తిన్నది ఒంటబట్టడానికి 7 చిట్కాలు.. పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతం

ఫొటో సోర్స్, Getty Images
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలని మనందరికీ తెలుసు.
కొత్త సంవత్సరంలో చాలా మంది చేసే తీర్మానాల్లో ఈ ఏడాదంతా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటామనే తీర్మానం కూడా ఉంటుంది.
కానీ, దైనందిన జీవితానికి వచ్చేసరికి రోజూ పోషకాహారాన్ని తీసుకోవడం కష్టమే.
సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమైనదనే అంశంలో ఎలాంటి విభేదాలు లేవు.
ఆహారం నుంచి గరిష్ఠ పోషకాలను అందుకోవడానికి ఉపకరించే 7 చిట్కాలను ‘‘ద ఫుడ్ ప్రోగ్రామ్’’ అనే బీబీసీ కార్యక్రమంలో లివర్‌పూల్ జాన్ మూర్స్ యూనివర్సిటీ హ్యూమన్ ఫిజియాలజీ ప్రొఫెసర్ గ్రేమ్ ఎల్. క్లోజ్ వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
1. కొద్దిగా వ్యాయామం
ఉదయం పూట కొంత వ్యాయామం చేయడం వల్ల మీ జీవక్రియ చురుగ్గా మారుతుంది. రోజంతా మీరు ఉత్సాహంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది.
వ్యాయామం అంటే జిమ్‌లో కఠోర కసరత్తులు లేదా తీవ్రంగా పరిగెత్తాల్సిన అవసరం లేదు. శరీరానికి కాస్త పని కల్పిస్తే చాలు.
చురుగ్గా ఉండటానికి ఒక చిన్న ప్రయత్నం సరిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
2. ఎక్కువగా కూరగాయలు తినండి
కూరగాయలు ఆరోగ్యానికి మంచి చేయడమే కాకుండా సంతృప్తిని ఇస్తాయి.
కూరగాయలు ఎక్కువగా తినాలనుకుంటే సాదా ఆమ్లెట్ కాకుండా అందులో పాలకూర, మష్రూమ్స్, తాజా టమోటాలు, ఎర్ర మిరియాలు జోడిస్తే సరి.
వెజిటబుల్ స్మూతీలను కూడా ప్రయత్నించవచ్చు. అవకాడోలను మెత్తగా చేసి కూరగాయల్ని దానికి జోడించి తినేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. ప్రణాళిక
సమయాని కంటే ముందే మీరు సిద్ధమై ఉంటే ఆకలి బాధను తప్పించుకోవచ్చు.
చాలాసార్లు మనం ఆకలితో ఉన్నప్పుడే తప్పులు చేస్తుంటాం. పైగా అప్పుడు ఆరోగ్యకరమైన ఆహారం కోసం చూడకుండా అందుబాటులో ఉన్నది తినేస్తుంటాం.
బయటకు వెళ్లేటప్పుడు బ్యాగులో తినడానికి ఏదైనా తీసుకెళ్లడం వంటివి మీ అలవాటుగా మార్చుకోవాలి. దీనివల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి. బయట అధిక ధరకు ఆహారాన్ని కొనాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లో దొరికే ఆహారం కంటే నాణ్యమైన ఆహారాన్ని తినొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
4. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రోటీన్ తినండి
జంక్ ఫుడ్‌పై మమకారాన్ని తగ్గించుకోండి. దానికి దూరంగా ఉండండి.
స్వీట్స్, కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలని శరీరం కోరుకుంటుంది. కానీ, కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా ఉండేందుకు శరీరానికి ప్రోటీన్ అవసరం ఎక్కువ. వయసు పెరిగే కొద్దీ ఎక్కువ ప్రోటీన్ తినండి.
5. సూపర్‌మార్కెట్ ఆహారాలపై వ్యామోహం తగ్గించుకోండి
చాలా సూపర్‌మార్కెట్లు, పెద్ద పెద్ద స్టోర్లలో బిల్లు కౌంటర్ దగ్గరకు వెళ్లడానికి ముందు మనం అనేక ర కాల ఆహార పదార్థాలతో కూడిన అల్మారాలు, షెల్ఫ్‌లను దాటాల్సి ఉంటుంది.
ఈ ఆహారపదార్థాలన్నీ ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడవు. కానీ, సూపర్‌మార్కెట్లలో వాటన్నింటినీ దాటుకుని మనం వెళ్లేలా అమరిక ఉంటుంది.
కాబట్టి, ఈ స్టాల్స్ దగ్గరకు మీరు చేరుకోగానే చేతుల్ని జేబులో పెట్టుకొని, బిల్లు కౌంటర్‌కు చేరిన తర్వాతే వాటిని బయటకు తీయండి.
ఇలా చేయడం వల్ల అనారోగ్యకర ఆహార పదార్థాలను మీ షాపింగ్ బుట్టలో వేయకుండా మిమ్మల్ని మీరు నిరోధించుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
6. నిరుత్సాహపడొద్దు
ఒకవేళ మీరు తినడానికి జంక్‌ఫుడ్‌ను ఎంచుకున్నట్లయితే దాన్ని ఆస్వాదించండి. ‘గిల్టీ ఫీలింగ్’ తెచ్చుకోకండి.
కానీ, మరోసారి అదే ఆహారాన్ని ఆర్డర్ చేయకండి.
7. నీరు
నీరు తాగడం చాలా ఉత్తమం, మళ్లీ చౌక కూడా.
జ్యూస్, ఆల్కహాల్, కార్బోనేటెడ్ డ్రింక్స్ వంటి వాటిలో మీరు ఊహించినదానికంటే అధికంగా చక్కెర ఉండొచ్చు.
ఆరోగ్యకరమైన మానవ శరీరంలో మూడింట రెండొంతులు నీరే ఉంటుంది.
శరరీమంతా పోషకాలు సరఫరా కావడానికి, వ్యర్థాలు రవాణా చేయడానికి ద్రవాలు అవసరం. కణాల్లో జరిగే రసాయన చర్యల్లో కూడా ద్రవాలు పాల్గొంటాయి.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














