హిందూ టీమ్, ముస్లింల జట్టు.. ఇలా మతాల ఆధారంగా టీమ్‌లు ఏర్పడి క్రికెట్ ఆడిన రోజులున్నాయి.. చివరకు ఆ పోటీలు ఎలా ముగిశాయో తెలుసా

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, జస్పాల్ సింగ్
- హోదా, బీబీసీ పంజాబీ
భారత్‌లో క్రికెట్ అంటే ప్రజలకు ఎంత ఇష్టమో తెలియంది కాదు. భారత జట్టు ఏ సమయంలో మ్యాచ్ ఆడినా కూడా.. లక్షలాది మంది క్రీడాభిమానులు ఆ మ్యాచ్‌ను చూస్తారు.
భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ, దానికి మించిన ఆదరణ సంపాదించుకుంది క్రికెట్.
ఎన్నో దశలను దాటుకుంటూ ఈ ఆట రూపాంతరం చెందుతూ వచ్చిందని దీని చరిత్రను చూస్తే అర్థమవుతోంది.
ఒకప్పుడు భారత్‌లో క్రికెట్ పోటీలు రాష్ట్రాలు, ప్రాంతాల మధ్య కాకుండా.. మతాల ఆధారంగా జట్లు ఏర్పడి మ్యాచ్‌లు జరిగిన రోజులున్నాయి.
ప్రస్తుత కాలంలో ఇది నమ్మడం కాస్త కష్టమే కావొచ్చు. కానీ, హిందూ జట్టు ముస్లిం టీమ్‌తో, ముస్లిం టీమ్ పార్సీ జట్టుతో పోటీ పడేది. అలాగే పార్సీ టీమ్, హిందూ జట్టుతో పోటీ పడేది.
ఈ పోటీలు ఎన్నో ఏళ్ల పాటు కొనసాగాయి. ఈ మ్యాచ్‌లను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చేవారు.
ఈ పోటీలకు వార్తా పత్రికలు కూడా ఆ సమయంలో ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చేవి.
ఈ ఆర్టికల్‌లో మనం ఇప్పుడు ‘ది బొంబే పెంటాంగ్యులర్’ అనే ప్రముఖ టోర్నమెంట్ గురించి తెలుసుకుందాం.
ఎలా ఈ టోర్నమెంట్ ప్రారంభమైంది? దీని చుట్టూ నెలకొన్న వివాదాలేంటి? ఎలా ఈ టోర్నమెంట్ ముగిసిందో చూద్దాం..

ఫొటో సోర్స్, GETTY IMAGES
భారత్‌లో క్రికెట్ ప్రారంభం
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం గుజరాత్‌లో ఉన్న కచ్‌కు బ్రిటన్ నుంచి ఒక నౌక వచ్చింది.
ఈ నౌకలోని వారు సరదాగా కాలం గడిపేందుకు ఇతర కార్యకలాపాలతో పాటు, క్రికెట్ కూడా ఆడేవారు.
కాలం గడుస్తున్న కొద్ది భారత్‌లో కూడా మెల్లమెల్లగా క్రికెట్ ఆట మొదలైంది. 1792లో తొలుత కలకత్తా క్రికెట్ క్లబ్ ఏర్పాటైంది.
లండన్‌లోని ఎంసీసీ క్లబ్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత పురాతన క్రికెట్ క్లబ్ ఇదే.
అదే సమయంలో, భారత్‌లో క్రికెట్‌ను అందిపుచ్చుకున్న తొలి కమ్యూనిటీ పార్సీ కమ్యూనిటీనే.
1848లో పార్సీ కమ్యూనిటీ ఓరియెంటల్ క్రికెట్ క్లబ్‌ను ఏర్పాటు చేసింది. దీని తర్వాత, పార్సీ కమ్యూనిటీ ఇతర ఎన్నో క్రికెట్ క్లబ్‌లను తెరిచింది.
ఆ సమయంలో పార్సీ కమ్యూనిటీల వద్ద అన్ని రకాల సదుపాయలు ఉండేవి. అందుకే వారు తమ జట్లను బ్రిటన్‌కు పంపేందుకు కూడా అనుమతించేవారు.
ఆ తర్వాత 1889-90ల్లో జీఎఫ్ వెర్నాన్ కెప్టెన్సీ కింద ఇంగ్లాండ్ టీమ్ భారత్ వచ్చింది. పార్సీ కమ్యూనిటీకి చెందిన టీమ్ నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. భారతీయ క్రికెట్ టీమ్‌కు ఇది అతిపెద్ద విజయం.
సచిన్ టెండూల్కర్ ఆటోబయోగ్రఫీ ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ సహ రచయిత, చరిత్రకారుడు, సీనియర్ క్రీడా పాత్రికేయుడు బోరియా మజుందార్ బాంబే పెంటాంగ్యులర్ గురించి రాశారు.
‘‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ది హిస్టరీ ఆఫ్ స్పోర్ట్స్’లో ఇది ప్రచురితమైంది.
‘‘పార్సీలు ఎన్నో క్రికెట్ క్లబ్‌లను ఏర్పాటు చేశారు. బాంబే వ్యాపార సామ్రాజ్యంలో పార్సీ కమ్యూనిటీతో హిందూ కమ్యూనిటీ పోటీ పడటం ప్రారంభించింది. పార్సీ కమ్యూనిటీ తర్వాత, హిందువులు కూడా క్రికెట్ ఆడటం ప్రారంభించేందుకు ఇది కూడా ఒక కారణంగా మారింది’’ అని బోరియా మజుందార్ తన వ్యాసంలో వివరించారు.
తొలి హిందూ క్రికెట్ క్లబ్ 1866లో ‘బాంబే యూనియన్’ పేరుతో ఏర్పాటైంది. ప్రాంతాల పేర్లతో పార్సీ కమ్యూనిటీ క్లబ్‌లను ఏర్పాటు చేయడంతో, మరోవైపు హిందువులు కులం, మతాల పేరుతో క్లబ్‌లను ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
‘ది బొంబే పెంటాంగ్యులర్’ 1890ల్లో ప్రారంభం కాకముందు.. భారత్‌లో పార్సీ కమ్యూనిటీలు, యూరోపియన్ క్లబ్‌లకు మధ్య వార్షిక ఈవెంట్లలో మ్యాచ్‌లు జరిగేవి.
ఈ మ్యాచ్‌లు 1907ల్లో ట్రయాంగిల్‌గా మారాయి. అంటే హిందువులకు చెందిన టీమ్ కూడా ఈ పోటీల్లో భాగమైంది.
ముస్లింల జట్టు 1912లో ఈ పోటీల్లో చేరింది. 1937ల్లో ‘రెస్ట్’ అనే పేరుతో టీమ్ ఏర్పాటైంది. దీనిలో ఆంగ్లో ఇండియన్లు, క్రిస్టియన్ కమ్యూనిటీలకు చెందిన క్రీడాకారులు ఉన్నారు.
దీంతో దీని పేరు పెంటాంగ్యులర్ టోర్నమెంట్‌గా మారింది. కానీ, కేవలం నాలుగు జట్లు మాత్రమే దీనిలో భాగమయ్యాయి.
కౌశిక్ బంధోపాధ్యాయ్ ‘మహాత్మ ఆన్ పిచ్’ పేరుతో ఒక పుస్తకం రాశారు. దీనిలో ‘ది బాంబే పెంటాంగ్యులర్ టోర్నమెంట్’ గురించి వివరించారు. 1912 వరకూ ఈ టర్నోమెంట్ వల్ల ఎలాంటి మతపరమైన హింసలు జరగలేదు.
సింధ్, లాహోర్, దిల్లీ, సెంట్రల్ ప్రావిన్స్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహించే వారు.
వివిధ కమ్యూనిటీల మధ్య పోటీకరమైన స్ఫూర్తి పెరగడంతో ఆ సమయంలో భారత్‌లో క్రికెట్ పాపులారిటీ పెరిగిందని కౌశిక్ రాశారు.
1930 ప్రారంభం వరకు కూడా ఈ టోర్నమెంట్‌లో క్రీడా స్ఫూర్తి స్పష్టంగా కనపడేది. ‘1924లో ముస్లిం టీమ్ టోర్నమెంట్‌లో గెలిచినప్పుడు, ఆ విజయాన్ని హిందువులు కూడా పండగగా చేసుకున్నారు. ఈ క్రీడా స్ఫూర్తిని చూసి మహమ్ముద్ అలీ జిన్నా కూడా ఎంతో ఆశ్చర్యపోయి, ప్రశంసలు కురిపించారు’’ అని కౌశిక్ రాశారు.
కమ్యూనిటీల మధ్య పోటీలు మతపరమైన హింసగా ఎలా మారాయి?
‘‘భారత్ ఒక దేశంగా మారేందుకు మతాల మధ్య ఈ టీమ్ కాంపిటీషన్లు అవసరమనే దానిపై ఈ టోర్నమెంట్ వివాదాస్పదంగా మారింది. రెండు రకాల వాదనలు వినిపించాయి. క్రికెట్ ద్వారా కమ్యూనిటీలను ఏకం చేస్తున్నామన్నది ఒక వాదన అయితే.. టోర్నమెంట్‌లో జరిగే పోటీల వల్ల చెడు వ్యాప్తి చెందుతుందని, కమ్యూనిటీల మధ్య దూరం పెరుగుతుందనేది మరో గ్రూప్ వాదన’’ అని కౌశిక్ చెప్పారు.
1928లో బీసీసీఐ ఏర్పాటు అయిన తర్వాత, ఈ పోటీలను పలువురు వ్యతిరేకించారని కౌశిక్ తెలిపారు. కానీ, చాలా మంది ఈ టోర్నమెంట్లకు అనుకూలంగానే మాట్లాడినట్లు చెప్పారు.
‘‘1936లో బొంబే క్వాడ్రాంగ్యులర్ జరగడానికి ముందు హిందూ-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. ఆ సమయంలో ఈ పోటీని ఆపే సమయం వచ్చింది అని ‘ది బొంబే క్రానికల్’ చెప్పింది. లేదంటే.. కమ్యూనిటీల మధ్య ఇది వివాదాన్ని మరింత చేయనుందని తెలిపింది. దేశ ప్రయోజనాల మేరకు ఈ టోర్నమెంట్ ముగించాలని పలువురు క్రికెట్ పెద్దలు కూడా సూచించారు’’ అని కౌశిక్ రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
గాంధీ ప్రకటన
డిసెంబర్ 1940న ఈ టోర్నమెంట్ గురించిన చర్చ విపరీతంగా పెరిగింది. ఈ సమయంలో హిందూ జింఖానాకు చెందిన ప్రతినిధులు సలహా కోసం గాంధీజీ వద్దకు వెళ్లారు.
గాంధీజీ అభిప్రాయాలు ‘ది కలెక్టివ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ’ 79వ సంపుటిలో ప్రచురితమయ్యాయి.
యూరప్‌లో జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్ధం, చాలా మంది నేతలు జైలు శిక్ష అనుభవిస్తోన్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌లను ఆపేయాలని గాంధీజీ కూడా పిలుపునిచ్చారు.
‘‘బొంబే ప్రజలకు నేనేమి చెప్పాలనుకుంటున్నా అంటే.. మతపరంగా జరిగే ఈ మ్యాచ్‌లను ఆపేసి, క్రీడలు ఆడే తీరును మార్చాలి. కాలేజీల మధ్య మ్యాచ్‌లు జరగడాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, హిందూ, ముస్లింల మధ్య ఈ మ్యాచ్‌లేంటన్నది నాకర్థం కావడం లేదు. పార్సీలకు మధ్య ఈ మ్యాచ్‌లు ఎందుకు?’’ అంటూ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
గాంధీజీ ప్రకటన తర్వాత కూడా 1941లో ఈ టోర్నమెంట్ జరిగింది. 1942 మినహాయిస్తే, 1946 వరకు ఈ టోర్నమెంట్ కొనసాగింది. ఆ తర్వాత ఈ టోర్నమెంట్‌కు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ టోర్నమెంట్ ఎలా ముగిసింది?
ఈ టోర్నమెంట్ 1943 నుంచి 1945 మధ్యలో ఉత్సాహంగా సాగింది.
ఈ టోర్నమెంట్ విషయంలో ప్రజలు ఎంత ఉత్సాహంగా ఉన్నారో వివరిస్తూ ఆ సమయంలో మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయని కౌశిక్ చెప్పారు.
కానీ చివరి పెంటాంగ్యులర్ టోర్నమెంట్ ఫిబ్రవరి 1946లో జరిగింది. ఆ ఏడాది భారత్‌లో చాలా ప్రాంతాల్లో మతపరమైన ఘర్షణలు పెద్ద ఎత్తున చెలరేగాయి.
ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ ఆడటం కష్టమని భావించారు. వివిధ కమ్యూనిటీల మధ్య వివాదాలు పెరగడంతో ఈ టోర్నమెంట్‌కు మద్దతు ఇస్తూ వచ్చిన ప్రముఖులు సైతం దీన్ని రద్దు చేయాలని సూచించారు.
దీంతో ఈ టోర్నమెంట్ దేశంలో శాంతికి భంగం కలిగిస్తుందని బీసీసీఐ అధ్యక్షుడు ఆంథోని డి మెల్లో చెప్పారు. ఆ తర్వాత చాలా సార్లు ఈ టోర్నమెంట్‌ను తిరిగి ప్రారంభించాలని చూశారు. కానీ, అది సాధ్యం కాలేదు.
ఇవి కూడా చదవండి:
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
- జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
- చనిపోతే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో పాస్టర్ సహా ఏడుగురి ఆత్మహత్య.. ఇదెలా బయటపడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














