2024 లీప్ ఇయర్: ఫిబ్రవరి 29న అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు కాదనకూడదు... ఏమిటీ సంప్రదాయం?

లీప్ డే

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ఏడాది వచ్చేసింది. ఈసారి మన క్యాలెండర్లలో ఒకరోజు అదనంగా ఉండనుంది. అంటే సాధారణంగా ఏడాదిలో ఉండే 365 రోజులు కాకుండా ఈ ఏడాది 366 రోజులుంటాయి. దీన్నే లీప్ ఇయర్ అంటారు.

సంవత్సరంలో అతి చిన్న నెలగా పేరున్న ఫిబ్రవరిలో ఒక రోజు అదనంగా, అంటే ఫిబ్రవరి 29 తారీఖు కూడా ఉంటుంది. దీన్నే లీప్ డేగా చెబుతుంటారు. కొన్ని భిన్నమైన సంప్రదాయాలు, నమ్మకాలతో కూడా ఈ రోజును గుర్తిస్తుంటారు.

సాధారణంగా లీప్ ఇయర్ ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వస్తుంటుంది. చివరిసారి 2020లో లీప్ ఇయర్ రాగా.. ఈ ఏడాది తర్వాత మళ్లీ 2028లో రాబోతుంది.

కానీ, నాలుగేళ్లకు ఒకసారి వస్తుందంటోన్న లీప్ ఇయర్‌లో కూడా కొన్ని మినహాయింపులున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లీప్ ఇయర్‌లో ఉండే భిన్నమైన సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు ఈ ఇయర్‌ ఎలా వస్తుంది? దీని వెనుకున్న సిద్ధాంతాలేంటి? వంటి విషయాలను తెలుసుకుందాం..

ప్రపోజల్

ఫొటో సోర్స్, gettyimages

లీప్ ఇయర్స్ ఎందుకు ఉంటాయి?

ఒక ఏడాది అంటే 365 రోజులు. అంటే భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి పట్టే కాలం. కానీ, ఇది నిజానికి రౌండ్ ఫిగర్. అసలు భూమి ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 365.242190 రోజులు పడుతుంది. అంటే 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల 56 సెకన్లు అన్నమాట. దీన్ని తారావృత్తంగా పిలుస్తుంటారు. తారావృత్తం అంటే భూమి లేదా మరేదైనా గ్రహం సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం.

ఈ సమయం క్యాలెండర్ ఇయర్‌ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అందుకే, అదనపు గంటలు, నిమిషాలు, సెకన్లను తీసేసి చెబుతుంటారు.

కానీ, ప్రతి నాలుగేళ్లకు ఒకసారి అదనపు గంటలను కలిపితే ఒక రోజు అవుతుంది. ఇలా కాలాల్లో మార్పులకు అనుగుణంగా మన క్యాలెండర్ ఇయర్లను సర్దుబాటు చేస్తుంటారు.

దీంతో, పెరిగిన ఈ అదనపు గంటలకు అనుగుణంగా ప్రతి నాలుగేళ్లకు ఒకరోజు అదనంగా వస్తుంది. ఆ సంవత్సరాన్ని లీప్ ఇయర్ అంటారు.

పెళ్లి చేసుకున్న జంట

ఫొటో సోర్స్, Getty Images

లీప్ ఇయర్ విశ్వాసాలు, సంప్రదాయాలేంటి?

లీప్ ఇయర్‌తో ముడిపడి ఎన్నో సంప్రదాయాలు, మూఢ విశ్వాసాలు ఉన్నాయి.

బ్యాచిలర్స్ డే.. దీన్నే కొన్నిసార్లు లేడిస్ ప్రివిలేజ్‌గా చెబుతుంటారు. ఇది ఐరిస్ సంప్రదాయం. లీప్ డే రోజు అబ్బాయిలకు అమ్మాయిలు ప్రపోజ్ చేయొచ్చు.

ఐర్లాండ్‌లో ఇప్పటికీ లీప్‌ డే నాడు అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేసే సంప్రదాయం కొనసాగుతోంది.

ఈ ఆధునిక ప్రపంచంలో ఏ రోజైనా అమ్మాయిలు అబ్బాయిలకు ప్రపోజ్ చేయొచ్చు. కానీ, 5వ శతాబ్దంలో ఈ సంప్రదాయమే కొనసాగేది. సెయింట్ బ్రిడ్జెట్, సెయింట్ పాట్రిక్‌ల సిద్ధాంతాలకు అనుగుణంగా ఈ సంప్రదాయం వచ్చిందని అంటుంటారు.

ప్రపోజ్ చేయడంలో అబ్బాయిలు చాలా నిదానంగా ఉండటం వల్ల అమ్మాయిలు పెళ్లి కోసం చాలా కాలం వేచిచూడాల్సి వస్తుందని సెయింట్ పాట్రిక్ వద్దకు వెళ్లి బ్రిడ్జెట్ ఫిర్యాదు చేసినట్లు చెబుతారు. మహిళలకు ప్రపోజ్ చేసే అవకాశం కల్పించాలని కోరినట్లు ప్రచారం ఉంది.

లీప్ డే నాడు అమ్మాయిలు ప్రపోజ్ చేస్తే అబ్బాయిలు నిరాకరించకూడదట. ఒకవేళ అమ్మాయిల ప్రపోజల్‌ను నిరాకరిస్తే వారికి పరిహారం చెల్లించే సంప్రదాయం కూడా ఉంది. అంటే, ప్రపోజల్‌ను తిరస్కరించిన అబ్బాయి అమ్మాయికి హ్యాండ్ గ్లౌవ్స్(చేతి తొడుగులు) లేదా సిల్క్ గౌన్‌ కొనివ్వాల్సి ఉంటుంది.

పుట్టిన రోజు వేడుక

ఫొటో సోర్స్, gettyimages

అయితే, కొన్ని సంస్కృతుల్లో లీప్ డేను దురదృష్టకరమైన రోజుగా భావిస్తారు.

గ్రీస్‌లో లీప్ ఇయర్‌లో ముఖ్యంగా లీప్ డే రోజు పెళ్లి చేసుకోవడానికి అసలు ఆసక్తి చూపరు. ఎందుకంటే, లీప్ ఇయర్‌లో జరిగే ఏ పెళ్లి అయినా విడాకులతో ముగుస్తుందని వారి నమ్మకం.

లీప్ ఇయర్‌లో పెళ్లి చేసుకోవడాన్ని గ్రీకులు అంగీకరించరు.

సమాజానికి చెడు కలిగించడానికి మంత్రగత్తెలు ఒక దగ్గర గుమ్మికూడిన రోజును లీప్ డేగా స్కాట్లాండ్‌ ప్రజలు భావిస్తుంటారు.

కొందరు స్కాట్లాండ్ ప్రజలు ఫిబ్రవరి 29న బిడ్డకు జన్మనివ్వడాన్ని కూడా దురదృష్టంగా భావిస్తుంటారు.

ఫిబ్రవరి 29న మంత్రగత్తెలు సమాజానికి చెడు కలిగిస్తుంటారని వారు నమ్ముతుంటారు.

వీటికి విరుద్ధంగా కొన్ని సంప్రదాయాల్లో ఫిబ్రవరి 29న పుట్టడాన్ని ‘లక్కీ బర్త్‌డే’గా చెబుతారు. ఒకవేళ లీప్ డేన పుట్టినరోజు వస్తే, వారు ప్రత్యేకమైన వారిగా కొందరు ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వసిస్తుంటారు.

లీప్ ఇయర్

ఫొటో సోర్స్, gettyimages

ఫిబ్రవరిలోనే లీప్ డే ఎందుకు?

ప్రాచీన రోమ్‌లో చక్రవర్తి జూలియస్ సీజర్ క్యాలెండర్ సంస్కరణలలో భాగంగా లీప్ డేను కలిపేందుకు ఫిబ్రవరి నెలను ఎంపిక చేసినట్లు చరిత్రలో ఉంది.

జూలియన్ క్యాలెండర్‌ను సీజర్ ప్రవేశపెట్టారు. సోలార్ ఇయర్‌కు అనుగుణంగా క్యాలెండర్ ఇయర్‌ ఉండేలా లీప్ ఇయర్‌ను దీనిలో కలిపారు.

ఆ తర్వాత జూలియన్ క్యాలెండర్‌లో కొన్ని మార్పులు చేసి 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ప్రవేశపెట్టినప్పటికీ, లీప్ డేను ఫిబ్రవరిలో కలిపే సంప్రదాయాన్నే కొనసాగించారు.

ఒకవేళ లీప్ ఇయర్స్ లేకపోతే..?

ఒకవేళ లీప్ ఇయర్ లేకపోతే, క్యాలెండర్ల మధ్యలో ఉన్న అదనపు సమయాన్ని మనం పరిగణనలోకి తీసుకోం. క్యాలెండర్లలో రుతువుల గతి తప్పుతూ ఉంటాయి.

700 సంవత్సరాల కాలంలో, ఉదాహరణకు వేసవి కాలం ఉత్తరార్ధగోళంలో జూన్‌లో కాకుండా డిసెంబర్‌లో వస్తూ ఉంటుంది. లీప్ ఇయర్స్ లేకపోతే ఉత్తరార్ధగోళంలో జూన్‌లో శీతాకాలం, దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది.

లీప్ ఇయర్

ఫొటో సోర్స్, gettyimages

లీప్ ఇయర్ ఎన్నేళ్లకు వస్తుంటుంది?

ప్రతి నాలుగేళ్లకు ఒకసారి లీప్ ఇయర్స్ వస్తుంటాయని ప్రజలు నమ్ముతుంటారు. కానీ, అన్నిసార్లు అలా కాదు.

తారావృత్తంలో వచ్చే మార్పుల(రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్ల మధ్య మార్పులు)ను బట్టి లీప్ ఇయర్స్ వస్తుంటాయి. ప్రతి నాలుగేళ్ల కాలంలో క్యాలెండర్ ఇయర్స్‌లో రోజుకి కచ్చితంగా 24 గంటలే ఉండవు. నిజానికి ఇవి 23.262222 గంటలు.

ఈ తేడాను కూడా లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

లీప్ ఇయర్‌ను లెక్కించడంలో ఒక నిబంధన ఉంది. లీప్ ఇయర్‌ను నాలుగుతో భాగిస్తే, పూర్ణ సంఖ్య రావాల్సి ఉంటుంది.

100తో భాగించగలిగే సంవత్సరాలను లీప్ ఇయర్స్‌గా చెప్పరు.

ఒక ఏడాదిని 4తో, 400తో భాగించినప్పుడు పూర్ణ సంఖ్య వస్తే, ఆ ఏడాదిని కూడా లీప్ సంవత్సరంగా చెబుతుంటారు.

ఈ లెక్కలు కాస్త గందరగోళంగా అనిపించవచ్చు. కింద ఉదాహరణలతో కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం..

2000 సంవత్సరం లీప్ ఇయర్. ఎందుకంటే, ఇది 4తో, 400తో రెండింటితో భాగించడానికి వీలైంది.

కానీ, 1700, 1800, 1900 సంవత్సరాలను 4తో భాగించేందుకు వీలైనప్పటికీ, 400 భాగించడానికి వీలు కాలేదు. అందువల్ల ఇవి లీప్ ఇయర్స్ కాలేదు.

రాబోయే సంవత్సరాలలో 2100 కూడా లీప్ ఇయర్ కావడం లేదు. ఇది కూడా 400తో భాగించడానికి వీలు లేకుండా ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)