ఈడీ-సీబీఐ: బీజేపీలో చేరితే కేసులు ఉండవా, ప్రతిపక్షాల ఆరోపణ నిజమేనా?

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/AK

‘‘భారతీయ జనతాపార్టీ బహిరంగంగా సీబీఐ, ఈడీ లాంటి ఏజెన్సీలను ప్రతిపక్ష నేతలపై ప్రయోగించి, వారిని బీజేపీలో చేరేలా చేస్తోంది’’ అని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తనకు సమన్లు ఇవ్వడంపై ఆయన పై విధంగా స్పందించారు.

తనను అరెస్ట్ చేయవచ్చని ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు ఈడీ సమన్లను అన్యాయమని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

జనవరి 3న తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఈడీ కేజ్రీవాల్‌కు ఇంతకు ముందే సమన్లు పంపింది. కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు పంపడం ఇది మూడోసారి. అంతకుముందు నవంబర్ 2, డిసెంబర్ 21న సమన్లు పంపినా కేజ్రీవాల్ హాజరు కాలేదు.

లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను విచారించాలని ఈడీ భావిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే చాలామంది ఆప్ లీడర్లు అరెస్ట్ అయ్యారు.

‘‘ఓ నాయకుడికి వ్యతిరేకంగా సీబీఐ, ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉదంతాలు బోలెడు ఉన్నాయి. ఇలా కేసులు ఉన్న నాయకులు బీజేపీలోకి చేరగానే, ఆ కేసులను మూసివేస్తారు, లేదంటే మూలనపడేస్తారు. బీజేపీలో చేరిన వారందరి కేసులు పరిష్కారమైపోతాయి. వారి పార్టీలో చేరనివారు జైలుకు పోతారు’’ అని కేజ్రీవాల్ అన్నారు.

‘‘బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఈ ఏజెన్సీలు నోరెత్తవు. కానీ బీజేపీయేతర రాష్ట్రాలలో మాత్రం ఈ ఏజెన్సీలు చాలా దూకుడుగా వ్యవహరిస్తుంటాయని’’ కొన్ని నెలల కిందట ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా కూడా చెప్పారు.

తాజాగా పశ్చిమబెంగాల్లో శుక్రవారం నాడు తృణమూల్ కాంగ్రెస్ నేత ఇంట్లో తనిఖీలకు వెళ్లిన ఈడీ అధికారులపై మూకదాడి జరిగింది.

రేషన్ కుంభకోణం ఆరోపణల కేసుకు సంబంధించి జైలులో ఉన్న పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ సన్నిహితుడు శంకర్ అధ్యా నివాసంలో ఈడీ సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ఈ గుంపు దాడి చేసింది. నార్త్ 24 పరగణాస్ జిల్లా సందేశ్‌ఖాలీలో ఈ ఘటన జరిగింది.

బీజేపీ ఆదేశాల ప్రకారమే ఈడీ, కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలను, కార్యకర్తలను వేధిస్తున్నాయని, తమ కార్యకర్తలను బీజేపీ రెచ్చగొడుతోందని అందుకే ఈడీ అధికారులపై దాడి జరిగిందని ఆ పార్టీ నేత కుణాల్ ఘోష్ ఆరోపించారు. తృణమూల్ నాయకులపై మాత్రమే ఈడీ దాడులు జరుగుతున్నాయని, బీజేపీ నాయకులపై చేయట్లేదని ఆయన అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

ఈడీ దాడులు

ఇది నిజమేనా?

ప్రతిపక్ష నేతలపై మాత్రమే ఈడీ దాడులు జరుగుతున్నాయన్న మాటల్లో నిజమెంతో చూద్దాం.

గడిచిన మూడేళ్ళలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ (పీఎంఎల్ఏ) చట్టం కింద ఈడీ 3,100 కేసులు నమోదుచేసినట్టు 2023 జులైలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.

2022-23 : 949 కేసులు

2021-22 : 1180 కేసులు

2020-21 : 981 కేసులు

ఫారిన్ ఎక్స్జేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద కూడా గడిచిన మూడేళ్ళలో 12వేల233 కేసులు నమోదయ్యాయి.

2022-23 : 4,173 కేసులు

2021-22 : 5,313 కేసులు

2020-21 : 2,747 కేసులు

సెప్టెంబర్ 2022లో ఈడీ నమోదు చేసిన కేసులో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురించింది.

ఈ కథనం ప్రకారం 18 ఏళ్ళ రికార్డులను పరిశీలిస్తే మొత్తం 147మంది నాయకులను అరెస్ట్ చేయడమో, విచారించడమో చేశారు. వీరిలో 85శాతం పత్రిపక్షాలకు చెందినవారే.

సీబీఐ దృష్టిలో పడిన 200 మంది నాయకులలో కూడా 80 శాతం మంది ప్రతిపక్ష నేతలే. ఈ 18 సంవత్సరాలలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండూ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి.

పీఎంఎల్‌ఏను 2005, 2009, 2012లో సవరించారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది.

2019లో మోదీ హయాంలో పీఎంఎల్‌ఏకు చేసిన మార్పులతో ఈడీకి దాడిచేసే అధికారాలు వచ్చాయి.

నిందితుల ఇళ్ళను సోదాలు చేసి, అరెస్ట్ చేసే అధికారం వచ్చింది.

అంతకుముందు ఇతర ఏజెన్సీలేవైనా ఎఫ్ఐఆర్‌ లేదా చార్జిషీట్‌లలో పీఎంఎల్ఏ సెక్షన్లు జోడించినప్పుడు మాత్రమే ఈడీ రంగంలోకి దిగి విచారణ జరిపేది. కానీ ఇప్పడు తనంతట తానే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, అరెస్ట్‌లు చేస్తోంది.

2014 నుంచి 2022వరకు ఈడీ లక్ష్యంగా చేసుకున్న 115 మంది నేతలలో 95 శాతం ప్రతిపక్ష నేతలేనని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం పేర్కొంది.

2004-14 మధ్య ఈడీ 26 మంది నేతలను విచారించింది. ఇందులో 54 శాతం అంటే 14మంది నేతలు ప్రతిపక్షాలకు చెందినవారు.

ఇవన్నీ 2022 వరకు సంబంధించిన గణాంకాలు మాత్రమే. 2023లో ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా పలు రాష్ట్రాలలో జరిగిన ఈడీ, సీబీఐ దాడులను రాజకీయ ప్రేరేపితమైనవిగా ప్రతిపక్షాలు అభివర్ణించాయి.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/AK

దిల్లీ : కేజ్రీవాల్ ప్రభుత్వం

ఆమ్ అద్మీ పార్టీ ప్రభుత్వం దిల్లీలో 2013 నుంచి అధికారంలో ఉంది. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

2023 ఫిబ్రవరిలో దిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది.

దిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఈ అరెస్ట్ చేశారు.

2021 దిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన విషయమిది. దీనిపై జులై 2022లో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనా విచారణకు ఆదేశించారు.

ఈ విషయంపై విచారణ జరిపాకా, సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

కరోనా సమయంలో నష్టాలు వచ్చాయనే పేరుతో లైసెన్సు ఫీజు రద్దు చేశారని, దీనివలన దిల్లీ ప్రభుత్వానికి రూ.140 కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొంది.

కొత్త మద్యం పాలసీలో లైసెన్సు మంజూరుకు లంచాలు తీసుకున్నారని, ఆ మొత్తాన్ని పంజాబ్ ఎన్నికలలో వినియోగించారని సీబీఐ అభియోగాలు మోపింది.

సీబీఐ, ఈడీ రెండూ ఈ కేసును విచారించాయి.

2023 అక్టోబరులో లిక్కర్ పాలసీ వల్ల ఆప్ ప్రయోజనం పొంది ఉంటే, ఈ కేసులో ఆ పార్టీని ప్రధాన ముద్దాయిగా ఎందుకు చూపలేదని సుప్రీం కోర్టు ఈడీని ప్రశ్నించింది.

కేజ్రీవాల్‌ను ప్రశ్నించాలంటూ ఈడీ మొదటిసారిగా నవంబర్‌లో సమన్లు జారీచేసింది.

కేజ్రీవాల్ పేరు చార్జిషీట్‌లో లేదని, ఆయన నిందితుడు కూడా కాడని, కనీసం సాక్షి కూడా కాడని, అలాంటప్పుడు ఆయనను విచారణకు ఎందుకు పిలుస్తున్నారని ఆప్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

‘‘వాళ్ళు నా నిజాయితీపై దాడి చేయాలనుకంటున్నారు’’ అని జనవరి 4న కేజ్రీవాల్ చెప్పారు.

‘‘నాకు సమన్లు పంపడం అన్యాయం. బీజేపీ లక్ష్యం విచారణ జరిపించడం కాదు. నన్ను లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి దూరం చేయడమే. ఎనిమిది నెలల కిందట సీబీఐ నన్ను పిలిచింది. వెళ్ళాను. మరి రెండేళ్ళుగా సాగుతున్న ఈ విచారణలో ఈడీ ఇప్పుడు నన్ను ఎందుకు పిలుస్తోంది?’’ అని ప్రశ్నించారు.

కేజ్రీవాల్ తప్పు చేయకపోతే విచారణకు హాజరు కావడానికి భయపడటమెందుకు అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/HEMANT SOREN

ఝార్ఖండ్ : హేమంత్ సోరెన్ ప్రభుత్వం

2019 నుంచి ఝార్ఖండ్‌లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా ప్రభుత్వం అధికారంలో ఉంది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

‘‘2019 నుంచి జేఎంఎం ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని బీజేపీ ప్రయత్నిస్తోంది, ఇలాంటి ప్రయత్నాల్లో విజయం సాధించలేని చోట ఈడీ అధికారులు తమ పని మొదలు పెడుతుంటారు’’ అని హేమంత్ సోరెన్ బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.

గడిచిన ఐదేళ్ళలో తనను, తన సన్నిహితులను అనేకసార్లు లక్ష్యంగా చేసుకున్నారని సోరెన్ చెప్పారు.

ఈడీ సోరెన్‌ను తమ ఎదుట హాజరకమ్మంటూ ఏడుసార్లు సమన్లు జారీచేసింది.

కానీ ఒక్కసారికూడా సోరెన్ ఈడీ ఎదుట హాజరుకాలేదు.

ఏడోసారి సమన్లు జారీచేసేటప్పుడు ఇది తమ చివరి సమన్ అని ఈడీ పేర్కొంది.

2023 ఆగస్టు 14న ఈడీ మొదటిసారి సోరెన్‌కు సమన్లు జారీచేసింది.

ఈడీకి సోరెన్ రాసిన లేఖలో ‘ఒకసారి నేను విచారణకు వచ్చి ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చాను. అది చట్టబద్ధంగా సంపాదించిన ఆస్తి అని చెప్పాను. దీని గురించి మీకేమైనా సమాచారం కావాలనుకుంటే లేఖ ద్వారానే నన్ను సంప్రదించండి’’ అని పేర్కొన్నారు.

ఈడీ నుంచి ఉపశమనం కోరుతూ ఝార్ఖండ్ హైకోర్ట్, సుప్రీం కోర్టులో సోరెన్ పిటిషన్లు వేశారు కానీ ఉపయోగం లేకపోయింది.

భూ కుంభకోణానికి సంబంధించి సోరెన్‌ను ఈడీ విచారించాలనుకుంటోంది.

అక్రమ మైనింగ్, మనీలాండరింగ్ అభియోగాలపై సోరెన్ ప్రెస్ అడ్వైజర్ అభిషేక్ ప్రసాద్ పింటూ ఆస్తులపై ఈడీ దాడులు చేసినట్టు జనవరి 3న కథనాలు వచ్చాయి.

దీనిపై అభిషేక్ ప్రసాద్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లడుతూ ‘‘ అవును.. నాకు గనులు ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఉన్నప్పుడు వాటికి అనుమతులు తెచ్చుకున్నాను’’ అని చెప్పారు.

అక్రమమైనింగ్ ఆరోపణలపై 2022లో కూడా సోరెన్‌ను ఈడీ ప్రశ్నించింది. ఇదే కేసులో 2022 జులైలో సోరెన్ సన్నిహితుడు పంకజ్ మిశ్రాను ఈడీ అరెస్ట్ చేసింది.

2021లో రూపా టిర్కే అనే మహిళా పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకున్న కేసులో బీజేపీ మద్దతుదారులు, రూపా టిర్కే కుటుంబ సభ్యుల ఆరోపణలతో పంకజ్ మిశ్రా పేరు కూడా తెరపైకి వచ్చింది. తరువాత దీనిపై సీబీఐ విచారణ మొదలుపెట్టింది.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/TEJASHWI YADAV

బిహార్ : తేజస్వి యాదవ్

బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ పై కూడా ఈడీ కేసులు నడుస్తున్నాయి.

జనవరి5న విచారణకు రావాల్సిందిగా ఈడీ తేజస్వి యాదవ్ కు సమన్లు జారీచేసింది. ‘‘ఉద్యోగాలకు బదులుగా భూమి’ కేసులో ఈ సమన్లు జారీ అయ్యాయి.

లాలూ యాదవ్, తేజస్విని, 2023 డిసెంబర్ 22 లేదా 27న హాజరుకావాలని ఈడీ కోరింది కానీ, వీరిద్దరూ హాజరు కాలేదు.

2023 ఫిబ్రవరిలో దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు కూడా లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, కుమార్తెలు, ఇంకా చాలామందికి సమన్లు పంపింది. ఇదే కేసులో మార్చిలో బిహార్‌లో ఈడీ అనేక ప్రాంతాలలో దాడులు చేసింది.

లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ స్కామ్ జరిగింది. రైల్వేలో ఉద్యోగాలు ఇచ్చినందుకు బదులుగా వారి నుంచి భూమిని తీసుకున్నారనేది ప్రధాన ఆరోపణ.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/DK SHIVAKUMAR

కర్ణాటక : డీకే శివకుమార్

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ఈడీ ఎప్పటి నుంచో లక్ష్యంగా చేసుకుంది. 2019 సెప్టెంబర్‌లో శివకుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.

కర్ణాటకలోని గతంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వంలోనూ, అంతకుమునుపు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ డీకే మంత్రిగా ఉన్నారు.

ఈ నెలలోనే కేరళ జై హింద్ చానల్‌కు సీబీఐ నోటీసులు జారీచేసింది. ఈ చానల్‌లో డీకే శివకుమార్ పెట్టుబడులకు సంబంధించిన సమాచారం కావాలని కోరింది.

జనవరి 11, 2024నాడు తమ ముందు హాజరు కావాలని చానల్ ఎండీకి నోటీసులు ఇచ్చింది. 2020లో శివకుమార్‌పై సీబీఐ కేసు నమోదుచేసినట్టు పీటీఐ తెలిపింది.

2013-2108 మధ్య రూ. 74 కోట్ల ఆదాయానికి సంబంధించి ఈ కేసు నమోదైంది.

2022 మేలో ఈడీ కూడా పీఎంఎల్ఏ కింద ఈడీ కూడా అభియోగపత్రాన్ని దాఖలు చేసింది.

గుజరాత్‌లో రాజ్యసభ సీటు ఎన్నిక డీకే శివకుమార్‌ రాజకీయ జీవితానికి చాలా కీలకంగా మారింది. ఈ సీటుకు అమిత్‌షా, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ పోటీపడ్డారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ గుజరాత్ నుంచి బెంగళూరులోని ఓ రిసార్ట్‌కు తరలించడంలో శివకుమార్ కీలక పాత్ర పోషించారు.

దీని తరువాత ఆదాయపు పన్ను శాఖాధికారులు ఈయన ఆస్తులపై దాడులు చేశారు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/MK STALIN

తమిళనాడు : డీఎంకే స్టాలిన్ ప్రభుత్వం

తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలో ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. డీఎంకే ప్రభుత్వంలోని మంత్రుల ఇళ్ళపై కిందటేడాది ఈడీ దాడులు చేసింది.

లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై ఒక ఈడీ ఆఫీసర్‌ను తమిళనాడు పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. డీఎంకే పార్టీకి చెందిన మంత్రి సెంథిల్ బాలాజీ ని ఈడీ అరెస్ట్ చేసింది. కేంద్ర ఏజెన్సీలను బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ పలు సందర్భాలలో ఆరోపించారు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, Getty Images

రాజస్థాన్

రాజస్థాన్, చత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, అధికారానికి దగ్గరగా ఉన్న వారిపై ఈడీ దాడులు చేసింది.

కిందటి నవంబర్‌లో అప్పటి సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్‌ను ఈడీ విచారణకు రమ్మని పిలిచింది.

జనవరి 3, 2024న వైభవ్ ఇంటిపై ఈడీ దాడులుచేసింది.

జల్ జీవన్ మిషన్‌తో అనుబంధం ఉన్న అనేకమంది ప్రభుత్వాధికారులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా, కాంగ్రెస్ నేత ఓం ప్రకాశ్ హుడ్లా తదితరుల నివాసాలపై ఈడీ దాడులు జరిపింది.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/BHUPESH BAGHEL

ఛత్తీస్‌గఢ్

అక్రమ రికవరీకి సంబంధించి డిసెంబరు 2022లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్యా చౌరాసియాను ఈడీ అరెస్ట్ చేసింది.

2023 ఫిబ్రవరిలో రాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ సదస్సు పెరిగిపోతున్న ఈడీ దాడుల గురించి అనేక ప్రశ్నలు రేగాయి.

భగేల్‌కు సన్నిహితంగా ఉన్న నేతలు, ప్రభుత్వ అధికారుల ఇళ్ళపై మొట్టమొదటిసారిగా ఆదాయపుపన్ను శాఖాధికారులు 2020 ఫిబ్రవరిలో దాడులు చేశారు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా ఈడీ స్కానర్‌లో ఉన్నారు.

అభిషేక్‌బెనర్జీ అనేకసార్లు ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఈ కేసు బొగ్గు అక్రమ తవ్వకాలకు సంబంధించినది.

ఈడీ, సీబీఐ రెండూ ఈ కేసును విచారిస్తున్నాయి. అయితే 2022లో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో అభిషేక్ బెనర్జీ పేరును చేర్చలేదు.

మమతా బెనర్జీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న జ్యోతిప్రియా మాలిక్ ఇంటిపై కూడా ఈడీ 2023 అక్టోబరులో దాడి చేసింది.

ఇలా మంత్రుల ఇళ్ళపై దాడులు జరుపుతుంటే ప్రభుత్వాన్ని ఎలా నడపాలని మమతా బెనర్జీ ప్రశ్నించారు.

తాజాగా జ్యోతి ప్రియా మాలిక్ సన్నిహితుడి ఇంటిపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వెళ్లగా, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా అనుమానిస్తున్న కొందరు వ్యక్తులు ఈడీ అధికారులను అడ్డుకుని దాడికి దిగారు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, ANI

బీజేపీలో చేరిన నేతల కేసులు కోల్డ్ స్టోరేజీకేనా?

జనవరి 3, 2923న ఆప్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. గతంలో బీజేపీలో లేకపోవడం వల్ల కేంద్ర ఏజెన్సీల విచారణలను ఎదురొన్నవారు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలోకానీ, ఆ పార్టీతో కానీ ఉన్నారంటూ ఆ పోస్టర్‌లో పేర్కొన్నారు.

కేసులున్ననేతలు బీజేపీలో చేరగానే విచారణలు ఆగిపోతున్నాయని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలు నిజమేనా?

హిమంత బిశ్వ శర్మ

హిమంత బిశ్వ శర్మ. ఒకనాడు అస్సాం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖా మంత్రి. కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి.

శారదా చిట్ ఫండ్ స్కామ్‌లో హిమంత బిశ్వ శర్మ పేరు కూడా వినిపించింది.

2014 ఆగస్టులో సీబీఐ గువహటిలోని హిమంత బిశ్వ శర్మ, ఆయన చానెల్ న్యూస్ లైవ్ కార్యాలయంపైనా దాడులు చేసింది. ఈ చానల్ యజమాని శర్మ హిమంత బిశ్వ శర్మ భార్య రింకీ భూయాన్ శర్మ. 2014 నవంబర్‌లో సీబీఐ హిమంతను గంటలకొద్దీ విచారించింది.

జనవరి 2015న చిట్ ఫండ్ కేసును గువాహటి హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. 2015 ఆగస్టులో హిమంత బీజేపీలో చేరారు.

హిమంత ముఖ్యమంత్రి అయ్యాక సీబీఐ ఏనాడూ ఆయనను విచారణకు పిలవలేదు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/SUVENDU OFFICIAL

సువేందు అధికారి

ఒకనాడు మమత ప్రభుత్వంలో బలమైన నాయకుడిగా ఉన్న సువేందు అధికారి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు.

2014లో జరిగిన ఓ స్టింగ్ ఆపరేషన్‌లో సువేందు అధికారి సహా అనేకమంది నాయకులు లంచాలు తీసుకుంటున్నట్టు అంగీకరించినట్టు బయటపడింది. దీనిని నారదా స్టింగ్ ఆపరేషన్ అని పిలుస్తారు.

2021 ఎన్నికలలో సువేందు అధికార బీజేపీలో చేరారు. మమత విజయం సాధించాకా సీబీఐ నలుగురు టీఎంసీ నాయకులను అరెస్ట్ చేసింది. ఈడీ చార్జిషీట్లు దాఖలు చేసింది. కానీ సువేందు అధికారి పేరు ఇందులో లేదు.

ఇందులో ముకుల్ రాయ్ పేరు కూడా లేదు. ఆయన అంతకుముందు బీజేపీలో చేరారు. కానీ తరువాత తిరిగి టీఎంసీ గూటికి చేరారు.

ఈడీ దాడులు

ఫొటో సోర్స్, FB/AJIT PAWAR

అజిత్ పవార్ ఇంకా చాలామంది..

అజిత్ పవార్ ప్రస్తుతం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన బీజేపీలో లేనంతకాలం దేవేంద్ర ఫడ్నవిస్ సహా అనేకమంది నేతలు ఆయనను లంచగొండిగా అభివర్ణించేవారు.

మార్చి 2022లో ఆదాయపు పన్ను శాఖాధికారులు అజిత్ పవార్ బంధువుల ఇళ్ళపై దాడులు చేశారు. చక్కెర మిల్లుల అవినీతికి సంబంధించి ఈడీ కూడా ఆయనపై అభియోగాలు మోపింది.

విదర్భ నీటిపారుదల కుంభకోణంలో ఈడీ మే 2020లో తాజా విచారణ ప్రారంభించింది.

ఏప్రిల్ 2023లో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటు అజిత్ పవార్ పేరులేదని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది.

ఛగన్ భుజ్‌బల్ కూడా 2014 నుంచి విచారణ సంస్థల స్కానర్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడాయన అవినీతి కేసుల నుంచి విముక్తి పొందారు.

ఇలాంటి జాబితాలో ఈయనొక్కరే కాదు. నారాయణ్ రాణే, ప్రఫుల్ పటేల్, భావనా గిల్, యామిని జాదవ్, ప్రతాప్ సారానాయక్, అదితి థాక్రే, ధనుంజయ ముండే...ఇలా అనేకమంది కేంద్ర విచారణా సంస్థల కేసుల్లో ఉండేవారు.

కానీ, ఇప్పడు వీరిదరి విషయాలలో రెండు అంశాలు కామన్‌గా కనిపిస్తుంటాయి.

1. వీరందరూ ఇప్పడు బీజేపీలో ఉన్నారు.

2. కేంద్రప్రభుత్వ విచారణా సంస్థ వీరిపై చర్యలను పక్కన పెట్టేశాయి.

ఇవి కూడా చదవండి :

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)