కల్పనా సోరెన్: సీఎం భార్య కోసమే ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ చేశారా?

Kalpana Soren

ఫొటో సోర్స్, Getty Images

ఝార్ఖండ్‌లో రాజకీయంగా వేడి పెరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నుంచి మరోసారి సమన్లు అందిన తరువాత ముందు జాగ్రత్త చర్యలకు ఆయన తొందరపడుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన పరిస్థితులు ప్రతికూలంగా మారితే తన భార్య కల్పన సోరెన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు వీలుగా పావులు కదుపుతున్నారనే చర్చ సాగుతోంది.

హేమంత్ సోరెన్ పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం)కు చెందిన సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అనూహ్యంగా రాజీనామా చేయడంతో ఈ చర్చ ఊపందుకుంది.

2019 అసెంబ్లీ ఎన్నికలలో గిరిడీహ్ జిల్లా గాండేయ నియోజకవర్గం నుంచి గెలిచిన సర్ఫరాజ్ అహ్మద్ కొద్ది రోజుల కిందట స్పీకరుకు తన రాజీనామా లేఖ పంపించారు.

ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ రవీంద్రనాథ్ మహతో ఆయన రాజీనామాను ఆమోదించారు. అయితే, స్పీకర్ ఆమోదించే వరకు ఆయన రాజీనామా విషయం ఎవరికీ తెలియలేదు.

సర్ఫరాజ్ అహ్మద్, హేమంత్ సోరెన్

ఫొటో సోర్స్, Ravi Prakash

ఇంతకీ సర్ఫరాజ్ ఏమంటున్నారు?

కాగా, సర్ఫరాజ్ అహ్మద్‌తో బీబీసీ మాట్లాడినప్పుడు ఆయన తన రాజీనామాను ధ్రువీకరించారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశానని, రాజకీయ కారణాలేమీ లేవని ఆయన చెప్పారు.

హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు మార్గమేర్పరచడానికే మీరు రాజీనామా చేశారా అని సర్ఫరాజ్‌ను ప్రశ్నించాగా ‘పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రాజీనామా చేశాను, ఇంతకుమించి ఇప్పుడేమీ చెప్పలేను’ అన్నారాయన.

ఈ అంశంపై ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు.

అయితే, ‘ఝార్ఖండ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ను కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈడీ వేధిస్తోంది’ అని ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు బీబీసీతో మాట్లాడుతూ ఆరోపించారు.

‘సమాజంలో అట్టడుగున ఉన్నవారికి హేమంత్ సోరెన్ గొంతై నిలిచారు. ఆయన నాయకత్వంలో జేఎంఎం బాగా బలపడింది. అందుకే, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ అంతా ఆయనకు అండగా ఉంటుంది. మాకు అసెంబ్లీలో మెజారిటీ ఉంది. మా నిర్ణయాలు మేం తీసుకునే హక్కు మాకు ఉంది’ అన్నారాయన.

ప్రతుల్ షా దేవ్

ఫొటో సోర్స్, facebook

‘ఈడీకి భయపడే భార్యను రంగంలోకి దించుతున్నారు’

కాగా, ఝార్ఖండ్‌లో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలపై అక్కడి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపణలు చేస్తోంది. కల్పన సోరెన్‌ ఎన్నికలలో పోటీ చేసేందుకు వీలుగానే సర్ఫరాజ్ అహ్మద్ రాజీనామా చేశారంటూ అక్కడి బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.

బీజేపీ ఝార్ఖండ్ శాఖ అధికార ప్రతినిధి ప్రతుల్ షా దేవ్ బీబీసీతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సోరెన్ ఈడీ సమన్లకు భయపడుతున్నారని అన్నారు. అందుకే ఆయన ఇలాంటి కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు.

‘జేఎంఎం వంటి రాజవంశ పార్టీలు కుటుంబం గురించి తప్ప ఇంకెవరి గురించీ ఆలోచించవు. అందుకే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈడీ తనను ఒకవేళ అరెస్ట్ చేస్తే తన భార్యను సీఎం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇంత హఠాత్తుగా ఆమెను తేవడం ఎందుకు? జేఎంఎంలో ఎవరైనా సీనియర్ నాయకుడిని తన వారుసుడిని చేయొచ్చు కదా’ అన్నారు.

మరోవైపు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కూడా ట్విటర్ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ‘ఝార్ఖండ్ నెక్స్ట్ సీఎం కల్పన సోరెన్’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఆయనే మరో ట్వీట్‌లో... ముంబయి హైకోర్టు నిర్ణయం ఒకటి ఉటంకింస్తూ గాండేయ అసెంబ్లీ స్థానానికి ఇప్పుడు ఎన్నికలు జరిగే అవకాశం లేదని కూడా రాశారు. ఝార్ఖండ్ ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఇంకో ఏడాది కంటే తక్కువే ఉందని.. దీనిపై గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాలంటూ ఆయన ఆ ట్వీట్‌లో రాశారు.

ఝార్ఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ ఇండియా కూటమిలోని అన్ని పార్టీలకు అండగా ఉంటుందని, జేఎంఎం ఆ కూటమిలో ఉందని చెప్పారు.

‘సర్ఫరాజ్ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన శాసనసభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేశారు. జేఎంఎంకు రాజీనామా చేయలేదు. పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల రీత్యా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లున్నారు’ అన్నారు.

Kalpana Soren

ఫొటో సోర్స్, Getty Images

అసలు సంగతి ఏంటంటే..

సర్పరాజ్ రాజీనామా వెనుక స్పష్టమైన కారణాలున్నాయని, అది కచ్చితంగా హేమంత్ సోరెన్ రాజకీయ ఎత్తుగడ అని ఝార్ఖండ్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సురేందర్ సోరెన్ అన్నారు.

‘సర్ఫరాజ్ ఖాళీ చేసిన స్థానంలో సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పన సోరెన్ పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు’ అని బీబీసీతో చెప్పారాయన.

హేమంత్‌కు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైతే కల్పన సోరెన్‌కు సీఎం పదవి అప్పగిస్తారని సురేందర్ సోరెన్ అన్నారు.

అయితే, మరో సీనియర్ పాత్రికేయుడు మధుకర్ మాత్రం ఇలాంటి అభిప్రాయంతో ఏకీభవించలేదు. కల్పన సోరెన్‌కు మార్గం వేసేందుకు సర్ఫరాజ్ రాజీనామా చేశారని తాను అనుకోవడం లేదన్నారు.

సర్ఫరాజ్ అహ్మద్ గతంలో కాంగ్రెస్, ఆర్జేడీలో ఉన్నారని, ఇప్పుడు కూడా వేరే అవకాశాల కోసం ఆయన రాజీనామా చేసి ఉండొచ్చని మధుకర్ అభిప్రాయపడ్డారు.

ED

ఫొటో సోర్స్, Getty Images

ఈడీ వర్సెస్ హేమంత్ సోరెన్

డిసెంబరు 29న ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను విచారించాలంటూ ఈడీ లేఖ పంపించింది. భూ పత్రాల తారుమారుకు సంబంధించిన కేసులో ఆయనను విచారించాల్సి ఉందని ఈడీ చెప్పింది.

అందుకోసం రెండు రోజుల్లో సీఎం సోరెన్ ఈడీకి తిరిగి రాతపూర్వక సమాధానం ఇవ్వాల్సి ఉన్నా ఆయన ఇవ్వలేదు. అయితే, స్పందన లేకుంటే ఆ లేఖనే సమన్లుగా పరిగణించాల్సి ఉంటుందని అందులో ఈడీ పేర్కొంది.

గతంలో కూడా హేమంత్ సోరెన్‌కు ఈడీ ఆరు సార్లు సమన్లు పంపించింది.

కానీ, ఆయన ఈడీ విచారణకు అందుబాటులో లేరు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆయన గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడు సుప్రీంకోర్టు ఆ కేసును హైకోర్టులోనే తేల్చాలని సూచించింది. అయితే, సమన్ల గడువు తీరిపోయిందన్న కారణంతో హైకోర్టు ఆయన పిటిషన్‌ను విచారించలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)