చిన్న వజ్రం కోసం వెతుకుతున్న నిరుపేద కుర్రాళ్లకు రూ. కోట్ల విలువైన డైమండ్ కనిపించింది...ఆ తర్వాత వారికి ఏమైంది?

పీస్ డైమండ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పీస్‌ డైమండ్‌ వేలంలో 6.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది.
    • రచయిత, మేరీ గూడాట్
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

2017లో పశ్చిమ ఆఫ్రికాలోని సియెర్రా లియోన్‌లో ఇద్దరు టీనేజ్ యువకులకు ముడి వజ్రం దొరికింది.

ఆ విషయం ఒక్క ఆఫ్రికా మాత్రమే కాదు.. ప్రపంచ దేశాల్లోనూ ప్రధాన వార్తగా మారింది.

ఆ ముడి వజ్రం వల్ల పేదరికంతో మగ్గుతున్న ఆఫ్రికాలో మార్పులు వస్తాయని, ఆ వజ్రం అమ్మకంతో వచ్చే డబ్బుతో స్థానిక ప్రజల జీవితాలే మారిపోతాయంటూ మీడియా కథనాలు వచ్చాయి.

709 క్యారెట్‌లు ఉన్న ‘శాంతి వజ్రం(పీస్ డైమండ్)’గా పిలిచే ఆ వజ్రాన్ని మొదట గుర్తించిన ఆ ఇద్దరు యువకులూ, ఇక వారి జీవితాలు మారిపోతాయని భావించారు.

ఐదుగురు సభ్యులతో కూడిన బృందంలో కోంబా జాన్‌బుల్, ఆండ్రూ సఫియాలే పిన్న వయస్కులు. వజ్రాన్వేషణలో ఉండగా ఓ రోజున బురదలో మెరుస్తూ కనిపించిన పెద్ద రాయి పై వారి దృష్టి పడింది. అది తమ కలలను నెరవేరుస్తుందని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని వారు భావించారు.

ఇంతకీ వారు ఇప్పుడేం చేస్తున్నారు? వజ్రం దొరికిన ఆరేళ్ల తరువాత వారి జీవితాలు ఎలా ఉన్నాయి?

జాన్‌బుల్
ఫొటో క్యాప్షన్, జాన్‌బుల్‌తో పాటు సఫియా తొలుత పీస్‌డైమండ్‌ను గుర్తించారు.

పొట్టకూటి కోసం..

సఫియా చదువులో ముందుండే విద్యార్థే అయినప్పటికీ, పేదరికం వల్ల పాఠశాల విద్యకు దూరం కావాల్సివచ్చింది.

1991-2002 మధ్య జరిగిన అంతర్యుద్ధం జాన్‌బుల్ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. పేదరికాన్ని అనుభవిస్తున్న సఫియా, జాన్‌బుల్‌లు స్థానిక పాస్టర్ సాయంతో ఏర్పాటైన ఐదుగురు సభ్యుల బృందంలో చేరారు. ఆ బృందం వజ్రాల వేటలో పాల్గొంటుంది. ఆ పని చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా జీతం అంటూ ఇవ్వరు. కానీ, కుటుంబ కనీస అవసరాలు తీరడంతోపాటు, రోజూ తినేందుకు ఆహారం లభిస్తుంది.

ఒకవేళ వారి అన్వేషణలో వజ్రం దొరికితే గనుక, వారిని స్పాన్సర్‌ చేస్తున్న పాస్టర్‌కే అందులో సింహభాగం అందుతుంది.

అలా అని, ఆ వజ్రాల వేట సులభమైనదేంకాదు. రోజూ తెల్లవారు జామున పని పామ్ తోటల్లో పనితో వారి దినచర్య మొదలవుతుంది. టిఫిన్ తిన్నాక, మిగిలిన రోజంతా వజ్రాల వెతుక్కుంటూ పోతారు. ఆ పని రోజూ జరగాల్సిందే.

“నేను మళ్లీ నా చదువును కొనసాగించేందుకు డబ్బును ఆదా చేయాలన్న ఆశ మాత్రం నాలో ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు. నా కల చెదిరిపోయిందని నేను జాన్‌బుల్‌తో చెప్పాను" అని సఫియా గుర్తుచేసుకున్నారు.

మండే ఎండలూ, భారీ వర్షాల్లోనూ వారు ఆ పనిని ఎలా కొనసాగించారో జాన్‌బుల్ గుర్తుచేసుకున్నారు.

"రోజూ మాకు మేమే ధైర్యం చెప్పుకునేవాళ్లం. చేసే పనిలో ప్రేరణ పొందడానికి ప్రయత్నించాం. అంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకునేవాళ్లం.” అని చెప్పారు.

‘‘ ఒకవేళ మంచి వజ్రం దొరికితే, మన జీవితాలు ఎలా మారిపోతాయి? సంపన్నులుగా మారితే ఏం చేద్దాం?’’ అనే విషయాల గురించి కలలు కనేవాళ్లమని జాన్‌బుల్ చెప్పారు.

తనకే గనుక డబ్బు వస్తే, తనకు రెండస్తుల భవంతి, టయోటా ఎఫ్‌జె క్రూయిజర్ కారు కొనాలని జాన్‌బుల్ అనుకుంటే, సఫియా మాత్రం చదువును తిరిగి కొనసాగించాలని ఆశపడ్డారు.

వజ్రాల అన్వేషణ

ఫొటో సోర్స్, Getty Images

వజ్రం దొరికిన క్షణాలవి..

మొత్తంగా వారు ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. ఆ రోజు ఉదయాన్నే ఉడికించిన అరటికాయ ముక్కలను తిని, ప్రార్థన చేసిన అనంతరం, ఐదుగురు సభ్యుల బృందం గని దగ్గరకు వజ్రాన్వేషణ కోసం వెళ్లింది.

ఆ రోజు 13 మార్చి 2017 శుక్రవారం.. జాన్‌బుల్, సఫియాలకు మట్టిని తవ్వే బాధ్యత అప్పగించారు. వర్షాకాలం మొదలవుతున్న తరుణంలో, వరదలను ఎదుర్కొనే సన్నాహాల్లో భాగమది.

ఆ సమయంలో జాన్‌బుల్ దృష్టి నీటి ప్రవాహం అడుగున మెరుస్తున్న రాయిపై పడింది. దానిని నిమిషంపాటు తదేకంగా చూస్తుండిపోయానని జాన్‌బుల్ చెప్పారు.

"నా జీవితంలో ఎన్నడూ నేను వజ్రాన్ని చూసిందే లేదు. నిమిషంపాటు అలాగే చూస్తుండిపోయాను. అదే వజ్రం అయ్యుంటుందా? అని నాకు అనిపించింది. అక్కడున్న మా అంకుల్‌ని పిలిచి, ఆ మెరుస్తున్న రాయి ఏమై ఉంటుందని అడిగాను. ఆ రాయిని బయటకు తీశాను. అది చాలా చల్లగా ఉంది. నేను దానిని చూడగానే, అక్కడున్న వారు నా చేతుల్లో నుంచి దాన్ని లాక్కుని, 'అది వజ్రం' అని చెప్పారు" అంటూ ఆ క్షణాలను గుర్తుచేసుకున్నారు జాన్‌బుల్.

709 క్యారెట్లు ఉన్న ఆ వజ్రం ప్రపంచంలోనే 14వ అతిపెద్ద వజ్రంగా రికార్డుల్లోకెక్కింది.

ఆ బృందం ఆ విషయాన్ని స్పాన్సర్ అయిన పాస్టర్ ఎమ్మాన్యుయెల్‌కు చెప్పారు. ఆయన వజ్రాన్ని బ్లాక్ మార్కెట్‌లో విక్రయించకుండా, ప్రభుత్వం దృష్టికి తీసుకునివెళ్లి, చరిత్రలో దానికంటూ ఓ స్థానం లభించేలా చేశారు.

ఆ తరువాత నిర్వహించిన వేలంలో ఆ వజ్రం 6.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది.

పీస్ డైమండ్ కథ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వజ్రాల కోసం నిత్యం అన్వేషణ జరుగుతూనే ఉంటుంది.

అదృష్టం వరిస్తే ఏం చేశారు?

జాన్‌బుల్, సఫియాల మాదిరిగానే వేలమంది అలాంటి అదృష్టమైన రోజూ తమనూ పలకరిస్తుందన్న ఆశతో వజ్రాలవేటకు వెళ్తుంటారు. ఒక్క చిన్న వజ్రం లభించినా, తమ జీవితాలు మారిపోతాయన్న ఆశే జాన్‌బుల్ లాంటి యువకులను అటువైపు మళ్లేలా చేస్తోంది.

వజ్రాన్ని ప్రభుత్వానికి అప్పగించడంతో, ఒప్పందం ప్రకారం లభించే మొత్తంలో బృందానికి లభించే డబ్బును సభ్యులందరికీ సమానంగా పంచాలని నిర్ణయించారు.

ఒక్కొక్కరికీ తొలివిడతలో 80వేల డాలర్లు అందాయి. అంతడబ్బును చూస్తామని జాన్‌బుల్ గానీ, సఫియా గానీ ఊహించి ఉండరు. కానీ, తమకు లభించిన మొత్తం చిన్నదేనని వారు భావించారు.

"నా వాటా డబ్బు నాకు దక్కినప్పుడు నేను దానిని ముట్టుకోకుండా, వారంపాటు అలానే ఉంచాను. రోజూ దానిని చూసుకుని మురిసిపోయాను. ఆ తరువాత ఇల్లు కొనడానికి ఫ్రీటౌన్‌కు వెళ్లాను" అని జాన్‌బుల్ చెప్పారు.

కెనడాకు వెళ్లి తన చదువును కొనసాగించాలని సఫియా నిర్ణయించుకున్నారు.

జాన్‌బుల్ కూడా అతడితోపాటు వెళ్లేందుకు ఉత్సాహం చూపారు. అందుకోసం ట్రావెల్ ఏంజెట్‌కు, యూనివర్సిటీ ఫీజు, వసతి..ఇలా అన్నింటికి కలిపి 15 వేల డాలర్లు వెచ్చించారు.

ఆ తరువాత వారిని ఘనా దేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆరునెలలపాటు ఉన్న సమయంలో చాలా డబ్బు ఖర్చుచేసినట్లు చెప్పారు వారిద్దరు.

వీసా దరఖాస్తు తిరస్కరణకు గురవడంతో వారి ప్రణాళికలన్ని చెదిరిపోయాయి. జాన్‌బుల్ సియెర్రా లియోన్‌కు తిరిగి వెళ్లిపోయారు. సఫియా కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.

మూడో దేశానికి వెళ్లి, ఉదయం పూట డ్రైవర్‌గా పనిచేస్తూ, సాయంత్రం సమయాల్లో చదువును కొనసాగిస్తున్నారు సఫియా.

“నేను రాత్రివేళల్లో గుర్రాలను సంరక్షించే పని చేస్తుంటాను. అక్కడే తిని, వాటి మధ్యనే నిద్రపోతుంటాను. నాలాగే పనిచేస్తున్న వారికి మాత్రం వసతి కేటాయించారు. నాకు ఆ అవకాశం లభించలేదు" అన్నారు సఫియా.

వజ్రం దొరికిన తర్వాత తాను ఊహించినట్లుగా, జీవితం కొనసాగలేదని సఫియా అన్నారు. ఉండటానికి సరైన వసతి కూడా లేని, దుర్భరపరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

సియెర్రా లియోన్‌లో కొన్న ఇల్లు తప్ప మరేం మిగల్లేదు. ఇంటికి వెళ్లాలని ఉందని సఫియా అన్నారు.

జాన్‌బుల్
ఫొటో క్యాప్షన్, జాన్‌బుల్ ప్రస్తుతం ఫ్రీటౌన్‌లో అల్యూమినియం కిటికీల తయారీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.

గుర్తింపు దక్కలేదు..

జాన్‌బుల్, సఫియాలతోపాటు బృందంలోని మిగిలిన సభ్యులు కూడా తమకు తగినంత గుర్తింపు లభించలేదని అంటున్నారు.

నిజానికి వజ్రం దొరికింది తమకైతే, మీడియా కథనాలు కూడా పాస్టర్‌నే ప్రధానంగా చూపాయని, తమ గురించి మాత్రం అరుదుగా ప్రస్తావించాయనేది వారి అభిప్రాయం.

సఫియా తనను ఆ గుర్తింపుకు దూరం చేశారని భావిస్తుంటే, జాన్‌బుల్ మాత్రం తనకు లభించిన డబ్బును మరో విధంగా వినియోగిస్తే బాగుండేదని చెప్తున్నాడు.

"నా చేతికి డబ్బు అందినప్పుడు నేను చిన్నవాడిని. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేను చేసిన పనికి నాకు బాధగా అనిపిస్తోంది. ఆ సమయంలో అందరికీ చూపించుకోవాలనే వ్యామోహంలో పడి దుస్తులకు, ఇతర వాటికీ డబ్బు ఖర్చు చేసేశాను. ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ, విదేశాలకు వెళ్లాలన్న ఆలోచనే గనుక నాకు రాకపోయుంటే, చాలా డబ్బు ఆదా అయ్యేది. అంతా వృథా చేశాను. దానిని వేరే విధంగా వాడుకునే వాడిని " అన్నారు జాన్‌బుల్.

జీవితం అనుకున్నట్లుగా మారకపోయినా, ప్రస్తుతానికి జాన్‌బుల్ చేస్తున్న పని అతడికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతోంది. ఫ్రీటౌన్‌లో అల్యూమినియం విండోల తయారీ పని చేస్తున్నారు జాన్‌బుల్.

ఒకవేళ తాను అనుకున్నదేదీ జరక్కపోతే, తాను కూడా జాన్‌బుల్‌తో చేరతానని సఫియా చెప్పారు.

"నా చిన్నతనంలో ఉండటానికి సొంత ఇల్లు లేక నా తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. కానీ నా పిల్లలకు ఇప్పుడు ఆ బాధ లేదు" అని సంతోషంగా చెప్పారు జాన్‌బుల్.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)