కెన్యా: మహిళలపై అక్కడ అంత ద్వేషమెందుకు? వారినెందుకు చంపుతున్నారు

స్త్రీహత్యలకు వ్యతిరేకంగా నిరసన చేసిన కొందరు పురుషులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, స్త్రీహత్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన పురుషులు
    • రచయిత, వాహిగా మౌరా
    • హోదా, బీబీసీ ఫోకస్ ఆన్ ఆఫ్రికా టీవీ, నైరోబీ

మహిళల హత్య కేసులు పెరుగుతుండటంతో పాటు మహిళలపై ఇతర హింసలు తీవ్రమవడంతో కెన్యాలో దేశవ్యాప్తంగా ఇటీవల నిరసనలు జరుగుతున్నాయి.

ఈ నిరసనలకు ముందు తూర్పు ఆఫ్రికా దేశంలో స్త్రీవివక్ష ఏ మేర పాతుకుపోయిందో తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో క్లిప్‌ పోస్ట్ అయింది.

దేశ రాజధాని నైరోబీలో ఇటీవల నిరసన తెలిపేందుకు యువతులు ఒక చోట చేరారు. ఈ నిరసనల అవసరమేంటని వాదిస్తూ ఇద్దరు పురుషులు ఆ యువతులను దుర్భాసలాడడం ఆ వీడియోలో కనిపించింది.

‘మహిళల వల్ల మగవాళ్లు ఇబ్బంది పడుతున్నారు’ అని ఆ పురుషుల్లో ఒకరు అంటుండడం వీడియోలో ఉంది. మహిళలు పురుషుల్ని కేవలం డబ్బుల కోసమే వాడుకుంటున్నారంటూ వారు వాదించారు.

ఈ వాదన మరింత పెరిగే కొద్ది, ఆ ఇద్దరు వ్యక్తులు కెమెరాకు ఎదురుగా వచ్చి మహిళలను మరింత తిట్టడం మొదలు పెట్టారు. ‘‘మేం నిన్ను చంపుతాం’’ అంటూ బెదిరించారు.

కెన్యాలో యాక్టివిస్ట్ బోనిఫేస్ మ్వాంగి ఈ వీడియోను ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేశారు. ‘‘తండ్రులుగా, పురుషులుగా వీరు పురుషుల కోసం మాట్లాడటం లేదని నాకు తెలుసు’’ అని మ్వాంగి ఆ వీడియో పోస్ట్‌లో రాశారు.

కానీ సమస్యేంటంటే.. కెన్యాలో చాలా కొద్ది మాత్రమే ఇలాంటి వాటికి వ్యతిరేకంగా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు.

‘‘కెన్యా పురుషులమైన మనం బయటికి వచ్చి స్త్రీద్వేషానికి వ్యతిరేకంగా గట్టిగా, బిగ్గరగా మాట్లాడాలి. కేవలం ఆమె జెండర్ కారణంగా హత్యకు గురవుతున్నారు’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్త్రీద్వేషానికి ముగింపు పలకాలని ఆయన పిలుపునిచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కెన్యాలో మహిళలపై హింస ప్రమాదకరంగా మారుతోంది. 2022లో 34 శాతం మంది మహిళలు తాము శారీరక హింసను ఎదుర్కొన్నట్లు చెప్పారని అక్కడి జాతీయ సర్వే పేర్కొంది.

కెన్యాలో ‘స్టాప్ కిల్లింగ్ వుమెన్(మహిళలను చంపడం ఆపండి)’ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

కెన్యాలో మహిళల హత్యలు విపరీతంగా పెరుగుతున్నట్లు ఇటీవల విడుదలైన రిపోర్టులో కూడా వెల్లడైంది.

ఈ ఏడాది జనవరిలో 10 మంది మహిళలు హత్యకు గురైనట్లు తెలిసింది.

డేటా అనాలసిస్, విజ్యులైజేషన్ కంపెనీ ఒడిపో డేవ్ మీడియా అధినేత ఫెలిక్స్ కిప్రోనో, తన సహోద్యోగులతో కలిసి ఈ విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు.

హత్యకు గురైన ఒక బాధితురాలి శరీర భాగాలు ఆమె అద్దెకు ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఒక ప్లాస్టిక్ బ్యాగ్‌లో కుక్కి ఉన్నాయి.

సైలెన్సింగ్ వుమెన్ పేరుతో విడుదల చేసిన నివేదిక ద్వారా మహిళల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయన్న భయంకరమైన వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని అన్నారు.

ఈ నివేదికలో బాధితుల తరఫున తీసుకోవాల్సిన చర్యలను కూడా ప్రతిపాదించారు.

కెన్యాలో జెండర్ ఆధారిత నిరసనలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, కెన్యాలో జెండర్ ఆధారిత నిరసనలు

ప్రస్తుతం ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్‌లోకి రావడంతో, ఆయనతో, ఆయన టీమ్‌తో ఇంటర్వ్యూల కోసం చాలా అభ్యర్థనలు వస్తున్నాయి.

‘‘ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడేందుకు పురుషులను తీసుకురావడం కాస్త కష్టమే కావొచ్చు’’ అని అన్నారు.

ఈ రిపోర్టు వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలపై ఆన్‌లైన్‌లో చర్చించేందుకు కూడా పురుషులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

‘‘టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్‌పై మేం అనాలటిక్స్‌ను చూసినప్పుడు, దీనిపై చర్చల్లో పాల్గొన్న 90 శాతం మంది మహిళలే’’ అని కిప్రోనో తెలిపారు.

జెండర్ ఆధారితంగా జరిగే హింస విషయంలో పురుషులు, మహిళల ప్రవర్తనలలో చాలా అంతరాయం కనిపిస్తుందన్నారు.

కెన్యా డీజే, పాడ్‌కాస్టర్, టీవీ హోస్ట్ మోసెస్ మథేంగే ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడాలనుకున్నారు. ఈయన ‘‘డీజే మోంజ్’’ గా పాపులర్.

స్త్రీ హత్యలను ఆపాల్సి ఉందని డిమాండ్ చేస్తూ ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తన వీడియోను పోస్టు చేశారు.

‘‘ఈ భయంకరమైన హింస వల్ల మనం చాలా మంది మహిళలను(భార్యలను, తల్లులను, కూతుర్లను, చెల్లెలను, స్నేహితులను, పిల్లలను) కోల్పోయాం’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

కెన్యాలో నిరసనలు

ఫొటో సోర్స్, AFP

డీజే మోంజ్ ఈ విషయంపై మరింత దృష్టిసారించి, స్త్రీహత్యలపై ప్రపంచవ్యాప్తంగా విడుదలైన గణాంకాలపై అధ్యయనం చేశారు.

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ స్త్రీహత్య కేసులు ఆఫ్రికాలోనే నమోదవుతున్నాయని తెలిసిందన్నారు. ‘‘మనం ఆఫ్రికన్లుగా గర్వించాల్సిన విషయాలు ఇవి కావు’’ అని అన్నారు.

యూఎన్ వుమెన్ 2022 విడుదల చేసిన డేటాలో మహిళా భాగస్వామి, కుటుంబ సంబంధిత హత్యలు ఆఫ్రికాలో రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 20 వేల వరకు ఈ హత్యలు జరిగినట్లు యూఎన్ వుమెన్ డేటాలో వెల్లడైంది.

ఆ తర్వాత ఆసియాలో 18,400, అమెరికాలో 7,900, యూరప్‌లో 2,300 కేసులు నమోదయ్యాయి.

మతపరమైన సంస్థలు కూడా బయటికి వచ్చి, ఈ విద్వేషానికి వ్యతిరేకంగా పోరాడాలని డీజే మోంజ్ పిలుపునిచ్చారు. ఆయన అంతకుముందు ఈ మతపరమైన సంస్థలలో పనిచేసిన అనుభవం ఉంది. ఆఫ్రికాలో ఎక్కువ మంది క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తారు.

‘‘దీనిపై మనం పోరాడాల్సి ఉంది. కొన్ని సార్లు మేం చర్చిలో పెళ్లి అనే అనుబంధంలో చిరకాలం ఉండాలని చెబుతూ ఉంటాం. భర్త ఆమెను కొట్టినప్పటికీ దీనికి విలువ ఇవ్వాలని అంటుంటాం’’ అని చెప్పారు. కానీ, ఆమె మరణించే దశకు వచ్చినప్పుడు, ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తమకెలా తెలుస్తుందని మాట్లాడుకుంటూ ఉంటామన్నారు.

కెన్యా సమాజం నుంచి ఈ భయంకరమైన స్త్రీద్వేషాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలంటే సమయం పడుతుందని కిప్రోనో అభిప్రాయపడుతున్నారు.

‘‘ఈ పితృస్వామ్య విధానం పురుషులుపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఇది మాలో ఎంత బలంగా నాటుకు పోయిందో కూడా మేం గుర్తించలేకపోతున్నాం’’ అని అన్నారు.

‘‘ఇది నా పోరాటం కాదని ప్రజలు భావిస్తున్నారు. ఇది మారాల్సి ఉంది’’ అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)