకు చెందిన ఆరుగురు వృద్ధుల లైంగిక వేధింపుల గురించి 2010లో రూబీ ఒక సామాజిక కార్యకర్తకు చెప్పారని నివేదిక తెలిపింది.
పిల్లలపై 60 మంది దారుణంగా వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆమె సామాజిక కార్యకర్తలకు చెప్పారు.
రెండేళ్ల తర్వాత లైంగిక దోపిడీ, మానవ అక్రమ రవాణా కేసులో.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఒక వ్యక్తికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది.
కానీ, అక్కడికి నాలుగేళ్ల తర్వాత రూబీ ఆయన్ను ఓ దుకాణంలో చూశారు. ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తనకు చెప్పలేదని ఆమె అన్నారు.
''ఒకటికి రెండుసార్లు చూశాను. ఎందుకంటే, కళ్లముందు కనిపిస్తున్న దానిని నమ్మలేకపోయా. అతను అక్కడ ఉన్నాడు. వెంటనే నేను పరిగెత్తాను'' అని ఆమె చెప్పారు.
''ఇంటికి వెళ్లా. ఆ తర్వాత మూడు నెలలు నేను ఇంటి నుంచి బయటకు రాలేదు''
జీఎంపీకి ఫోన్ చేసి ''మీరు ఏమీ చేయలేదు'', నేను ఆందోళనలో ఉన్నానని చెప్పినట్లు రూబీ తెలిపారు.

తొమ్మిదేళ్లుగా పిల్లలపై లైంగిక దోపిడీ ఘటనలను జీఎంపీ ఎలా దర్యాప్తు చేసిందో సమీక్షించిన అనంతరం, ఈ నేరాన్ని పోలీసులు తక్కువ ప్రమాదకరంగా భావించారని, అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదని నివేదిక గుర్తించింది.
లైంగిక వేధింపుల కేసులను సమర్థంగా పరిష్కరించడంలో పోలీసుల వైఫల్యం కారణంగా 2012లో మ్యాగీ ఆలివర్ జీఎంపీకి రాజీనామా చేసి బాధితుల కోసం ఒక ఫౌండేషన్‌ను స్థాపించారు.
రాచ్‌డేల్‌లో ఇప్పటికీ పిల్లలపై లైంగిక దోపిడీ జరుగుతోందని, దేశవ్యాప్తంగా బాధితుల నుంచి అలాంటి విషయాలు ఫౌండేషన్ దృష్టికి వస్తూనే ఉన్నాయని ఆమె అన్నారు.
"12 ఏళ్ల కిందట రూబీ, ఇతర పిల్లలు చెప్పిన విషయాలే ఇప్పటి బాధితులు కూడా చెబుతున్నారు'' అని మ్యాగీ తెలిపారు.
''ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసనే అనుకుంటున్నా, కానీ పోలీసులు, సామాజిక సంస్థలు గుణపాఠాలు నేర్చుకున్నట్లు నటిస్తున్నాయని నేను అనుకుంటున్నా'' అన్నారామె.
లైంగిక వేధింపులకు గురైన పిల్లలకు అండగా నిలవాలని రూబీ పిలుపునిచ్చారు. అలాగే, పోలీసు విచారణల అనంతరం వారికి మానసికంగానూ సాయం అందించాలన్నారు.
''పోలీస్ స్టేషన్ తలుపుతట్టి లైంగిక వేధింపుల గురించి చెప్పే ప్రతి చిన్నారి బాధనూ వినాలి, అర్థం చేసుకోవాలి'' అని ఆమె అన్నారు.
''ఆ సమయంలో చాలా భావోద్వేగం ఉంటుంది. అందువల్ల, వారిని ఇంటికి తీసుకెళ్లడానికంటే ముందు, ఒక మానసిక నిపుణుడితో మాట్లాడించి తన లోపల ఉన్న విషయాలను బయటికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి, అప్పుడే వారికి తగిలిన గాయం గురించి బయటికి చెప్పగలుగుతారు.''
బీబీసీ యాక్షన్ లైన్
ఈ కథనంలోని సమస్యల ప్రభావం మీ మీద పడినట్లయితే, BBC యాక్షన్ లైన్ ద్వారా సాయం పొందవచ్చు.
''లైంగిక దోపిడీకి గురైన వారు, బాధితుల విషయంలో వైఫల్యానికి తీవ్రంగా చింతిస్తున్నాం'' అని జీఎంపీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
''బాధితులను, ఆ దారుణాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని ఎలా చూసుకోవాలి, వారి సంరక్షణ వంటి విషయాల్లో జీఎంపీ ఇప్పుడు ఉత్తమ విధానాలను పాటిస్తోంది'' అని వారు చెప్పారు.
''చిన్నారులపై లైంగిక దోపిడీ(చైల్డ్ సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్- సీఎస్‌ఈ)ని అరికట్టడం, అలాంటి ఘటనలపై స్పందించే విధానంలో చాలా మార్పులొచ్చాయి. ముఖ్యంగా లైంగిక వేధింపులకు గురవుతున్న యువతను గుర్తించేందుకు, బాధితులకు అండగా నిలిచేందుకు, అలాగే, నేరస్తులపై నిరంతరం నిఘా కొనసాగించేందుకు మేము ఏజెన్సీలతో కలిసి పని చేస్తున్నాం'' అన్నారు.
రాచ్‌డేల్ బోరో కౌన్సిల్ ప్రతినిధి మాట్లాడుతూ ''2004 నుంచి 2013 మధ్య కాలంలో దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడంలో, లైంగిక వేధింపుల నుంచి పిల్లలను రక్షించేందుకు చర్యలు తీసుకోవడంలో రాచ్‌డేల్ కౌన్సిల్‌లోని వ్యక్తులు విఫలమైనందుకు చింతిస్తున్నాం'' అన్నారు.
''ప్రస్తుతం చాలా కఠినమైన పద్ధతులు అమల్లో ఉన్నాయి, అలాంటి భయంకరమైన వైఫల్యాలు మళ్లీ జరగకుండా చూసుకుంటాం.''
ఇవి కూడా చదవండి:
- షరాన్ స్టోన్ : ‘నీ అంత అందగత్తె ఇంకెవరూ లేరంటూ నా ముందే ప్యాంట్ విప్పేశాడు..’
- కామసూత్రలోనే వాత్సాయనుడు స్వలింగ సంపర్కం గురించి రాశారా? భారత చరిత్రలో ఈ లైంగికత మూలాలు ఎక్కడ ఉన్నాయి?
- బీబీసీ ఐ పరిశోధన: న్యూడ్ ఫోటోలతో బ్లాక్మెయిల్ చేసే లోన్ యాప్‌ల తెర వెనుక ఏం జరుగుతుంది?
- 'నా రొమ్ముల మధ్య ముఖం పెట్టాడు'.. ఆపరేషన్ థియేటర్లలో సీనియర్ల లైంగిక వేధింపులకు బలవుతున్న మహిళా సర్జన్లు
- ఆ చర్చిని కదిలిస్తే 1,000 దాకా లైంగిక వేధింపుల కేసులు బయటపడ్డాయి... బాధితుల్లో చాలా మంది పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














