ఎంఫిల్ కోర్సు రద్దు: యూజీసీ ఆదేశంతో విద్యార్థులకు లాభమా, నష్టమా?

విద్యార్థులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, విద్యార్థుల ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఎంఫిల్(మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ) రద్దయిందని, ఎంఫిల్ డిగ్రీకి ఇకపై గుర్తింపు ఉండబోదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తెలిపింది.

రానున్న (2024-25) విద్యా సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు ఇకపై ఎంఫిల్ అడ్మిషన్లు చేయరాదని యూజీసీ కార్యదర్శి మనీష్ జోషి డిసెంబరు 26న పబ్లిక్ నోటీసు విడుదల చేశారు.

‘‘కొన్ని యూనివర్సిటీలు వచ్చే విద్యా సంవత్సరానికి ఎంఫిల్ అడ్మిషన్లు తీసుకుంటున్నట్లు యూజీసీ దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో మీకో విషయం తెలిపరుస్తున్నాం. ఎంఫిల్ డిగ్రీకి గుర్తింపు లేదు. 2022లో యూజీసీ తీసుకువచ్చిన నిబంధనలలో దేశంలోని ఉన్నత విద్యా సంస్థలు ఎంఫిల్ ప్రోగ్రామ్స్ నడపకూడదని స్పష్టంగా ఉంది.

వచ్చే విద్యా సంవత్సరంలో యూనివర్సిటీలు ఎంఫిల్ అడ్మిషన్లు తీసుకోవద్దని కోరుతున్నాం. అలాగే, విద్యార్థులు కూడా ఎంఫిల్ ప్రోగ్రామ్స్ లో చేరవద్దు’’ అని మనీష్ జోషి అందులో వివరించారు.

ఎంఫిల్ ప్రోగ్రామ్స్ అందించడానికి వీల్లేదని యూజీసీ ఆదేశించిన నేపథ్యంలో, ఇకపై ఆర్ట్స్, హ్యుమానిటీస్ చదివే విద్యార్థులకు ఈ కోర్సు చేసే అవకాశం ఉండదు. వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) తర్వాత నేరుగా పీహెచ్డీ చేయాల్సి ఉంటుంది.

యూజీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ ప్రవేశాలు రద్దు చేస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.భట్టు రమేశ్ బీబీసీతో చెప్పారు.

‘‘తెలుగు యూనివర్సిటీ తరఫున ఎంఫిల్ ప్రవేశాలు కల్పించేవాళ్లం. కానీ, యూజీసీ ఆదేశాలతో వాటిని రద్దు చేస్తున్నాం’’ అని ఆయన చెప్పారు.

ఎంఫిల్

ఫొటో సోర్స్, screengrab

ఫొటో క్యాప్షన్, కేంద్ర ప్రభుత్వ గజిట్‌కు అనుగుణంగా ఎంఫిల్ కోర్సులు రద్దు చేయాలని వర్సిటీలకు యూజీసీ అప్పట్లోనే సూచించింది.

పీహెచ్‌డీ పట్టా: 2022 నాటి యూజీసీ నిబంధనల్లో ఏముంది?

దేశంలో ఉన్నత విద్యా సంస్థలలో చదివే విద్యార్థులకు పీహెచ్‌డీ పట్టా ఇచ్చేందుకు అనుసరించాల్సిన నిబంధనలను యూజీసీ 2022లో తీసుకువచ్చింది.

మినిమం స్టాండర్డ్స్ అండ్ ప్రొసీజర్స్ ఫర్ అవార్డ్ ఆఫ్ పీహెచ్‌డీ డిగ్రీ రెగ్యులేషన్ పేరిట వీటిని ప్రవేశపెట్టింది.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2022 నవంబరు 7న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇందులో రెగ్యులేషన్ నం.14 ప్రకారం, ఎంఫిల్ కోర్సులు నడిపేందుకు యూనివర్సిటీలకు వీలుండదు.

ఈ గెజిట్ ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఎంఫిల్ కోర్సులు రద్దు చేసుకోవాలని అప్పట్లోనే యూజీసీ సూచించింది.

ఆ తర్వాత కూడా కొన్ని యూనివర్సిటీలు వీటిని అందిస్తుండడంతో తాజా ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చినట్లు యూజీసీ చెబుతోంది.

ఎంఫిల్

ఫొటో సోర్స్, Getty Images

విద్యార్థులకు ఎంఫిల్ అవసరం ఉందా?

2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. దీని అమలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడి ఉంది.

జాతీయ విద్యా విధానంలో ఎంఫిల్ రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఉన్నత విద్యలో డ్రాపౌట్స్ తగ్గించాలనేది ఈ విధానం ప్రధాన లక్ష్యాల్లో ఒకటి.

2018లో 26.3 శాతంగా ఉన్న గ్రాస్ ఎన్‌రోల్మెంట్‌ను 2035 నాటికి 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

యూజీసీ నిబంధనల ప్రకారం, మొదట్లో ఎంఫిల్ ఏడాది కోర్సు. రానురానూ ఇది రెండేళ్లకు మారింది. రీసర్చ్ ప్రధానంగా సాగాల్సిన ఎంఫిల్, థియరీ లేదా మెథడాలజీకి పరిమితమైందన్న విమర్శలున్నాయి.

వాస్తవానికి పీజీ పూర్తయ్యాక పీహెచ్‌డీ చేసేందుకు గతంలో ఎంఫిల్ ప్రోగ్రామ్ అనేది ఒక వారధిగా ఉండేది. ఇది చదివినప్పటికీ, పీహెచ్‌డీ చేయాల్సి వచ్చేది.

ఇందుకు ఏడాది లేదా రెండేళ్ల సమయం కేటాయించాల్సి రావడం, కోర్సు, రీసర్చ్ ఫీజు కోసం డబ్బులు వెచ్చించాల్సి రావడంతో విద్యార్థులు రెండు విధాలుగానూ నష్టపోవాల్సి వచ్చేదని విద్యావేత్తలు చెబుతున్నారు.

ప్రస్తుత రీసర్చ్ విధానానికి ఎంఫిల్ ఏ మాత్రం సరిపోదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి ప్రొ.పొదిలె అప్పారావు బీబీసీతో చెప్పారు.

‘‘ఇప్పుడున్న పరిస్ధితుల్లో పీహెచ్‌డీలో చేరి పరిశోధనలు చేసేందుకు ఎంఫిల్ అవసరం లేదు. గతంలో ఓరియంటేషన్ కోసం పనికివచ్చేది. ఆ డిగ్రీ రావడం వల్ల ఉపయోగం ఉండటం లేదని యూజీసీ గుర్తించింది. విద్యార్థులకూ సమయం వృథా అవుతోంది.

వాస్తవానికి వేరే దేశాల్లో ఎంఫిల్ తరహా కోర్సులు ఎక్కడా ఉండవు. ప్రస్తుత సమయంలో ఎంఫిల్ అవసరం లేదు కనుక దాన్ని యూజీసీ రద్దు చేసింది’’ అని ఆయన వివరించారు.

ఎంఫిల్

ఫొటో సోర్స్, screengrab

నాలుగేళ్ల డిగ్రీతో నేరుగా పీహెచ్‌డీ

జాతీయ విద్యా విధానం ప్రకారం పరిశోధనతో కూడిన నాలుగేళ్ల డిగ్రీ లేదా పీజీ పూర్తయ్యాక నేరుగా పీహెచ్‌డీ కోర్సుల్లో చేరేందుకు అవకాశం ఉంది.

మధ్యలో ఎంఫిల్ చేయడం కారణంగా విద్యార్థులకు అదనంగా ఎలాంటి ప్రయోజనాలు దక్కడం లేదని జాతీయ విద్యా విధానం రూపకల్పన కమిటీ భావించింది. దీనివల్ల జాతీయ విద్యా విధానంలో ఎంఫిల్ కోర్సు రద్దు చేసింది.

ఇప్పటికే దేశంలో చాలా వరకు యూనివర్సిటీలు ఎంఫిల్ కోర్సులు రద్దు చేసుకుంటూ వస్తున్నాయి.

‘‘గతంలో ఎంఫిల్‌లో కొంత రీసెర్చ్ జరిగేది. పబ్లికేషన్స్ కూడా వచ్చేవి. కానీ, ఇప్పుడు అది కేవలం థియరీగా మారిపోయింది. బ్రిడ్జ్ కోర్సుగా మిగిలింది. యూజీసీ ఫెలోషిప్ వచ్చినవాళ్లు ఎంఫిల్ సమయంలో వాడుకుంటే పీహెచ్‌డీ పూర్తయ్యాక మరోసారి ఫెలోఫిప్ రాదు. దానివల్ల అసలైన రీసర్చ్ చేయాల్సినప్పుడు పీహెచ్‌డీకి ఫెలోఫిప్ ఉండేది కాదు. దీన్ని రద్దు చేయడం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదిగానే చూడాలి’’ అని ప్రొఫెసర్ అప్పారావు విశ్లేషించారు.

ఎంఫిల్

ఫొటో సోర్స్, Getty Images

ఎవరికి నష్టం?

ఎంఫిల్ రద్దుతో కొన్ని నష్టాలూ లేకపోలేదు. దీనివల్ల విద్యార్థులకు ఎంతో కొంత నష్టం కలుగుతుందని విద్యార్థి నేతలు చెబుతున్నారు.

దేశంలోని యూనివర్సిటీలలో పీహెచ్‌డీ సీట్లు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. సెంట్రల్ యూనివర్సిటీలలో సిబ్బంది సరిపడా ఉండటంతో కొంత మేర మెరుగ్గా ప్రవేశాలు కల్పిస్తున్నారు. కానీ, రాష్ట్ర యూనివర్సిటీల్లో బోధన సిబ్బంది కొరత కారణంగా పీహెచ్‌డీ ప్రవేశాలు ఎక్కువ సంఖ్యలో కల్పించలేని పరిస్థితి.

దీనివల్ల పీజీ పూర్తయ్యాక ఎంఫిల్ చేస్తే రీసర్చ్ వైపు వెళ్లాలన్న ఆసక్తి విద్యార్థులలో ఉండేందుకు వీలుంటుందని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఎంఫిల్ రద్దుతో సీట్ల సంఖ్య తగ్గిపోయి రీసర్చ్‌కు వెళ్లాలనుకునే వారికి కేవలం పీహెచ్‌డీ మాత్రమే ఆప్షన్‌గా ఉంటుందని చెబుతున్నారు.

ఎంఫిల్ రద్దుతో ఎదురయ్యే ఇబ్బందులు కొన్నింటిని విద్యార్థులు వివరించారిలా:

- నాణ్యమైన పరిశోధనలు తగ్గిపోయే అవకాశం. అప్పటికే ఎంఫిల్‌లో పరిశోధనలపై కొంత పట్టు రావడంతో పీహెచ్‌డీకి వచ్చాక పరిశోధన సమర్థంగా నిర్వహించే వీలుంటుంది. అదే ఎంఫిల్ రద్దుతో నేరుగా పీహెచ్‌డీలో చేరి పరిశోధన మొదలు పెట్టాల్సి ఉంటుంది.

- ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఎంఫిల్ ఉంటే అదనపు అర్హతగా పరిగణించి అవకాశాలు ఎక్కువగా లభించేవి.

ఇదే విషయంపై ఏఐఎస్ఎఫ్ ఉస్మానియా యూనివర్సిటీ కార్యదర్శి నెల్లి సత్య బీబీసీతో మాట్లాడారు.

‘‘ఎంఫిల్ ప్రోగ్రామ్స్‌ను రద్దు చేయడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. పీహెచ్‌డీ చేయడానికి ఇదొక గేట్ వేలా ఉండేది. మంచి టాపిక్ ఎంచుకుని స్వల్ప కాలిక పరిశోధన చేసేందుకు వీలుండేది. తర్వాత పీహెచ్‌డీలో చేరినప్పుడు ఆ అనుభవం ఉపయోగపడేది. ఎంఫిల్ రద్దు కావడంతో నేరుగా పీహెచ్‌డీలో చేరి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది’’ అని అభిప్రాయపడ్డారు.

ఎంఫిల్

ఫొటో సోర్స్, Getty Images

కొందరు అవకాశాన్ని కోల్పోతున్నారా?

ఎంఫిల్ రద్దు కారణంగా అవకాశాలను కోల్పోతున్నామని కొన్ని కోర్సుల విద్యార్థులు చెబుతున్నారు.

‘‘ఎంఫిల్ ఇన్ రీహాబిలిటేషన్ సైకాలజీ, ఎంఫిల్ ఇన్ క్లినికల్ సైకాలజీ.. ఈ రెండు కోర్సులు మాకు ఎంతో కీలకం. రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ బాడీగా ఉంటుంది. ఎంఫిల్ చేస్తేనే సైకాలజిస్టుగా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు ఎంఫిల్ రద్దు కారణంగా మాలాంటి విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ నిజాం కాలేజీ విద్యార్థి హబీబ్ బీబీసీతో చెప్పారు.

ఇలాంటి కోర్సుల మీద సమీక్ష జరుపుతామని యూజీసీ హామీ ఇచ్చిందని విద్యార్థులు చెబుతున్నారు.

ఇవి కూాడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)