జపాన్: ఎంత పెద్ద భూకంపం వచ్చినా ఈ దేశం ఎలా తట్టుకుంటోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేయిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
13 ఏళ్ల క్రితం ఫసిఫిక్ మహా సముద్రంలో వచ్చిన భూకంపం సునామీలా మారి.. జపాన్‌ను కుదిపేసింది. ఈ భూకంపం ధాటికి ఫుకుషిమాలోని అణు విద్యుదుత్పత్తి కేంద్రంలో ప్రమాదం జరిగింది.
ఏళ్లు గడిచినా.. నాటి జ్ఞాపకాలింకా జపాన్ ప్రజల ఆలోచనల్లో పచ్చిగానే ఉన్నాయి. ఇషికవాలో భూకంపం, వెంటనే సునామీ హెచ్చరికతో అందరిలోనూ నాటి సంఘటనలు మెదిలాయి.
జపాన్‌లో ఇలాంటి హెచ్చరికలు కొత్తవి ఏమీ కావు.
నేను మొదటిసారి అక్కడకు వెళ్లినప్పుడు, భూమి కంపిస్తుంటే మంచం మీద నుంచి ఎగిరి దూకాను.
అయితే, కొన్ని నెలల్లోనే భూ ప్రకంపనలకు అలవాటు పడ్డాను. జపాన్‌లో భూకంపాలు చాలా త్వరగా మన జీవితంలో భాగంగా మారిపోతాయి. ఒక స్థాయి వరకు మీరు వాటికి అలవాటు పడిపోతారు.
భూకంపం అనే భావన మిమ్మల్ని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది. తర్వాతది ఎప్పుడు వస్తుంది?. మన భవనం సురక్షితమేనా? అనే ప్రశ్నలు నిరంతరం మెదులుతూనే ఉంటాయి.
ఈ తరానికి ఆ భయాలు 2011 మార్చి 11న వాస్తవ రూపంలోకి వచ్చాయి.
రెండు నిముషాల పాటు భూమి ఊగుతూనే ఉంది. ఆ రోజు బతికున్న వారిలో అలాంటి అనుభవాన్ని ఎవరూ చూసి ఎరుగరు. అది అలా సాగుతూనే ఉంది.
నాటి సునామీలో చిక్కుకుని ప్రాణాలతో బయటపడినవాళ్లు తాము ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుని ప్రాణాలతో బయటపడ్డామో ఎప్పటికీ గుర్తు చేసుకుంటారు.
భూకంపం వచ్చిన 40 నిముషాల తర్వాత సముద్రం తీరాన్ని దాటి తీర ప్రాంతం మీదకు ఉప్పెనలా విరుచుకు పడింది.
చెలియలి కట్టను దాటుకుని జపాన్ ఈశాన్య ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ పట్టణాలు, గ్రామాలను తుడిచి పెట్టేసింది. సెండాయ్ నగరం మీద ఎగురుతున్న హెలికాప్టర్ల ద్వారా ఈ దృశ్యాలను టెలివిజన్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
భూకంపం, ఆ వెంటనే సునామీ, ప్రమాదంలో చిక్కుకున్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్
అదే రోజు జపనీయుల వెన్ను జలదరించే వార్త ఒకటి బయటకు వచ్చింది. భూకంపం వల్ల ఫుకుషిమాలోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రమాదంలో పడిందనేది ఆ వార్త.
ఫుకుషిమాలో అణు రియాక్టర్లు కరగడం మొదలైంది. దీంతో అక్కడి ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశాలు జారీ అయ్యాయి. లక్షల మంది ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. టోక్యోలోనూ భయం వ్యాపించింది.
ఆ రోజు ప్రతీ జపనీయుడి మీద చెరిగిపోని భయాన్ని ముద్రించింది. ఆ సంఘటన తర్వాత నేను టోక్యోలో కొత్త ప్రదేశం కోసం వెదకడం మొదలు పెట్టాను. ఆ ప్రాంతంలో నదులకు దూరంగా ఎత్తైన ప్రాంతంలో నేల ఎక్కడ గట్టిగా ఉందా అని నా భార్య జియోలాజికల్ మ్యాప్‌లను ఆధ్యయనం చెయ్యడం ప్రారంభించింది. ఆమె అక్కడి భవనాల వయసు మీద కూడా దృష్టి పెట్టింది.
ఆమెకు స్పష్టత వచ్చింది. “ మనం 1981కి ముందు కట్టిన భవనాల్లో ఉండటం లేదు” అని చెప్పింది.
మేము1985లో నిర్మించిన భవనంలోకి మారాము. భారీ మొత్తంలో ఆహారం, నీరు సేకరించడం మొదలు పెట్టాం.
బాత్‌రూమ్‌లో సింక్ కింద ఐదేళ్ల పాటు నిల్వ ఉండే కార్టన్ బాక్సులలో దాచి ఉంచాం.
2011 నాటికి భయానక విధ్వంసం సోమవారం మరోసారి వస్తుందని భయపడ్డాను.
అది రాకపోయినప్పటికీ ఈ భూకంపం జపాన్ చరిత్రలో ఓ విజయ గాధ లాంటిదే.
జపాన్‌లో భూకంపాలు రిక్టర్ స్కేలుపై వాటి తీవ్రత వల్ల కాకుండా, అవి వచ్చినప్పుడు భూమి ఎంత సేపు కంపించిందనే దానిపైనే గుర్తిస్తారు. భూకంప తీవ్రత రిక్టర్ ఒకటి నుంచి ఎడు వరకూ ఉండవ్చచు. సోమవారం ఇషికావాలో వచ్చిన భూకంపం టాప్ నెంబర్ అయిన 7ని తాకింది.
రోడ్లు, వంతెనల మీద భారీగా విధ్వంసం కనిపిస్తోంది. కొండ చరియలు విరిగిపడ్డాయి. అయితే ఆ ప్రాంతంలో చాలా భవనాలు స్థిరంగా ఉన్నాయి.
టొయమా, కనవజా లాంటి పెద్ద నగరాల్లో ప్రజా జీవితం కొంత వరకు సాధారణ స్థాయికి వచ్చింది.
దగ్గర్లో ఉన్న కషివజకి అనే నగరంలో ఉన్న ఓ స్నేహితుడికి ఫోన్ చేశాను. “ఇది చాలా భయంకరంగా ఉంది” అని అతను చెప్పాడు. “ ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఇంత పెద్ద భూకంపం నేను చూడలేదు. మేము తీర ప్రాంతాన్ని ఖాళీ చేసి వచ్చేశాం. అయితే ఇప్పుడు మళ్లీ మా ఇళ్లకు వచ్చాం. అంతా బాగానే ఉంది” అని ఆయన చెప్పారు.
ఇది అసాధారణమైన కథ. ఇంజనీరింగ్ అద్భుతం. 1923లో టోక్యోను భారీ భూకంపం కుదిపేసిన తర్వాత నిర్మాణ రంగంలో జపాన్ రాస్తున్న కొత్త అధ్యాయం.

ఫొటో సోర్స్, Reuters
అనుభవాలు నేర్పిన పాఠాలు
ద గ్రేట్ కంటో క్వేక్ అని పిలిచే ఈ భూకంపం నగరంలోని అనేక భూభాగాలను చదును చేసింది. యూరోపియన్ శైలిలో ఇటుకతో నిర్మించిన ఆధునిక భవనాలు కూలిపోయాయి.
ఈ విపత్తు తర్వాత భూకంపాలను తట్టుకునే ఇళ్లను నిర్మించేందుకు జపాన్ ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి నిర్మించిన ఇళ్లను ఇనుము, కాంక్రీట్ మిశ్రమంతో కలిపి నిర్మించేవారు. చెక్కతో కట్టిన ఇళ్లలో బలమైన దూలాలను ఉపయోగించేవారు.
భూకంపాలు వచ్చినప్పుడల్లా నష్టాన్ని, విధ్వంసాన్ని అధ్యయనం చేసి ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన విధానాలను మార్చేవారు. 1981 తర్వాత భూకంపాలను తట్టుకునేలా భవన నిర్మాణంలో మార్పులు చేపట్టాలనే ఆదేశాలు పెద్ద మార్పుని తీసుకొచ్చాయి. 1995లో కొబేలే వచ్చిన భూంకంపం నుంచి మరి కొన్ని పాఠాలు నేర్చుకున్నారు.
2011లో రిక్టర్ స్కేలుపై 9 పాయింట్ల తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు టోక్యోలో దాని తీవ్రత 5 పాయింట్లుగా ఉంది. 1923లో టోక్యోలో 5 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించినప్పుడు భారీగా నష్టం జరిగింది.
1923లో వచ్చిన భూకంపంతో దేశ రాజధాని నగరం నిలువునా ఊగిపోయింది. శిధిలాల దిబ్బగా మారింది. లక్ష నలభైవేల మంది చనిపోయారు. 2011లో వచ్చిన భూకంపంలో ఆకాశహర్మ్యాలు అటు ఇటు ఊగాయి. కిటికీలు పగిలిపోయాయి. అయితే పెద్ద పెద్ద భవనాలేవీ పడిపోలేదు. సునామీ వల్ల వేల మంది చనిపోయారు కానీ భూకంపం వల్ల పెద్దగా నష్టం జరగలేదు.
ఇషికావాలోని పురాతన చెక్క ఇళ్లు శిధిలాల కుప్పగా మారాయి. ఒక ఆధునిక భవనం కూలిపోయింది. అయితే అది 1971లో నిర్మించిందని స్థానిక వార్తా ఛానళ్లు పదే పదే చెబుతున్నాయి. పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.
అయితే ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. ప్రపంచంలో ఈ స్థాయిలో భూకంపం మరే దేశంలో వచ్చినా... నష్టం ఇంత కంటే భారీగా ఉండేది.
ఇవి కూాడా చదవండి:
- భారతీయ అభిమానులకు తెగ నచ్చేసిన పాకిస్తానీ క్రికెట్ షో.. అంతలా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఏం చేశారు?
- జగన్నాథరెడ్డి ఇంట్లో అయిదు అస్థిపంజరాలు... అసలేం జరిగింది?
- 2023: చంద్రయాన్-3 సహా ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయాలు ఇవీ
- రివైండ్ 2023: మీరు సోషల్ మీడియా ఫాలో అయ్యారా? 'నాటు.. నాటు' నుంచి 'జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్' వరకు గుర్తుందా?
- 2023: డిసెంబర్ 31 లోపు ఈ పనులు చేయండి, కొత్త సంవత్సరంలో ఇబ్బందులు ఉండవ్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















