సముద్రం ఒడ్డున కొండ రాళ్ల మధ్య 6 అడుగుల పుర్రె.. అత్యంత భయంకరమైన జీవుల్లో ఇదీ ఒకటి

pliosaur skull
    • రచయిత, రెబెకా మోరెల్లె, అలిసన్ ఫ్రాన్సిస్
    • హోదా, బీబీసీ న్యూస్ సైన్స్

జురాసిక్ తీర ప్రాంతంలో వెలికితీసిన ఒక భారీ సముద్ర జీవి ప్లయోసార్ పుర్రెను ప్రజల సందర్శనకు ఉంచారు.

ప్లయోసార్‌కు చెందిన 2 మీటర్ల(సుమారు 6.5 అడుగులు) పొడవైన అవశేషం ఇది.

భూగ్రహంపై తిరిగిన అత్యంత భయంకరమైన వేటాడే జంతువులలో ప్లయోసార్ కూడా ఒకటి.

15 కోట్ల సంవత్సరాల కిందటి ఈ సముద్ర జీవి పుర్రెను అది దొరికిన ప్రదేశానికి దగ్గర్లోనే ఉన్న డోర్సెట్‌లోని కిమ్మెరిడ్జ్‌లో ఎచెస్ కలెక్షన్‌ మ్యూజియంలో ప్రజల సందర్శన కోసం ఉంచారు.

2 మీటర్ల పొడవైన ప్లియోసార్ పుర్రె

ఫొటో సోర్స్, BBC/TONY JOLLIFFE

ఈ సముద్రజీవికి చెందిన మిగతా అస్థిపంజర శిథిలాలను కోతకు గురవుతున్న కొండ చరియల నుంచి వెలికి తీయాల్సి ఉంది.

వీటిని కూడా వెలికి తీస్తామని పరిశోధకులు చెప్తున్నారు.

కిమ్మెరిడ్జ్ తీరానికి దగ్గర్లో ఉన్న బీచ్‌లో జంతువుల అవశేషాలపై అధ్యయనం చేసే ఔత్సాహికులు ప్లయోసార్‌ భాగాన్ని కనుగొన్నారు.

ఆ తరువాత తీరంలో కోతకు గురవుతున్న కొండ చరియలలోకి తాళ్ల సహాయంతో దిగిన ఆ బృందం ప్లయోసార్ పుర్రెలో మిగిలిన భాగాన్ని కూడా బయటకు తీశారు.

డోర్సెట్ బీచ్

ఫొటో సోర్స్, BBC STUDIOS

ఫొటో క్యాప్షన్, డోర్సెట్ బీచ్‌లో తాడుల ద్వారా పై నుంచి కిందకు దిగుతూ అవశేషాలను వెలికితీశారు

ఈ అవశేషాలను తొలగించే బృందానికి స్టీవ్ ఎచెస్ నేతృత్వం వహించారు.

ఆయన పేరుతో మ్యూజియంలో ఈ భారీ సముద్ర జీవికి చెందిన పుర్రెను ప్రజల సందర్శనకు ఉంచారు.

దీంతో పాటు ఆయన జీవితకాలం పాటు సేకరించిన ఇతర ఇలాంటి అవశేషాలను కూడా ప్రదర్శనకు ఉంచారు.

‘‘ఇవి చూడటానికి చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు వచ్చినప్పుడు వాటి ఎంతో ఆసక్తితో తిలకిస్తున్నారు. వారు వచ్చి దాని ముఖాన్ని చూస్తున్నారు’’ అని బీబీసీ న్యూస్‌కు ఆయన చెప్పారు.

ఇప్పటి వరకు దొరికిన పూర్తి నమూనాల్లో ప్లయోసార్ పుర్రె ఒకటి. దీన్ని ఎంతో సురక్షితంగా భద్రపరిచారు.

దీని దవడ మొసలి దవడలా ఉంది. 130 పదునైన దంతాలు ఉన్నాయి. పుర్రెకు రెండు వైపులా ఉన్న భారీ కండరాలతో నింపి ఉన్నట్లు పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయి. ప్లయోసార్‌ని ‘సీ రెక్స్’ అని కూడా అంటారు.

వేటాడే సముద్ర జీవులు

ఫొటో సోర్స్, BBC STUDIOS

ఫొటో క్యాప్షన్, డబుల్ డెక్కర్ బస్సు అంత పొడవుగా ఈ రాక్షస జీవులు పెరిగేవి

10 నుంచి 12 మీటర్ల పొడవు పెరిగే ఈ పురాతన సముద్ర జీవి, తనకున్న నాలుగు అతిపెద్ద రెక్కలతో మహాసముద్రంలో తిరిగేది.

ఇది భారీగా ఉన్నప్పటికీ, వేగంగా కదులుతుంది.

ప్లయోసార్లు ఆహార గొలుసులో పైభాగంలో ఉంటాయని స్టీవ్ ఎచెస్ చెప్పారు.

ఇవి ఇతర ప్లయోసార్లను కూడా తినేస్తాయని ఆయన చెప్పారు.

తాము సేకరించిన ప్లయోసార్ ఎముకలపై ఇతర ప్లయోసార్‌లు కరిచిన గాట్లు కనిపించాయని అన్నారు.

ప్లియోసార్ సముద్ర జీవి పుర్రె

ఫొటో సోర్స్, BBC/TONY JOLLIFFE

అయితే, మరికొందరు పరిశోధకులు దీనికి ఇతర ప్లయోసార్లకు ఉన్న ఫీచర్లు కనిపించలేదని.. ఇది సరికొత్త జీవి నమూనా కావొచ్చని అంటున్నారు.

మరోవైపు ఈ ప్లయోసార్ శరీరానికి చెందిన మిగతా భాగం ఎక్కడ ఉందనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

కిమ్మెరిడ్జ్ తీర ప్రాంతానికి చెందిన కొండ చరియల్లోనే దీని అస్థిపంజరం ఉండొచ్చని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, సముద్రం ఒడ్డున కొండ రాళ్ల మధ్య 6 అడుగుల పుర్రె.. అత్యంత భయంకరమైన జీవుల్లో ఇదీ ఒకటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)