2023: చంద్రయాన్-3 సహా ఇస్రో సాధించిన చరిత్రాత్మక విజయాలు ఇవీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఐదున్నర దశాబ్దాల అంతరిక్ష ప్రయాణ చరిత్రలో ఎన్నో విజయాలు, పరాజయాలు చవిచూసింది ఇస్రో. కానీ, 2023 ఒక్క సంవత్సరం మాత్రం ఇస్రో చరిత్రను విజయతీరాలకు చేర్చిన ఏడాదిగా నిలిచిపోతుంది.
ఎందుకంటే, ఈ ఒక్క ఏడాదిలోనే ఇస్రో ప్రపంచ అంతరిక్ష రంగంలోనే తిరుగులేని విజయాలు సాధించింది.
చంద్రయాన్-3తో ఇప్పటి వరకూ ఎవరూ దిగని చంద్రుడి దక్షిణ ధ్రువంలో విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది.
ఆదిత్య L1 ప్రయోగంతో సూర్యుడి మీద పరిశోధనలకు తన అబ్జర్వేటరీని పంపించింది. గగనయాన్ ప్రయోగాలతో సమీప భవిష్యత్తులో మానవ సహిత అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేస్తోంది.

ఫొటో సోర్స్, ISRO
నాసా చంద్రుడి మీద దిగేనాటికి ఇస్రో పుట్టలేదు
1969 ఆగస్ట్ 15న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థగా ఇస్రో తొలి అడుగు వేసేనాటికే, అమెరికా తన వ్యోమగాముల్ని చంద్రుడి మీద దించింది. అలాంటి పరిస్థితి నుంచి అతి తక్కువ ఖర్చుతో, అంతరిక్ష ప్రయోగాలు చేయడంలో ఇస్రో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ 55 ఏళ్ల ఇస్రో ప్రయాణంలో అన్ని సంవత్సరాలు ఒక ఎత్తు. 2023 మరో ఎత్తు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇస్రో మూడు కీలక అంతరిక్ష ప్రయోగాలతో పాటు, మరో ఐదు కీలక ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తి చేయగలిగింది.

ఫొటో సోర్స్, ANI
చరిత్రలో నిలిచిపోయిన చంద్రయాన్ త్రీ
2023 ఆగస్ట్ 23న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ త్రీ మాడ్యూల్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండ్ అవ్వగానే యావద్దేశం సంబరాలు చేసుకుంది.
చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది. అంతేకాదు.. అత్యంత క్లిష్టమైన దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది.
నిజానికి ఈ ప్రయోగానికి కొద్ది రోజుల ముందే రష్యా ప్రయోగించిన లూనా 25 కూడా చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగేందుకు ప్రయత్నించింది. కానీ, చివరి నిమిషంలో లూనా 25లో అనుకోని అవాంతరాలు ఎదురై భూమితో సంబంధాలు తెగిపోయాయని రష్యా ప్రకటించింది.
చంద్రుడి దక్షిణ ధ్రువం మీద దిగిన ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్‌లు పది రోజుల పాటు చంద్రుడి ఉపరితలం మీద అనేక శాస్త్రీయ పరిశోధనలు చేసి, అక్కడి మూలకాలను, మట్టి నమూనాలను, ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలను, ఇతర అంశాలపై కీలకమైన సమాచారాన్ని, చంద్రుడి దక్షిణ ధ్రువానికి సంబంధించిన ఫోటొలను భూమికి చేరవేశాయి.
రోవర్‌కు ఉన్న ‘లేజర్ ఇండ్యూస్డ్ బ్రేక్‌డౌన్ స్ప్రెక్ట్రోస్కోప్ పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ ఉన్నట్లు కనుగొందని ఇస్రో వెల్లడించింది. దీంతోపాటు అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సిలికాన్, ఆక్సిజన్‌లను ప్రజ్ఞాన్ రోవర్ కనుగొందని ఇస్రో ప్రకటించింది.

ఫొటో సోర్స్, ISRO
చంద్రయాన్ 2 ప్రయోగానికి వెయ్యి కోట్ల వరకూ ఖర్చు చేసిన ఇస్రో.. చంద్రయాన్ త్రీ ప్రయోగానికి కేవలం 615 కోట్లను మాత్రమే వెచ్చించింది. చంద్రయాన్ 2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే మళ్లీ ఈ ప్రయోగంలో కూడా వినియోగించుకోవడం ద్వారా ఖర్చును బాగా తగ్గించుకోగలిగింది. దీంతో పాటు చంద్రయాన్ 2లో లోపాలను విశ్లేషించుకుంటూ చంద్రయాన్ త్రీ ప్రయోగాలు ప్రారంభించింది.
చంద్రయాన్ 2ని సక్సెస్ బేస్డ్ విధానంలో తయారు చేస్తే, ఫెయిల్యూర్ బేస్డ్ విధానంలో చంద్రయాన్ త్రీకి రూపకల్పన చేసింది. అంటే, చంద్రుడి మీద ల్యాండయ్యే ఆ చివరి 15 నిమిషాల సమయంలో 1.68 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందికి దిగే సమయంలో ఎదురయ్యే అవాంతరాలను ముందే ఊహించి, వాటిని స్వయంగా అధిగమించేలా చంద్రయాన్ త్రీ ల్యాండర్ మాడ్యూల్‌ను తయారు చేసింది.
ల్యాండరే కాదు.. రోవర్ ప్రజ్ఞాన్ కూడా... తన ప్రయాణ మార్గంలో అడ్డుగా వచ్చిన చంద్ర బిలాన్ని ముందే గుర్తించి తన దారిని మళ్లించుకుంది. ఇలా చంద్రయాన్ త్రీ అందించిన డేటాతో ఇస్రో చంద్రుడిపైకి మావన సహిత ప్రయోగాలకు బాటలు వేయనుంది.

ఫొటో సోర్స్, ISRO
సూర్యుడి మీద కన్నేసిన ఆదిత్య L1
చంద్రయాన్ త్రీతో అమోఘమైన విజయాన్ని అందుకున్న ఇస్రో... వారాల వ్యవధిలోనే సెప్టెంబర్ 2న సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య L1ను ప్రయోగించింది. సౌరకుటుంబంలో శక్తికి మూల స్థానం సూర్యుడే. సూర్యుడు... భూమికి దాదాపుగా 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు.
సూర్యుడిలోని నిరంతర కేంద్ర సంలీన చర్య ద్వారా హైడ్రోజన్ హీలియంగా మారుతుంది. ఇలా మారే క్రమంలో అత్యధిక స్థాయిలో శక్తి విడుదల అవుతుంది.
సూర్యుడి కేంద్రాన్ని కోర్ అంటారు. అక్కడ ఉష్ణోగ్రత 1 కోటి 50 లక్షల డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. కేంద్రం నుంచి ఉపరితలానికి వచ్చే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కొన్నిసార్లు సూర్యుడిలో ఈ రసాయన చర్యల వల్ల పెద్ద ఎత్తున సౌర తుపానులు పుట్టుకొస్తాయి. వీటి వల్ల అంతరిక్షంలో శాటిలైట్లకు, భూమ్మీద కమ్యూనికేషన్ వ్యవస్థలకు, విద్యుత్ గ్రిడ్లకు ప్రమాదం తలెత్తుతుంది.
అందువల్ల, సౌర తుపానులను ముందే కనిపెట్టేందుకు, సూర్యుడి ఉపరితలం మీద పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేసిన ప్రయోగమే ఆదిత్య L1.
సూర్యుడి మీద పరిశోధనలకు ఇలా ప్రోబ్‌లను పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది. ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, కొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడిపై పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్‌లను ప్రయోగించాయి. ఆదిత్య L1 ప్రయోగంతో ఇస్రో వాటి సరసన నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడి గురించి పరిశోధనలు చేయడానికి ఆదిత్య L1 అనే అబ్జర్వేటరీని సూర్యుడికి, భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ వన్ చుట్టూ ఉండే హాలో ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టింది.
సెప్టెంబర్ 2న నింగిలోకి వెళ్లిన ఈ అబ్జర్వేటరీ 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇటీవలే తన నిర్ధిష్ట కక్ష్య లెగ్రాంజ్ పాయింట్ వన్‌ను చేరుకుంది. మరో వారంలో రోజుల్లో ఇది ఆ పాయింట్ చుట్టూ ఉన్న హాలో ఆర్బిట్‌లోకి వెళ్లబోతోంది.
భూమికి సూర్యుడికి మధ్య ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉంటాయి. ఈ పాయింట్ల దగ్గర రెండింటి గురుత్వాకర్షణలు శూన్యమవుతాయి. అంటే, ఈ ప్రాంతంలో స్పేస్ మిషన్లు, స్పేస్ స్టేషన్లు ఉంటే వాటిని స్థిరంగా ఉంచడానికి ఎలాంటి ఇంధనం అవసరం ఉండదు.
అందుకే సూర్యుడిపై నేరుగా కన్నేసి ఉంచడానికి దీన్ని సూర్యుడికి, భూమికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గరకు ఇస్రో పంపింది. ఈ పాయింట్ భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో భూమి వైపు వందో వంతు దూరంలో ఉంటుంది.
ఇది తన నిర్ధిష్ట కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత భూమితో పాటుగానే సూర్యుడి చుట్టూ తిరుగుతూ, దానిపై అమర్చిన పరికరాల సాయంతో నిత్యం సూర్యుడి ఉపరితలం కరోనా సహా తాను ఉన్న ప్రదేశంలో వాతావరణ పరిస్థితులపై శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తూ, ఆ సమాచారాన్ని భూమ్మీదకు రియల్ టైంలో సమాచారాన్ని పంపిస్తుంది.

ఫొటో సోర్స్, ISRO
మానవ సహిత అంతరిక్ష ప్రయోగమే గగనయాన్
మానవ సహిత అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరింత పురోగతి సాధించిన సంవత్సరం కూడా 2023.
ఈ ఏడాది అక్టోబర్ 21న గగనయాన్ TV D1 టెస్ట్ ఫ్లైట్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. నిజానికి ఈ ప్రయోగం లాంచింగ్ సమయానికి సరిగ్గా ఐదు సెకెన్ల ముందు రాకెట్లో లోపాన్ని గుర్తించిన కంప్యూటర్ లాంచింగ్ ప్రక్రియను ఆపేసింది.
కానీ, గంటలోపే ఆ లోపాన్ని సరిచేసి ఇస్రో... గగనయాన్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.
పది నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగంలో ఇస్రో ప్రయోగించిన రాకెట్ నుంచి విడివడిన క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్ సురక్షితంగా బంగాళాఖాతంలో ల్యాండయ్యింది.

ఫొటో సోర్స్, ISRO
అసలేంటీ గగనయాన్?
గగనయాన్ అంటే.. మానవ సహిత అంతరిక్ష యాత్రల కోసం నిర్ధేశించిన మిషన్. ముగ్గురు వ్యోమగాములను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో లోఎర్త్ ఆర్బిట్‌లో, మూడు రోజులు ఉంచి తిరిగి సురక్షితంగా వారిని భూమ్మీదకు తీసుకురావడమే ఈ ప్రయోగం ప్రధాన ఉద్దేశం.
ఇది సాధ్యమైతే.. భారత్ ఆపై నిర్వహించబోయే మావన సహిత అంతరిక్ష యాత్రలు, ఇతర ప్రయోగాలకు మార్గం సుగమం అవుతుంది.
2007లోనే గగనయాన్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఈ మిషన్‌లో భాగంగా 20 రకాల విభిన్నమైన పరీక్షలు, 3 మానవ రహిత ప్రయోగాలు కూడా చేయనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఈ 20 రకాల పరీక్షల్లో కీలకమైన క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెస్ట్ వెహికిల్‌ను ఈ ఏడాదే ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.

ఫొటో సోర్స్, ISRO
మరికొన్ని ప్రయోగాలు...
2023లో అంతర్జాతీయ స్థాయిలో భారత అంతరిక్ష విజయాలను సగర్వంగా నిలబెట్టిన ఈ మూడు ప్రయోగాలతో పాటు, ఇస్రో మరికొన్ని కీలక ప్రయోగాలు కూడా చేపట్టింది.
2023 జులై 30న విజయవంతంగా పీఎస్ఎల్వీ సి-56 ప్రయోగం పూర్తి చేసింది.
2023 మే 29న జీఎస్‌ఎల్వీ ఎఫ్ 12 మిషన్, 2023 ఏప్రిల్ 22న పీఎస్‌ఎల్వీ సీ55 ప్రయోగాలను కూడా విజయవంతంగా పూర్తి చేసింది.
2023 ఏప్రిల్ 2న రీ యూజబుల్ లాంఛ్ వెహికిల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించి, భూమ్మీదకు తీసుకొచ్చింది.
ఈ ప్రయోగంలో అంతరిక్ష వ్యోమనౌకలు భూమ్మీదకు వచ్చేటప్పుడు అత్యంత వేగంతో భూవాతావరణంలో ఎదుర్కొనే పరిస్థితులను ఈ టెస్ట్ వెహికల్‌తో పరీక్షించారు. ఇది భవిష్యత్తులో మానవస సహిత ప్రయోగాలకు చాలా కీలకమైన ప్రయోగం.
2023 మార్చి 26న ఎల్వీఎం త్రీ రాకెట్ సాయంతో వన్ వెబ్ ఇండియా మిషన్, ఫిబ్రవరి 10న ఎస్ఎస్ఎల్వీ డీటూ మిషన్లను విజయవంతం చేసింది.

ఫొటో సోర్స్, ISRO/TWITTER
ఇండియన్ స్పేస్ స్టేషన్ కోసం ప్రయోగాలు
ఇస్రో అంతరిక్ష రంగంలో మరిన్ని సమున్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ప్రధాని మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో జరిగిన ఒక సమావేశంలో సూచించారు. వాటిలో 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ (భారతీయ అంతరిక్ష స్టేషన్) నిర్మించాలని, 2040 నాటికి చంద్రుడి మీదకు మావన సహిత ప్రయోగాలు నిర్వహించాలని అన్నారు. వాటితో పాటుగా... చంద్రుడిపై మరిన్ని ప్రయోగాలు చేయాలని, ఇందుకోసం నెక్ట్స్ జనరేషన్ లాంచింగ్ వెహికిల్ తయారీ, అత్యాధునిక లాంచింగ్ ప్యాడ్‌లు, హ్యూమన్ సెంట్రిక్ ల్యాబొరేటరీల నిర్మాణం వంటివి చేయాలన్నారు.
అలాగే, వీనస్ ఆర్బిటర్, మార్స్ ల్యాండర్ ల వంటి మరిన్ని గ్రహాంతర ప్రయోగాలు కూడా చేయాలని ప్రధాని మోదీ నిర్దేశించారు. ఆ సరికొత్త లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం ఇస్రో శాస్త్రవేత్తలకు, భారత అంతరిక్ష రంగానికి ఉందని అన్నారు.
ఇస్రో తన తొలి అడుగువేసిన నాటి నుంచి ఈ ఐదున్నర దశాబ్దాల్లో తొలినాళ్లలో వైఫల్యాలు చవిచూసినా, తర్వాత తన సక్సెస్ రేటును పెంచుకుంటూ పోయింది.
కానీ, ఒక్క 2023లో మాత్రం చంద్రుడి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ తో చరిత్రను తిరగరాసింది. సూర్యుడి మీదకు అబ్జర్వేటరీ ప్రయోగంతో చరిత్రను సృష్టించింది. గగనయాన్ ప్రయోగాన్ని విజయవంతం చేసి సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది.
ఇలా ఎన్నో విజయాలను అందించిన 2023... ఇస్రో చరిత్రలోనే కాదు.. భారత అంతరిక్ష చరిత్రలోనే ఇప్పటివరకూ అత్యంత సక్సెస్ ఫుల్ ఇయర్‌గా నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















