భారతీయ అభిమానులకు తెగ నచ్చేసిన పాకిస్తానీ క్రికెట్ షో.. అంతలా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఏం చేశారు?

ఫొటో సోర్స్, FAKHR-E-ALAM ON X/TWITTER
- రచయిత, అలీ అబ్బాస్ అహ్మదీ
- హోదా, బీబీసీ న్యూస్
భారత్, పాక్‌ల మధ్య శత్రుత్వం, ఉద్రిక్తతలు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉన్నాయి. అందుకే భారత్, పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ పట్ల రెండు దేశాల ప్రజలు చూసే తీరు భిన్నంగా ఉంటుంది.
గెలుపునూ, ఓటమినీ మనసుకు తీసుకుంటారు రెండు దేశాల ప్రజలు.
అయితే, ఇటీవల ముగిసిన వరల్డ్ కప్ క్రికెట్ -2023 సందర్భంగా పాకిస్తాన్‌లో నిర్వహించిన క్రికెట్ షో మాత్రం భారత క్రికెట్ అభిమానుల ఆదరణను చూరగొంది.
భారత క్రికెట్ అభిమానులకు పరిచయం ఉన్న వసీం అక్రమ్ వంటి మాజీ క్రికెటర్లతో కూడిన ఈ షో పేరు ‘ది పెవిలియన్’.
19 నవంబర్ 2023లో జరిగిన భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫలితంపై నిర్వహించిన నిపుణుల విశ్లేషణ వీడియోకు యూట్యూబ్‌లో 1.3 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ఇంతకీ ఈ షో ఉద్దేశమేంటి? భారత క్రికెట్ అభిమానులు కూడా మెచ్చుకోవడం వెనుక ఉన్న కథేంటి?

ఫొటో సోర్స్, THE PAVILION ON YOUTUBE
'ది పెవిలియన్'లో ఏముంది?
ది పెవిలియన్ షో ను 2021లో ప్రారంభించారు. ముఖ్యమైన క్రికెట్ టోర్నమెంట్స్ సమయంలో పాకిస్తాన్‌కు చెందిన స్టార్ క్రికెటర్లు కొందరు ఈ షోలో పాల్గొని విశ్లేషణ చేస్తుంటారు.
ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ తరువాత వరల్డ్‌కప్ ఎడిషన్‌ను ముగించారు. ఈ వీడియోలో వసీం అక్రమ్, మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్, మిస్‌బా ఉల్ హక్‌లు పాల్గొన్నారు.
ప్యానలిస్టులంతా మ్యాచ్ తరువాత విశ్లేషణ చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మ్యాచ్ ఫలితంపై ఎవరి ప్రభావం ఎంత? ఏ బాల్ మలుపు తిప్పింది? ఏ ఆటగాడు ఎలా ఆడాడు? జట్ల మధ్య ఎలాంటి పోరు జరిగింది? అంటూ చక్కనైన విశ్లేషణతో, ఉదాహరణలతో వివరించడం చూస్తే, నిపుణులైన స్నేహితులంతా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా అనిపించింది.
అరీ సంస్థ యజమాని, ది పెవిలియన్ షో సమర్పకులైన సల్మాన్ ఇక్బాల్ మాట్లాడుతూ, “ది పెవిలియన్ షో లక్ష్యమే అది” అన్నారు.
“విమర్శలకు అతీతంగా నిపుణులైన క్రికెటర్లు తమ అభిప్రాయాలను, విశ్లేషణలను వివరణాత్మకంగా అందించడమే ఈ షో లక్ష్యం. మేం దానిపైనే దృష్టిసారించాం. దేన్ని అతిక్లిష్టతరం చేయకుండా కార్యక్రమాన్ని కొనసాగించడమే మా లక్ష్యం” అన్నారు.
“ఇందులో మీకు ఎలాంటి ప్రతికూలమైన వ్యాఖ్యలు కనిపించవు” అన్నారు.
ఈ కార్యక్రమానికి మాత్రం అనూహ్యంగా విశేష ఆదరణ లభించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ వంటి భారత క్రికెటర్లు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రశంసించారు.

ఫొటో సోర్స్, Getty Images
షో ఎందుకు పాపులర్ అయింది?
భారత జర్నలిస్ట్ రాజ్‌దీప్ సింగ్ సర్దేశాయ్ మాట్లాడుతూ, “నిస్సందేహంగా ఈ షో ప్రపంచకప్‌పై అత్యుత్తమ విశ్లేషణ అందించిన షో అనొచ్చు.
ఎందుకంటే ఇందులో జింగోయిజం (నా దేశమే గొప్ప అన్న భావన) లేదు. మాజీ క్రికెటర్ల నిజమైన లోతైన విశ్లేషణ మాత్రమే ఉంది” అని కితాబిచ్చారు. చాలామంది ఈ కార్యక్రమాన్ని కోక్ స్టూడియో కార్యక్రమంతో పోల్చారు.
ఈ పాకిస్తానీ సంగీత కార్యక్రమం కూడా భారతీయుల ఆదరణను చూరగొంది.
ది పెవిలియన్ షోలో పాల్గొనడాన్ని తాను ఆస్వాదించానని బీబీసీతో అన్నాడు పాకిస్తాన్ లెజెండరీ క్రికెట్ బౌలర్ అక్రం.
ఆయన మాట్లాడుతూ “ఈ షో నిజాయితీ గల కార్యక్రమం. మేం ఈ షోలో జరిగే సంభాషణలో కాస్త సరదా, నవ్వులు, కథలతో కూడిన క్రికెట్ గురించి మాట్లాడుకున్నాం. ఆస్వాదించాం” అన్నారు.
భారత్, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న శత్రుత్వాన్ని క్రికెట్ ఆట కూడా పంచుకుంది. ఎప్పుడు మ్యాచ్ జరిగినా సరే, అదేస్థాయి ఉద్రేకాలు ఇరు దేశాల్లోనూ కనిపిస్తుంటాయి.
అయితే, రాజకీయాల ప్రభావం తమపై పడకుండా ఇరు దేశాల జట్లు తమదైన శైలిలో ఆటను కొనసాగిస్తున్నాయి. చాలాఏళ్లుగా ద్వైపాక్షిక సిరీస్‌లలో తలపడ్డాయి.
ఈ ఏడాది వరల్డ్‌కప్ నేపథ్యంలో పాక్ జట్టు మ్యాచ్ ఆడేందుకు భారత్‌కు వస్తుందా? రాదా? అన్న సంగిగ్ధత నెలకొంది. అయితే, పాకిస్తాన్ జట్టు పాల్గొంది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లోనూ ఎందుకు ఆదరణ లభించింది?
“బయటి వారికి ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి వివరించడం కష్టం. కానీ, ది పెవిలియన్ షో మాత్రం, అందుకు అతీతం మారింది. ఇరు దేశాలు తమ తమ సంస్కృతుల పట్ల లోతైన అభిమానాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు ఈ షో చేరువైంది” అన్నారు విజ్జెన్ ఇండియా క్రికెట్ మీడియా సంస్థ కంటెట్ హెడ్ అభిషేక్ ముఖర్జీ.
ప్రపంచ కప్ సమయంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పలు వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ క్లిప్‌లో ప్యానలిస్ట్ భారతజట్టును ప్రశంసించిన వీడియోను యూజర్లు షేర్ చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలోని అన్ని ఎపిసోడ్లలో ఒక ఎపిసోడ్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రపంచ కప్‌లో భారత బౌలర్లు చీటింగ్ చేస్తున్నారంటూ పాకిస్తాన్ జట్టు విమర్శలు చేసిన నేపథ్యంలో వసీం అక్రమ్ భారతజట్టుకు తన మద్దతు తెలిపిన ఎపిసోడ్ అది.
అందులో అక్రం మాట్లాడుతూ.. “వారు కలిగి ఉన్న టాలెంట్‌ను నేనూ కలిగి ఉండాలని అనుకుంటున్నాను అన్నారు. విమర్శలు చేస్తున్న వారిని ఉద్దేశించి, ప్రపంచం ముందు నవ్వులపాలయ్యే విమర్శలకు దూరంగా ఉండాలని అభ్యర్థిస్తున్నాను” అన్నారు.
ముఖర్జీ మాట్లాడుతూ, “ఆ దేశాన్ని నిందించడానికి వారు అస్సలు ప్రయత్నం చేయలేదు. అది చూడటానికి ఎంతో ఉపశమనంగా, కొత్తగా అనిపించింది. వారు భారత క్రికెట్ గురించి మాట్లాడిన ప్రతిసారీ, ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. అందుకోసం ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. ఓ జట్టు అద్భుత ప్రదర్శన గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆ కార్యక్రమం అత్యుత్తమంగా ఉంది” అన్నారు.
ఈ కార్యక్రమం టీవీ ఛానెల్‌లో ప్రసారం కానప్పటికీ, భారత్‌లోనూ ప్రజాదరణ పొందింది. అందుకు మరో కారణమూ ఉంది.
కార్యక్రమంలో పాల్గొన్న ప్యానలిస్టులు ఇంగ్లీష్, ఉర్దూ, పంజాబీ భాషల్లోనూ మాట్లాడారు. అందువల్ల ఎక్కువ మంది భారతీయులకు చేరువైంది. అంతేకాకుండా ప్యానలిస్టుల్లో ఉన్న మాజీ క్రికెటర్లందరూ భారత క్రికెట్ అభిమానులకు పరిచయమున్న ముఖాలే. వారి వారి అత్యుత్తమ ప్రదర్శనలతో క్రికెట్ ప్రపంచంలో స్థానం పొందినవారు కావడమూ కలిసొచ్చింది.

ఫొటో సోర్స్, SCREENSHOT/THEPAVILION
భారత క్రికెట్ అభిమానులు ఏమంటున్నారు?
“2000 సంవత్సరాల్లో పెరిగిన వాడిని నేను. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మిస్‌బా ఉల్ హక్, వసీం అక్రమ్, మొయిన్ ఖాన్‌ల గురించి బాగా తెలుసు. భారతజట్టు అభిమానిగా, మ్యాచ్ జరిగే సమయంలో వారు ఏం చేస్తారో, మ్యాచ్‌ను ఎలా ప్రభావితం చేస్తారో అన్న ఆందోళనతో ఉండేవాడిని” అని ఒరిస్సాకు చెందిన అమ్రిత్ పట్నాయక్ అన్నారు.
“అందరినీ ఒకే దగ్గర చూడటంతోపాటు వారు భారత్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పడం నాకు నచ్చింది” అన్నారు.
ముఖర్జీ మాట్లాడుతూ “వరల్డ్ కప్ సమయంలో ఇలాంటి షో వచ్చి మా లోటుని తీర్చింది. భారత్ ప్రపంచకప్‌కు వేదిక అయినప్పటికీ ఇలాంటి షో మాత్రం టీవీలో కనిపించలేదు” అన్నారు.
అయితే, వరల్డ్ కప్ టోర్నీ అధికారిక ప్రసార సంస్థ స్టార్ స్పోర్ట్స్‌లో వచ్చిన కార్యక్రమాలన్ని “భారత్‌ను కేంద్రంగా చేసుకుని” వచ్చినవే అన్నారు.
ది పెవిలియన్ షో మాత్రం పలు క్రీడలకు సంబంధించి, ముఖ్యంగా ఇరు దేశాలకు ఎంతో ప్రియమైన క్రికెట్ గురించి విశ్లేషణాత్మక ప్రసారాలు అందించింది.
పాకిస్తాన్‌లోనూ బాలీవుడ్ చిత్రాలు, భారత సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే సీరియళ్ల వంటివి ప్రసారం అయ్యేవి. ఇటీవలి కాలంలో ఇరు దేశాల ప్రభుత్వాలు పలు ఆంక్షలు విధించినప్పటికీ, తరచుగా కొన్ని ప్రాజెక్టులల్లో ఇరుదేశాలకు చెందిన కళాకారులు కలిసి పనిచేస్తూనే ఉన్నారు. అందుకు మద్దతు కూడా లభిస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రశంసలే క్రికెట్‌కూ చేరాయి.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల భారత టాక్ షోలలో కనిపించాడు. మరో క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఓసారి తనకు భారత్ అంటే చాలా ఇష్టమని, ఇల్లుగా భావిస్తానని చెప్పాడు.
“ప్రజలను ఏకం చేసి సామర్థ్యం క్రీడలకు ఉందని చెప్పడం అతిశయోక్తి కావొచ్చు. కానీ భారత్, పాకిస్తాన్‌ల క్రికెట్‌ను చూసినప్పుడు అది నిజమని అనిపిస్తోంది” అన్నారు ఇక్బాల్.
“అంతేకాకుండా, పాకిస్తానీ క్రికెట్ కార్యక్రమం భారత్‌లో ఇలాంటి ప్రశంసలను పొందడం చూస్తే, క్రికెట్ అనే క్రీడ ప్రజలందరినీ ఏకం చేసే సామర్ధ్యాన్ని ఏమేరకు కలిగి ఉందో చెప్పొచ్చు” అన్నారు.
ఇవి కూడా చదవండి..
- వ్యూహం: 'నన్ను చంపడానికి పబ్లిగ్గా కాంటాక్ట్ ఇచ్చిన కొలికపూడి శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలి' -డీజీపీకి రామ్‌గోపాల్ వర్మ ఫిర్యాదు
- అరపైమా గిగాస్, పైచ్: ఈ చేపకు ఆకలి ఎక్కువ.. పీక్కు తినే పిరానా చేపను కూడా ఇది మింగేస్తుంది
- ‘డెవిల్’ రివ్యూ: నేతాజీతో మర్డర్ మిస్టరీని ముడిపెట్టిన ఈ స్పై థ్రిల్లర్ ఎలా ఉంది?
- కొత్త మహా సముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- జేఎన్1: కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా? దీని లక్షణాలేంటి? టీకాలు పనిచేస్తాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














