కోటీ 30 లక్షల రూపాయల ముద్దు కథ

ఫొటో సోర్స్, GettyImages
పారిస్‌లో 1950 ప్రాంతంలో ఓ జంట నడిరోడ్డుపై గాఢంగా ముద్దు పెట్టుకుంది. ఆ దృశ్యం చాలా పాపులర్ అయింది. ఈ ఫోటోలో తన ప్రియుడ్ని ముద్దు పెట్టుకున్న మహిళ తన 93వ ఏట మరణించారు.
ఆ మహిళ పేరు ఫ్రాంకోయిస్ బోర్నెట్. ఇది పారిస్‌లోని ప్రసిద్ధ హోటల్ డి విల్లే సిటీ హాలు వద్ద జరిగింది. ఈ చిత్రాన్ని రాబర్ట్ డోయిస్నో అనే ఫొటోగ్రాఫర్ తీశాడు.
ఓ వీధిలో ఈ ప్రేమజంట గాఢ చుంబనంలో మునిగిపోయిన ఈ తెలుపు-నలుపు చిత్రం 1980లో వ్యాపారపరంగా ఎంతో విజయం సాధించింది.
కానీ, ఈ ఫోటోలో ఉన్నది తామేనంటూ మరికొన్ని జంటలు కూడా ముందుకు రావడంతో ఈ వ్యవహారం కోర్టు మెట్లు కూడా ఎక్కింది.
పారిస్ నగర ప్రణయపు లోతులను చూపించే క్రమంలో అనుకోకుండా తీసిన ఫోటోలా ఇది కనిపిస్తుంటుంది.
కానీ, నిజానికి ఈ ఫోటో ముందుగా అనుకుని తీసినదే. 1980 ప్రాంతాలలో ఈ ఫోటో ఎంతో ప్రసిద్ధి పొందడంతో ప్రపంచవ్యాప్తంగా యువతీయువకుల పడకగదులలో ఓ అలంకరణగా మారింది.
ఈ ఫోటో ఇంతగా ప్రాచుర్యం పొందడంతో అందులో కనిపిస్తున్నది తామేనంటూ, తమకు పరిహారం చెల్లించాలంటూ చాలా జంటలు డిమాండ్ చేశాయి. కొందరైతే కోర్టుకు కూడా వెళ్ళారు. అయితే, కోర్టు ఈ కేసులను తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఫోటోకి ఉప్పెనలా వచ్చిపడుతున్న ప్రచారమే ఈ చిత్రం వెనుక ఉన్న కథేమిటో నేరుగా చెప్పేందుకు బొర్నెట్ ను ప్రేరేపించింది.
బొర్నెట్, ఆమె బాయ్‌ఫ్రెండ్ జాక్వెస్ కార్టోడ్ ఇద్దరూ డ్రామా ఆర్టిస్టులు. 1950లో వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటున్న దృశ్యాన్ని చూసిన ఫోటోగ్రాఫర్ రాబర్ట్ డోయిస్నో వీరిని కలిశారు.
‘‘వారిద్దరూ ఒకరిని ఒకరు పట్టుకున్న విధానం, ముద్దుపెట్టుకున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకున్నాయి. అలా మరోసారి చేయగలరా అని నేను వారిని అభ్యర్థించాను’’ అని డోయిస్నో గుర్తు చేసుకున్నారు.
లైఫ్ మ్యాగజైన్‌లో లవ్ ఇన్ పారిస్ పేరుతో రాసే ఒక ఆర్టికల్ కోసం డోయిస్నో ఫోటోలు తీసే పనిలో ఉన్నారు. అయితే బొర్నెట్, ఆమె ప్రియుడి చుంబన ఫోటోను తీసినందుకు ఈ ఫోటోగ్రాఫర్ వారికి కొద్ది మొత్తమే చెల్లించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అయితే, ఈ ఫోటోలో ఉన్నది తానేనని చెప్పడానికి బోర్నెట్ ఫొటోగ్రాఫర్ సంతకం చేసి ఇచ్చిన ఒరిజినల్ కాపీని బయటపెట్టారు.
ఈ ఫోటో 1980 మొదట్లో చురుకైన కమర్షియల్ ఏజెంట్ కంటపడేవరకు పాతచిత్రాలలో కలిసిపోయి ఉంది. దీని తరువాత ఈ ఫోటో పారిస్ ప్రసిద్ధ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
2005లో బోర్నెట్ తన దగ్గరున్న ఒరిజినల్ కాపీని వేలంలో విక్రయించారు. ఇందుకుగానూ ఆమెకు సుమారు 1 కోటి 37 లక్షల రూపాయలు లభించాయి.
ఈ ఫోటో తీసిన కొన్నిరోజులకే బొర్నెట్, ఆమె మాజీ ప్రియుడు విడిపోయారు. తరువాత బొర్నెట్ సినిమాలలో తన కెరీర్ వెదుక్కోవడానికి వెళ్ళిపోయారు.
ఫోటోగ్రాఫర్ డోయిస్నో 1994లో మరణించారు. 2006లో బొర్నెట్ మాజీ బాయ్ ఫ్రెండ్ జాక్వెస్ కార్టోడ్ 2006లో చనిపోయారు.
‘‘బార్నెట్ క్రిస్మస్ రోజున ఈ లోకాని విడిచిపెట్టారు. కానీ, తన ముద్దుతో శాశ్వత్వాన్ని పొందారు ’’ అని జర్నలిస్ట్ మార్గోట్ నికోడెమ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- రూ.2.5 కోట్ల లాటరీ తగిలినా 90 ఏళ్ల వయసులో రిక్షా తొక్కుతున్నారు. ఆ డబ్బంతా ఏమైంది?
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
- మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














