కెమెరాకు చిక్కిన సగం ఆడ, సగం మగ పక్షి ఇది....

ఫొటో సోర్స్, John Murillo
కొలంబియాలోని మనిజేల్స్ నగరానికి నైరుతి దిశగా పది కిలోమీటర్ల దూరంలో ఉన్న డాన్ మిగ్యుల్స్ నేచర్ రిజర్వ్‌లో పక్షి శాస్త్రవేత్త జాన్ మురిల్లో ఓ అరుదైన పక్షిని గుర్తించారు.
పక్షుల శాస్త్రవేత్తగా ఆయన చాలా పక్షి జాతులను చూశారు. కానీ, ఈ అడవిలో కనిపించిన అకుపచ్చ హనీక్రీపర్(క్లోరోఫేన్స్ స్పిజా) మాత్రం వెరీ వెరీ స్పెషల్.
ఆ పక్షి ఎడమ వైపున ఈకలు ఆకుపచ్చగా ఉన్నాయి. అవి ఆ జాతి పక్షుల్లో ఆడపక్షుల రంగుని సూచిస్తున్నాయి. కుడివైపున మగపక్షుల్లో కనిపించే నీలం రంగు ఈకలు ఉన్నాయి.
మురిల్లో ఆ విషయాన్ని గుర్తించారు. దీన్ని మరో శాస్త్రవేత్త, న్యూజిలాండ్‌లోని ఒటాగో యూనివర్సిటీలో జువాలజీ ప్రొఫెసర్ అయిన హమీష్ స్పెన్సర్‌కు చెప్పారు.
‘‘అది చాలా కొత్తగా ఉంది. చాలామంది పక్షి శాస్త్రవేత్తలు జినాండ్రోమార్ఫ్(ఆడ, మగ రెండు లక్షణాలూ ఉండడం) పక్షులను తమ జీవితంలో చూడలేరు. కొద్దిమందికి మాత్రమే వీలవుతుంది. మురిల్లోకు ఆ అదృష్టం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది'' అని కొలంబియాలో విహారయాత్రలో ఉన్న ప్రొఫెసర్ స్పెన్సర్ బీబీసీతో చెప్పారు.
ఇలాంటి పరిణామం పక్షుల్లో అత్యంత అరుదైన విషయమని ఆయన చెప్పారు. న్యూజీలాండ్‌లో చాలామందికి ఇలాంటివి ఉన్నాయని కూడా తెలియదు.

ఫొటో సోర్స్, John Murillo
అరుదైన పరిణామం
ఒకవైపు మగ లక్షణాలు, మరోవైపు స్త్రీ లక్షణాలు కనిపించే పరిస్థితి ''బైలేటరల్ జినాండ్రోమార్ఫీ’’ అంటారు.
కొలంబియాలో కనిపించిన గ్రీన్ హనీక్రీపర్ (క్లోరోఫేన్స్ స్పిజా)లో జినాండ్రోమార్ఫి గురించి 'జర్నల్ ఆఫ్ ఫీల్డ్ ఆర్నిథాలజీ'లో మురిల్లోతో పాటు ఇతర పక్షి శాస్త్రవేత్తలతో కలిసి స్పెన్సర్ తమ పరిశీలనను రాశారు.
రెండు లైంగిక లక్షణాలు కలిగి ఉండే పరిణామం, అనేక పెద్ద జంతువుల సమూహాల్లో కనిపిస్తుంది. వాటిలో ఈ లక్షణాన్ని సులభంగా గుర్తించొచ్చు
కానీ, పక్షి జాతుల్లో జినాండ్రోమార్ఫి కనిపించడం గత వందేళ్లలో ఇది రెండో ఉదాహరణ మాత్రమే.
పక్షులలో లింగ నిర్ధరణ, లైంగిక ప్రవర్తనపై అవగాహన పెంచుకునేందుకు, జంతువులలో మగ, ఆడ లక్షణాలు ఉండే జినాండ్రోమార్ఫ్స్‌ను అర్థం చేసుకోవడం ముఖ్యమని ఒటాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ స్పెన్సర్ ఒక ప్రకటనలో తెలిపారు.
''చాలా జంతు జాతుల్లో మాదిరిగా ఆడ, మగ రెండు లక్షణాలు కనిపించడం, ఆ పక్షి ఆడ, లేదా మగ అయి ఉండే అవకాశాన్ని సూచిస్తుంది'' అని ఆ ప్రకనటలో పేర్కొన్నారు.
కానీ, ఈ అరుదైన పక్షి ఇలా ఎలా మారింది?
పక్షుల్లో ఆడ, మగగా కనిపించే ఈకలు పక్షి శరీరంలోని హార్మోన్లలో వ్యత్యాసం కంటే, ఈకల సమీపంలోని కణాల క్రోమోజోమ్ మేకప్ కారణంగా ఏర్పడి ఉండొచ్చు.
ఇలాంటి పరిణామాలను కీటకాల్లో గతంలోనే గుర్తించారు. ముఖ్యంగా సీతాకోకచిలుకలు, సాలెపురుగులు, బల్లులు, ఎలుకల్లో కనుగొన్నారు.
''అండం ఉత్పత్తి చేయడానికి స్త్రీలో కణ విభజన సమయంలో లోపం తలెత్తి, రెండు స్మెర్మ్ కణాల ద్వారా రెండుసార్లు ఫలదీకరణం జరగడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది'' అని పరిశోధకులు అంచనా వేశారు.

ఫొటో సోర్స్, John Murillo
21 నెలల పరిశీలన
డాన్ మిగ్యుల్ నేచర్ రిజర్వ్‌లో, సాధారణ అటవీ ప్రాంతంలో భారీ విస్తీర్ణంతో కూడిన పొలాల్లో పక్షుల ఆహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
అక్కడ వాటికి తాజాగా ఉండే పండ్లు, తియ్యని నీళ్లు అందుతాయి. పక్షులను వీక్షించడానికి అదో అద్భుత ప్రదేశంగా మారింది.
''అక్కడ అనేక టానేజర్ జాతి పక్షులు, ఒరియోల్స్, థ్రషెస్, యుఫోనియాస్ తదితర పక్షులు అక్కడ కనిపిస్తాయి'' రచయిత ఆ కథనంలో రాశారు.
వారిని ఆకర్షించిన పక్షి ''కనీసం 21 నెలల పాటు అక్కడ ఉంది. అక్కడ పండ్లు పెట్టినప్పుడు వారు వెళ్లిపోయే వరకూ వేచి ఉన్నప్పటికీ, దాని ప్రవర్తన ఇతర వైల్డ్ గ్రీన్‌హనీక్రీపర్స్‌లానే ఉంది.''
నిర్దిష్ట సమయంలో, ''ఒక పక్షి తన పరిధిలోనే తిరుగుతూ ఉంటుంది. అదే జాతికి చెందిన ఇతర పక్షులను ఆహారం వద్దకు వెళ్లనివ్వకపోయినప్పటికీ అది అక్కడే ఉంది'' అని వారు గుర్తించారు. కానీ, అలా ఎందుకు జరుగుతుందో కచ్చితంగా చెప్పలేకపోయారు.
''సాధారణంగా, ఇలాంటి పక్షులు ఇతర పక్షులను దూరంగా ఉంచుతాయి. అవి కూడా వీటితో దూరంగా ఉంటాయి. కానీ, ఇది కాస్త భిన్నంగా కనిపిస్తోంది. దీనికి పునరుత్పత్తి చేసే అవకాశం ఉందన్న సూచనలు కనిపించడం లేదు.'' అని స్పెన్సర్ పేర్కొన్నారు.
ఇలాంటి వాటికి వారసులు లేకపోయినప్పటికీ, ఈ పక్షి ఇప్పటికే జంతు ప్రపంచంపై ప్రత్యేకమైన ముద్ర వేసింది.
ఇవి కూడా చదవండి:
- నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవి: మానవజాతి అంతమైపోయాక భూమి ఇలా మారిపోతుందా?
- నీళ్ల కోసం వెళ్తే మొసళ్ల దాడులు.. వీటిని ఇండోనేషియా ఎందుకు ఆపలేకపోతోంది?
- 'వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ అవార్డు' గెలుచుకున్న చిత్రాలను మీరు చూశారా?
- ఈ జంతువులు చేసే కామెడీ చూస్తే నవ్వు ఆపుకోలేరు
- మిగ్జాం: ప్రపంచంలో అత్యంత తీవ్రమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














