అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మహమ్మద్ షాహీద్
- హోదా, బీబీసీ
అయోధ్యలో శ్రీరామాలయ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం ఈనెల 22న జరగనుంది. సుమారు 7,000 మంది అతిథులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. వీరిలో దాదాపు 3వేలమంది వీవీఐపీలు కూడా ఉన్నారు.
ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా అన్ని రాజకీయ పక్షాల అగ్రనేతలను ఆహ్వానించామని విశ్వహిందూ పరిషత్ తెలిపింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నుంచి, మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి దాకా ఆహ్వానాలు పంపారు.
ఈ కార్యక్రమానికి హాజరుకావడంలేదని సీతారామ్ ఏచూరి ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ ఇండియా కూటమిలోని కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు తామీ కార్యక్రమానికి హాజరువుతున్నదీ లేనిదీ స్పష్టం చేయలేదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
డోలాయామానంలో కాంగ్రెస్?
కొన్నిరోజుల కిందట సోనియాగాంధీ శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరవుతున్నారంటూ మీడియా కథనాలు వచ్చాయి.
కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనే విషయంపై సరైన సమయంలో స్పందిస్తామని కాంగ్రెస్ పార్టీ కిందటి శుక్రవారం స్పష్టం చేసింది.
కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరామ్ రమేష్ ‘‘ సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటూ’’ ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ హాజరయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని ‘ది టెలిగ్రాఫ్’ అనే ఆంగ్ల దినపత్రిక ఇటీవల ఒక కథనాన్ని ప్రచురించింది.
తమ పార్టీ పోరాటం బీజేపీ సిద్ధాంతాలు, దాని రాజకీయాలపైనే కానీ, తాము రామమందిరానికి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ పార్టీకి చెందని ఓ సీనియర్ నేత తెలిపారు.
‘‘మేం ఆర్ఎస్ఎస్-బీజేపీ కంటే ఎక్కువ ఆధ్యాత్మిక వాదులం. వారు మతాన్ని రాజకీయలబ్ధి కోసం వాడుకుంటారు. మేం మతోన్మాదులం కాము. మేం అన్ని మతాలను గౌరవిస్తాం. రామ మందిరం ఉత్సవాలను మేమేందుకు బహిష్కరించాలి’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ కాంగ్రెస్ నేత టెలిగ్రాఫ్ దినపత్రికకు తెలిపారు.
జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరవుతున్నారు. ఆలయ గర్భగుడిలో 12 గంటల 15 నిమిషాలకు ఆయన పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
ఆగస్టు 5, 2020న ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
కాంగ్రెస్ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోంది?
శ్రీరామ మందిర ప్రాణ ప్రతిష్ఠకార్యక్రమంలో పాల్గొనే విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతోందనే ప్రశ్న తలెత్తుతోంది.
సీనియర్ జర్నలిస్టు నీరజా చౌదరి కూడా ఈ విషయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘‘ఎందుకంటే 90ల నాటి కాంగ్రెస్ మానిఫెస్టోలో రామమందిర నిర్మాణాన్ని చేపడతామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది. చట్టపరంగా లేదా, చర్చల ద్వారా నిర్మాణం చేస్తామని కాంగ్రెస్ తెలిపింది. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ శ్రీరామమందిర ప్రాణప్రతిష్ఠలో పాల్గొనాల్సిన అవసరం ఉంది’’అని చెప్పారు.
‘‘1992లో బాబ్రీ మసీదు కూలగొట్టినప్పుడు,రామమందిర నిర్మాణం అనేది ఎప్పుడు నిర్ణయాత్మకశక్తిగా లేదు. కానీ ఈసారి ఆలయ నిర్మాణ ఘనత పీఎం మోదీకి చెందుతుంది. త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలకు బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటుంది’’ అని తెలిపారు.
‘‘అయితే.. బీజేపీ కార్యక్రమానికి ఎందుకు వెళ్ళాలని కాంగ్రెస్ ఆలోచిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే దీని ఫలితం నేరుగా బీజేపీనే పొందుతుంది. కానీ కార్యక్రమానికి హాజరుకాకపోతే కాంగ్రెస్‌కు హిందూ వ్యతిరేకి అనే ముద్రవేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకే కాంగ్రెస్ ఇంకా డోలాయామానంలోనే ఉంది’’ అని తెలిపారు.
బీజేపీకి లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉందనే విషయాన్ని మీడియా ప్రచారం చేస్తోందని టెలిగ్రాఫ్‌తో సదరు కాంగ్రెస్ నాయకుడు తెలిపారు.
‘‘మేం ఆలయాలకు వెళతాం, మసీదులు, చర్చిలు, గురుద్వారా ఎక్కడైకనా వెళతాం. కానీ రామ మందిర ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళకూడదు? సుప్రీం కోర్టు సూచనల మేరకు ఏర్పడిన నేషనల్ ట్రస్ట్ మమ్మల్ని ఆహ్వానించింది’’ అని ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్లింల నుంచి ఒత్తిడి ఉందా?
శ్రీరామ మందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ హాజరుకావడంపై కేరళలో ఆ పార్టీ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
కేరళలో కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు అయిన శశిథరూర్ ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయ వేదికగా అభివర్ణించారు.
డిసెంబర్ 28న ఆయన ఓట్వీట్ చేశారు. రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానాలు అందుకున్నవారు వెళ్ళాలా వద్దా అనే విషయం ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. కార్యక్రమానికి హాజరుకానివారిని హిందూ వ్యతిరేకులని పిలవకూడదు. వెళ్ళినవారిని బీజీపీ చేతిలో కీలుబొమ్మలయ్యారని నిందించకూడదు అన్నారు.
రాజకీయనాయకులు ఈ కార్యక్రమానికి హాజరుకావడంపై ముస్లింలకు అభ్యంతరం లేదని సీనియర్ జర్నలిస్ట్ వినోద్ శర్మ చెప్పారు.
‘‘ రామ మందిర వివాదంపై సుప్రీం కోర్టు తీర్పును ముస్లింలు అంగీకరించారు. అలాంటి పరిస్థితులలో రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరైతే వారెందుకు ఆగ్రహిస్తారు?కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ముస్లింల ఓట్లు పోగొట్టుకోదు’’ అని శర్మ తెలిపారు.
‘‘కానీ అదే సమయంలో కాంగ్రెస్‌కు కేరళ కూడా చాలా ముఖ్యమైది. కాంగ్రెస్‌కు బలమున్న కొన్ని రాష్ట్రాలలో కేరళ కూడా ఒకటి. అందుకే ఇక్కడ తన మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌ను అసంతృప్తికి గురిచేయదలుచుకోలేదు’’ అని నీరజా చౌదరి చెప్పారు.
‘‘ఆలయ నిర్మాణం వల్ల 90 శాతం మంది హిందువులు సంతోషంగా ఉన్నారనేది నిజం. ఈ విషయాన్ని ఓ జాతీయ పార్టీ (కాంగ్రెస్) ఎలా విస్మరిస్తుంది? బీజేపీ రాముడిని చక్కగా వాడుకోగలిగింది. మరి కాంగ్రెస్ పార్టీ రాముడితో ఏం చేయనుందనే సవాల్ ముందు ముందు ఎదురుకానుంది’’ అని ఆమె తెలిపారు.
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, పీవీ నరసింహారావులాంటి వాళ్ళు ‘‘మేం బీజేపీతో పోరాడగలం, కానీ రాముడితో ఎలా పోరాడతాం’’ అని అనేవారు. కాంగ్రెస్ సమాధానం లేని విచిత్రమైన పరిస్థితి ఎదుర్కోంటోంది.
‘‘కాంగ్రెస్ ఈ కార్యక్రమానికి హాజరుకాకపోతే వారికి హిందువుల ప్రయోజనాలపై ఆసక్తి లేదు. ఇప్పటికే ఇండియ యూనియన్ ముస్లింలీగ్ హెచ్చరిక కూడా చేసింది. ఈ హెచ్చరికను చూపి కాంగ్రెస్‌కు ముస్లిం పార్టీకి భయపడి కార్యక్రమానికి హాజరుకాలేదని చెబుతారు’’

ఫొటో సోర్స్, Getty Images
ప్రాణప్రతిష్ఠకు హాజరైతే కాంగ్రెస్‌కు ప్రయోజనమా?
2019లో రామమందిరంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. అయితే ఆలయ ప్రారంభోత్సవానికి హాజరైతే కాంగ్రెస్ పార్టీకి లాభమా? నష్టమా? దీనిపై వినోద్ శర్మ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళకపోతే, చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ రాముడిని అవమానించిందని, మొదటి నుంచి వారు రాముడికి వ్యతిరేకంగానే ఉన్నారని, నిజాలు ఎప్పటికైనా నిజాలేనని’’ చెబుతారని వినోద్ శర్మ అన్నారు.
1986లో జిల్లా కోర్టు తీర్పుమేరకు బాబ్రీ మసీదు తాళాలు తెరిచారు. అక్కడ బాలరాముడిని ప్రతిష్టించారు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం ( అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెస్సే అధికారంలో ఉంది) బాబ్రీ మసీదు తాళాలు తెరిచింది. ఎందుకంటే విడాకులు పొందిన షాబానో అనే మహిళకు భరణం ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును రద్దుచేసేందుకు ఓ చట్టమే చేసింది. దీనికి బదులుగా హిందువులను సంతృప్తి పరిచేందుకు బాబ్రీ మసీదు తాళాలు తెరిపించారు.
‘‘కాంగ్రెస్‌ది అందరినీ కలుపుకుపోయే సిద్ధాంతం. ఇందులో ఆ పార్టీలో అన్నిరకాల వాళ్ళు ఉంటారు. కాబట్టి రామమందిర ప్రారంభోత్సవానికి వెళ్లడమనేది ఆ పార్టీ సిద్ధాంతానికేమీ వ్యతిరేకం కాదు’’ అని వినోద్ శర్మ చెప్పారు.
2019లో సుప్రీం కోర్టు తీర్పు అనంతరం, రాహుల్, ప్రియాంక గాంధీ ‘‘ప్రతి ఒక్కరు కోర్టు నిర్ణయాన్ని గౌరవించి సామాజిక సామరస్యానికి పాటుపడాలని’’ ట్వీట్ చేశారు.
ఏదేమైనా బాబ్రీ మసీదు తలుపులు తెరుచుకున్నపుడు, రామ విగ్రహాన్ని అక్కడ పెట్టినప్పుడు, బాబ్రీ మసీదును కూలగొట్టినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
ఇవి కూడా చదవండి:
- మూత్రం రంగును బట్టి కిడ్నీలు పాడయ్యాయో, లేదో ఎలా తెలుసుకోవచ్చు?
- ఈ నగరంలో అత్యాచారాలు సర్వ సాధారణం.. రేపిస్టుల్ని కొట్టి చంపటం కూడా
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- రూ.2.5 కోట్ల లాటరీ తగిలినా 90 ఏళ్ల వయసులో రిక్షా తొక్కుతున్నారు. ఆ డబ్బంతా ఏమైంది?
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















