పారిశుధ్య కార్మికుల సమ్మె: ‘మేం సీఎం సీట్లో కూర్చొని పనిచేస్తే బాగుంటుందా’ అని సిబ్బంది ఎందుకు ప్రశ్నిస్తున్నారు?

పారిశుధ్య కార్మికులు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్‌లోని స్మార్ట్ సిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు కంపు కొడుతున్నాయి.

అక్కడ మున్సిపాలిటీ చెత్త వాహనాల విజిల్ గత పది రోజులుగా వినిపించడం లేదు. చెత్తను తీసుకెళ్లే వాహనాలు వీధుల్లో కనిపించడం లేదు.

దుర్గంధం రోజు రోజుకీ పెరుగుతుండటంతో పాటు ప్రతీ వీధి మూలల్లో చెత్త పేరుకు పోతోంది. వీటిని శుభ్రం చేసే సిబ్బంది గత పది రోజులుగా సమ్మె చేస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా పారిశుధ్య సిబ్బంది సమ్మె ఎందుకు చేస్తున్నారు? ప్రభుత్వానికి కార్మిక సంఘాలకు మధ్య ఏం చర్చలు జరిగాయి? ఈ సమ్మెపై ప్రజలు ఏమంటున్నారు? కార్మికులు, ప్రభుత్వ వాదనలేంటి?

పారిశుధ్య కార్మికుల సమ్మె

పేరుకుపోతున్న చెత్త

గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్‌ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టారు.

ఏళ్ల తరబడి పని చేస్తున్న పారిశుధ్య కార్మికులను క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతోపాటు హెల్త్ అలవెన్సులను వర్తింప చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఈ డిమాండ్‌లను నెరవేర్చాలంటూ 2023 డిసెంబర్ 26 నుంచి కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో పారిశుధ్య కార్మికులు సమ్మె బాటపట్టారు.

అయితే, కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ సమ్మె ఆందోళన కలిగిస్తోంది.

డిసెంబర్ 26 నుంచి చేపట్టిన సమ్మె కారణంగా చెత్త తీసుకునే వెళ్లే వాహనాలు రాకపోవడంతో ఇళ్లలోని చెత్తను వీధి మూలల్లో ఉండే చెత్త కుప్పల్లో వేస్తున్నారు. వాటిని తీసేవారు లేకపోకపోవడంతో అవి పేరుకుపోతున్నాయి. ఆ మార్గాల్లో వెళ్లేవారిని దుర్గంధం వెంటాడుతోంది. సమస్య రోజు రోజుకు తీవ్రమవుతోంది.

“రెండు రోజులుగా చెత్త తీయకపోతే ఇంట్లోనే ఒక మూల చెత్తను ఉంచాను. కానీ కంపు ఎక్కువకావడంతో తీసుకెళ్లి చెత్త కుప్పలో వేశాను. డిసెంబర్ 28 నుంచి రోజూ రాత్రి ఇంట్లోని చెత్తను కవర్లో తీసుకుని వెళ్లి బయట పడేసి వస్తున్నా. ఇప్పుడు అక్కడ చెత్త కొండలా పెరిగిపోతుండటంతో దగ్గరకు కూడా వెళ్లేకపోతున్నాం. పిల్లలకు జ్వరాలు కూడా వస్తున్నాయి. ఈ సమస్య త్వరగా తేలకపోతే ఇళ్లన్నీ రోగాలతో నిండిపోతాయి” అని ద్వారకా నగర్‌కు చెందిన అంజనేయులు బీబీసీతో అన్నారు.

ఈ పరిస్థితి రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో కనిపిస్తోంది.

పారిశుధ్య కార్మికులు

డ్రైనేజీల పరిస్థితి అంతే..

పారిశుధ్య సిబ్బంది సమ్మెకు దిగడంతో చెత్త కుప్పలు మాత్రమే కాదు డ్రైనేజీలూ నిండిపోతున్నాయి. రోడ్లపైకి డ్రైనేజీ నీరు చేరడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి విశాఖలోని అత్యంత ఖరీదైన ఏరియాగా పేరు పొందిన ఏంవీపీ కాలనీలో కూడా కనిపించింది.

రోడ్లపైకి డైనేజీలు ప్రవహిస్తుండటంతో రోడ్డు పక్కనే ఇల్లు ఉన్న తమ లాంటి వాళ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందని ఏంవీపీ కాలనీకి చెందిన శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

“మా ఇంటి వద్ద పరిస్థితి అందోళనకరంగా ఉంది. చెత్తను, డ్రైనేజీ నీళ్లను శుభ్రం చేయాలంటూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న ప్రాంతానికి డిసెంబర్ 27 నుంచి ప్రతి రోజూ వెళ్తున్నా. వాళ్లను అభ్యర్థిస్తున్నా. అధికారులను అడిగితే కార్మికులు సమ్మెలో ఉన్నారంటున్నారు. కార్మికులను అడిగితే మా డిమాండ్లు పరిష్కరించేవరకు మేం రామని అంటున్నారు. మేం టాక్సులు అన్నీ సమయానికి కడతాం, కట్టకపోతే పెనాల్టీలు వేస్తారు. మరి ఇప్పుడు ఈ అసౌకర్యానికి మేం ఎవరికి పెనాల్టీలు వేయాలి” అని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారిశుధ్య కార్మికులు

కార్మికుల సమ్మెకు ఎందుకు దిగారు?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షనేత హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 15 వేల వేతనాన్ని రూ. 26 వేల రూపాయలకు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పని ఒత్తిడి, ఆరోగ్య సమస్యల కారణంగా కార్మికుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలను పర్మినెంటు చేయడం, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్కు అలవెన్సు ఇవ్వడం, క్లాప్‌ (Clean Andhra Pradesh) డ్రైవర్లకు రూ.18,500, మున్సిపాల్ సిబ్బందికి రూ. 26 వేలు జీతం తదితర డిమాండ్లపై పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్ల సాధన కోసం విధులకు హాజరుకాకుండా ఎక్కడి వాహనాలను అక్కడి యార్డుల్లో నిలిపేశారు.

పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం, ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, వాహనాల పనితీరును మెరుగుపర్చడం, చేసే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం వంటివి ఉన్నాయి.

ఈ డిమాండ్లపై పారిశుధ్య కార్మిక సంఘాలతో ప్రభుత్వం రెండుసార్లు చర్చలు జరిపింది. కానీ అవి ఫలప్రదం కాలేదు. దీంతో కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు.

పారిశుధ్య కార్మికులు

చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?

మున్సిపల్ కార్మికుల సమ్మె మొదలైన తర్వాత ఆ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం రెండుసార్లు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. రెండు సార్లు కూడా కొన్ని అంశాలపై ఇటు ప్రభుత్వం, అటు కార్మిక సంఘాలు సానుకూలంగా ఉన్నప్పటికీ, మరికొన్ని అంశాల్లో ఇరువర్గాలు మొండి పట్టుతో ఉన్నాయి. దీంతో చర్చలు అర్ధాంతరంగా నిలిచిపోతున్నాయి.

జనవరి 2న సచివాలయంలో మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రుల బృందం చర్చించింది. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

కార్మికులకు బేసిక్ పే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒకవేళ మున్సిపల్ కార్మికులకు బేసిక్ పే చెల్లిస్తే, ఇతర శాఖల్లో పని చేస్తున్న దాదాపు 90 వేల మంది సిబ్బంది కూడా అదే డిమాండ్ చేస్తారని ఏపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కార్మిక సంఘాల నాయకులకు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల కారణంగా వేతనానికి సంబంధించిన డిమాండ్ ను నెరవేర్చలేమని కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను సీఎం జగన్ కు మరోసారి వివరించి, జనవరి 12 లేదా 17న మరోసారి చర్చించాలని మంత్రుల కమిటీ తెలిపింది.

“మున్సిపల్‌ కార్మికులు ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలనే అమలు చేయమంటున్నాం. చర్చల్లో కూడా మంత్రులు స్పష్టతతో లేరు. ఒక్కొసారి ఒక్కోలా మాట్లాడుతున్నారు. సమ్మెను ఈ నెల 17 వరకు వాయిదా వేయాలని మంత్రులు కోరారు. అయితే అది సాధ్యం కాదని చెప్పాం” అని ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు చెప్పారు.

పారిశుధ్య కార్మికులు

మున్సిపల్ వర్కర్ల సమ్మెపై ఆ శాఖ మంత్రి ఏమన్నారంటే...

మున్సిపల్‌ కార్మికులను సమ్మె విరమించాలని కోరామని, వారి డిమాండ్లలో కొన్నింటికి జీఓలు విడుదల చేయాలని నిర్ణయించామని మున్సిపల్‌ పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. మరికొన్ని అంశాలపై మరోసారి చర్చలు జరపాలని, అప్పటి వరకు సమ్మె విరమించాలని కోరినట్లు చెప్పారు. సమ్మె కారణంగా ఇబ్బందులున్నచోట ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

రోస్టర్, పీఎఫ్ ఖాతాల వంటి అంశాలను పరిష్కరిస్తామని, మిగిలిన ఇతర డిమాండ్లపై మరోమారు చర్చలు జరుపుతామని మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.

చర్చలు విఫలం కావడంతో మున్సిపల్ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. వీరి ఆందోళనలను అడ్డుకునే క్రమంలో మున్సిపల్ కార్మికులు, పోలీసులకు మధ్య పలు చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి. చాలా చోట్ల ఆందోళన చేస్తున్న కార్మికులను అరెస్టులు చేస్తున్నారు. మరో వైపు కోవిడ్ కేసులు పెరుగుతున్న సమయంలో ఈ సమ్మె కొనసాగుతుండటంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.

పారిశుధ్య కార్మికులు

‘‘మీ సీట్లో మమ్మల్ని కూర్చోనిస్తారా సీఎం గారూ...’’

మున్సిపల్ కార్మికులు, ప్రభుత్వానికి మధ్య ఇంకా చర్చలు ఒక కొలిక్కి రాకపోవడంతో వీధుల్లో చెత్తను శుభ్రపరిచేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. కొన్ని చోట్ల ప్రైవేటు వ్యక్తులకు చెత్తను తీసుకెళ్లే పనులు అప్పగించింది. ఆ ప్రైవేటు సిబ్బందికి, మున్సిపల్ కార్మికులకు మధ్య పలు చోట్ల గొడవలు జరిగాయి.

“మా చేత రోజుకు రూ. 500 చొప్పున పని చేయించుకుంటున్న ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తులకు మాత్రం రోజుకు రూ. 1000 నుంచి రూ. 1500 ఇస్తోంది. ఆ డబ్బేదో మాకు చెల్లిస్తే మేమే చేస్తాం కదా. మా పనులను మరో వ్యక్తుల చేత చేయించడం ఎంత వరకు న్యాయం? మీ పాలన బాగోలేదని, మేం కూడా మీ సీట్లో కూర్చుని పని చేస్తే బాగుంటుందా ముఖ్యమంత్రి గారూ? మా కడుపుకొట్టకండి. మాకు మీరిచ్చిన హామీలనే నెరవేర్చమని అడుగుతున్నాం” అని విశాఖలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికురాలు మేరీ బీబీసీతో అన్నారు.

“సుప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం చెల్లించమని తీర్పు ఇచ్చింది. పర్మినెంట్ వర్కరుకి ఎంతయితే జీతం చెల్లిస్తున్నారో, వారి చివరి బేసిక్ ఎంత ఉందో, దానిని కాంట్రాక్ట్ వర్కర్‌కి కనీస వేతనం కింద ఇవ్వాలి. అలా చూసుకుంటే రూ. 26 వేలకు తక్కువ కాకుండా పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలి. ఇలాంటి న్యాయమైన కోర్కెలనే పారిశుధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.” అని విశాఖ జిల్లా సీఐటీయూ ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వీ కుమార్ బీబీసీతో అన్నారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఎక్కడి చెత్త అక్కడే... ఎందుకు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)