ముల్లంగి సంబరం.. ఈ ఆకుకూరతో పండుగ చేసుకుంటారు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గోర్డాన్ కోలె-ష్మిత్
- హోదా, బీబీసీ ట్రావెల్
ముల్లంగితో మీరేతై ఏం చేస్తారు? వంటల్లో వినియోగించడమో లేదంటే, పచ్చి ముల్లంగిని తినడమో చేస్తారు.
కానీ ముల్లంగితో ఓ వేడుకే జరుగుతుందని, అందుకోసం ప్రజలు మేలైన, విలువైన ముల్లంగి కోసం వెతుకుతారని మీకు తెలుసా?
ఏటా మెక్సికోలోని ఓక్సాకాలో ‘లా నోచే డి రాబానోస్’ (ది నైట్ ఆఫ్ ది రాడిష్) పేరిట జరిగే వేడుకకు ఎంతో ప్రత్యేకత ఉంది.
ఇక్కడి ముల్లంగి ఎరుపు రంగులో పండుతుంది. మెక్సికోలో ఎక్కువ శాతం రెస్టారెంట్లలో ముల్లంగితో చేసిన వంటకాలు మెనూల్లో కనిపిస్తాయి.
కానీ, ఈ వేడుక కోసం దిగుబడి చేసే ముల్లంగి మొదలుకొని అంతా ప్రత్యేకమే.

ఫొటో సోర్స్, Getty Images
ఏంటి ఈ వేడుక?
ది నైట్ ఆఫ్ రాడిష్ వేడుకలో ఔత్సాహిక కళాకారులు ఎంతోమంది పాల్గొంటారు. ఏటా డిసెంబర్ 23న ఈ వేడుక నిర్వహిస్తారు.
ఇందుకోసం అప్పుడే నేలలో నుంచి తీసిన తాజా ముల్లంగిని శుభ్రంగా కడిగి, సిద్ధం చేస్తారు రైతులు.
కళాకారులు నిర్ణీత సమయంలో ముల్లంగిని విభిన్న ఆకృతుల్లో చెక్కుతారు. అలా తీర్చి దిద్దిన వాటిలో అత్యంత ఆకర్షణీయంగా, అందరినీ ముగ్ధుల్ని చేసేలా ఉంటే ఆ ముల్లంగి కళాత్మక రూపానికి బహుమతి లభిస్తుంది.
అంతేకాదు, మరుసటి ఏడాది వేడుక సమయం వచ్చేవరకు ప్రజలు దాని గురించే మాట్లాడుకుంటారు.
"కళాకారులు ఈ ముల్లంగిలను భిన్నమైన ఆకృతుల్లో కట్ చేస్తారు. అలా చేయడం సాధ్యమేనా? అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకునేలా ఉంటాయవి అని స్థానిక ముల్లంగి రైతు సెర్గియో నవ్వుతూ చెప్పారు.
ఆయన మాట్లాడుతూ "అన్ని భిన్నమైన పరిమాణాల్లో వందల కొద్దీ ఉంటాయి... వేడుకకు అవసరమయ్యే డిమాండ్‌ను కొనసాగించడానికి ఈ సంవత్సరం గతంలో కంటే ఎక్కువ” అని చెప్పారు
మరో రైతు మార్టినెజ్ మాట్లాడుతూ "మేం పండించిన ముల్లంగిల్లో కచ్చితంగా ఒకటి మాత్రం, చాలా డబ్బు సంపాదించే కళాత్మక రూపంగా మారనుంది" అన్నారు.
ఓక్సాకాలో ఈ వేడుకే కాదు, త్రీ కింగ్స్ డే అన్న వేడుక కూడా జరుగుతుంది. అలాంటి పండుగలు చాలానే ఉన్నా, ‘లా నోచే డి రాబానోస్’ అందరికీ ప్రత్యేకం.

ఫొటో సోర్స్, Getty Images
ఎలా మొదలైంది?
ఈ వేడుక 19వ శతాబ్దపు చివరి నాటిదని చెప్పారు ఓక్సాకా మార్కెట్‌లోని స్థానిక విక్రేత ఒకరు.
మెక్సికోని ఓక్సాక పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగులో ముల్లంగికి అధిక ప్రాధాన్యత ఉంది. ఏటా డిసెంబర్ నెల క్రిస్మస్ పర్వదినాల సమయంలో ఓక్సాకా స్థానిక మార్కెట్‌లో ఎటు చూసినా ముల్లంగి కనిపించేది.
కొనుగోలు దారులను ఆకర్షించేందుకు ముల్లంగి రైతులు రకరకాల ప్రయత్నాలు చేసేవారు. అందులో భాగంగానే, సృజనాత్మకంగా తమ ముల్లంగిలను కళాత్మకంగా చెక్కి, ఓక్సాకలోని ప్రధాన ప్రాంతమైన జొకాలోలో ప్రదర్శనలకు పెట్టి, కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించేవారు.
అలా రైతులు కాస్తా, పోటీదారులుగా మారారు. తమ ఉత్పత్తిని గొప్పగా చూపడం కోసం, మేలైన, పరిమాణంలో పెద్దగా ఉన్న ముల్లంగిలతో రకరకాల ఆకృతులను ప్రదర్శించారు.
అలా ఓ మార్కెటింగ్ టెక్నిక్ మొదలైంది. క్రమంగా అదే పద్ధతి ఆదరణ పొంది, ఏకంగా వేడుకే నిర్వహించేలా మారింది. 1897 నాటికి ఓక్సాకోలోని స్థానికులు ముల్లంగిని కళాత్మకంగా చెక్కే పోటీలు నిర్వహించుకునేలా, అధికారికంగా అక్కడి మున్సిపాలిటీ అధ్యక్షులు ప్రకటన విడుదల చేశారు.
క్రిస్మస్ సంప్రదాయంగా ఏటా డిసెంబర్ 23వ తేదీన ఈ వేడుకలు జరుగుతాయి. ప్రజలంతా ఎంతో ఆసక్తిని కనబరుస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతా సందడిగానే జరుగుతుంది..
ఏటా 23 డిసెంబర్‌న సూర్యోదయం అవగానే ఓక్సాకా ప్రధాన ప్లాజా ప్రదర్శన స్థలంగా మారుతుంది. రైతులు టన్నుల కొద్దీ తెచ్చిన ముల్లంగిని అక్కడికి చేర్చుతారు.
పోటీదారులకు వారి వారి స్థలాలను కేటాయించి, ముల్లంగిలను అందజేస్తారు. వాటిని చూసుకుని అప్పటికే వారు తీర్చిదిద్దాలనుకున్న ఆకృతులకు అనుగుణంగా ముల్లంగిలను ఎంచుకుంటారు పోటీదారులు.
ఏర్పాట్లలో ఎలాంటి పొరపాటు జరగకుండా చూస్తారు నిర్వాహకులు. నిర్ణీత సమయంలోగా తమ కళాకృతులను పోటీదారులు సిద్ధం చేయాల్సి ఉంటుంది.
అనుభవజ్ఞులు, కళాకారులతో కూడిన న్యాయనిర్ణేత ప్యానెల్, అన్నిటిని, అన్నివిధాలుగా పరిశీలించి, ఏడాది పొడవునా గొప్పగా చెప్పుకునేలా తీర్చిదిద్దిన కళాత్మక ముల్లంగికి, దానిని తీర్చిద్దిన కళాకారుడికి రూ.5.9 లక్షలు, (120,000 మెక్సికన్ పెసోలు) నగదు బహుమతిని అందజేస్తుంది.
ఓక్సాకా స్టేట్ టూరిజం హెడ్, సయిమి వెలాస్కో మాట్లాడుతూ "ఈ వేడుకలో కళాకారులు సృష్టించిన కళాత్మక రూపాలు ఓక్సాకన్ ప్రజల ప్రపంచ దృష్టికోణాన్ని సూచిస్తాయి. అది మనందరినీ ఎంతో ఆకర్షిస్తాయి. ఈ వేడుక మాకెంతో ప్రియమైన సంప్రదాయాలలో ఒకటి" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విజేతలు ఏమంటున్నారు?
2015 నుంచి ప్రతి సంవత్సరం పోటీలో పాల్గొంటున్న
యువ కళాకారుడు ఆంటోనియో అక్వినో 2015 నుంచి ప్రతి ఏటా వేడుకలో పాల్గొంటున్నారు. గతేడాది మొదటి మూడు స్థానాల్లో అతడి కళాత్మక రూపం ఎంపిక అవకపోవడంతో నిరాశ చెందిన అక్వినో, ఈసారి మాత్రం పోటీ కోసం ముందునుంచే డిజైన్లను రూపొందిస్తున్నారు.
ఆంటోనియో మాట్లాడుతూ "మనకు ఇచ్చిన తక్కువ సమయంలోనే, మన ఆలోచనకు తగినట్లుగా మనకు వచ్చిన ముల్లంగిని చెక్కడం ముఖ్యం. తక్కువ సమయంలో కళాత్మకంగా చెక్కాలి" అని చెప్పారు
పోటీ గురించి ఆంటోనియోకు అనుభవం ఉంది. అయితే, "అనుభవం కన్నా సమయస్ఫూర్తి ముఖ్యం" అన్నారు ఆంటోనియో.
మరో కళాకారుడు సెరాఫిన్ మునోజ్ దాదాపు ప్రతి సంవత్సరమూ పోటీల్లో పాల్గొన్నారు. ఆయన 55 ఏళ్లుగా పోటీల్లో పాల్గొంటున్నారని స్థానికులు చెప్పారు. ఆయన్ను "పట్టువదలని విక్రమార్కుడు" అని పిలుస్తారు.
గతేడాది బహుమతి పొందిన కార్లా వాస్కెజ్ కూడా ఈ ఏడాది పోటీల్లో పాల్గొంటున్నారు. ఆమె మాట్లాడుతూ, “ఈసారి ఏం జరుగుతుందో అని కాస్త ఆందోళనగానూ ఉంది. మంచి డిజైన్‌ను ఎంచుకుంటాననే నమ్మకం ఉంది” అన్నారు.
డిసెంబర్ 23న జరిగే ఈ వేడుక అంతా సంబరంగా జరుగుతుంది. ఆ రాత్రి మొత్తం ప్రదర్శనలు అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రదర్శన అనంతరం వాటిని తమ ఇళ్ల ముందు పెట్టి, మురిసిపోతారు కళాకారులు.
తరువాతి 24 గంటల్లో, అవి కంపోస్ట్ ఎరువుగా మారతాయి.
విజేత గురించి, అతడి కళాత్మక ఆకృతి గురించి మాత్రం చర్చ ఏడాది పొడవునా జరుగుతుంది. బహుమతులు దక్కని వారు మాత్రం మరుసటి ఏడాది తాము ముల్లంగిపై చెక్కబోయే ఆకృతి గురించి ఆలోచనలు చేస్తుంటారు.
ఇవి కూడా చదవండి..
- సైన్యం కస్టడీలో ముగ్గురు పౌరుల మృతి తర్వాత కశ్మీర్లో ఏం జరుగుతోంది?
- ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టు తీర్పును ఈ న్యాయ కోవిదులు ఎందుకు తప్పుబడుతున్నారు?
- ‘సన్‌బర్న్’ ఫెస్టివల్లో ఏం చేస్తారు? దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణమేంటి?
- చెన్నై: మగవాళ్లతో మాట్లాడుతోందని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ట్రాన్స్‌సెక్సువల్ బాయ్‌ఫ్రెండ్, అసలేం జరిగింది?
- 'నా ఆరోగ్యం ఏమవుతుందో' అని ఆందోళన చెందేవారే త్వరగా చనిపోతున్నారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














