హ్యూమన్ రైట్స్ వాచ్: మైనారిటీలు, మహిళల పట్ల భారత్ వివక్ష చూపిస్తోందన్న 'వరల్డ్ రిపోర్ట్-2024'

రెజ్లర్ల నిరసన

ఫొటో సోర్స్, @SAKSHIMALIK/TWITTER

మైనార్టీ మతస్థుల పట్ల భారత ప్రభుత్వం వివక్ష చూపుతోందని మానవ హక్కుల కోసం పనిచేసే హ్యుమన్ రైట్స్ వాచ్ సంస్థ ఆరోపించింది.

హ్యుమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన ‘ప్రపంచ నివేదిక 2024’ మానవ హక్కులకు సంబంధించి భారత వైఖరి, విధానంపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఈ నివేదికను హ్యుమన్ రైట్స్ వాచ్ గురువారం విడుదల చేసింది.

హ్యుమన్ రైట్స్ వాచ్ సుమారు వంద దేశాల్లో మానవ హక్కుల విధానాలను, చర్యలను పర్యవేక్షిస్తోంది. వీటిని ఆధారంగా చేసుకునే వార్షిక ప్రపంచ నివేదికను రూపొందిస్తుంది.

తాజాగా విడుదలైన ఈ 740 పేజీల నివేదిక మణిపూర్‌లో జరిగిన మతపరమైన అల్లర్ల నుంచి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేసిన నిరసనలు, జమ్మూకశ్మీర్‌లోని తాజా పరిస్థితుల వరకు చాలా అంశాలను ప్రస్తావించింది.

భారత్ గతంలో ఇలాంటి నివేదికల ఆరోపణలను తిరస్కరించింది. హ్యుమన్ రైట్స్ వాచ్ తాజాగా విడుదల చేసిన నివేదికపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.

భారత్‌లో మతపరమైన హింస

ఫొటో సోర్స్, GETTY IMAGES

తాజా నివేదికలో ఏముంది?

భారత్‌లో గత ఏడాది కాలంగా మానవ హక్కులను అణచివేస్తూ, వేధింపులకు గురిచేస్తూ పలు ఘటనలు జరిగినట్లు హ్యుమన్ రైట్స్ వాచ్ వెల్లడించింది.

భారత్‌లో ప్రస్తుతం ఉన్న బీజేపీ పాలిత ప్రభుత్వాన్ని హిందూ జాతీయవాద ప్రభుత్వంగా ఈ సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.

సామాజిక కార్యకర్తలను, జర్నలిస్టులను, విపక్ష నేతలను, ప్రభుత్వ విమర్శకులను భారత్ గత ఏడాది అరెస్ట్ చేసిందని తెలిపింది.

ఉగ్రవాదం వంటి రాజకీయ ప్రేరేపిత నేరాభియోగాలను వారిపై నమోదు చేసినట్లు ఈ నివేదిక చెప్పింది.

ఈ నివేదిక ప్రకారం, ‘‘దాడులతో జర్నలిస్టులను, సామాజిక కార్యకర్తలను, విమర్శకులను వేధిస్తుంది. ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డట్టు ఆరోపిస్తోంది. ప్రభుత్వ రహిత సంస్థల ఫండింగ్‌ను నియంత్రించే విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని వాడుతోంది’’ అని చెప్పింది.

‘‘బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న విభజనా విధానాలు, వివక్ష వల్ల మైనార్టీలపై హింసాత్మక ఘటనలు పెరిగాయి. ఇవి ప్రభుత్వాన్ని విమర్శించే వారిలో భయం, ఆందోళనకర పరిస్థితులను సృష్టించాయి’’ అని సంస్థ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ మీనాక్షి గంగూలీ చెప్పారు.

బాధ్యులను శిక్షించకుండా బాధితులను వేధించడం, ప్రశ్నించే వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుండటం తమల్ని కలచివేస్తున్నాయని మీనాక్షి గంగూలీ అన్నారు.

బీబీసీ కార్యాలయాలపై దాడులు

ఫొటో సోర్స్, REUTERS

నివేదికలో ప్రస్తావించిన ఘటనలు

బీబీసీ కార్యాలయాలపై దాడులు

గత ఏడాది ఫిబ్రవరిలో బీబీసీ కార్యాలయాలపై జరిగిన దాడులను, మణిపుర్ హింసాత్మక ఘటనలను, దేశ రాజధానిలో మహిళా రెజ్లర్ల ఆందోళనలను ఈ నివేదికలో హ్యుమన్ రైట్స్ వాచ్ ప్రస్తావించింది.

మోదీపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీని విడుదల చేసిన తర్వాత దిల్లీ, ముంబైలలో ఉన్న బీబీసీ కార్యాలయాలపై ప్రభుత్వం దాడులు చేసిందని ఈ నివేదిక తెలిపింది.

ముస్లింలకు భద్రతను అందించడంలో అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆ డాక్యుమెంటరీలో ఉంది.

ఐటీ చట్టంలో ఉన్న అత్యవసర అధికారాలను ఉపయోగించి ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీ భారత్‌లో విడుదల చేయకుండా అడ్డుకుంది.

‘‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’’ పేరుతో రెండు ఎపిసోడ్‌లలో ఈ డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది.

తొలి ఎపిసోడ్ జనవరి 17న బ్రిటన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండో ఎపిసోడ్ జనవరి 24న ప్రసారమైంది.

రాజకీయాల్లో నరేంద్ర మోదీ తొలిరోజులను డాక్యుమెంటరీ తొలి భాగంలో చూపించారు. భారతీయ జనతా పార్టీలో సాధారణ నేత నుంచి నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యే దశలను ఇందులో చిత్రీకరించారు.

నూహ్‌లో మత ఘర్షణలు

ఫొటో సోర్స్, PARVEEN KUMAR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

నూహ్‌లో మత ఘర్షణలు

హర్యానా నూహ్‌లో హిందూ మతాన్ని అనుసరించే కొందరు వ్యక్తులు ఊరేగింపును నిర్వహించారు. ఆ యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో మత ఘర్షణలు చెలరేగాయి.

ప్రభుత్వం ముస్లింలపై చర్యలు తీసుకునే క్రమంలో, చాలా మంది ముస్లింల ప్రాపర్టీలను ధ్వంసం చేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారని ఈ నివేదికలో ఉంది.

నివేదిక ప్రకారం జూలై 31న బజరంగ్ దళ్ నూహ్‌లో ఈ ధార్మిక యాత్ర నిర్వహించింది. ఈ యాత్రలో వేలాది మంది బజ్‌రంగ్ దళ్ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

నూహ్‌లోని దేవాలయం నుంచి యాత్ర జరుగుతుండగా రాళ్ల దాడి, క్షణాల వ్యవధిలో మంటలు చెలరేగాయి అల్లరిమూకల గుంపు నగరంలోని పలు వీధులు, ఆలయం వెలుపల ప్రాంతాల్లో నిప్పు పెట్టింది. దీంతో పెద్ద సంఖ్యలో జనం ఆలయంలో చిక్కుకుపోయారు. ఆ తర్వాత పోలీసుల సాయంతో వారంతా బయటపడ్డారు.

పరిస్థితులు అదుపు తప్పడంతో బీజేపీ పాలిత హర్యానా ప్రభుత్వంపై పంజాబ్, హర్యానా హైకోర్టు మండిపడింది.

మణిపుర్‌లో హింసాత్మక ఘటనలు

ఫొటో సోర్స్, GETTY IMAGES

మణిపుర్‌లో హింస

గత ఏడాది మే నెలలో చిన్న రాష్ట్రమైన మణిపుర్‌లో రెండు గ్రూపులైన మెజార్టీ మైతేయీ, మైనార్టీ కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసి ఆ రాష్ట్రాన్ని తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది.

ఈ హింస పలువారాల పాటు కొనసాగింది. 200 మంది వరకు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది మంది ఇళ్లు, చర్చీలు ధ్వంసమయ్యాయి.

ఈ హింసాత్మక ఘటనలతో ఆ ప్రాంతంలో చాలా కాలం ఇంటర్నెట్‌ను బ్యాన్ చేశారు.

మియన్మార్ నుంచే వారికి ఆశ్రయం కల్పిస్తూ, డ్రగ్స్ స్మగ్గింగ్ చేస్తూ కుకీ తెగకు చెందిన వారు ఈ హింసకు పాల్పడుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బిరేన్ సింగ్ ఆరోపించినట్లు నివేదికలో పేర్కొంది.

పెద్ద సంఖ్యలో మియన్మార్ నుంచి వచ్చే అక్రమ వలసదారుల ముప్పును మణిపుర్ ఎదుర్కొంటోందని గత ఏడాది మే 2న ఆయన చెప్పినట్లు నివేదిక పేర్కొంది. ఆ తర్వాత మే 3న హింస చెలరేగిందని తెలిపింది.

బీజేపీ ప్రభుత్వానికి చెందిన ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ వరుసగా రెండోసారి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు.

మణిపుర్ జనాభాలో 64 శాతంగా ఉన్న మైతేయీ కమ్యూనిటీ, తమకు ఎస్టీ హోదా ఇవ్వాలని అడుగుతోంది. దీన్ని పర్వతాల్లో నివసించే కుకీ, నాగా తెగల వారు వ్యతిరేకిస్తున్నారు.

ఇప్పటికే ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకబడి ఉన్న వీరి ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే, కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూములు కొనేందుకు లేదా స్థిరపడేందుకు వారికి అనుమతిస్తున్నట్లు అవుతుందని వాదిస్తూ నిరసనలకు దిగారు.

ఇటీవల మైతేయీ ట్రైబ్ యూనియన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన మణిపుర్ హైకోర్టు, దీన్ని పున:పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

పార్లమెంట్‌లో కూడా మణిపుర్ హింసపై పెద్ద ఎత్తున రగడ జరిగింది. రాష్ట్ర పోలీసుల నియంత్రణలో పరిస్థితులు లేవని సుప్రీంకోర్టు కూడా తెలిపింది.

ఈ హింసాత్మక ఘటనలను విచారించేందుకు, ఆ సమయంలో జరిగిన లైంగిక హింస కేసులను విచారించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

మణిపుర్‌లో మే నెలలో మైతేయి వర్గానికి చెందిన పురుషులు ఇద్దరు కుకి మహిళలను వివస్త్రులను చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన భయానక వీడియో వెలుగులోకి రావడంతో, ఈ హింసపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది.

ఐక్యరాజ్య సమితి కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. మణిపుర్‌లో మహిళలను, అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని జరిపిన లైంగిక వేధింపు ఘటనల వార్తలు, ఫోటోలు తమల్ని కలచివేశాయని హ్యుమన్ రైట్స్ వాచ్ తెలిపింది.

జమ్మూ, కశ్మీర్‌లో ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/AFP VIA GETTY IMAGES

జమ్మూ, కశ్మీర్ కేసు

జమ్మూ, కశ్మీర్‌లో భావా ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించినట్లు వచ్చిన ఆరోపణలను హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో ప్రస్తావించింది.

కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్ట్ 5న జమ్మూకశ్మీర్‌కు రాజ్యాంగపరంగా ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేసింది. జమ్మూ, కశ్మీర్, లద్దాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది.

ఆగస్ట్ 2019 నుంచి గృహ నిర్భంధంలో ఉన్న జమ్మూకశ్మీర్ హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ నాలుగేళ్ల తర్వాత విడుదలయ్యారు.

డిసెంబర్‌లో పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, ఆర్మీ తొమ్మిది మందిని ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. వారిలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఈ అంశాలను హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో ప్రస్తావించింది.

సాక్షి మాలిక్

ఫొటో సోర్స్, SakshiMalik

రాజధాని వీధుల్లోకి వచ్చి మహిళా రెజ్లర్ల నిరసన

రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు చేపట్టిన నిరసనలు గత ఏడాది దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఫెడరేషన్‌కు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బ్రిజ్ భూషణ్ సింగ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని మహిళా రెజ్లర్లు ఆరోపించారని నివేదిక పేర్కొంది. ఈ మహిళా రెజ్లర్లలో ఒలింపిక్ పతాక విజేతలు కూడా ఉన్నారు.

బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నించిందని హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో పేర్కొంది.

బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోన్న మహిళా రెజ్లర్ల నిరసనలను బలవంతంగా ఆపివేయించారని తెలిపింది. వారితో అవమానకరంగా ప్రవర్తించారని చెప్పింది.

మహిళా రెజ్లర్ల నిరసన

ఫొటో సోర్స్, ANI

ఏడాది చివరిలో భారత రెజ్లింగ్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగగా దానిలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు అనుకూలమైన, ఆయన సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ తాను రెజ్లింగ్‌ను వదిలేస్తున్నట్లు ప్రకటించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనే టేబుల్‌పై తన షూస్‌ను వదిలేసి వెళ్లారు.

కొంతమంది రెజ్లర్లు ప్రభుత్వం గౌరవార్థంగా తమకు ఇచ్చిన పతకాలను తిరిగి ఇచ్చేశారు.

ఆ తర్వాత రెజ్లింగ్ అసోసియేషన్‌కు కొత్తగా ఎన్నికైన ఎగ్జిక్యూటివ్‌ను క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేసింది.

దేశంలో డిజిటల్ సౌకర్యాలను పెంచేందుకు ప్రభుత్వం పనిచేసిందని, ఈ సౌకర్యాలు సామాన్య ప్రజలకు చేరుకునేలా ప్రయత్నించిందని రిపోర్టు తెలిపింది.

కానీ, ఇంటర్నెట్‌పై ఆంక్షలు, డేటా భద్రత లోపించడం వంటివి ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అవరోధంగా నిలిచాయని నివేదిక ఎత్తిచూపింది. అంతేకాక, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సస్ అనేది అతిపెద్ద సమస్యగా ఉందని చెప్పింది.

ఈ ఏడాది భారత్ జీ20కు నాయకత్వం వహించింది. జీ20 కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. భారత ప్రయత్నాలతోనే ఆఫ్రికన్ యూనియన్ జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని పొందగలిగిందని హ్యుమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)