ఇండియా vs సౌతాఫ్రికా: ఇది టెస్టా, వన్డేనా? పిచ్ క్యురేటర్‌పై అనుమానాలు

ఇండియా సౌతాఫ్రికా

ఫొటో సోర్స్, GRANT PITCHER/GALLO IMAGES

    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, బీబీసీ కోసం

వన్డే మ్యాచ్‌లో మొత్తం రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 100 ఓవర్లు ఉంటాయి. కానీ దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్ట్ కేవలం 107 ఓవర్లలోనే ముగియడం అభిమానులనే కాదు, ఇరుజట్లను కూడా ఆశ్చర్యపరిచింది.

ఈ టెస్ట్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. టెస్ట్‌ మ్యాచ్‌ల చరిత్రలోనే అత్యంత తక్కువ సమయంలో అంటే కేవలం ఒకటిన్నర రోజులో ముగిసిన మ్యాచ్‌గా ఇది రికార్డులెకెక్కింది.

మొత్తం 642 బంతులు మాత్రమే మ్యాచ్ సాగింది. అంటే 107 ఓవర్లన్నమాట. వన్డేమ్యాచ్ కంటే కేవలం 7 ఓవర్లు ఎక్కువ అంతే.

సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 55 పరుగులు చేయగా బదులుగా భారత్ 153 పరుగులు చేసింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్యజట్టు 176 పరుగులకు ఆలౌట్ కాగా, రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసి గెలిచింది. దీంతో ఈ సిరీస్ 1-1తో డ్రా అయింది.

ఇక ఈ మ్యాచ్‌లో 7 వికెట్లు తీసిన భారత పేసర్ మహ్మద్ సిరాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికవవ్వగా, బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

దక్షిణాఫ్రికాలో ప్రస్తుత సిరీస్ ప్రారంభానికి ముందు మహ్మద్ సిరాజ్‌తో ప్రిటోరియాలో మాట్లాడాను. అతను ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. టీమ్ బసచేసిన హోటల్ ముందు అతను టీని ఆస్వాదిస్తున్నాడు.

ఆ సమయంలో నేను అతనిని ఓ ప్రశ్న అడిగాను. ‘ ఇంత తక్కువ సమయంలో స్టార్‌ క్రికెటర్ అయ్యారు కదా.. ఒత్తిడికి గురవడం లేదా’’ అని..

దానికి సిరాజ్ ఓ అమాయకమైన బదులు ఇచ్చాడు. ‘‘ స్టార్, విస్టార్ ఏమీ లేవు బ్రదర్.. ఏ ఫార్మాట్ అయినా మంచి బంతులు వేసుకుంటూ వెళ్ళిపోవడమే’’ అని చెప్పాడు.

ఓ వారం రోజుల తరువాత న్యూలాండ్స్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సిరాజ్ ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను తన బౌలింగ్‌తో కకావికలం చేశాడు.

దీన్ని చూశాకా ఫార్మాట్‌తో సంబంధం లేకుండా సిరాజ్ విధ్వంసక బౌలింగ్ చేసేవాడిలా కనిపించాడు.

ఇందుకు కొన్ని నెలల ముందే ఆసియాకప్ ఫైనల్లో శ్రీలంక బ్యాటింగ్‌ను తన అద్భుత బౌలింగ్‌తో తుత్తినియలు చేశాడు.

ఇండియా సౌతాఫ్రికా

ఫొటో సోర్స్, ANI

సిరాజ్ కంటే పిచ్‌కే ఎక్కువ పేరొచ్చింది

కేప్‌టౌన్ లో జరిగిన రెండో టెస్ట్‌మ్యాచ్‌లో మొదటిరోజు ఆట ముగిసిన తరువాత సిరాజ్ ప్రతిభపై కంటే కూడా పిచ్ స్వభావంపైనే అందరికళ్ళు పడ్డాయి.

మొదటిరోజు ఆటలో 23 వికెట్లు పడటమనేది ప్రతిరోజూ జరిగే పనికాదు. దశాబ్దానికో ఇంకా చెప్పాలంటే శతబ్దానికోసారేమైనా ఇలాంటి అరుదైనవి చోటు చేసుకుంటాయి.

సున్నా పరుగులకే 6 వికెట్లు కోల్పోవడమనేది టీమ్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి. సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ అష్వెల్ ప్రిన్స్ ప్రెస్ మీట్‌కు వచ్చినప్ప్పుడు ఈ పిచ్ గురించి సమర్థించుకోవడానికి ఆయనదగ్గర ఏమీ లేకపోయింది.

ఈ పిచ్ ఇంత వేగంగా, అసమానమైన బౌన్స్‌తో ఉంటుందనే విషయం తనకే తెలియదని ఆయన చెప్పారు.

ఈ విషయం తనక ముందుగానే తెలిసి ఉంటే స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను బౌలింగ్‌కు ఎందుకు దింపుతామని ప్రశ్నించారు.

భారత్‌ను ఓడించాలనే పిచ్ క్యూరేటర్ అత్యుత్సాహం తమను ఇబ్బందుల్లోకి నెట్టిందనే భావన సౌతాఫ్రికా టీమ్‌లో వ్యక్తమవుతోంది.

ఇండియా సౌతాఫ్రికా

ఫొటో సోర్స్, ANI

కోహ్లీ, రోహిత్ అనుభవం

ఈ పిచ్‌పై కేవలం నలుగురు బ్యాట్స్‌మెన్లు మాత్రమే రెండంకెల స్కోర్లు దాటారు. ఏ బ్యాట్స్‌మెన్ కనీసం అర్థసెంచరీ కూడా చేయలేకపోయాడు. దీంతో ఈ పిచ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో రోహిత్ శర్మ అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే వన్డే ఓపెనర్ తరహా బ్యాటింగ్ చేశాడు.

కోహ్లీ క్రీజులో ఉన్నంతసేపు అతను నియంత్రణలోనే ఉన్నట్టు కనిపించాడు కానీ, పెద్ద స్కోరు చేయలేకపోయాడు.

ఈ మ్యాచ్ నాలుగైదురోజులపాటు జరగదని అర్థమైపోయింది. చివరకు మూడోరోజు గురించి కూడా మరిచిపోవాల్సి వచ్చింది.

ఎట్టకేలకు ఈ నాటకీయ టెస్ట్ మ్యాచ్ ను గెలుచుకోవడం ద్వారా టీమిండియా సిరీస్ ను సమం చేసి తన కలను నెరవేర్చుకుంది.

రోహిత్ శర్మ, విరాట్ అనుభవం, నైపుణ్యం ద్వారా తమ టెస్ట్ కెరీర్‌లో ఒక్కసారైనా దక్షిణాఫ్రికాలో సిరీస్‌ను కోల్పోకుండా వస్తారా అనే ప్రశ్నకు సమాధానం దొరికింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)