బంగ్లాదేశ్ ఎన్నికలు భారత్‌‌కు ఎందుకంత ముఖ్యం?

భారత ప్రధాని నరేంద్రమోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

ఫొటో సోర్స్, NAVEEN SHARMA/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత ప్రధాని నరేంద్రమోదీతో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా
    • రచయిత, అన్బరాసన్ యతిరాజన్
    • హోదా, బీబీసీ న్యూస్

బంగ్లాదేశ్ జనవరి 7వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున సరిహద్దున ఉన్న భారత్ పాత్రపై కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా నాలుగోసారి ఈ పదవిని చేపట్టాలనే వ్యూహంతో ఉన్నారు. దీనికితో,డు ప్రధాన ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించడంతో ఆమె విజయం లాంఛనమే కానుంది.

షేక్ హసీనా రాబోయే ఎన్నికలను స్వేచ్ఛ, పారదర్శకతతో జరిగేందుకు సహకరించరని, అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ)తో పాటు దానితో పొత్తు పెట్టుకున్న ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి.

అందుకే, ఆమె తొలుత పదవి నుంచి వైదొలగాలని, తటస్థ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాకనే, ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, హసీనా అందుకు నిరాకరించారు.

భారత్, మయన్మార్‌లతో 271 కిలోమీటర్ల పొడవైన సరిహద్దుని కలిగి ఉన్న బంగ్లాదేశ్‌లో 170 మిలియన్లకు పైగా జనాభా ఉన్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది ముస్లిం మతస్థులు.

భారత్‌కు బంగ్లాదేశ్‌ కేవలం పొరుగు దేశం మాత్రమే కాదు, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల భద్రతలో కీలకంగా ఉంది. దానితోపాటు వ్యూహాత్మక భాగస్వామిగా, మిత్రదేశంగా దశాబ్దాల కాలంగా బలమైన సంబంధాలను కలిగి ఉంది.

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, Getty Images

ప్రతిపక్షాల విమర్శలు...

బంగ్లాదేశ్‌తో భారత్ మెరుగైన సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని భారత విధాన రూపకర్తలు అంటున్నారు.

1996లో తొలిసారి షేక్ హసీనా పదవిని చేపట్టిన నాటి నుంచి భారత్‌తో స్నేహపూర్వక సంబంధాలు మరింత బలపడ్డాయి. ఈ తరుణంలో రానున్న ఎన్నికల్లో మళ్లీ ఆమె పగ్గాలు చేపట్టాలని భారత్ కూడా కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు.

2022లో భారత్ వచ్చిన సమయంలో షేక్ హసీనా మాట్లాడుతూ, "బంగ్లాదేశ్ ఎన్నటికీ భారత్‌ను మర్చిపోదు" అని అన్నారు. 1971 స్వాతంత్య్రోద్యమ సమయంలో భారత ప్రభుత్వం, సైనికదళం, భారత ప్రజలు తమ పక్షాన నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు.

ఈ వ్యాఖ్యల పట్ల అక్కడి ప్రధాన ప్రతిపక్షమైన బీఎన్‌పీ నుంచి ఆమె నేతృత్వంలోని అధికార పార్టీ ఘాటైన విమర్శలను ఎదుర్కొవలసి వచ్చింది.

సీనియర్ బీఎన్‌పీ నేత రుహుల్ కబీర్ రిజ్వీ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ, "భారతదేశ ప్రభుత్వం కేవలం ఒక్క పార్టీకే కాదు, బంగ్లాదేశ్ ప్రజలకూ మద్దతివ్వాలి. దురదృష్టవశాత్తూ, భారత విధాన కర్తలు బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం వద్దని కోరుకుంటున్నారు" అని వ్యాఖ్యానించారు.

ఆయన బంగ్లాదేశ్‌లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికలను "డమ్మీ ఎన్నికలు"గా అభివర్ణించారు. "భారత్‌ బాహాటంగానే షేక్ హసీనాకు మద్దతు ప్రకటిస్తూ, బంగ్లాదేశ్ ప్రజలను ఒంటరివాళ్లను చేసింది" అంటూ భారత్‌పై ఆరోపణలు చేశారు.

బీఎన్‌పీనేత వ్యాఖ్యలపై స్పందించేందుకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నిరాకరించారు.

బీబీసీ వేసిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, "బంగ్లాదేశ్ ఎన్నికలనేవీ ఆ దేశ అంతర్గత వ్యవహారం. ఎవరిని ఎన్నుకోవాలో బంగ్లాదేశ్‌ ప్రజలు నిర్ణయించుకుంటారు. మిత్రదేశంగా బంగ్లాదేశ్‌లో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేం కోరుకుంటున్నాం" అన్నారు.

బంగ్లాదేశ్‌లో 2001, 2006 సంవత్సరాల్లో సంకీర్ణ ప్రభుత్వాలు అధికారం చేపట్టినప్పుడు ఏం జరిగిందో, ఇప్పుడు బీఎన్‌పీ, జమాత్ ఇ ఇస్లామీ పార్టీల కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని గనుక ఏర్పాటు చేస్తే, బంగ్లాదేశ్‌లో ఇస్లామిక్ భావజాలం పెరిగి భారత్ పట్ల వారి వైఖరిలో మార్పు రావొచ్చని భారత్ కూడా ఆందోళన చెందుతోంది.

బంగ్లాదేశ్‌లో భారత మాజీ రాయబారి పినాక్ రంజన్ చక్రవర్తితో బీబీసీతో మాట్లాడుతూ, “గతంలో పనిచేసిన ఇస్లామిక్ నాయకులు, వారి స్వప్రయోజనాల కోసం పలు జీహాదీ సంస్థలకు ఊపిరిపోసి, వారి అవసరాలకు తగ్గట్లుగా పనులు చేపించుకున్నారు. 2004లో షేక్ హసీనా హత్యకు కుట్ర జరిగింది. పాకిస్తాన్‌ నుంచి ఆయుధాలను రవాణా చేస్తున్న 10 ట్రక్కులను కూడా పట్టుకున్నారు" అని చెప్పారు..

2009లో షేక్ హసీనా అధికారం చేపట్టాక బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఈశాన్య భారత రాష్ట్రాల్లో పనిచేస్తూ, తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్న తిరుగుబాటు సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించారు షేక్ హసీనా. అలా తన నిర్ణయాలతో భారత్ నమ్మకాన్ని గెల్చుకున్నారు షేక్ హసీనా.

వివాదాలూ ఉన్నాయి...

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య జాతి, భాష, సాంస్కృతికంగా కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

1971లో బంగ్లాదేశ్ స్వతంత్రం పొందిన సమయంలో భారత్ కీలకంగా వ్యవహరించింది. బంగ్లాదేశ్‌కు చెందిన బెంగాలి రెసిస్టెన్స్ ఫోర్స్‌కు మద్దతుగా భారత్ తన సేనలను పంపింది.

ఓ విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్‌లో అన్నింటిపైనా భారతదేశం ప్రభావం ఉంటుంది.

ఆహారపదార్థాల నుంచి మొదలుకొని ఎన్నికల వరకు.. బియ్యం, పప్పు దినుసులు, కూరగాయాలు, వివిధ రకాల వస్తువులు..ఇలా చాలా ముఖ్యమైన వాటి కోసం భారత్‌పైనే ఆధారపడింది బంగ్లాదేశ్.

2010 నుంచి బంగ్లాదేశ్‌కు ఆర్థికంగా కూడా మద్దతుగా నిలిచింది భారత్. బంగ్లాదేశ్‌లో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల నిమిత్తం ఏడు బిలియన్ డాలర్లకు పైగా రుణాన్ని అందించింది.

అయితే, గడిచిన దశాబ్దంలో ఇరు దేశాల మధ్య అంతర్గత వ్యవహారాల్లో జోక్యం నుంచి మొదలుకొని, నదీ జలాల పంపిణీల విషయం వరకు పలు అంశాలపై వివాదాలు నెలకొన్నాయి. వీటిపై భారత్, బంగ్లాదేశ్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.

ఢాకాలోని సెంటర్ ఫర్ పాలసీ డైలాగ్‌కు చెందిన దేవప్రియ భట్టాచార్య మాట్లాడుతూ, "బంగ్లాదేశ్‌లో భారత్ పట్ల భిన్నమైన వాదనలు ఉన్నాయి. మంచి పొరుగుదేశంగా ఉన్నప్పటికీ భారత్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు రావడం లేదన్న భావన నుంచి పుట్టుకొచ్చిన సమస్యలు అవి. పొరుగుదేశంగా, సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నా కూడా, ఇచ్చిపుచ్చుకోవడంలో బంగ్లాదేశ్ కోరుకుంటున్నట్లుగా సమాన వాటా అందడం లేదన్న వాదనలు ఉన్నాయి" అన్నారు.

2009లో షేక్ హసీనా అధికారం చేపట్టాక, రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండుసార్లూ ఆమె నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీ విజయం సాధించింది. అయితే, ఈసారి జరిగే ఎన్నికల పట్ల ప్రతిపక్షాలు తమకు విశ్వసనీయత లేదని అంటున్నాయి. ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశాయి. అవామీ లీగ్ పార్టీ ఆరోపణలను ఖండించింది.

భారత్, బంగ్లాదేశ్‌ల మధ్యనున్న రోడ్డు, జల, రైలు మార్గాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు నిత్యావసరాలతోపాటు, ఇతర వస్తువులను సరఫరా చేసేందుకు ఈ మార్గాలే కీలకం. అయినప్పటికీ ఇది సరిపోవడం లేదు.

అయితే, నేపాల్, భూటాన్‌ల మధ్య నెలకొన్న రోడ్డు రవాణా సవాళ్లతో కూడుకున్నదని, ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి వాణిజ్య కార్యకలాపాలను కొనసాగించడానికి బంగ్లాదేశ్ ఇంకా సన్నద్ధం కాలేదని అన్నారు.

నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్‌ల గుండా రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో అసుసంధానమై ఉంది భారత్. 20 కిలోమీటర్ల పొడవున్న ఈ మార్గాన్ని ‘ చికెన్స్ నెక్ (కోడి మెడ)’గా వ్యవహరిస్తుంటారు.

భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకన్న సందర్భంలో ఆ ప్రాంతం ప్రమాదంలో పడే అవకాశం ఉందని భారత ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఎందుకంటే ఆ కారిడార్ భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతం.

చైనా ప్రధాని జిన్‌పింగ్‌తో బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా

ఫొటో సోర్స్, POOL

చైనా ప్రాబల్యమేంటి?

బంగ్లాదేశ్‌ అధికార ప్రభుత్వం మానవహక్కుల ఉల్లంఘనలు, అదనపు న్యాయపరమైన హత్యలకు పాల్పపడుతోందని, బంగ్లాదేశ్‌పై కఠినమైన ఆంక్షలు విధించాలని పాశ్చాత్య ప్రభుత్వాలు వాదిస్తున్నప్పటికీ, భారత్ మాత్రం సమర్థించలేదు. అది ప్రతికూలమైన చర్యగా పేర్కొంది.

ఇందుకు కారణమూ ఉంది. ప్రాంతీయ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న చైనా కూడా బంగ్లాదేశ్‌తో సంబంధాలను మరింత బలపర్చుకోవడానికి వ్యూహాత్మకంగా సాగుతోంది .ఈ నేపథ్యంలో భారత్ సున్నితంగా వ్యవహరిస్తోంది.

పినాక్ చక్రవర్తి మాట్లాడుతూ, "బంగ్లాదేశ్ పట్ల సంయమనంతో వ్యవహరించాలని మేం పాశ్చాత్య దేశాలకు చెప్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ఒత్తిడి పెంచడం వల్ల షేక్ హసీనా ఇతర దేశాల మాదిరిగా చైనాతో చేతులు కలిపే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే భారత్‌కు కొత్త సమస్య తలెత్తుతుంది" అన్నారు.

రాజకీయ చిత్రం మారుతుందా?

ఇరుదేశాల మధ్య అంతటి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, కొంతమంది బంగ్లాదేశీయులు భారత్‌ విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

ఢాకాలోని కూరగాయల వ్యాపారి జమీరుద్దీన్‌తో బీబీసీ మాట్లాడిన సందర్భంలో, "భారత్, బంగ్లాదేశ్‌ మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని నేను భావించడం లేదు. మాది ముస్లిం ప్రధాన దేశం కావడంతో భారత్ పట్ల మాకెప్పుడూ అభ్యంతరం ఉంటుంది. మొదట మేం స్వతంత్య్ర దేశంగా నిలబడ్డాకనే, ఇతరులపై ఆధారపడాలి. లేదంటే చిక్కుల్లో పడతాం" అన్నారు.

ఇదిలా ఉంటే, భారత్‌లో 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక దేశంలో మైనార్టీల పట్ల వివక్ష పెరిగిందని, ముఖ్యంగా ముస్లింల పట్ల వివక్ష పెరిగిందని మానవహక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే, బీజేపీ ఈ ఆరోపణలు ఖండిస్తూ వస్తోంది.

భారతదేశంలో చోటుచేసుకుంటున్న 'బంగ్లాదేశీ అక్రమ వలసల'పై చాలామంది భారత రాజకీయ నాయకులు స్పందిస్తుంటారు.

అస్సాం, పశ్చిమబెంగాల్ దేశాల్లో నివసిస్తున్న బెంగాలీ ముస్లింలను సూచించే విధంగానే ఈ వ్యాఖ్యలు ఉన్నాయి.

దేవప్రియ భట్టాచార్య మాట్లాడుతూ, "భారత్‌లో ముస్లింల పట్ల కొనసాగుతోన్న వివక్ష, అనుచిత ప్రవర్తనలతో, అదే రీతిలో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పట్ల కూడా ఇలాంటి వివక్షే మొదలవుతుందన్న భయం కూడా క్రమంగా బలపడుతోంది" అన్నారు. బంగ్లాదేశ్ జనాభాలో హిందువుల జనాభా 8% ఉన్నారు.

బంగ్లాదేశ్‌లోని షేక్ హసీనా ప్రభుత్వం తమ పట్ల అనుకూలంగానే ఉందని భారత్ బలంగా నమ్ముతోంది.

అయితే, అక్కడి ప్రజల్లోనూ స్థానం సంపాదించడం భారత్‌కు సవాల్‌గా నిలిచే అంశం.

ఇవి కూడా చదవండి..

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)