పశ్చిమ బెంగాల్-నారద స్కామ్: మమతా బెనర్జీ క్యాబినెట్ లో ఇద్దరు మంత్రులు సహా నలుగురు నేతలు అరెస్ట్

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC
పశ్చిమ బెంగాల్ లో నారదా స్టింగ్ ఆపరేషన్ కేసులో మమతా బెనర్జీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రుల సహా నలుగురు నేతలను అరెస్ట్ చేసిన సీబీఐ, సోమవారం రాత్రి వారిని కోల్‌కతా ప్రెసిడెన్సీ జైలుకు పంపింది.
సీబీఐ సోమవారం మంత్రి సుబ్రతో ముఖర్జీ, ఫిర్హాద్ హకీమ్, టీఎంసీ ఎమ్మెల్యే మదన్ మిత్రా, పార్టీ మాజీ నేత శోభన్ ఛటర్జీలను అరెస్ట్ చేసింది.
ఈ నేతల ఇళ్లకు వెళ్లి విచారణ కోసం, వారిని కోల్‌కతా నిజామ్ ప్యాలెస్‌లోని తమ కార్యాలయానికి తీసుకొచ్చిన సీబీఐ, తర్వాత వారిని అక్కడే అరెస్ట్ చేసింది.
సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సాయంత్రం నలుగురు నేతలకూ మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ రాత్రి కోల్‌కతా హైకోర్ట్ ఆ ఉత్తర్వులపై స్టే విధించింది.
ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై, హైకోర్ట్ డివిజన్ బెంచ్ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ నిందితులను జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలని ఆదేశించింది.
సోమవారం రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత నలుగురు తృణమూల్ నేతలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జైలుకు పంపించినట్లు కొన్ని వర్గాల ద్వారా తెలిసిందని వార్తా సంస్థలు చెప్పాయి.
వారిని జైలుకు తీసుకు వెళ్లిన సమయంలో నలుగురు నిందితుల కుటుంబ సభ్యులు ఆ జైలు బయటే ఉన్నారు.
సోమవారం నలుగురు నేతలను సీబీఐ తీసుకెళ్లడంతో, కార్యాలయం దగ్గరకు భారీగా చేరుకున్న తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు, మద్దతుదారులు కొన్ని గంటలపాటు నిరసన ప్రదర్శనలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. కొన్ని గంటలపాటు ఆమె అక్కడే ఉన్నారు. సీబీఐ కార్యాలయం నుంచి బయటికొస్తున్న సమయంలో "కోర్టు నిర్ణయం తీసుకుంటుంది" అని ఆమె మీడియాతో అన్నారు.
తృణమూల్ నేతల అరెస్టులను కోర్టులో సవాలు చేస్తానని పార్టీ ఎంపీ పార్థ్ ఛటర్జీ అన్నారు.

ఫొటో సోర్స్, SANJAY DAS/BBC
న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉంది
"నాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. బీజేపీ నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎవరినైనా నియమించగలదు" అని మంత్రి ఫిర్హాద్ హకీమ్ కోల్‌కతా సీబీఐ కార్యాలయం బయట అన్నట్లు పీటీఐ చెప్పింది.
"మేం చెడ్డవాళ్లం, కానీ ముకుల్ రాయ్, శుబేందు అధికారి మాత్రం చెడ్డవాళ్లు కాదు. నారద స్టింగ్ ఆపరేషన్‌లో ముకుల్ రాయ్, శుభేందు అధికారి నిందితులు. కానీ వాళ్లను అరెస్ట్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది" అని ఆయన అన్నారు.
ఈ ఇద్దరు నేతలు ఆ స్టింగ్ ఆపరేషన్ జరిగిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సభ్యులుగా ఉన్నారు. కానీ తర్వాత వారు బీజేపీలో చేరారు.
నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీని ఓడించిన శుభేందు అధికారి కొత్త అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా, ముకుల్ రాయ్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
"మేం దొంగలం కాదు. సీబీఐ నా బెడ్రూంలోకి వచ్చి నన్ను అరెస్ట్ చేసేంత తప్పుడు పని నేనేం చేయలేదు" అని మరో మంత్రి సుబ్రతో ముఖర్జీ కూడా సీబీఐ కార్యాలయం బయట అన్నారు.
నారద స్టింగ్ ఆపరేషన్‌ను నారదా న్యూస్ పోర్టల్ జర్నలిస్ట్ మాథ్యూ శామ్యూల్ 2014లో చేశారు. అందులో టీఎంసీ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు డొల్ల కంపెనీలకు సాయం అందించడానికి సహాయపడుతూ కనిపించారు.
ఎన్నికల ఫలితాల తర్వాత చర్యలపై ప్రశ్నలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 15 రోజులకే జరిగిన నేతల అరెస్టులపై ప్రశ్నలు కూడా వస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ దీనిని రాజకీయ కక్షసాధింపుగా చెబుతోంది.
బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో జోరుగా ప్రచారం చేసింది. కానీ, మమతా బెనర్జీ భారీ ఆధిక్యంతో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారు.
"కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇద్దరు నేతలు(మోదీ, అమిత్ షా) బెంగాల్‌లో ప్రజాతీర్పును స్వీకరించలేక పోతున్నారు. ఆట మళ్లీ మొదలైంది" అని అరెస్టైన నలుగురిలో ఒకరైన మదన్ మిత్రా ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ ఎన్నికల ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే ఈ నేతలపై చార్జిషీటు దాఖలు చేయడానికి సీబీఐకి అనుమతి ఇచ్చారు.
ఫలితాలు వచ్చినప్పటి నుంచి గవర్నర్ రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి వరుస ట్వీట్లు చేస్తూ వస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆయన కుచ్‌బిహార్ జిల్లాలో రాజకీయ హింసకు ప్రభావితమైన కుటుంబాలను కూడా కలిసి వచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
తమ నేతల అరెస్టులకు వ్యతిరేకంగా తృణమూల్ మద్దతుదారులు నిరసనలకు దిగడంపై కూడా ఆయన సోమవారం ట్వీట్ చేశారు.
కార్యకర్తలు సీబీఐ కార్యాలయంపై రాళ్లు రువ్వినట్లు రిపోర్టులు రావడంతో, "రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్దడంపై మమతా బెనర్జీ దృష్టి పెట్టాలని" ఆయన ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- Fake Newsపై అవగాహన కల్పించే కథనాలు మీ కోసం
- నకిలీ వ్యాక్సీన్లు: కరోనా టీకాలకూ తప్పని నకిలీల బెడద.. సోషల్ మీడియాలో అమ్మకం..
- కోవిడ్ వ్యాక్సీన్ పేటెంట్ వివాదం ఏంటి... ఈ హక్కులు తొలగిస్తే టీకా అందరికీ అందుతుందా?
- కోవిడ్-19: 'మమ్మల్ని తీసుకువెళ్లి యుద్ధభూమిలో పడేశారు' - జూనియర్ డాక్టర్లు
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
- భారత్‌లో కోవిడ్ సంక్షోభం మోదీ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసిందా?
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- ‘రాబిన్ హుడ్’ హ్యాకర్లు: దోచుకున్న సొమ్మును దానం చేస్తున్నారు.. ఎందుకు?
- ‘మోడలింగ్ జాబ్ ఉందంటే వెళ్లా... అది గ్యాంగ్ రేప్ కోసం పన్నిన ఉచ్చు అని అర్థమైంది’
- కరోనావైరస్ సెకండ్ వేవ్ భారత్‌లో బలహీన పడుతోందా... కేసులు నిజంగానే తగ్గుతున్నాయా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








