ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆదిత్య-ఎల్1 స్పేస్ క్రాఫ్ట్ తన తుది కక్ష్యంలోకి చేరింది. భూమి నుంచి సూర్యుని వైపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లెగ్రాంజ్ పాయింట్ వద్ద హాలో కక్ష్యలోకి ఇది విజయవంతంగా చేరినట్లు ఇస్రో తెలిపింది.
2023లో భారత్ అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలను సాధించింది.
తాజా మలుపుతో 2024లో తొలి రోజునే ఎక్స్‌పోశాట్ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించి, శుభారంభం చేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారం తిరక్కుండానే మరో మైలురాయిని చేరుకున్నట్లయింది.
ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 తన నిర్దిష్ట గమ్య స్థానాన్ని చేరుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్ చేశారు.
" భారత దేశం మరో మైలురాయిని చేరుకుంది. భారత దేశపు తొలి సూర్యుడి పరిశోధనా కార్యక్రమం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్ వన్ లక్ష్యాన్ని చేరుకుంది.
అత్యంత సంక్లిష్టమైన అంతరిక్ష యాత్రలను వాస్తవ రూపంలోకి తీసుకు రావడంలో మన శాస్త్రవేత్తల అంకితభావానికి ఇది నిదర్శనం.
వారు సాధించిన అసాధారణ విజయానికి దేశం అభినందనలు చెబుతోంది.
మానవాళి ప్రయోజనాల కోసం కొత్త అంశాలను కనుక్కోవడంలో మేము ప్రయత్నిస్తూనే ఉంటాం" అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇస్రో కూడా మోదీ ట్వీట్‌నే రీట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
" భారతదేశానికి ఇదొక అద్భుత సంవత్సరం. భూమి- సూర్యుడి మధ్య ఉన్న రహస్యాల గుట్టు విప్పేందుకు ఆదిత్య ఎల్ వన్ మిషన్ తుది కక్ష్యలోకి చేరుకుంది" అని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఆదిత్య ఎల్1 ప్రయోగం సూర్యుడి మీద పరిశోధనలకు ప్రోబ్‌లను పంపించిన నాలుగో దేశంగా భారత్ నిలిచింది.
ఇప్పటి వరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు కొన్నిసార్లు స్వయంగా, కొన్నిసార్లు సంయుక్తంగా సూర్యుడి గురించి పరిశోధనల కోసం రోదసీలోకి ప్రోబ్‌లను ప్రయోగించాయి. ఇప్పుడు ఆదిత్య L1తో ఇస్రో వాటి సరసన నిలిచింది.

ఫొటో సోర్స్, ISRO
అసలేంటీ ఆదిత్యL1?
సూర్యుడి మీద పరిశోధనల కోసం 2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఇస్రో ఆదిత్య L1ను ప్రయోగించింది.
ఇస్రో ప్రయోగించిన ఈ ఆదిత్య L1 మిషన్ చంద్రయాన్-3 మాదిరిగానే భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపహేళిని పెంచుకుని సూర్యుడి దిశగా సుదీర్ఘంగా ప్రయాణించి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గరకు చేరుకుంది.
లెగ్రాంజ్ పాయింట్ దగ్గర భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యమవుతాయి. కాబట్టి ఆ ప్రదేశంలో ఏదైనా వస్తువును ఎలాంటి శక్తి ప్రయోగం లేకుండా స్థిరంగా ఉంచవచ్చు.
అందుకే ఇస్రో ఆదిత్య L1ను అక్కడకు పంపించింది. కానీ అక్కడ కూడా ఆదిత్య L1 మీద చంద్రుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తులు పనిచేస్తాయి. అందుకే ఆదిత్య L1ను ఆ లెగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న శూన్య కక్ష్యలో పరిభ్రమించేలా ప్రవేశపెట్టబోతోంది ఇస్రో.
ఇలా ఒక్కసారి ఆదిత్య L1 శూన్య కక్ష్యలోకి చేరిన తర్వాత ఐదేళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది.

ఫొటో సోర్స్, ISRO
ఏడు పరికరాలతో ఆదిత్య L1
ఇస్రో వెల్లడించిన వివరాల ప్రకారం- ఆదిత్య L1 సూర్యుడి అధ్యయనానికి భారత్ ప్రయోగించిన తొలి మిషన్. అయితే ఇది పూర్తి స్థాయి సోలార్ అబ్జర్వేటరీ మిషన్ కాదు. కానీ దీనిని స్పేస్ బేస్డ్ అబ్జర్వేటరీ క్లాస్ సోలార్ ప్రోబ్2గా ఇస్రో అభివర్ణించింది.
ఇది సూర్యుడి ఉపరితలానికి దగ్గరగా వెళ్లదు. కానీ సూర్యుడికి భూమికి మధ్య దూరంలో వందో వంతు దూరం వరకూ వెళ్లింది.
ఆదిత్య L1 సూర్యుడి ఉపరితలంపై ఉన్న కరోనాను అనుక్షణం పరిశీలిస్తూ ఉంటుంది. ఇందుకోసం ఆదిత్య L1లో ఏడు రకాల పరికరాలు అమర్చారు.
ఇందులో నాలుగు పరికరాలు నిత్యం సూర్యుడి వైపే ఉంటూ పరిశోధనలు చేస్తాయి. మరో మూడు పరికరాలు లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర పరిస్థితులను విశ్లేషించి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపుతాయి.
ఈ ఏడు పరికరాలు ప్రధానంగా కరోనా ఉష్ణోగ్రతలో మార్పులు, కరోనల్ మాస్ ఎజెక్షన్, ప్రీ ఫ్లేర్స్, ఫ్లేర్ యాక్టివిటీస్, వాటి లక్షణాలు, అంతరిక్ష వాతావరణంలో మార్పులు, అక్కడ ఉండే అణువులు, పరిస్థితులను విశ్లేషించడం చేస్తాయి. సూర్యుడిపై ఉన్న క్రోమోస్పియర్ , కరోనాలలో మార్పులను విశ్లేషిస్తాయి. వీటిలోని వేడిని, అక్కడ ఉండే ప్లాస్మాను, సూర్యుడి ఉపరితలం నుంచి పెల్లుబికే సోలార్ మాస్ ఎజెక్షన్లను, వాటి జ్వాలలను విశ్లేషిస్తాయి.
సూర్యుడి కరోనా స్థితిగతుల్ని, దాని హీటింగ్ మెకానిజం పరిశీలించడం, కరోనాలో ఉండే ప్లాస్మా ఉష్ణోగ్రత, వేగం, సాంద్రతను పరిశీలించడం, కరోనల్ మాస్ ఎజెక్షన్ల డైనిమిక్స్, వాటి ప్రభావాలను, అవి ఉత్పత్తయ్యే అంశాలను పరిశీలించడం, సూర్యుని చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని పరిశీలించడం, సౌర పవనాలు పుట్టుక, వాటి గమనం, వాటి స్థితిగతుల్ని పరిశీలించడం వంటి పనులు చేస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడిపై కన్నేసి నిత్యం పరిశోధనలు
సూర్యుడిపై నిత్యం కన్నేసి, అక్కడి పరిస్థితుల్ని అధ్యయనం చేయడానికి ఇస్రో కీలకమైన పేలోడ్‌లను అమర్చింది. వాటిల్లో మొదటిది విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ అన్నది సూర్యుడి కరోనాను పరిశీలించడంతో పాటు, కరోనల్ మాస్ ఎజెక్షన్ల డైనమిక్స్‌ను నిత్యం పరిశోధిస్తుంది.
ఆదిత్య L1లో అమర్చిన మరో పేలోడ్ సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇది సోలార్ ఫోటో స్పియర్, క్రోమో స్పియర్‌ల ఇన్ నియర్ అల్ట్రా వయోలెట్‌ను లెక్కిస్తుంది. దీంతో పాటు సోలార్ ఇర్రేడియెన్స్ వేరియేషన్లను కూడా లెక్కిస్తుంది. ఇర్రేడియెన్స్ అంటే.. ఏదైనా ఒక వస్తువు నుంచి ఒక చదరపు మీటరు పరిధి నుంచి ఒక సెకెన్‌లో ఉత్పన్నమయ్యే కాంతి శక్తి అని అర్థం.
మరో పేలోడ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్... ఇది సాఫ్ట్ ఎక్స్‌రే స్పెక్ట్రో మీటర్. ఇది సౌర పవనాల్లో ఉన్న సాప్ట్ ఎక్స్ రే ఫ్లక్స్‌ను అధ్యయనం చేస్తుంది. నాలుగో పేలోడ్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. దీనికి సౌరపవనాలను అధ్యయనం చేయడానికి, వాటి విస్తృతిని, సౌర పవనాల్లో అయాన్ల స్థితి మాస్ అనాలసిస్ చేయడానికి నిర్దేశించింది.
మరో పేలోడ్ హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్. ఇది సూర్యుడిపై ఉత్పన్నమయ్యే హై ఎనర్జీ ఎక్స్‌రేలను పరిశోధించే హార్డ్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్.
ఇక మరో పేలోడ్ సోలార్ అల్ట్రా వయోలెట్ ఇమేజింగ్ టెలీస్కోప్. ఇది ఒక యూవీ టెలీస్కోప్. ఇది అల్ట్రా వయోలెట్ వేవ్‌లెంగ్త్ రేంజ్‌లో ఉన్న సోలార్ డిస్క్ చిత్రాలను తీసి, ఇస్రోకి పంపిస్తుంది.
మరో పేలోడ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్‌పరిమెంట్ అనే పేలోడ్ సోలార్ విండ్‌లో ఉండే ప్రోటాన్, ఇంకా ఆల్ఫా పార్టికల్స్ విస్తృతిని లెక్కిస్తుంది.
ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అనే పరికరాలు సోలార్ విండ్స్, ఎనర్జిటిక్ అయాన్లు, వాటి ఎనర్జీ విస్తృతి వంటి వాటిని పరిశీలిస్తాయి.
వీటితో పాటు అడ్వాన్డ్స్ ట్రైయాక్సిల్ హై రిజల్యూషన్ డిజిటల్ మాగ్నటోమీటర్ అనే పరికరం ఆదిత్య L1 ఉన్న ప్రదేశంలో మిగిలిన గ్రహాల అయస్కాంత క్షేత్ర ప్రభావాన్ని లెక్కిస్తుంది. దీనిలో రెండు సెట్ల మాగ్నెటిక్ సెన్సర్లున్నాయి. ఈ సెన్సర్లు ఆదిత్య L1 మీద కాకుండా దానికి దూరంగా ఆరు మీటర్ల దూరంలో ఉంటాయి. అంటే ఆదిత్య L1 వెనుక భాగంలో ఆరు మీటర్ల పొడవుగా ఉన్న తీగలాంటి నిర్మాణంలో చివర ఒక సెన్సర్, మధ్యలో మూడు మీటర్ల దూరంలో మరో మాగ్నెటోసెన్సర్ ఉంటాయి.
ఇలా ఆదిత్య L1లో అమర్చిన ఏడు పేలోడ్లలో నాలుగు పేలోడ్‌లు సూర్యుడిని, సూర్యుడి ఉపరితలం మీద ఉన్న కరోనాను, ఇతర పరిస్థితుల్ని అధ్యయనం చేస్తాయి. మిగిలిన మూడు మూడు పేలోడ్లు ఆదిత్య L1 ఉన్న ప్రదేశంలో పరిస్థితులను అధ్యయనం చేస్తూ ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడి మీద పరిశోధనలు ఎందుకు?
విశ్వం పుట్టుక, భవిష్యత్తుల గురించి తెలుసుకోడానికి నక్షత్రాలే ప్రధాన ఆధారం. భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడిని పరిశోధిస్తే, విశ్వం గురించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. సూర్యుడి లాంటి నక్షత్రాల్లో ఉండే పరిస్థితులను భూమ్మీద సృష్టించి, వాటిపై పరిశోధనలు చేయడం దాదాపు అసాధ్యం.
అందుకే నేరుగా సూర్యుడిపైనే పరిశోధనలు చేసేందుకు అంతరిక్ష సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. ఇలా సూర్యుడి గురించిన సమాచారం తెలుసుకోవడం మాత్రమే కాదు, నిరంతరంగా సూర్యుడి మీద ఓ కన్నేసి ఉంచడానికే ఇస్రో ఆదిత్య L1 ను ప్రయోగించింది.
సూర్యుడి ఉపరితంలపై జరిగే రసాయన చర్యల వల్ల ఉత్పన్నమయ్యే సౌర తుపానులను ముందుగానే గుర్తించడానికి కూడా ఈ ప్రయోగం సహకరిస్తుంది.
సూర్యుడు ఒక డైనమిక్ నక్షత్రం. అంటే సూర్యుడిలో నిరంతరం కేంద్రక సంలీన చర్యతో పెద్ద ఎత్తున శక్తి విడుదల అవుతుంది. అప్పుడప్పుడూ సూర్యుడి ఉపరితలం నుంచి పెద్ద ఎత్తున సౌర పవనాలు సూర్య కుటుంబంలోకి విడుదల అవుతాయి.
ఒకవేళ ఇలాంటి సౌర పవనాలు భూమి వైపుగా దూసుకొస్తే దాని ప్రభావం వల్ల చాలా ఉపద్రవాలు తతెత్తుతాయి.
భూమ్మీద వాతావరణం, భూ అయస్కాంత క్షేత్రాల వల్ల ఈ సౌర పవనాలు నేరుగా భూ ఉపరితలం వరకూ రాలేవు. కానీ ఆకాశంలో ఉండే శాటిలైట్లకు, భూమ్మీద ఉండే కమ్యూనికేషన్ వ్యవస్థలకు, విద్యుత్ గ్రిడ్‌లకు ప్రమాదం కలిగే అవకాశముంది.
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వంటి వాటిల్లో పనిచేసే వ్యోమగాములు ఇలాంటి సౌరపవనాల బారిన నేరుగా పడితే, చాలా ప్రమాదం. కాబట్టి ముందుగానే వాటిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆదిత్య L1 చేసే పనుల్లో ఇదీ కీలకమైనది.

ఫొటో సోర్స్, Getty Images
ఆ పేరే ఎందుకు, అక్కడే ఎందుకు...?
సూర్యుడి మీద పరిశోధనలకు భూమ్మీద చాలా చోట్ల సోలార్ అబ్జర్వేటర్లు ఉన్నాయి. కానీ భూమ్మీద ఉండే వాతావారణం కారణంగా పూర్తి స్థాయిలో సూర్యుడి గురించి పరిశోధనలు చేయడం వీటికి సాధ్యం కాదు.
ముఖ్యంగా సూర్యుడి చుట్టూ ఉంటే కరోనా గురించి పరిశోధనలు చేయాలంటే... భూవాతావరణానికి అవతల ఉండాలి. భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర ఉండే అబ్జర్వేటరీలు నేరుగా సూర్యుడిని ప్రతీ క్షణం చూడగలుగుతాయి. వాటికి సూర్యుడికి మధ్య ఎప్పుడు, ఎలాంటి అడ్డంకీ రాదు. అందుకే ఇవి సూర్యుడి నుంచి ఉత్పన్నమయ్యే సౌరతుపానులను ముందుగానే గుర్తించగలుగుతాయి.
ఈ అబ్జర్వేటరీ సూర్యుడి మీద ప్రయోగాలు చేయబోతోంది కాబట్టి దీనికి ఆదిత్య అని పేరు పెట్టారు. ఆదిత్య అంటే సూర్యుడు అని అర్థం.
ఇక దీనిని సూర్యుడికి భూమికి మధ్యలో ఉన్న లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గర దీనిని ప్రవేశ పెట్టబోతున్నారు కాబట్టి ఈ మిషన్‌కి ఆదిత్య L1 అని పేరు పెట్టింది ఇస్రో.
భూమికి, సూర్యుడికి మధ్య ఐదు లెగ్రాంజ్ పాయింట్లు ఉన్నాయి. కానీ ఇస్రో ఆదిత్య L1 ని లెగ్రాంజ్ పాయింట్ 1 దగ్గరకే పంపిస్తోంది. ఎందుకంటే ఇది భూమికి, సూర్యుడికి మధ్య వందో వంతు దూరంలో భూమి వైపుగా ఉంటుంది. అంటే 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. L2 పాయింట్ భూమికి వెనుక ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్లినా భూమి అడ్డుగా ఉంటుంది కాబట్టి, సూర్యుడి మీద పరిశోధనలు చేయడం కష్టం.
L3 సూర్యుడి వెనుక ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకోవడం చాలా కష్టం. ఇక L4, L5లు కూడా చాలా దూరంలో ఉంటాయి. కాబట్టి ఇస్రో L1 పాయింట్ దగ్గరకు తన అబ్జర్వేటర్‌ని పంపించింది.
ఈ ఐదు పాయింట్లలోనూ L4, L5 దగ్గర ఉండే ఖగోళాలు స్థిరంగా ఉంటాయి. కానీ మిగిలిన మూడు పాయింట్ల దగ్గర ఉండే వస్తువులు అస్థిరంగా ఉంటాయి. అంటే కాలంతో పాటు నెమ్మదిగా రెండింటిలో ఏదో ఒక ఖగోళపు గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. అందుకే వాటిలో అప్పుడప్పుడూ కాస్త ఇంధనాన్ని మండించి వాటి స్థానాన్ని సరి చేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఆదిత్య L1 తన ప్రయాణంలోనే సూర్యుడి మీద ఎన్నో పరిశోధనలు చేసి ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపించింది. మరో ఐదేళ్ల పాటు తన నిర్దిష్ట కక్ష్యలో ఉంటూ సూర్యుడి మీద నిరంతరం పరిశోధనలు చేస్తూ, ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపిస్తుంది. ఆదిత్య L1 అందించే సమాచారం భారత్‌తో పాటు మిగిలిన దేశాల అంతరిక్ష సంస్థలకు కూడా చాలా ఉపయుక్తమని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి:
- ఎంఫిల్ కోర్సు రద్దు: యూజీసీ ఆదేశంతో విద్యార్థులకు లాభమా, నష్టమా?
- ఎక్స్‌పోశాట్: ఇస్రో తొలిసారిగా ఇలాంటి శాటిలైట్ ఎందుకు ప్రయోగించింది? ఈ మిషన్ ప్రత్యేకత ఏమిటి?
- రూ.2.5 కోట్ల లాటరీ తగిలినా 90 ఏళ్ల వయసులో రిక్షా తొక్కుతున్నారు. ఆ డబ్బంతా ఏమైంది?
- మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?
- భారతీయ అభిమానులకు తెగ నచ్చేసిన పాకిస్తానీ క్రికెట్ షో.. అంతలా ఈ పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఏం చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















