హైదరాబాద్ మెట్రో రైల్: ఎయిర్‌పోర్ట్ రూట్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు పక్కనబెట్టింది...

హైదరాబాద్ మెట్రో రైల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశ హైదరాబాద్ మెట్రో రైల్ రూట్లను(కారిడార్లను) మార్చేసింది. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్ఎంఆర్ఎల్) నూతన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రతిపాదనను తాత్కాలికంగా పక్కన పెడుతూ.. రెండు కొత్త రూట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

ఇంతకీ బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిపాదనలను కాంగ్రెస్ ఎందుకు పక్కన పెట్టింది..? ఆ రూటులో మెట్రో రైల్ నిర్మించేందుకు ప్రభుత్వానికి ఉన్న అభ్యంతరాలేంటి? ప్రస్తుతం ఆమోదించిన రూట్లలో మెట్రో రైల్ ప్రయాణం ఎంతవరకు సాధ్యపడుతుందనే విషయాలపై చర్చ జరుగుతోంది.

దీనిపై మెట్రో రైల్ అధికారులు, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ నిపుణులతోనూ బీబీసీ మాట్లాడింది.

రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, TelanganaCMO

సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారు.?

బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్నప్పుడు 2022 డిసెంబరులో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మెట్రో రైల్ కారిడార్ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టింది తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం.

ఇది తాత్కాలికంగానే అని మెట్రో రైల్ అ‌ధికారులు చెబుతున్నారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పట్టాలెక్కిస్తుందా అనే సందేహం అయితే వ్యక్తమవుతోంది.

‘‘గత ప్రభుత్వం రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నిర్మించాలనుకున్న 31 కిలోమీటర్ల ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ మెట్రో రైల్ ప్లాన్‌ను ప్రస్తుతానికి నిలిపివేయనున్నాం. ఈ మార్గంలో ప్రయాణానికి ఇబ్బందులు లేకుండా వెడల్పైన ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ రూట్లలో ఎయిర్ పోర్టుకు మెట్రో లైన్ వేయాలి’’ అని మెట్రో రైల్ అధికారులకు చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

ఈ విషయంపై హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి బీబీసీతో మాట్లాడారు.

‘‘రాయదుర్గం నుంచి విమానాశ్రయం రూటును పెండింగులో పెట్టమని ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతానికి ఆ రూటును చేపట్టడం లేదు. దానికి తగ్గట్టుగా కొత్త రూట్లపై అధ్యయనం జరుగుతోంది. అంచనా వ్యయంపరంగా ఎంత వ్యత్యాసం వస్తుందనే విషయంపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించాల్సి ఉంది’’ అని చెప్పారు.

కేసీఆర్, కేటీఆర్

ఫొటో సోర్స్, KTRBRS/twitter

కేసీఆర్ ప్రభుత్వం ఆమోదించిన రూటెటు?

ఇప్పటికే రాయదుర్గం వరకు ఉన్న కారిడార్-3ని ఎయిర్ పోర్టు వరకూ పొడిగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్ పోర్టు రూటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని 2018 జనవరిలోనే నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ తర్వాత ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేయలేదు.

చివరికి 2022 డిసెంబరు 9న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.6,250 కోట్ల అంచనా వ్యయంతో రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టు వరకు మెట్రో కారిడార్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మార్గం మొత్తం పొడవు 31 కిలోమీటర్లు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ తరహాలో ఉంటుంది. కిలోమీటరు భూమిపైన, మరో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో మెట్రో రైల్ ప్రయాణిస్తుంది.

మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువుగా నిర్దేశించుకుంది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ని‌‍ధులతో నిర్మించాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రాజెక్టు చేపట్టిన తర్వాత ఆ మార్గంలో ఉన్న భూముల ధరలు అమాంతం పెరిగాయి. మెట్రో రైల్ వస్తోందనే ప్రచారంతో మూడు, నాలుగింతలు పెంచేశారు.

ప్రస్తుతం మెట్రో రైల్ రూటు మారడంతో మరోసారి భూముల ధరలపై ప్రభావం కనిపిస్తుందని గండిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒకరు బీబీసీకి చెప్పారు.

మెట్రో రైల్ రూటు మార్పులతో రవాణాపరంగా ఏర్పడే ఇబ్బందులు, ఖర్చుపై ఇప్పటికిప్పుడు ఎలాంటి ప్రభావం ఉండబోదని చెప్పారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభరెడ్డి.

‘‘రాయదుర్గం నుంచి చేపట్టే రూటులో ఇంకా పనులు మొదలు కాలేదు. కేవలం శంకుస్థాపన మాత్రమే జరిగింది. ఇప్పుడు ఆ రూటును మార్చినా ప్రభావం పెద్దగా ఉంటుందని అనుకోవడం లేదు. ప్రభుత్వం కొత్త రూటుపై అధ్యయనం చేసి పట్టాలెక్కించాలి’’ అన్నారు పద్మనాభ రెడ్డి.

హైదరాబాద్ మెట్రో

సీఎం రేవంత్ రెడ్డి ఆమోదించిన ప్రతిపాదనలేమిటి..?

హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మూడు కారిడార్లలో హైదరాబాద్ మైట్రో రైల్ రాకపోకలు సాగిస్తోంది. 69 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ విస్తరించి ఉంది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్, నాగోలు నుంచి రాయదుర్గ్ మార్గాల్లో మెట్రో రైళ్లు తిరుగుతున్నాయి.

ప్రస్తుతం ఈ మూడు మార్గాలను విస్తరించడంతోపాటు మరికొన్ని మార్గాలను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రతిపాదించింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం లభించింది.

కొత్త ప్రతిపాదనల్లో భాగంగా 76 కిలోమీటర్ల మార్గాన్ని అధికారులు రెండో దశ కింద సిద్ధం చేశారు. ఇందులో మియాపూర్ వరకు ఉన్న మార్గాన్ని బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్‌చెరు వరకు...అంటే 14 కిలోమీటర్లు విస్తరించాలనేది ప్రతిపాదన. ఎల్బీనగర్ వరకు ఉన్న మార్గాన్ని మరో 8 కిలోమీటర్లు.. హయత్ నగర్ వరకు విస్తరించాలనే ప్రతిపాదన సిద్ధమైంది.

హైదరాబాద్ మెట్రో రైల్

ఫొటో సోర్స్, TWITTER/HYDERABAD METRO RAIL

రెండు రూట్లలో విమానాశ్రయానికి..

రెండు మార్గాల్లో ఎయిర్ పోర్టు‌కు చేరుకునేలా ప్రతిపాదనలను హెచ్ఎంఆర్ఎల్ సిద్ధం చేసింది. ఇప్పటికే ఎంజీబీఎస్ వరకు ఉన్న మార్గాన్ని ఎయిర్‌పోర్టు వరకు విస్తరించాలనే ప్రణాళికకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

వాస్తవానికి గతంలో జేబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు కారిడార్ నిర్మించాల్సి ఉంది. పాతబస్తీలో ఆస్తుల సేకరణ విషయంలో పురోగతి లేకపోవడంతో ఎంజీబీఎస్ వరకే కారిడార్‌ను ప్రభుత్వం పరిమితం చేసింది.

ప్రస్తుత కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఫలక్‌నుమా వరకు కారిడార్‌‌ను పొడిగించాలని నిర్ణయించింది. ఇదే మార్గాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ పొడిగించాలని నిర్ణయించింది. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి, పీ7 రోడ్డు మీదుగా ఎయిర్ పోర్టు వరకు మైట్రో రైల్ లైనుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇది 23 కిలోమీటర్లు ఉంటుంది.

అవసరమైతే తానే స్వయంగా పాతబస్తీ ప్రజాప్రతినిధులతో మాట్లాడి మెట్రో రైల్ నిర్మాణానికి అవసరమైన ఆస్తుల సేకరణకు సహకరించాలని కోరాతానని అధికారులతో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

‘‘మెట్రో రైలు నిర్మాణ ప్రణాళికలో భాగంగా పాతనగరంలో వారసత్వ, మతపరమైన నిర్మాణాలు 103 ఉన్నాయని తేలింది. వీటికి నష్టం జరగకుండా చూడాలని సీఎం ఆకాంక్షించారు. ఈ ప్రక్రియలో అవసరమైతే తానే స్వయంగా కలుగజేసుకుంటానని, ఓల్డ్ సిటీ ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకుంటామని అన్నారు’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఇది కాకుండా మరో మార్గంలో నగరం నుంచి విమానా‌‍శ్రయానికి చేరుకునేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాగోలు నుంచి ఎల్బీనగర్, ఒవైసీ ఆసుపత్రి, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవ్ పల్లి, ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లోని కొత్త హైకోర్టు ప్రాంతం వరకు మరో లైనుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని పొడవు 19 కిలోమీటర్లు.

ఈ మార్గం కూడా ఎయిర్ పోర్టుకు వెళ్లే కారిడార్‌కు అనుసంధానం కానుంది. దీనివల్ల నగరం నుంచి రెండు మార్గాల్లో విమానాశ్రయం చేరుకునే వీలుంటుంది.

ఎన్వీఎస్ రెడ్డి

ఫొటో సోర్స్, HMRL

ప్రస్తుతం ఆమోదం పొందిన విమానాశ్రయ రూటుపై అధ్యయనం చేయాల్సి ఉందని బీబీసీతో చెప్పారు మైట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.

‘‘కొత్త రూటుపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందిస్తాం. అప్పుడు రాయదుర్గం రూటుతో పోల్చితే ఎంత వ్యత్యాసం వస్తుందనేది తేలుతుంది. డీపీఆర్ తయారీకి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది’’ అని చెప్పారు.

ఇదే విషయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని రీజనల్ సెంటర్ ఫర్ అర్బన్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ డైరెక్టర్ ప్రొ. ఎం.కుమార్ బీబీసీతో మాట్లాడారు.

‘‘విమానాశ్రయానికి ఎక్కువగా ఎటువైపు నుంచి ప్రయాణికులు వె‌‍ళుతున్నారనే అంశాలపై అధ్యయనం చేయాలి. నిపుణుల నుంచి సలహాలు తీసుకోవాలి. రాయదుర్గం నుంచి వెళ్లే రూటులో ఎక్కువ స్టేషన్లు రాకపోవచ్చు. అదే పాతబస్తీ, ఎల్బీనగర్ నుంచి వెళ్లే రూటులో ఎక్కువ స్టేషన్లు రావొచ్చు. ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది.

చాంద్రాయణగుట్టను జంక్షన్ చేసుకుని రెండు రూట్లకు అనుసంధానం చేస్తే బాగుంటుంది. ఖర్చు కూడా తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఎక్కువ మంది ప్రయాణించే అవకాశం ఉంది. దీనికితోడు కొత్త కారిడార్లపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి’’ అని చెప్పారు.

ప్రొఫెసర్ కుమార్

ఫొటో సోర్స్, UGC

మూసీ నది వెంట కొత్త కారిడార్లు

మూసీనదికి ఇరువైపులా 40 కిలోమీటర్ల పొడవునా.. ఈస్ట్, వెస్ట్ కారిడార్లను నిర్మించేందుకు కూడా ఆమోదం తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.

ఇప్పటికే మూసీ నదికి సమాంతరంగా ఎక్స్‌ప్రెస్ వేలను నిర్మించాలని గత ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇప్పటికే నాగోలు వద్ద కొంత మేర పనులు జరుగుతున్నాయి.

తాజాగా మెట్రో రైల్ కనెక్టివిటీ కూడా ప్రతిపాదించిన నేపథ్యంలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరగాల్సి ‌ఉందని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుత ఉన్న మెట్రో రైల్ మార్గాలు ఏ మాత్రం సరిపోవని ప్రొఫెసర్ ఎం.కుమార్ అభిప్రాయపడ్డారు. రహదారుల విస్తరణ, ట్రాఫిక్ వంటి సమస్యలు తగ్గేందుకు మెట్రో రైల్ ఒక చక్కని సాధనం అవుతుందని వివరించారు.

‘‘హైదరాబాద్ నగరంలో రహదారుల విస్తరణ కొన్ని కారణాలతో ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు. దీనికి మెట్రో రైల్ ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు.

పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా 300-400 కిలోమీటర్ల మెట్రో రైల్ నిర్మిస్తే ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా 2050 సంవత్సరానికి పెరిగే ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ రూపొందించాలి.

మొత్తం ఎన్ని ఫేజ్ లు ఉండాలి… వాటిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే విషయంపై స్పష్టత ఉండాలి. దూర ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో వచ్చే ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేలా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించేలా ఉండాలి’’ అని బీబీసీతో చెప్పారు ప్రొ.కుమార్.

హైదరాబాద్ మెట్రో

ఫొటో సోర్స్, LTMetrorail

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రతిపాదనలు ఇలా..

నగరంలో రూ.69,100 కోట్ల అంచనాలతో నూతన మెట్రో రైల్ రూట్లకు అనుమతించినట్లు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ గతేడాది ఆగస్టులో ప్రకటించింది. అప్పట్లో ప్రాథమిక నివేదికతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) రూపొందించాలని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దానికి అనుగుణంగా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు నివేదికలు సిద్ధం చేయాలని భావించగా.. ఈలోపు ఎన్నికలు రావడంతో ప్రతిపాదనలు ముందుకు సాగలేదు.

హైదరాబాద్ మెట్రో రైల్ గతంలో చేసిన ప్రతిపాదనల ప్రకారం.. ఇప్పటికే పూర్తయిన ఫేజ్ -1 తోపాటు మరో రెండు ఫేజ్‌లలో మెట్రో రైల్‌ను విస్తరించాలనేది ప్రణాళిక.

ఇందులో గత ప్రభుత్వం ప్రతిపాదించిన రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ రూటు ప్రతిపాదన రెండో ఫేజ్‌లో ఉంది. అప్పట్లో ఫేజ్-2లో భాగంగా 67.5 కిలోమీటర్లు విస్తరించాలని నిర్ణయించారు.

రెండో ఫేజ్‌లో ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.

రాయదుర్గం – శంషాబాద్ విమానాశ్రయం(31 కిలోమీటర్లు, 9 స్టేషన్లు)

బీహెచ్ఈఎల్ – లక్డీకాపూల్ (26 కిలోమీటర్లు, 24 స్టేషన్లు)

నాగోలు – ఎల్బీనగర్ (5 కిలోమీటర్లు, 4 స్టేషన్లు)

ఎంజీబీఎస్ – ఫలక్ నుమా(5.5 కిలోమీటర్లు, 5 స్టేషన్లు)

హైదరాబాద్ మెట్రో రైల్

ఫొటో సోర్స్, Getty Images

మూడో దశలో..

ఇక మూడో దశలో అభివృద్ధి చేయాల్సిన మార్గాలను రెండు భాగాలుగా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రతిపాదించింది.

పార్ట్ – ఏ కింద 142 కిలోమీటర్ల రైల్ మార్గం నిర్మించాలని పేర్కొంది. వీటిల్లో రెండు డబుల్ ఎలివేటెడ్ ఫ్లైఓవర్లు సైతం ఉన్నాయి.

మూడో ఫేజ్‌-ఏ ప్రతిపాదనలు ఈ కింద విధంగా ఉన్నాయి.

బీహెచ్ఈఎల్ -పటాన్ చెరు-ఓఆర్ఆర్-ఇస్నాపూర్.. 13కిలోమీటర్లు

ఎల్బీనగర్ నుంచి పెద్దఅంబర్ పేట.. 13 కిలోమీటర్లు

శంషాబాద్ జాతీయ రహదారి -కొత్తూరు-షాద్ నగర్… 28 కిలోమీటర్లు

ఉప్పల్ – ఘట్ కేసర్ – ఓఆర్ఆర్ – బీబీనగర్ – 25 కిలోమీటర్లు

శంషాబాద్ ఎయిర్ పోర్టు – తుక్కుగూడ – మహేశ్వరం క్రాస్ రోడ్- కందుకూరు 26 కిలోమీటర్లు

తార్నాక – ఈసీఐఎల్.. 8 కిలోమీటర్లు

జేబీఎస్ – తూంకుంట(డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్)..17 కిలోమీటర్లు

ప్యారడైజ్ -కండ్లకోయ(డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్).. 12 కిలోమీటర్లు

ఇవి కాకుండా ఫేజ్ – ౩లో పార్ట్ – బి కింద ఔటర్ రింగు రోడ్డు చుట్టూ 136 కిలోమీటర్ల పొడవునా మెట్రో రైల్ నిర్మించాలని హెచ్ఎంఆర్ఎల్ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదు.

గతంలో ఔటర్ రింగు రోడ్డు నిర్మాణ సమయంలో రైల్ మార్గం కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సేకరించారు. దీనివల్ల ప్రత్యేకంగా రైలు మార్గం కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులు.

ఇవన్నీ పూర్తయితే హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) పరిధిలో మూడు దశల్లో కలిపి 415 కిలోమీటర్ల మెట్రో మార్గం, 186 స్టేషన్లు అందుబాటులోకి వస్తాయని మెట్రో రైల్ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)