జపాన్: రన్‌వే మీద కోస్ట్‌గార్డ్ ఫ్లైట్‌ను ఢీకొని మంటల్లో కాలి బూడిదైన ప్యాసింజర్ విమానం.. కోస్ట్‌గార్డ్ ఫ్లైట్‌లోని అయిదుగురు మృతి

జపాన్‌లో రన్ వేపై కాలిపోతున్న జేఏఎల్ 516 విమానం

ఫొటో సోర్స్, Reuters

టోక్యో హనెడా విమానాశ్రయంలో జపాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జేఏఎల్ 516 విమానం మంటల్లో చిక్కుకుంది.

విమానం రన్‌వేపై ఉండగా కాలిపోయింది.

కొత్త సంవత్సరం తొలి రోజున జపాన్‌లో భారీ భూకంపం సంభవించడంతో బాధితుల సహాయం నిమిత్రం సామగ్రి తీసుకొచ్చిన కోస్ట్‌గార్డ్ విమానాన్ని ఈ జేఏఎల్ 516 విమానం ఢీకొన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది.

రన్ వేపై ల్యాండ్ అయిన తరువాత ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది.

ఈ ప్రమాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు.

కోస్ట్‌గార్డ్ విమానంలో ఉన్న అయిదుగురు మరణించినట్లు జపాన్ రవాణా శాఖ మంత్రిని ఉటంకిస్తూ ఏఎఫ్‌పీ వార్తాసంస్థ వెల్లడించింది.

కోస్ట్ గార్డ్ విమానం పైలట్ బయటకు దూకి తప్పించుకున్నప్పటికీ తీవ్రంగా గాయపడ్డారు.

వీడియో క్యాప్షన్, జపాన్‌లో ఘోర విమాన ప్రమాదం

కాలిపోతున్న విమానం కిటికీలు, దిగువ భాగం నుంచి మంటలు వస్తున్న దృశ్యాలు జపాన్ టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.

జపాన్‌కు చెందిన వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే అక్కడి అధికారులను ఉటంకిస్తూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించింది.

హనెడా ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తరువాత జపాన్ కోస్ట్‌గార్డ్‌కు చెందిన మరో విమానాన్ని ఢీకొనడం వల్ల మంటలు చెలరేగి ఉండొచ్చని ఎన్‌హెచ్‌కే తెలిపింది.

ప్రమాదానికి గురైన ప్రయాణికుల విమానం హోక్కడో విమానాశ్రయం నుంచి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు బయలుదేరింది.

హనెడా ఎయిర్‌పోర్ట్‌కు సాయంత్రం 5.40కి చేరుకున్న ఆ విమానం ల్యాండ్ అయిన వెంటనే మంటల్లో చిక్కుకుంది.

జపాన్‌లో రన్ వేపై కాలిపోతున్న జేఏఎల్ 516 విమానం

ఫొటో సోర్స్, screen grab

విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

విమానంలోని 379 మంది ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు ఎన్‌హెచ్‌కే పేర్కొంది.

అయితే, కోస్ట్‌గార్డ్ విమానం నుంచి ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో అయిదుగురి ఆచూకీ తెలియలేదని తొలుత అధికారులు తెలిపారు. అనంతరం వారు ప్రాణాలు కోల్పోయినట్లు జపాన్ రవాణా మంత్రి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)