ఆంధ్రప్రదేశ్: '2024 ఎన్నికల్లో కేవలం సంక్షేమ పథకాలే గెలిపించలేవని జగన్ భావిస్తున్నారా?'...ఇంచార్జ్‌ల మార్పులో వైసీపీ వ్యూహమేంటి?

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
2024లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
అధికారంలో ఉన్న వైసీపీ ఓ అడుగు ముందుకేసి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగానే అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు స్థానాలకు కొత్త ఇంచార్జ్‌లను నియమిస్తోంది.
తొలి విడతలో 11, రెండో విడతలో 27 కలిపి మొత్తం 38 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త నేతలను ప్రకటించింది. మూడు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్‌లను కూడా మార్చింది.
కొత్త ఇంచార్జ్‌ల పేర్లు ప్రకటిస్తున్న సందర్భంతో ‘వారంతా తమ అభ్యర్థులే’ అంటూ బొత్స సత్యనారాయణ అన్నారు.
అయితే, అధికారిక ప్రకటనలో మాత్రం వారిని అభ్యర్థులుగా ప్రస్తావించలేదు.
ఇప్పుడు ప్రకటిస్తున్న ఈ బాధ్యులను మరో మూడు నెలల్లో జరగనున్న ఎన్నికల అభ్యర్థులుగా నిర్ణయిస్తారా? లేక మరోసారి మార్పులు చేసి కొత్త నేతలు తెరమీదకు వచ్చే అవకాశం ఉంటుందా? అన్న అంశం మాత్రం చర్చనీయంగా మారింది.

ఫొటో సోర్స్, BhumanaAbhinayReddy/FB
సీనియర్లను కాదని, వారసులకు చాన్స్..
కొత్త ఇంచార్జ్‌ల జాబితాలో కొందరు సీనియర్లకు అవకాశం లభించలేదు. సీనియర్ల స్థానంలో యువనేతలను తెర మీదకు తెచ్చారు.
కొందరు సీనియర్లు తమ వారసుల కోసం సీట్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. కొంతకాలంగా ఆయా నియోజకవర్గాల్లో అన్నీ తామై వ్యవహరిస్తున్న యువనేతలకు ఇప్పుడు ఇంచార్జ్ బాధ్యతలు దక్కాయి.
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బదులుగా ఆయన తనయుడు మోహిత్ రెడ్డికి బాధ్యతలు ఇవ్వగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి స్థానంలో ఆయన కుమారుడు అభినయ రెడ్డి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి బదులుగా ఆయన కొడుకు కృష్ణమూర్తికి అవకాశం దొరికింది.
ఇక ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు పిల్లి సూర్యప్రకాష్‌కు రామచంద్రాపురం ఇంచార్జ్ హోదా ఇచ్చారు. అక్కడి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి చెల్లుబోయిన వేణును రాజమహేంద్రవరం రూరల్‌కు పంపించి మరీ సూర్యప్రకాష్‌కు అవకాశం ఇవ్వడం విశేషం.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా స్థానంలో ఆయన కుమార్తె నూరి ఫాతిమాకు అవకాశం దక్కింది.
పోలవరం ఎస్టీ రిజర్వుడు స్థానంలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బదులుగా ఆయన భార్య తెల్లం రాజ్యలక్ష్మి కి చోటిచ్చారు.

ఫొటో సోర్స్, Chelluboina Srinivasa Venugopala Krishna/FB
మంత్రులకు తప్పని బదిలీలు..
మంత్రులకు కూడా స్థాన చలనం కలిగింది.
తొలి జాబితాలో ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, విడదల రజనీ వంటి మంత్రులు సీట్లు మారాల్సి వచ్చింది.
రెండో జాబితాలో మరో ముగ్గురు మంత్రులు ఈ జాబితాలో చేరారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్, కళ్యాణదుర్గం నుంచి పెనుగొండకు మారారు. 2019లో ఆమె తొలిసారి అక్కడి నుంచి గెలిచారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ కూడా రామచంద్రాపురం వదులుకుని, రాజమహేంద్రవరం రూరల్ వెళ్లాల్సి వస్తోంది. ఆయన కూడా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేనే.
మరో మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి సీటును కొత్త నేత భరత్ కుమార్‌కు కేటాయించారు. తాజా జాబితాలో అమర్నాథ్ కి ఏ నియోజకవర్గం కేటాయించకపోవడం విశేషం.
రిజర్వుడు సీట్లలోనే ఎక్కువ..
మొత్తం 38 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేయగా, వాటిలో అత్యధికం ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలే కావడం విశేషం.
కొందరు నేతలకు టికెట్లు నిరాకరించగా వారిలో కూడా రిజర్వుడు స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారు.
సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర బాబు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వంటి వారిని పక్కన పెట్టేశారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును తొలగించినా ఆయన స్థానంలో భార్యకు అవకాశం ఇచ్చారు.
విజయనగరం జిల్లా రాజాం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కంబాల జోగులని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఇంచార్జ్‌గా నియమించడం విశేషం.
అరకు శాసనసభ స్థానానికి ప్రస్తుత అక్కడి నుంచి ఎంపీగా ఉన్న గొడ్డేటి మాధవిని ఇంచార్జ్‌గా నియమించారు.
పి. గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జడ్పీ చైర్మన్ పెప్పర్తి వేణుగోపాల్ ను బాధ్యులుగా ప్రకటించారు.
మహిళా నేతలకు అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రస్తుతం 14 మంది మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో పాడేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భాగ్యలక్ష్మిని అరకు ఎంపీ స్థానానికి బదిలీ చేశారు.
గతంలో అవకాశం దక్కని పిఠాపురం, గుంటూరు ఈస్ట్ అసెంబ్లీ స్థానాల్లో ఈసారి మహిళలకు చాన్స్ కల్పించారు.
హిందూపురం ఎంపీగా ఉన్న గోరంట్ల మాధవ్ స్థానంలో జె.శాంత అవకాశం దక్కించుకోవడంతో, అక్కడా మహిళలకు ప్రాతినిధ్యం పెరిగినట్టు అయ్యింది.
మిగిలిన అసెంబ్లీ స్థానాల వారీగా కూడా మార్పులు, చేర్పుల కోసం వైసీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. అందుకు అనుగుణంగా మంతనాలు జరుగుతున్నాయి.
పలువురు నాయకులను తొలగించి, కొత్త ముఖాలకు అవకాశం కల్పించే దిశలో పరిణామాలు ఉన్నట్టు ప్రచారం జోరుగా ఉంది.
తదుపరి జాబితాలో కూడా మహిళా నేతలకు గతంతో పోలిస్తే అదనంగా సీట్లు కేటాయించే అవకాశం ఉందని అంతా అంచనా వేస్తున్నారు.

ఫొటో సోర్స్, MarganiBharat/FB
ఊహించని రీతిలో మార్పులు..
వైసీపీ కొత్త ఇంచార్జ్‌ల నియామకంలో ఎమ్మెల్యేలు ఎంపీలు గాను ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది.
ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లుగా అసెంబ్లీ సీట్లలో అవకాశం దక్కించుకున్న వారిలో నలుగురు ఎంపీలు ఉన్నారు.
కాకినాడ ఎంపీ వంగా గీత పిఠాపురం అసెంబ్లీ స్థానానికి, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రాజమహేంద్రవరం సిటీ అసెంబ్లీ నియోజకవర్గానికి, అరకు ఎంపీ గొడ్డేటి మాధవి అరకు అసెంబ్లీ స్థానానికి, అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కళ్యాణదుర్గం అసెంబ్లీ స్థానానికి ఇంచార్జ్‌లుగా నియమితులయ్యారు.
పాడేరు ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మిని అరకు ఎంపీ స్థానానికి బాధ్యురాలిగా ప్రకటించారు.
పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణను అనంతపురం ఎంపీ స్థానానికి ఇన్‌చార్జిగా ప్రకటించారు.
2009లో కర్ణాటకలోని బళ్లారి నుంచి గెలిచిన జె.శాంతను హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నియమించడం విశేషం. పార్టీ కండువా కప్పుకున్న కొన్ని గంటల్లోనే ఆమె పేరును ప్రకటించడం ఆసక్తిగా మారింది.

ఫొటో సోర్స్, Kondeti Chittibabu/FB
సిట్టింగులు ఏం చేస్తారు?
ఇప్పటికే సీట్లు నిరాకరించిన నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నేరుగా వెళ్లి జనసేన అధినేతతో భేటీ అయ్యారు. రెండో జాబితాలో ఆయన స్థానంలో మాజీ ఎంపీ తోట నరసింహం అక్కడ ఇంచార్జ్‌గా వచ్చారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం.
కదిరి ఎమ్మెల్యే పీవీ శిద్దారెడ్డి వర్గీయులు కూడా నిరసన వ్యక్తం చేశారు.
పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సైతం అధినేత నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు తదుపరి జాబితాలో తమకు అవకాశం ఉండదని భావిస్తున్న నేతలు కూడా స్వరం పెంచుతున్నారు.
ఎమ్మిగనూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి సూచన మేరకే మాచాని వెంకటేష్‌ని ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కి రాజ్యసభ సీటు ఖరారు చేసినట్టు ఆయన స్వయంగా వెల్లడించారు.
వీళ్లే ఎన్నికల అభ్యర్థులా?
ప్రస్తుతం ప్రకటించిన ఇంచార్జ్‌లందరూ వచ్చే ఎన్నికల్లో బరిలో ఉంటారా? అనే ప్రశ్నకు గ్యారెంటీ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సీనియర్ జర్నలిస్ట్ కృష్ణంరాజు మాట్లాడుతూ "ఎన్నికలకు స్వల్ప వ్యవధి మాత్రమే ఉంది. ఇప్పుడు ప్రకటిస్తున్న నియోజకవర్గాల ఇంచార్జ్‌లంతా బరిలో ఉంటారని అభిప్రాయం ఎక్కువగా ఉంది. కానీ ఎన్నికలనాటి పరిణామాలను బట్టి, అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని మార్పులు జరగవచ్చు.
ఐదేళ్లుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నవారిని కూడా తొలగించడానికి వెనకాడని పార్టీ నాయకత్వం, రెండు మూడు నెలల పాటు ఇంచార్జ్‌లుగా వ్యవహరించే వారిని పక్కకు తొలగించడం పెద్ద విస్మయాన్ని కలిగించదు.
దాదాపుగా 90% వీరే అభ్యర్థులుగా ఉన్నప్పటికీ మిగిలిన 10 శాతం మాత్రం కొన్ని అటు ఇటు జరిగే అవకాశం చివరి నిమిషం వరకు ఉంటుంది" అన్నారు.
ఇప్పటికే పూతలపట్టు ఎమ్మెల్యే సహా పలువురు నేతలు పార్టీ అధినేత నిర్ణయంపై తమ అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరికొందరు నాయకులు కూడా అసహనం ప్రదర్శించే అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితులు ఉత్పన్నమైతే, వాటికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసేందుకు అధిష్టానం దగ్గర ఆప్షన్స్ ఉంటాయని కృష్ణంరాజు అన్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM
విశ్లేషకుల అభిప్రాయమేంటి?
సంక్షేమ పథకాలు మాత్రమే తనకు విజయాన్ని తెచ్చిపెడతాయని ఇన్నాళ్లుగా నమ్మిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, కేవలం అవే మళ్లీ అధికారాన్ని కట్టబెట్టవనే అంచనాకు వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు చెవుల కృష్ణాంజనేయులు అభిప్రాయపడ్డారు.
"జగన్ దృష్టి కుల సమీకరణాల మీద మళ్లింది. కొత్త ఇంచార్జ్‌లంతా ఆయా సీట్లలో మెజార్టీ కులస్తులే. ఎస్సీ, ఎస్టీ లతో పాటుగా క్రిస్టియన్, ముస్లిం మైనార్టీ ఓట్లు నిలబెట్టుకోవడం, బీసీలలో బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతను గుర్తించి, ఇలాంటి చర్యలకు పూనుకున్నారు. అయితే, అందుకు ప్రతివ్యూహం రచించడంలో ప్రతిపక్ష కూటమి ముందున్న దాఖలాలు లేవు. 38 సీట్లలో నాయకులనూ మార్చినా, ప్రతిపక్షం ఆ అసంతృప్తులను తమ వైపు మళ్లించుకొలేకపోతోంది" అని కృష్ణాంజనేయులు వ్యాఖ్యానించారు.
ఎన్నికల సన్నాహాల్లో పాలకపక్షం దూకుడుగా ఉండగా, విపక్షాలు ఇంకా సీట్ల సర్దుబాటు వంటి విషయాల జోలికి పొకపోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారాయన.
ఇవి కూడా చదవండి..
- మహాత్మ జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలే స్థాపించిన తొలి బాలికల పాఠశాల ఏడాదిలోనే ఎందుకు మూతపడింది, ఆ తర్వాత ఏమైంది?
- 2024: సూపర్ ఎల్ నినో అంటే ఏంటి? దీని ప్రభావంతో భారత్‌లో ఈ ఏడాది కరవు తప్పదా
- సద్దాం హుస్సేన్: ‘నల్ల ముసుగు కప్పకుండానే నన్ను ఉరి తీయండి... నా ధైర్యాన్ని మీరు చూడలేరా?’
- అయోధ్య: సోనియా గాంధీకి ఆహ్వానంపై వీహెచ్‌పీ వాదన ఏమిటి?
- పిల్లల భవిష్యత్తు కోసం వారితోనే పొదుపు చేయించే మూడు చిట్కాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














