‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
'హిట్ అండ్ రన్' కేసుల్లో విధించే శిక్షలు పెంచుతూ తీసుకొచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ చేపట్టిన సమ్మెను విరమించాలని ట్రక్కు డ్రైవర్లకు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్(ఏఐఎంటీసీ) మంగళవారం పిలుపు ఇచ్చిందని పీటీఐ వార్తాసంస్థ తెలిపింది.
ఏఐఎంటీసీ సభ్యులతో చర్చించిన తర్వాతే కొత్త చట్టాన్ని అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏఐఎంటీసీ చెప్పింది.
ఏఐఎంటీసీ ప్రతినిధులతో తాము చర్చలు జరిపామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయల్ భల్లామంగళవారం రాత్రి చెప్పారని వార్తాసంస్థ ఏఎన్‌ఐ తెలిపింది.
కొత్త నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని, అమలు చేయబోయే ముందు ఏఐఎంటీసీ ప్రతినిధులతో చర్చిస్తామని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకొంటామని ఆయన చెప్పారు.
సమ్మె విరమణ పిలుపు వార్తలు రాక ముందు, అనేక రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది.
కొత్త చట్టాన్ని వ్యతిరేకిస్తూ లారీ, ట్రక్కు, టాక్సీ, బస్సు ఆపరేటర్లు దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేపట్టారు. దీని ప్రభావంతో పెట్రోలు, డీజిల్ కొరత వస్తుందనే ఆందోళనతో మంగళవారం పలు పెట్రోలు పంపుల ముందు వాహనదారులు క్యూ కట్టారు. హైదరాబాద్‌లో ఇది ఎక్కువగానే కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
పదేళ్ల జైలు, రూ.7 లక్షల జరిమానా
ఇటీవల పార్లమెంటు ఆమోదించిన భారతీయ న్యాయ సంహిత (ఇండియన్ జస్టిస్ కోడ్)లో, 'హిట్ అండ్ రన్' కేసుల్లో డ్రైవర్లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల జరిమానా విధించే నిబంధనను తీసుకొచ్చారు.
ఇప్పటివరకు ట్రక్కు లేదా డంపర్ ఢీకొని ఎవరైనా చనిపోతే డ్రైవర్ మీద నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ అభియోగాలు నమోదు చేసేవారు. అయితే, డ్రైవర్‌కు బెయిల్ లభించేది. చట్ట ప్రకారం రెండేళ్ల జైలు శిక్ష విధించేవారు.
ఇప్పుడు కొత్త చట్టం కఠినంగా మారడంతో డ్రైవర్లతోపాటు లారీ, టాక్సీ, బస్సు ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, ANI
భారతీయ న్యాయ సంహిత: డ్రైవర్లలో ఆందోళన
కొత్త చట్టం (భారతీయ న్యాయ సంహిత) ఇంకా అమల్లోకి రాలేదు. కానీ, ఈ చట్టంపై డ్రైవర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత డ్రైవింగ్ చేయడం కష్టమవుతుందని డ్రైవర్లు భావిస్తున్నారు. పొరపాటున యాక్సిడెంట్ జరిగితే పదేళ్ల జైలు శిక్ష, ఏడు లక్షల రూపాయల జరిమానా భరించడం చాలా కష్టమని వారు అంటున్నారు.
ఇంత భారీ జరిమానాలు చెల్లించేంత డబ్బు తమకు రాదని బీబీసీతో భోపాల్ శివార్లలో సమ్మె చేస్తున్న ట్యాంకర్ డ్రైవర్లు అన్నారు.
పదేళ్ల జైలు శిక్ష అంటే చాలా ఎక్కువ అని, కొత్త చట్టం నిబంధనలు తమను భయపెడుతున్నాయని వారు చెప్పారు.

అత్యంత పురాతన రవాణా సంస్థ ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ చెప్పినదాని ప్రకారం, దేశంలోని 35 శాతం భారీ వాహనాలు పెట్రోల్, ఎల్‌పీజీ వంటి ఇతర నిత్యావసర వస్తువుల రవాణాలో నిమగ్నమై ఉన్నాయి.
కేవలం ఒక్కరోజు సమ్మె కారణంగా ఒక్క ముంబయి మహానగరంలోనే రూ.120 కోట్ల నుంచి రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆ సంస్థ చెబుతోంది.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, బిహార్ సహా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం కనిపించింది.
సోమవారం దాదాపు పది వేల ప్రైవేట్ బస్సులు, ట్రక్కులు, టాక్సీలు నడవలేదని మధ్యప్రదేశ్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు పేర్కొన్నాయి.
సోమవారం ఆల్ గుజరాత్ ట్రక్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దాదాపు 40 శాతం వాణిజ్య వాహనాలు రోడ్లపైకి రాలేదు.

ఫొటో సోర్స్, ANI
‘అంత డబ్బే మా వద్ద ఉంటే డ్రైవర్లుగా ఎందుకు పనిచేస్తాం?’
జరిమానా చెల్లించడానికి తమ వద్ద 7 లక్షల రూపాయలు ఉంటే ట్రక్కు డ్రైవర్‌గా ఎందుకు పనిచేస్తానని భోపాల్‌లో సమ్మెను కవర్ చేసిన బీబీసీ ప్రతినిధి సల్మాన్ రావితో ఒక ట్రక్ డ్రైవర్ అన్నారు.
తమకు ఆరు, ఏడు వేల రూపాయల జీతం వస్తుందని కొందరు డ్రైవర్లు తెలిపారు. ‘‘ఇంత భారీ జరిమానా ఎలా చెల్లించగలం? జైలుకెళితే తమ భార్యాపిల్లల పరిస్థితి ఏంటి’’ అని వారు ప్రశ్నించారు.
‘‘ప్రమాదాలు జరిగితే డ్రైవర్లు పారిపోతున్నారని, ఫోన్ చేసి సమాచారం ఇవ్వట్లేదని పోలీసులు, అధికారులు అంటున్నారు. కానీ, అక్కడే ఉంటే జనం వచ్చి దాడి చేస్తే మమ్మల్ని ఎవరు కాపాడతారు’’ అని డ్రైవర్లు వాపోతున్నారు.
కావాలని ఎవరూ యాక్సిడెంట్లు చేయరని ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ (నార్త్ జోన్) ఉపాధ్యక్షుడు జస్పాల్ సింగ్ అన్నారు.
“భారత్‌లో డ్రైవర్ల మీద ఎక్కువగా మూకదాడి జరుగుతుంది. గాయపడిన వ్యక్తిని పట్టించుకోకుండా డ్రైవర్లను కొట్టడం ప్రారంభిస్తారు. డ్రైవర్లను కొట్టి చంపిన ఘటనలు చాలా ఉన్నాయి. సామగ్రితోపాటు వారిని సజీవ దహనం చేస్తారు. ఇలాంటి పనులు చేసే వారిపై ఎలాంటి కేసులు ఉండవు. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవర్లలో భయం మరింత పెరుగుతుంది’’ అని జస్పాల్ సింగ్ వివరించారు.

ఫొటో సోర్స్, ANI
పాత చట్టం, కొత్త చట్టం మధ్య తేడా ఏంటి?
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే హిట్ అండ్ రన్ కేసులు, వాటిలో సంభవించే మరణాలు ‘నిర్లక్ష్య హత్యల చట్టం’ కిందకు వస్తాయి.
భారతీయ న్యాయ సంహిత చట్టంలో దీనికి సంబంధించి రెండు నిబంధనలు ఉన్నాయి.
సెక్షన్ 104లోని రెండు నిబంధనల్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి మరణానికి కారణమైతే ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు.
రెండో నిబంధన ప్రకారం, నిర్లక్ష్య డ్రైవింగ్‌తో మరణానికి కారణమై ఘటనా స్థలం నుంచి డ్రైవర్ పారిపోతే, లేదా ప్రమాదం జరిగిన తర్వాత పోలీసు అధికారికి లేదా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వకపోతే 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించాలి,
ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం హిట్ అండ్ రన్ కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడుతుంది. అయితే ఇలాంటి కేసుల్లో డ్రైవర్లకు బెయిల్ లభిస్తుంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














