జపాన్: విమానం మంటల్లో చిక్కుకున్నా అందులోని 379 మంది ప్రాణాలతో ఎలా బయటపడ్డారు?

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గ్రేమ్ బేకర్
    • హోదా, బీబీసీ న్యూస్

జపాన్ రాజధాని టోక్యోలోని హోనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్(జేఏఎల్) విమానం 516 ల్యాండ్ అయ్యే సమయంలో కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఢీకొనడంతో ముందు పెద్ద కుదుపుకు గురైంది. ఆ తరువాత రన్ వేపై అదుపు తప్పి జారిపోతున్నప్పుడు వేడి, పొగ విమానాన్ని చుట్టుమట్టాయి.

ఈ ఘటనతో ఈ ఎయిర్‌బస్ 350 విమానంలోని ప్రయాణికులలో బతికి బయటపడటం ఎలా అనే భయాందోళన మొదలైంది. చావుకూ, బతుక్కూ మధ్య కేవలం కొన్ని సెకన్ల వ్యవధే ఉందని ఇందులోని 379 మందికి అర్థమైంది.

కానీ మంటల్లో చిక్కుకున్న విమానం నుంచి ప్రయాణికులందరూ ప్రాణాలతో తప్పించుకోవడం నిజంగా అద్భుతమే.

విమానంలో ప్రయాణికులను ఖాళీ చేయించిన పద్ధతి, నవీన సాంకేతికతే ప్రయాణికుల ప్రాణాలు కాపాడిందని నిపుణులు చెబుతున్నారు.

భారీ భూకంపం బాధితుల సహాయం నిమిత్తం సామగ్రి తీసుకొచ్చిన కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఈ జేఏఎల్ 516 విమానం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. కోస్ట్‌గార్డ్ విమానంలోని ఐదుగురు చనిపోగా, పైలట్‌కు తీవ్ర గాయాలయ్యాయి. జేఏఎల్ విమానంలోని 379 మందీ ప్రాణాలతో బయటపడ్డారు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, టోక్యో హనెడా విమానాశ్రయంలో మంటల్లో చిక్కుకున్న విమానం

ఒకేసారి 2 విమానాలు రన్‌వే పైకి ఎందుకు వచ్చాయి?

టోక్యో హనెడా విమానాశ్రయంలో ఒకే సమయంలో రన్‌వేపైకి రెండు విమానాలు ఎందుకు వచ్చాయి? సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు సరిగ్గా ఏం జరిగింది? అసలీ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై విచారణ కొనసాగుతోంది.

ప్రస్తుతానికైతే వీడియోలు, ప్రయాణికులు చెబుతున్న విషయాలను బట్టి ప్రమాదం ఎలా జరిగిందనే విషయంతోపాటు తాము బతికి బయటపడ్డామనే నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్న ప్రయాణికుల స్థితిని ఇవి వివరిస్తున్నాయి.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బుగ్గి అయిన కోస్ట్ గార్డ్స్ విమానం
విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, విమానం క్యాబిన్‌లో కమ్ముకున్న పొగ

‘క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది’

రన్‌వేపై విమానం గుద్దుకున్నప్పుడు ప్రయాణికులలో ఏర్పడిన గందరగోళాన్ని స్వీడే అంటన్ అనే 17ఏళ్ళ ప్రయాణికుడు వివరించాడు.

‘‘కొన్ని నిమిషాల్లోనే విమానం కాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది’’ అని ఆయన స్వీడిష్ వార్తా పత్రిక అఫ్టాన్‌బ్లాడెట్‌కు తెలిపాడు.

‘‘క్యాబిన్‌లో పొగ కమ్ముకోవడం నరకంలా అనిపించింది. మా అంతట మేమే కిందకు పడిపోయాం. ఆ తరువాత అత్యవసర ద్వారం తెరుచుకోవడంతో దాన్నుంచి బయటపడ్డాం’’ అని చెప్పాడు.

‘‘మేమెక్కడికి వెళుతున్నామో మాకే తెలియదు. ఆ గందరగోళంలో ఎదురుగా ఉన్న మైదానం వైపు పరుగుతీశాం’’ అని తెలిపాడు.

స్వీడే అంటన్, అతని తల్లిదండ్రులు, సోదరి ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.

సతోషి యమాకే అనే 59 ఏళ్ళ ప్రయాణికుడు మాట్లాడుతూ, ‘‘విమానం గుద్దుకోగానే, ఒక పక్కకు ఒరిగిపోయినట్టుగా’’ అనిపించింది.

‘‘విమానం దేనినో గుద్దుకునే సమయంలో, కిటికీ బయట నాకు నిప్పు రవ్వలు కనిపించాయి. తరువాత క్యాబిన్ మొత్తం పొగతో నిండిపోయింది’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక ప్రయాణికుడు తెలిపాడు.

కైడో న్యూస్‌తో మాట్లాడిన మరో ప్రయాణికుడు- ‘‘మేం దేనినో గుద్దుకున్నట్టు అనిపించింది.. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో మేం పైకి ఎగిరిపడినట్టయింది’’ అని చెప్పాడు.

విమాన ప్రమాదం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 516 విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కోస్ట్ గార్డ్ విమానాన్ని ఢీకొట్టిందని భావిస్తున్నారు
విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, మంటలు ఆర్పిన తరువాత విమానం ఇలా మిగిలింది

‘విమానం ఇంజిన్ నుంచి మంటలు’

విమానం ఆగిన తరువాత ఇంజిన్‌లోంచి వస్తున్న ఎర్రటి మంటలను కొందరు ప్రయాణికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రించారు.

మరికొందరు విమానం లోపలి దృశ్యాలను చిత్రీకరించారు. ఇంతలో పొగ వారి కెమెరా అద్దాలపైన పేరుకుపోయింది.

ప్రయాణికుల అరుపులతో తరువాత ఏం చేయాలనే విషయాన్ని తెలియజేయడానికి క్యాబిన్ సిబ్బంది ప్రయత్నించడం మొదలుపెట్టారు.

విమానం దిగిన తరువాత మంటలు ఎగిసిన సందర్భంలో లోపల మాత్రం అంతా చీకటిగా ఉందని ఓ ప్రయాణికురాలు తెలిపారు. ‘‘విమానంలో వేడిగా అనిపించింది. నిజం చెప్పాలంటే నేనైతే బతుకుతాను అనుకోలేదు’’ అని జపనీస్ ప్రసార మాధ్యమం ఎన్‌హెచ్‌కేకు తెలిపారు.

ప్రయాణికులను బయటకు తీసుకురావడానికి ఒకే తలుపు తెరవడం వల్ల తాము కష్టపడాల్సి వచ్చిందని మరో ప్రయాణికుడు చెప్పారు.

‘‘విమానం చివర, మధ్యలో ఉన్న తలుపులు తెరుచుకోవని ఓ ప్రకటన చేశారు. దీంతో మొత్తం ప్రయాణికులందరూ ముందు డోర్ నుంచే దిగాల్సి వచ్చింది’’ అని చెప్పారు.

విమానం నుంచి ఏర్పాటుచేసిన జారుడుబల్లపై నుంచి ప్రయాణికులు జారుతున్న దృశ్యాలు, దగ్థమవుతున్న క్యాబిన్ నుంచి బయటపడేందుకు దొర్లుతున్న ప్రయాణికులు, బయటపడినవారు దూరంగా పరిగెత్తుతున్న దృశ్యాలు, వీడియోలు, ఫోటోలలో కనిపిస్తున్నాయి.

విమానం మొత్తం త్వరగా ఖాళీ అయిపోవడానికి ఓ ప్రధాన కారణం ఏ ప్రయాణికుడు కూడా తన లగేజీ గురించి ఆలోచించకపోవడమే.

విమాన ప్రమాదం
ఫొటో క్యాప్షన్, విమానం నుంచి జారుడుబల్ల ద్వారా బయటపడుతున్న ప్రయాణికులు

90 సెకన్లు ఒకచోటే మంటలు

విమానం ప్రమాదానికి గురికాగానే, వెంటనే విమాన సిబ్బంది వేగంగా స్పందించి ప్రయాణికులను ఖాళీ చేయించడంలో చొరవ చూపారని అలెక్స్ మాచెరాస్ అనే విమానయాన విశ్లేషకుడు తెలిపారు.

మొదటి నిమిషంన్నరపాటు విమాన ప్రమాద మంటలు ఒక ప్రాంతానికే పరిమితం అవ్వడం వల్ల ప్రయాణికులు తప్పించుకునేందుకు కొంత సమయం చిక్కింది.

మంటలకు విమానంలోని ఏ తలుపులు దూరంగా ఉన్నాయో సిబ్బంది బాగా అర్థం చేసుకోగలిగారు. అలా దూరంగా ఉన్న తలుపునే వారు తెరిచారు. అందుకే మిగిలిన తలుపులు తెరుచుకోనట్టుగా మనకు ఫోటోలలో కనిపించింది అని ఆయన వివరించారు.

ఎయిర్‌బస్ ఏ350 విమానం కాంపోజిట్, కార్బన్- ఫైబర్ మెటీరియల్‌తో తయారుచేసిన మొట్టమొదటి విమానం. అందుకే ఈ విమానం గుద్దుకున్నా, మంటలు రేగినా తట్టుకోగలిగినట్టు కనిపించింది.

మంటలు విమానం చుట్టుమట్టేలా కనిపించడంతో ప్రయాణికులను దింపే ప్రక్రియ వేగంగా సాగింది.

అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వీడియో ఫుటేజ్‌లో కనిపిస్తున్నాయి.

ప్రయాణికులందరూ ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఐదు నిమిషాల సమయం పట్టిందని యమకె అనే ప్రయాణికుడు తెలిపారు.

‘‘మంటలు, పది నుంచి 15 నిమిషాలపాటు వ్యాపించడాన్ని నేను చూస్తూనే ఉన్నాను’’ అని ఆయన తెలిపారు.

సుబాసా సవాడా అనే 28 ఏళ్ళ ప్రయాణికుడైతే, ‘‘మేం చనిపోయి ఉండాల్సింది. కానీ ఏదో అద్భుతం జరిగింది’’ అని చెప్పారు.

మంటలను అదుపులోకి తేవడానికి కొన్ని గంటల సమయం పట్టింది.

స్వల్ప గాయాలపాలైన 14 మంది ప్రయాణికులు, విమాన సిబ్బందికి వైద్యులు చికిత్స అందించారు.

ప్రయాణికులందరూ తాము బతికి బయటపడ్డామని, ఇప్పుడు బానే ఉన్నామని తమకు అయినవారందరికీ చెబుతున్నారు.

‘‘ఇదెందుకు జరిగింది’’ అని సావడా అనే ప్రయాణికుడు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానం దొరికేదాకా తాను మరో విమానంలో ప్రయాణించనని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, జపాన్: కాలిపోతున్న విమానం నుంచి 379 మంది ఎలా ప్రాణాలతో బయటపడ్డారంటే...

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)