అరేబియా సముద్రంలో హైజాక్ అయిన నౌకలోకి దిగి సిబ్బందిని రక్షించిన ఇండియన్ నేవీ కమాండోలు

ఫొటో సోర్స్, ANI
అరేబియా సముద్రంలో హైజాక్ అయిన నౌకలోకి దిగిన భారత నౌకాదళ కమాండోలు అందులోని సిబ్బంది అందరినీ రక్షించినట్లు ఇండియన్ నేవీ వెల్లడించింది.
నౌకలో ఉన్న 21 మంది సిబ్బందిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చామని చెప్పింది.
రక్షించిన వారిలో 15 మంది భారతీయులున్నట్లు తెలిపింది.
నౌక హైజాక్‌కు గురైనట్లు సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ వెంటనే ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టి సిబ్బంది అందర్ని కాపాడింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
హైజాక్ అయిన నౌకపై లైబీరియా జెండా ఉంది. ఇది గురువారం సాయంత్రం సోమాలియా తీర ప్రాంతానికి దగ్గర్లో హైజాక్ అయింది.
హైజాక్ అయిన ఈ కార్గో షిప్ పేరు ఎంవీ లీలా నార్‌ఫోల్క్.
అరేబియా సముద్రంలో లైబీరియా జెండాతో వెళ్తున్న మర్చెంట్ షిప్ హైజాక్ అయిందన్న విషయం తెలుసుకోగానే భారతీయ నౌకాదళం వెంటనే తన యుద్ధనౌక ఐఎన్ఎస్ చెన్నైను పంపింది.
లైబీరియా జెండా ఉన్న కార్గో షిప్ ఎంవీ లీలా నార్‌ఫోల్క్ హైజాక్ అయినట్లు గురువారం యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది.
వ్యూహాత్మక సముద్ర మార్గాలలో నౌకల రాకపోకలను బ్రిటన్‌కు చెందిన ఈ సంస్థ ట్రాక్ చేస్తుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వెళ్తున్న నౌక
హైజాక్ కావడానికి ముందు ఈ నౌక బ్రెజిల్ నుంచి బహ్రెయిన్ వైపు ప్రయాణిస్తోంది.
సోమాలియా తీర ప్రాంతం నుంచి 300 నాటికల్ మైళ్ల దూరంలో దీన్ని గురువారం హైజాక్ చేశారు.
హైజాక్ అయిన తర్వాత యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్‌కు మెసేజ్ వచ్చింది.
ఐదు నుంచి ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నౌకలోకి ప్రవేశించారని ఆ మెసేజ్‌లో ఉంది.
ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం అందుకోగానే, ఆర్మీకి చెందిన విభాగాలు వెంటనే స్పందించాయని భారతీయ నౌకాదళ అధికార ప్రతినిధి చెప్పారు.
హైజాక్ అయిన నౌక నుంచి యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ పోర్టల్‌కు మెసేజ్ వచ్చిందని తెలిపారు.
ఆ తర్వాత, ఈ సంఘటన గురించి భారతీయ నౌకాదళానికి సమాచారం అందిందని, వెంటనే పెట్రోలింగ్ టీమ్‌ను పంపించామని తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
అరేబియా సముద్రంలో నౌకలపై పెరుగుతున్న దాడులు
ఇటీవల కాలంలో అరేబియా సముద్రంలో ప్రయాణించే మర్చెంట్ నౌకలపై దాడులు పెరుగుతున్నాయి.
అంతకుముందు లైబీరియా జెండాతో వెళ్తున్న నౌక ఎంవీ కెమ్ ప్లూటోపై కూడా దాడి జరిగింది. ఆ నౌకలో 21 మంది భారతీయ పౌరులున్నారు.
డ్రోన్ల ద్వారా ఈ నౌకపై దాడి జరిపినట్లు రిపోర్టులు వచ్చాయి.
అంతకుముందు ఆఫ్రికా దేశం గబాన్ జెండాతో వెళ్తున్న ఎంవీ. సాయి బాబా నౌకపైనా దాడి జరిగింది. ఇది చమురుతో వెళ్తుంది.
ఈ నౌక భారత్ గుండా వస్తుండగా దాడి జరిగింది. దీనిలో 25 మంది నౌకా సిబ్బంది ఉన్నారు. వారందరూ భారతీయులే.
ఎంవీ కెమ్ ప్లూటోపై డ్రోన్ దాడి జరిగిన తర్వాత అరేబియా సముద్రంలో వివిధ ప్రాంతాల్లో ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ కోల్‌కతా పేర్లతో మార్గదర్శక క్షిపణి విధ్వంసకర నౌకలను మోహరించారు.
ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండేలా వీటిని రూపొందించారు.
ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలకు చెందిన షిప్‌లను లక్ష్యంగా చేసుకుని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు జరుపుతున్న సమయంలో అరేబియా సముద్రంలో భారత్ వైపుకి వచ్చే నౌకలపై కూడా దాడులు జరుగుతున్నాయి.
ఈ దాడులను సీరియస్‌గా తీసుకోవాల్సి ఉందని అమెరికా చెబుతోంది. ఈ దాడులు అంతర్జాతీయ సముద్ర మార్గాల రక్షణకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఈ దాడులపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా తీవ్రంగా స్పందించారు.
‘‘భారత్ ఆర్థిక, వ్యూహాత్మక శక్తి పెరుగుతుండటంతో కొందరికి అసూయగా ఉంటోంది. అరేబియా సముద్రంలో ఎంవీ కెమ్ ప్లూటో, ఎర్ర సముద్రంలో ఎంవీ సాయి బాబా నౌకపై జరిగిన దాడులను భారత ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంటోంది. ఈ దాడి జరిపింది ఎవరైనా వారిని గుర్తించి శిక్షిస్తాం’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత్ వాణిజ్యంలో 80 శాతం సముద్ర మార్గం గుండానే జరుగుతోంది. అంతేకాక, 90 శాతం ఇంధనం సముద్ర మార్గం ద్వారానే వస్తోంది.
చాలా వరకు ఎగుమతులు, దిగుమతులు ముంబై, కొచ్చి, మంగళూరు, గోవా, చెన్నైల నుంచి జరుగుతున్నాయి. నౌకలపై దాడులు భారత్‌కు ఆందోళనకరంగా మారుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: కిమ్ వారసత్వాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిందన్న సౌత్ కొరియా స్పై ఏజెన్సీ.. ఇంతకీ ఎవరా లీడర్?
- ఈడీ-సీబీఐ: బీజేపీలో చేరితే కేసులు ఉండవా, ప్రతిపక్షాల ఆరోపణ నిజమేనా?
- చిన్న వజ్రం కోసం వెతుకుతున్న నిరుపేద కుర్రాళ్లకు రూ. కోట్ల విలువైన డైమండ్ కనిపించింది...ఆ తర్వాత వారికి ఏమైంది?
- కెమెరాకు చిక్కిన సగం ఆడ, సగం మగ పక్షి ఇది....
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














