నరేంద్ర మోదీ సర్కారులో 36 మంది మంత్రులు కశ్మీర్‌కు వెళ్ళడానికి కారణమేంటి?

ఫొటో సోర్స్, Getty Images
జమ్ము-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని అందించే ఆర్టికల్-370ని నిర్వీర్యం చేసి ఐదు నెలలకు పైనే అయ్యింది.
ప్రభుత్వం మాత్రం జమ్ము-కశ్మీర్‌లో ఇప్పుడు అంతా బాగానే ఉందని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెబుతోంది.
విపక్షాలేమో, అక్కడ అంతా బాగానే ఉంటే, తమను అక్కడికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాయి.
జమ్ము-కశ్మీర్ నేతలను ఎందుకు గృహనిర్బంధంలో ఉంచారని, లోయలో నెలల తరబడి ఇంటర్నెట్ సేవలు ఎందుకు ఆపివేశారని కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అధికార, ప్రతిపక్షాల ఈ గందరగోళం మధ్య 36 మంది కేంద్ర మంత్రులు జనవరి 18 నుంచి 25 వరకూ జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆల్ ఇండియా రేడియో వివరాల ప్రకారం మంత్రులు అందరూ జమ్ము, కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి రాజ్యాంగంలోని ఆర్టికల్ -370ని తొలగించిన తర్వాత ఏర్పడిన ప్రభావం గురించి ప్రజలతో మాట్లాడుతారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వం అమలుచేయబోయే కార్యక్రమాల గురించి సమాచారం ఇస్తారు.
వీరిలో న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ సహా ఐదుగురు మంత్రులు లోయలోని ప్రజలతో మాట్లాడుతారు. మిగతా మంత్రులు జమ్మూ వెళ్లనున్నారు.
మంత్రులు జమ్ము కశ్మీర్ రెండు ప్రాంతాల్లో వివిధ జిల్లాల్లో జనవరి 24 వరకూ ఉంటారు.
విపక్షాలు దీనిని ప్రభుత్వం ప్రాపగాండాగా వర్ణించాయి. ప్రభుత్వం మొదట చట్టం పాస్ చేసేసి, తర్వాత వాటికి ప్రజల మద్దతు కోరుతామని చెబుతోందని అంటున్నాయి.
బీజేపీ మాత్రం తమ మంత్రులు అభివృద్ధి కార్యక్రమాల కోసం కశ్మీర్‌లో పర్యటిస్తున్నారని, దీనికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెబుతోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ప్రస్తుత సమయంలో ఇలాంటి పర్యటన అవసరం ఏముంది. దీని పరిణామాలు ఎలా ఉండచ్చు. దీని గురించి బీబీసీ ప్రతినిధి మానసీ దాశ్ జమ్ము-కశ్మీర్ అంశంపై భారత ప్రభుత్వం తరఫున సంధానకులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ రాధాకుమార్‌తో మాట్లాడారు.
ఇవి ప్రొఫెసర్ రాధా కుమార్ అభిప్రాయాలు.

ఫొటో సోర్స్, Getty Images
ఏం చేయాలనుకుంటున్నారో తెలీడం లేదు
నాకు తెలిసి ఇది చాలా వింత నిర్ణయం. మొదట ప్రజలను అడక్కుండానే ఆర్టికల్ -370లోని అన్ని నిబంధలను మీరే తొలగించారు. ఇప్పుడు మీరే వారితో మాట్లాడ్డానికి వెళ్తున్నారు.
మీరు నిజానికి ఏం చేశారో దానిని, ఇప్పుడు వారికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటున్నారు. అది కూడా ఐదు నెలల తర్వాత. వారు అడక్కపోయినా.
స్థానిక రాజకీయ నేతలు గృహనిర్బంధంలో లేదా జైళ్లలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా వారి నుంచి మాట తీసుకున్నారు. అంటే, రెండు రకాలుగా నేతల నోళ్లు మూయించేశారు.
ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే, వారంలోపు ప్రజలకు వీలైనన్ని సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించడం మీకు తెలుసు. కానీ, ఇప్పుడు సుప్రీంకోర్టుకు సమాధానంగా వారు ఒక నోటీసు జారీ చేశారు. మేం కొన్ని ఆంక్షలు కొనసాగిస్తామని చెప్పారు.
అలాంటప్పుడు హఠాత్తుగా 36 మంది మంత్రులు కశ్మీర్ వెళ్లడం అంటే వీళ్లు ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
పరిస్థితి అంచనా వేయడానికా
ఇప్పటికీ తాము తమ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంటే, నేను వాళ్లకు ఇప్పటికి కాస్తైనా అర్థమైందని కచ్చితంగా అంటా...
కానీ వాళ్లు అలా చేయడం లేదు. మేం అక్కడ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికి వెళ్తున్నాం అంటున్నారు.
కానీ వాళ్లు దేని గురించి చెప్పడానికి వెళ్తున్నారు అనేదే ప్రశ్న. అంటే, 370లో ఏముందో ప్రజలకు తెలీదని ప్రభుత్వం అనుకుంటోందా.
బహుశా 35-ఎ పరిమిత రూపాన్ని తిరిగి తీసుకురావాలని మొదట మీరే అన్నారు. పర్వత ప్రాంతాల్లో బయటి వారు చాలా తక్కువగా భూములు కొనుగోలు చేయగలిగేలా ఆర్టికల్-371లో మరో నిబంధన తీసుకొచ్చారు.
ఇప్పుడు వారు దాన్ని కూడా నిరాకరిస్తున్నారు. అలా చేస్తే, పెట్టుబడులు రావని చెబుతున్నారు. ఇలాంటి ప్రతిష్టంభన ఎక్కడెక్కడ ఉంటుందో, అలాంటి చోట్ల పెట్టుబడులు రావడం అంత సులభం కాదు, అనే విషయం అందరికీ తెలిసిందే.
అలాంటప్పుడు లాండ్-గ్రాబ్ లాంటి స్థితి ఏర్పడుతుంది. జనం భూములు కొనుగోలు చేస్తూ వెళ్తారు. ఎప్పుడు ధర పెరిగితే అప్పుడు అమ్ముకోడానికి అక్కడే తిష్ఠ వేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ పర్యటనకు విలువ ఉందా?
ఈ పర్యటన బహుశా కెమెరాలు, టీవీ చానళ్ల కోసమే ఉంటుంది. అంతకు మించి ఈ పర్యటనకు ఎలాంటి ప్రత్యేక ప్రయోజనం కనిపించడం లేదు.
పెద్ద పెద్ద చానళ్లు, వీరిని చూపిస్తూ ఆహా ఓహో అంటాయి. అందుకే, ప్రభుత్వం ఈ చర్యను వెనకడుగు వేయడంగా అస్సలు చూడకూడదు.
వారు మొదట హడావుడిగా, ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, బిల్లును టేబుల్‌పై పెట్టకుండా అన్ని విషయాలనూ ఒకటి రెండు గంటల్లోనే పూర్తి చేశారు.
దీనిపై కలకలం రేగకుండా నేతలను మొదటే గృహనిర్బంధం చేశారు. సమాచార మాధ్యమాలన్నింటినీ నిలిపివేశారు.
ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సరవణ బిల్లు తీసుకొచ్చినపుడు, దానిని కూడా వ్యతిరేకిస్తారని వారికి తెలుసు. అయినా ఈ బిల్లు గురించి ఒక రోజు సభలో చర్చ జరిగిన తర్వాత దాన్ని కూడా పాస్ చేసేశారు.
ఇప్పుడు దాని తర్వాత నిరసన ప్రదర్శనలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో, అందరికీ కనిపిస్తున్నాయి. దీనిని వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మాత్రం మేం బిల్లు పాస్ చేసేశాం అని స్పష్టంగా చెబుతోంది.
అలాంటప్పుడు ఇది ప్రభుత్వం తన నిర్ణయం గురించి మరోసారి ఆలోచించేలా ఎక్కడ కనిపిస్తోంది.

ఫొటో సోర్స్, AFP
ప్రభుత్వం ప్రజలను అర్థం చేసుకోవడం లేదు
ఇక ప్రభుత్వం ప్రజలకు తమ అభిప్రాయం అర్థమయ్యేలా చెప్పడమే మిగిలింది. మొదట ప్రతి విషయానికీ సంప్రదింపులు జరిపేవారు. కానీ అది సమయానికి జరగలేదు.
మీరు మాత్రం ప్రజలను ఒక్క మాట కూడా అడగకుండా, ఒక రాష్ట్ర్రాన్ని పూర్తిగా మార్చేయచ్చు. వాటి స్టేటస్ మార్చేయచ్చు. వాటి హక్కులను మార్చేయచ్చు. వారి రాజ్యాంగ సంబంధాలను మార్చేయచ్చు.
ప్రజలతో మాట్లాడాలనే అనుకుంటే, అదే అంశంపై వెళ్లుండాలి. మేం ఏ చర్యలు తీసుకున్నామో, వాటిని మేం వెనక్కు తీసుకోవాలా? అని అడగాలి.
కానీ వీళ్లు అక్కడకు చర్చల కోసం వెళ్లడం లేదు. "మీరు మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు" అని వీళ్లు అక్కడ ప్రజలకు చెప్పడానికి వెళ్తున్నారు.
వాళ్లు ఏం చేశారో, ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అందులో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. కానీ వాళ్లు మాత్రం ప్రజలకు ఈ విషయం అర్థం కాలేదనే అంటూ ఉంటారు.
ఇవి కూడా చదవండి:
- కశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవల రద్దు వంటి ఆంక్షలను ప్రభుత్వం వారంలోగా సమీక్షించాలి :సుప్రీం కోర్టు
- JNUలో దాడి జరిగినప్పుడు వీసీ ఎక్కడున్నారు... ఏం చేస్తున్నారు?: వైస్ చాన్స్‌లర్ జగదీశ్ కుమార్ ఇంటర్వ్యూ
- దేశవ్యాప్తంగా NRC అమలు చేసేందుకు NPR తొలి అడుగా? - FACT CHECK
- ‘మా తల్లిదండ్రులు ఓ రహస్య గే పోర్న్ రాజ్యాన్ని నడిపారు'
- రాకాసి ఆకలి: తిండి దొరక్కపోతే తమని తామే తినేస్తారు
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
- క్రిస్మస్ కార్గో అద్భుతం: 60 మందిని తీసుకెళ్లేలా డిజైన్ చేసిన ఓడలో 14,000 మంది ఎక్కారు
- కాలం ఎప్పుడూ ముందుకే వెళ్తుంది.. వెనక్కి పోదు... ఎందుకు?
- పాకిస్తానీ మెమన్స్: పిసినారి తనం వీళ్ల ఘన వారసత్వం... అన్ని రంగాల్లో వీళ్లదే ఆధిపత్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








