యాపిల్ ఐఫోన్ కంపెనీని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా, వాషింగ్టన్ పోస్ట్ కథనంలో ఏముంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కీర్తి దుబే
- హోదా, బీబీసీ
అక్టోబర్ 31. సమయం : ఉదయం 9.30గంటలు
ప్రభుత్వం మద్దతు ఉన్న ఎటాకర్స్ తన ఫోన్ హ్యాక్ చేయడానికి ప్రయత్నించారంటూ యాపిల్ కంపెనీ తనకో హెచ్చరిక సందేశాన్ని పంపినట్టు తృణముల్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ సభ్యురాలు మహువా మొయిత్రి, ఎక్స్ (గతంలో ట్విటర్)లో రాశారు.
మహువా ఒక్కరే కాదు ఆమెతోపాటు శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నాయకుడు శశీథరూర్, అనేకమంది ప్రతిపక్ష ఎంపీలు, కొందరు జర్నలిస్టులు కూడా యాపిల్ కంపెనీ తమకు కూడా ఇటువంటి వంటి సందేశాలు పంపినట్టు పేర్కొన్నారు.
అయితే, ప్రభుత్వమే హ్యాకింగ్‌కు పాల్పడుతోందనే ఆరోపణలను కేంద్రప్రభుత్వం ఖండించింది. యాపిల్ పంపిన నోటిఫికేషన్‌పై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రకటించింది.
దీనిపై దాదాపు రెండు నెలల తరువాత డిసెంబరు 28న అమెరికా వార్తా పత్రిక వాషింగ్టన్ పోస్టు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ లాబ్ ఓ వివరణాత్మకైన నివేదికను ప్రచురించాయి.
యాపిల్ కంపెనీ ప్రతిపక్ష ఎంపీలకు, జర్నలిస్టులకు నోటిఫికేషన్ పంపిన ఒక రోజు తరువాత నరేంద్రమోదీ ప్రభుత్వం యాపిల్ ఇండియా అధికారులపై ఒత్తిడి తెచ్చిందని, ఈ నోటిఫికేషన్ తమ సిస్టమ్స్‌లోని పొరపాటు వల్ల వచ్చినట్టు ప్రకటించాలని పేర్కొందని, లేదంటే ప్రత్యామ్నాయ ప్రకటన అయినా చేయాలని చెప్పినట్టు ఆ నివేదికలో పేర్కొన్నాయి.
కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని అర్థసత్యాలు, కట్టుకథలుగా కొట్టిపారేశారు.
ప్రతిపక్ష ఎంపీలు తమకు వచ్చిన యాపిల్ నోటిఫికేషన్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్టు చేయడం మొదలుపెట్టగానే బీజేపీ నేతలు ఈ నోటిఫికేషన్‌ను ప్రశ్నించడంతోపాటు ఇది యాపిల్ అల్గారిథమ్‌లోని అంతర్గత హెచ్చరిక అని, పొరపాటున వచ్చిందని చెప్పడం మొదలుపెట్టారు.
కానీ వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ ప్రకారం మోదీ ప్రభుత్వ అధికారులు యాపిల్ ప్రతినిధులను పిలిచి ‘‘ ప్రభుత్వానికి ఈ నోటిఫికేషన్ వల్ల రాజకీయంగా వచ్చే నష్టాన్ని తగ్గించడానికి సాయపడాల్సిందిగా కోరినట్టు పేర్కొంది. దీంతోపాటు విదేశీ నిపుణుడిని ఒకరిని పిలిచి, ఈ నోటిఫికేషన్ పై ఎలాంటి వివరణ ఇవ్వాలో యాపిల్ కంపెనీకి మార్గదర్శనం చేయాలని చెప్పినట్టు తెలిపింది.
ఈ విషయంపై పూర్తి అవగాహన ఉన్న ముగ్గురు వ్యక్తులు తమ పేరు బయటకు చెప్పొద్దనే షరతుపై పై విషయాలను తెలియజేసినట్టు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
‘‘ఈ విషయంలో ప్రభుత్వం చాలా అసంతృప్తికి గురైంది’’ అని వారు తెలిపారు.
ఈ వార్తా పత్రిక కథనం ప్రకారం యాపిల్ పంపిన సందేశానికి మద్దతుగా ఆ కంపెనీ ప్రతినిధులు నిలబడ్డారు. కానీ భారత ప్రభుత్వం యాపిల్ కంపెనీ విశ్వసనీయతను తక్కువ చేసి చూపడానికి చేసిన ప్రయత్నం, ఒత్తిడికి గురిచేసిన విధానం క్యూపర్టినోలోని ఆ కంపెనీ ప్రతినిధులపై తీవ్ర ప్రభావం చూపింది.
ఈ మొత్తం సంఘటనలు బయటకు రాగానే ‘‘ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీ భారత్‌లోని ప్రస్తుత ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది. రాబోయే దశాబ్దంలో యాపిల్ కంపెనీకి భారత మార్కెట్ చాలా కీలకమనే విషయం కూడా ముఖ్యమైనదే’’ అని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రభుత్వం ఏం చెప్పింది?
వాషింగ్టన్ పోస్టు కథనాన్ని కేంద్ర సమాచార సాంకేతిక సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా వేదికగా తోసిపుచ్చారు.
‘‘వాషింగ్టన్ పోస్టు కథనానికి స్పందించడం శ్రమతో కూడిన పని. కానీ ఈ పనిచేయక తప్పదు’’ అని పేర్కొన్నారు.
‘‘ఈ కథనం అర్థసత్యం, కట్టుకథ. కానీ యాపిల్ పంపిన నోటిషికేషన్లపై విచారణ సాగుతోంది’’ అని ఆయన చెప్పారు.
‘‘సమాచార మంత్రిత్వశాఖ ఈ విషయంపై స్పష్టమైన విధానంతో ఉంది. యాపిల్ ఈ నోటిఫికేషన్లు ఇవ్వడం వెనుక కచ్చితంగా ఏం జరిగింది? అనే విషయంపై భారత ప్రభుత్వం జరిపే విచారణలో పాల్గొనమని యాపిల్ కంపెనీని కూడా అడిగాం. విచారణ కొనసాగుతోంది. ఇవ్వన్నీ నిజాలు. ఇక మిగిలిన కథనమంతా కేవలం ఊహాగానం’ అని తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అదానీపై నివేదికలు... జర్నలిస్టులకు వార్నింగ్
2023 అక్టోబరులో యాపిల్ 20మందికి నోటిఫికేషన్లు పంపింది. వీరంతా ప్రతిపక్ష ఎంపీలు, జర్నలిస్టులే.
యాపిల్ హెచ్చరిక సందేశం పంపిన వారిలో ఆనంద్ మంగనాలే, సిద్ధార్థ వరదరాజన్ అనే జర్నలిస్టుల పేర్లు ఉన్నాయని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
దక్షిణాసియా వ్యవస్థీకృత నేరాలు, అవీనితి నివేదిక ప్రాజెక్ట్ (ఓసీసీఆర్‌పి)కు ఆనంద్ మంగనాలే దక్షిణాసియా సంపాదకుడిగా ఉన్నారు. ఇది పరిశోధనాత్మక జర్నలిజాన్ని నడిపే లాభాపేక్ష లేని సంస్థ.
2023 సెప్టెంబరులో ఈ సంస్థ. బ్రిటీషు వార్తా పత్రికలు ‘ది గార్డియన్’ ‘ఫైనాన్షియల్ టైమ్స్’ కలిసి ఓ కథనాన్ని తయారుచేశాయి.
పన్ను చెల్లింపులకు స్వర్గధామమైన మారిషస్ నుంచి ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్, ఈఎం రిసర్జంట్ ఫండ్ పేరుతో అదానీ కంపెనీలలోకి పెట్టుబడులు వచ్చాయని, ఈ వ్యవహారమంతా 2013 నుంచి 2018మధ్య నడిచిందని, వీరు ఈ కంపెనీలో షేర్లు కొనుగోలు చేసి విక్రయాలు కూడా జరిపారని ఆ కథనంలో పేర్కొన్నారు.
వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం ఆగస్టు 23, 2023న ఓసీసీఆర్‌పీ ఈ కథనంపై వివరణ కోసం అదానీ గ్రూపులకు మెయిల్ పంపింది. మెయిల్ పంపిన పదిరోజుల తరువాత ఈ కథనం వెలుగులోకి వచ్చింది.
అదానీ గ్రూపుల వివరణ కోరుతూ మెయిల్ పంపిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆనంద్ మంగనాలే ఫోన్‌లోకి పెగాసస్ స్పైవేర్ ఇన్‌స్టాల్ అయిందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆయన ఫోన్‌పై జరిపిన ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది.
పెగాసస్ ఓ స్పైవేర్. దీనిని ఇజ్రాయెల్ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూపు తయారుచేసింది.
ఈ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వానికి విక్రయించినట్టు ఈ కంపెనీ పేర్కొంది.
వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని అదానీ గ్రూపు ఖండించింది. తమ కంపెనీ ఎటువంటి హ్యాకింగ్‌లకు పాల్పడలేదని, తమకు వ్యతిరేకంగా ఓసీసీఆర్‌పి చేస్తున్న విష ప్రచారమని పేర్కొంది.
‘అదానీ కంపెనీ అత్యుత్తమ విలువలను, నియమాలను పాటిస్తుందని’ ఆ కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ హెడ్ వర్షా చెన్నై తెలిపారు.
యాపిల్ ఐడీ ఉపయోగించి మంగనాలే ఫోన్‌ను హ్యాక్ చేసినట్టే ‘దివైర్’ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు సిద్ధార్థ వరదరాజన్ ఫోన్‌ను కూడా హ్యాక్ చేశారని ఆయన యాపిల్ ఐడీ [email protected] అని పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
సుప్రీం విచారణకు సహకరించని కేంద్రం : వరదరాజన్
దీనిపై సిద్ధార్థ వరదరాజన్‌తో బీబీసీ మాట్లాడింది. ఒత్తిళ్ళ మధ్యన యాపిల్ నుంచి వెలువడిన ప్రకటనపై ఆయన అభిప్రాయం కోరేందుకు ప్రయత్నించింది.
‘‘2021లో ఫర్‌బిడెన్ స్టోరీస్ సహకారంతో పెగాసస్ స్పైవేర్ పై ఓ కథనం సిద్ధం చేశాం. దీంతో చాలా ఫోన్లలో స్పైవేర్ ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. వారిలో నేను కూడా ఒకరిని. ఈ వ్యవహారం సుప్రీం కోర్టుకు ఎక్కింది. దీనిపై విచారణ జరిగింది. సుప్రీం కోర్టు కూడా దీనిని అంగీకరించింది. సుప్రీం నియమించిన విచారణ కమిటీకి కేంద్రప్రభుత్వం సహకరించలేదు. ఇది ఒకరకంగా కోర్టు ధిక్కారమే. ఈ కేసు కోల్డ్ స్టోరేజీకి చేరిపోయింది. కానీ నా పాయింట్ ఏమిటంటే వీరంతా సుప్రీం కోర్టుముందు ఎందుకు హాజరు కాలేదు. మళ్ళీ మూడేళ్ళ తరువాత మరోసారి ఇప్పుడు ప్రజల ఫోన్లు లక్ష్యంగా మారాయి’’ అని చెప్పారు.
అక్టోబరు 16న సిద్ధార్థ వరదరాజన్ యాపిల్ కంపెనీ నుంచి హెచ్చరిక సందేశాన్ని అందుకున్నారు.
‘‘నేను అప్పుడు మరీ సున్నితమైన వార్తలపై పని చేయడం లేదు. ఓసీసీఆర్‌పి లాంటి పనులు కూడా చేయడంలేదు. కానీ వైర్ ప్రచురించే వార్తల్లో 90 శాతం ప్రభుత్వానికి నచ్చవు. పెగాసస్ లిస్టులో నా పేరు ముందుంది. ఇప్పటికీ ఉంది. మనం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వం కళ్ళు మనపైనే ఉంటాయి. అలా చేస్తుందని కూడా మనకు తెలుసు. ఈ సాఫ్ట్‌వేర్‌తో మనం ఏ కథనంపై పనిచేస్తున్నామో ప్రభుత్వం అర్థం చేసుకుంటుంది. మనకు ఉప్పందిస్తున్నది ఎవరో కూడా తెలుసుకుంటుంది’’ అని చెప్పారు.
ఇండియా యాపిల్‌కు అతిపెద్ద మార్కెట్ అని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. రైతుల ఉద్యమ సమయంలో కొందరి ట్వీట్లు తొలగించాలంటు భారత ప్రభుత్వం ట్విటర్ పై ఒత్తిడి తెచ్చినట్టు ఆ కథనంలో తెలిపింది. అలాంటి పరిస్థితులలో ఇలాంటి ఒత్తిడిని వారు (యాపిల్ కంపెనీ) ఎలా భావిస్తారు?
ఈ ప్రశ్నకు సిద్ధార్థ్ బదులిస్తూ, ‘‘యాపిల్ అంటే భద్రత అనే పేరుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ. అయితే ఈ నోటిఫికేషన్లపై వెనక్కి తగ్గడంపై ఆ కంపెనీనే ఆలోచించుకోవాలి. వారు తమ విలువలు, భద్రతపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడుకోవాలా, లేక ప్రభుత్వాల ఒత్తిడికి తలొగ్గాలా అనేది నిర్ణయించుకోవాలని’’ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
యాపిల్ హెచ్చరిక, ప్రతినిధులకు ప్రభుత్వ పిలుపు
అక్టోబరులో అనేక మంది ఎంపీలు తమకు వచ్చిన యాపిల్ హెచ్చరిక సందేశాన్ని ట్విటర్‌లో షేర్ చేసుకుని చర్చించడం మొదలుపెట్టాక, భారత ప్రభుత్వానికి చెందిన ఓ సీనియర్ అధికారి యాపిల్ ఇండియా ఎండీ విరాట్ భాటియాను పిలిచారని, ఈ విషయం గురించి తెలిసిన ఇద్దరు వ్యక్తులు చెప్పారని వాషింగ్టన్ న్యూస్ పేర్కొంది.
వీరిద్దరిలోఒకరు, ‘‘ఆ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని, అది పొరపాటున జరిగినట్టుగా పేర్కొనాలని’’ భారత ప్రభుత్వ అధికారి యాపిల్ ఇండియా ఎండీకి చెప్పారని తెలిపారు.
‘‘వారి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు యాపిల్ ఇండియా అధికారి ‘‘ఇప్పటికే ఆపిల్ వెబ్ సైట్‌లో ఉన్నట్టుగా కొన్ని హెచ్చరికలతో నోటిఫికేషన్లు రావొచ్చనే ప్రకటన జారీచేస్తామని’’ చెప్పినట్టు ఆ కథనం తెలిపింది.
ఎంపీలు ట్వీట్లు చేసిన కొన్ని గంటల తరువాత, యాపిల్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ థ్రెట్ ఇంటలిజెన్స్ సిగ్నల్స్ ఆధారంగా అటువంటి దాడులను కచ్చితంగా గుర్తించలేం. కొన్నిసార్లు ఇలాంటివి తప్పుడు అలారమ్ సందేశాలు కూడా కావచ్చు ఎటాకర్లను గుర్తించడమనేది ఎప్పటికీ జరిగే పనికాదు’’ అని తెలిపింది.
‘‘మేము ఎటువంటి పరిస్థితులలో ఇలాంటి సందేశాలు పంపామో చెప్పలేం. ఎందుకంటే భవిష్యత్తులో తమను గుర్తించకుండా ప్రభుత్వ ప్రాయోజిత ఎటాకర్లు దారులు వెదుక్కుంటారు’’ అని పేర్కొంది.
యాపిల్ ఈ ప్రకటన చేయగానే యాపిల్ తాను పంపిన సందేశాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదనే విషయం అర్థమైంది.
వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడిన ఇద్దరు వ్యక్తులలోఒకరు ‘‘ ఆ సమయంలో భాటియా తన కంపెనీ వారితో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. కానీ కంపెనీలోని ఇతర ఎగ్జిక్యూటివ్‌లు మాత్రం తాము మరింత బలంగా ఉండాలని చెప్పారని’’ తెలిపారు.
యాపిల్ పంపిన హెచ్చరిక సందేశాలు నిజం కాదనే కోణంలో కథనాలు రాయాల్సిందిగా ఇద్దరు టెక్ జర్నలిస్టులను యాపిల్ ఇండియా కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం కోరినట్టుగా వాషింగ్టన్ న్యూస్ కథనం పేర్కొంది.
దీనివలన యాపిల్ భద్రతాప్రమాణాలపై చర్చను రాజేసినట్టవుతుందని యాపిల్ భావించింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈరోజు మేము, రేపు చీఫ్ జస్టిస్
యాపిల్ కంపెనీ హెచ్చరిక సందేశాలు పంపిన వారిలో శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఒకరు.
‘‘ఎంతో ఖరీదైన యాపిల్ ఫోన్ కొనడానికి కారణం. అందులోని బలమైన భద్రతా వ్యవస్థే. ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి, ప్రభుత్వంతో చేతులు కలపడం, లేదంటే తమ నైతిక విలువల విషయలో రాజీపడిన తరువాత ఆ కంపెనీ తమ వ్యాపారం వంక ఓసారి చూసుకుంటే తరువాత ఏం జరుగుతుందో ఆలోచించుకోవచ్చు’’ అని ప్రియాంక బీబీసీకి తెలిపారు.
‘‘ సుప్రీం కోర్టుపై గౌరవంతో నేనో మాట చెప్పదలుచుకున్నాను. గోప్యత అనేది ప్రాథమిక హక్కు. జర్నలిస్టులు, ఎంపీలపైనా గూఢచర్యాన్ని సుప్రీం కోర్టు ఈరోజు విస్మరిస్తే, రేప్పొద్దున ఈ ప్రభుత్వం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఫోన్‌ను కూడా హ్యాక్ చేయగల ధైర్యాన్ని తెచ్చుకుంటుంది. ఎవరికీ రక్షణ ఉండదు’’ అని ఆమె తెలిపారు.
‘‘ఫేస్‌బుక్ పై ఆరోపణలు వచ్చినప్పుడు అమెరికా పార్లమెంటులో ఎంత క్లిష్టమైన ప్రశ్నలు వేశారో, అవి మార్క్ జుకర్‌బర్గ్‌ను ఎంత ఇబ్బంది పెట్టాయో చూశాం. ఇక్కడ మన ఫోన్ విషయంలో రాజీపడితే ఇక చెప్పడానికి ఏమీ మిగలదు. ఇప్పుడు అదే జరుగుతోంది’’ అని చెప్పారు.
‘‘ఒక మహిళగా ఇది ఇంకా నన్ను బాధిస్తోంది. నేను స్నేహితులో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, ఆఖరికి నవ్వులాటకు కూడా నేనేమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అది ఇంకోరకంగా బయటకు వెళ్ళిపోతుందనే భయం. ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని వింటూ ఉంటారనే సందేహం పీడిస్తూనే ఉంటుంది. ఓ నలుగురు మనుషులు ఎప్పడూ నా పై దృష్టిసారించి, నా వ్యక్తిగత ఫోటోలు చూసినట్టు అనిపిస్తుంటుంది. వీరి గతమేమిటో మనందరికీ తెలుసు. ఇంతకుముందు గుజరాత్‌లో కూడా ఏం చేశారో తెలుసు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాదు, రాబోయే ఎన్నికలను కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ‘‘ప్రజలను ఎవరిని ఎన్నుకోవాలనే విషయాన్ని వారి ఫోన్లలోకి చొరబడటం ద్వారా ప్రభావితం చేస్తారు.

ఫొటో సోర్స్, ANI
ప్రభుత్వం తనకు వ్యతిరేకంగా తానే సరైన విచారణ జరపగలదా?
మీరు నిఘా నీడలో ఉన్నారని తెలుసుకున్నప్పుడు మానసికంగా ఎంతో అలజడి ఉంటుంది. వరదరాజన్, ప్రియాంక చతుర్వేది ఈ అంశంపై ఒకే విధమైన సమాధానం చెప్పారు.
‘‘ఏ ప్రభుత్వం కూడా తీవ్ర విమర్శలను సహించలేదు. కానీ, తేడా ఏమిటంటే కొన్ని ప్రభుత్వాలకు విమర్శలను ఎదుర్కొనే సహనం ఉంటుంది. మరికొన్నింటికీ అసహనం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇలాంటి వృత్తులలోకి వచ్చినప్పుడు జర్నలిజంలో భయానికి చోటు ఉండదని మనందరికీ తెలుసు. అసలు ప్రజాస్వామ్యంలోనే భయానికి చోటుండకూడదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే భయమనేది పూర్తిగా తొలగిపోవాలని’’ వరదరాజన్ చెప్పారు.
‘‘ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే ఈ నిఘా ఇప్పట్లో ముగుస్తుందని అనుకోవడం లేదు. కానీ దేశం కోసం గొంతెత్తినవారంతా ఇలాంటి మూల్యం చెల్లించుకోవాలంటే, నేను అందుకు సిద్ధం’’ అని ప్రియాంక చతుర్వేది అన్నారు.
‘‘మేమీ విషయంలో సాంకేతిక విచారణ ప్రారంభించాం. ఇప్పటిదాకా యాపిల్ ఈ విచారణకు పూర్తిగా సహకరించింది’’ అని వాషింగ్టన్ పోస్ట్ కథనంపై స్పందిస్తూ ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
భారత టెక్ విధానాలపై పనిచేసే వెబ్‌సైట్ మీడియానామా ఫౌండర్ నిఖిల్ పహ్వా వాషింగ్టన్ పోస్ట్‌తో మాట్లాడుతూ ‘‘ భారత ప్రభుత్వం తనపై వచ్చిన ఆరోపణలపై తానే నిజాయితీగా ఎలా విచారణ జరుపుతుంది? భారత ప్రభుత్వం ఈ విషయాలను చాలా చిన్నవని చెబుతోంది. ప్రభుత్వం ఎప్పటిలానే దీనిని గుట్టుచప్పుడు కాకుండా చేస్తోంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP
పెగాసస్ గూఢచర్యం
రెండేళ్ళ కిందట 2021 జులైలో కొన్ని వార్తా సంస్థలు పార్ బిడెన్ స్టోరీస్‌తో కలిసి ఓ పరిశోధనచేసి, ప్రపంచంలోని అనేకమంద జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల ఫోన్లు హ్యాకింగ్‌కు గురైన గుట్టును బయటపెట్టాయి.
ఫోన్లను హ్యాక్ చేయడానికి ఉపయోగి పెగాసస్ అనే సాఫ్ట్‌వేర్‌ను ఎన్ఎస్ఓ అనే కంపెనీ రూపొందించింది. ఈ కంపెనీ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. కేవలం సార్వభౌమ ప్రభుత్వాలకు మాత్రమే , ఉగ్రవాదం, నేరాలపై పోరాడేందుకు తామీ సాఫ్ట్‌వేర్‌ను విక్రయించినట్టు ఆ కంపెనీ తెలిపింది.
అదే సమయంలో ఇండియాలో ‘ది వైర్’ ఓ కథనం ప్రచురించింది. 40మంది జర్నలిస్టులు సహా అనేకమంది వ్యాపారవేత్తల పోన్లలో పెగాసస్ స్పైమాల్ వేర్‌ను చొప్పించారని ఆ కథనం పేర్కొంది. ముగ్గురు ప్రతిపక్ష నేతలు, వీరిలో రాజ్యంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి కూడా ఉన్నారు, మోదీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు, ప్రస్తుత, మాజీ భద్రతా ఏజెన్సీల అధిపతుల ఫోన్లు హ్యాక్ అయినట్టు ఆ కథనంతో లాపరు.
భారత ప్రజాస్వామ్యాన్ని నగుబాటు చేసేందుకు ఇదో కుట్ర అని, ఇలాంటి గూఢచర్యంతో ప్రభుత్వం సాధించేదేమీ ఉండదని సమాచార సాంకేతిక మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY IMAGES
పెగాసస్ ఎలా పనిచేస్తుంది?
పెగాసస్ ఓ స్పైవేర్. దీనిని ఇజ్రాయెలీ సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీస్ రూపొందింది. దీనిని స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తే చాలు, హ్యాకర్ల సంబంధిత ఫోన్‌లోని సమస్త సమాచారానికి యాక్సెస్ దొరుకుతుంది.
పెగాసస్ ఎన్‌క్రిప్ట్‌డ్ మెస్సేజులు, ఆడియోలను కూడా వినగలదు, చదవగలదని సైబర్ సెక్యూరిటీ కంపెనీ కాస్పర్‌స్కై తెలిపింది. పెగాసస్ ను ఉపయోగించిన సంబంధిత ఫోన్‌లోని సమస్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు.
2016లో ఈ విషయాన్ని మొదట వెలుగులోకి తీసుకువచ్చిన యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌కు చెందిన మానవ హక్కుల కార్యకర్త అహ్మద్ మన్సూర్‌కు ధన్యవాదాలు చెప్పాలి.
ఆయనకు కుప్పలుతెప్పలుగా ఎస్ఎంఎస్‌లు వచ్చేవి. ఇవ్వన్నీ ఆయనకు అనుమానాస్పదంగా అనిపించాయి. ఈ లింకులన్నీ ఏదో తప్పుడు లక్ష్యం కోసం పంపారని ఆయన అర్థం చేసుకున్నారు.
యూనివర్సిటీ ఆప్ టోరంటోలోని ‘సిటిజెన్ లాబ్’ నిపుణులకు ఆయన తన ఫోన్ చూపించారు. ‘లుక్ అవుట్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ సాయాన్ని కూడా ఆయన అభ్యర్థించారు.
మన్సూర్ ఊహే నిజమైంది. ఆ లింక్‌లపై క్లిక్ చేస్తే, ఐ ఫోన్ లో మాల్వేర్ చొరబడి ఉండేది. ఈ మాల్వేర్ పేరు పెగాసస్. ఇది చాలా సంక్లిష్టమైన గుర్తించలేదని దాడి అని లుక్‌అవుట్ పరిశోధకులు చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే భద్రంగా ఉంటాయని పరిగణించే యాపిల్ ఫోన్లలోకి ఈ మాల్వేర్ చొరబడటం. అయితే యాపిల్ ఫోన్ దీనిని ఎదుర్కొనేందుకు అప్‌డేట్ అయింది.
దీని తరువాత 2017లో మెక్సికన్ ప్రభుత్వం పెగాసస్ సాయంతో మొబైల్ గూఢచర్యానికి పాల్పడినట్టుగా న్యూయార్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.
మెక్సికోలో దీనిని మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు, అవినీతి వ్యతిరేక కార్యకర్తల ఫోన్లపై ప్రయోగించారు.
మెక్సికోలోని ఓ ప్రసిద్ధ మానవహక్కుల కార్యకర్త, జర్నలిస్టు మెక్సికన్ ప్రభుత్వం మొబైల్ ఫోన్ల గూఢచర్యానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ కోర్టులో కేసు కూడా వేశారు.
నేరగాళ్ళు, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఉపయోగించాలనే షరతుపై సాఫ్ట్‌వేర్‌ను మెక్సికన్ ప్రభుత్వానికి ఇజ్రాయెలీ కంపెనీ ఎన్ఎస్‌ఓ విక్రయించినట్టు ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ రాసింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఫోన్ కాల్స్, టెక్ట్స్ సమాచారాన్ని మానిటర్ చేయడమే కాక, ఫోన్‌లోని మైక్రోఫోన్, కెమెరాలను దానంతటదే యాక్టివేట్ చేయగలదు అని న్యూయార్క్ టైమ్స్ రాసింది.
ఈ కంపెనీ సౌదీ అరేబియాకు కూడా ఈ సాఫ్ట్‌వేర్ విక్రయించిందని, దానిని జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు ముందు ఆయన ఫోన్‌లో వినియోగించారనే ఆరోపణలు ఎదుర్కొంది.
ఉగ్రవాదం, నేరాలకు వ్యతిరేకంగా వినియోగించేందుకు మాత్రమే తామీ సాఫ్ట్‌వేర్‌ను కేవలం ప్రభుత్వాలకు మాత్రమే విక్రయిస్తామని ఎన్ఎస్ఓ కంపెనీ చెబుతుంటుంది.
ఈ సాఫ్ట్‌వేర్ ను తామెప్పుడూ వినియోగించలేదని, కేవలం ప్రభుత్వాలే ఉపయోగించాయని కంపెనీ కాలిఫోర్నియా కోర్టుకు తెలిపింది.








