జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, పిలర్ అర్జెంటో అరిజాన్
- హోదా, ద కన్వర్జేషన్
మనం శారీరకంగా, మానసికంగా, మేథోపరంగా ఆరోగ్యంగా ఉండటంలో మనం తినే ఆహారమే ముఖ్యం.
అలాగే చర్మం, జుట్టు మెరుపు వంటి అంశాలను కూడా ఆహారం ప్రభావితం చేస్తుంది.
జుట్టు రాలడం చిన్న విషయం కాదు. అసాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగా లేదని చెప్పడానికి, దానిపట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించే మొదటి సంకేతం.
దీర్ఘకాలిక ఒత్తిడి, జన్యువులు, హార్మోన్ల మార్పులు లేదా కొన్ని ఔషధాలు తీసుకోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు రాలుతుంది.
మన జుట్టుకు చేటు చేసే కారకాల గురించి తెలుసుకోవడంతో పాటు సులభమైన మార్గాల్లో జుట్టును ఎలా సంరక్షించుకోవాలో ఇక్కడ చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
తినాల్సిన ఆహారం ఇదే
ప్రొటీన్లు, బి విటమిన్, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు అధికంగా ఉండే కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి చాలా కీలకం.
అనోరెక్సియా (తక్కువ బరువు ఉండటం), బులీమియా (అతిగా తినడం) వంటి ఆహార రుగ్మతలకూ జుట్టు రాలడానికి మధ్య బలమైన సంబంధం ఉంటుంది.
జుట్టు రాలడానికి ఆహారంలోని ఏ నిర్ధిష్ట అంశాలు కారణం అవుతున్నాయో కచ్చితంగా తెలియకపోవచ్చు.
కానీ, ఉదాహరణకు అధిక చక్కెరలు, సంతృప్త కొవ్వులు ఉన్న ఆహార పదార్థాలతో గుండె సంబంధిత వ్యాధులు రావడం మాత్రమే కాకుండా మన కణాల్లో ఒత్తిడి, ఇన్‌ఫ్లమేషన్ కలుగుతుంది. దీనితో మన శరీరం మరింత సున్నితంగా మారి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. వాటిలో జుట్టు రాలడం కూడా ఒకటి.
ఈ కారణంగానే మార్కెట్‌లో లభించే అనేక రకాల రెమిడీలు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రభావాలపై దృష్టిసారిస్తాయి.
కాబట్టి చేపలు, వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణం ఉండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
ఇన్‌ఫ్లమేషన్ కలిగించే ఆహారానికి దూరంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొన్ని తార్కిక వివరణలు చెబుతున్నాయి.
అనేక అధ్యయనాలు కూడా ఇందుకు మద్దతు ఇస్తున్నాయి.
ఉదాహరణకు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే మెడిటరేనియన్ డైట్(తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం)ను పాటిస్తే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని కొందరు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జుట్టు రాలడానికి మరో ప్రధాన కారణం ఒత్తిడి
ఒత్తిడి కారణంగా శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హర్మోన్ విడుదల ఎక్కువైనా, తక్కువైనా సమస్యలు వస్తాయి.
రోజూవారీ జీవితంలో ఒత్తిడి సాధారణం అయిపోయింది. ఈ ఒత్తిడి పరిస్థితులు సుదీర్ఘకాలం కొనసాగితే జుట్టు రాలడం సమస్య మొదలవుతుంది.
అడ్రినల్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే కార్టిసాల్ హార్మోన్‌కూ జుట్టు రాలడానికి సంబంధం ఉంటుంది.
ఒత్తిడి తగ్గిపోగానే శరీరంలో ఈ హార్మోన్ స్థాయిలు సాధారణానికి వస్తాయి.
ఆహారంతో ఈ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడం సాధ్యమేనా?
కచ్చితంగా సాధ్యమే.
అవకాడో, ఆయిలీ ఫిష్, కొన్ని రకాల విత్తనాలు, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఫుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు, వివిధ విటమిన్లు, ఖనిజాలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కార్టిసాల్ హార్మోన్‌కు కళ్లెం వేయవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
పులియబెట్టిన ఆహారాలు
జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో పులియబెట్టిన ఆహారాలు మంచి ప్రభావాన్ని చూపుతాయని నిరూపితమైంది.
ఇక్కడే మన పేగుల్లోని మైక్రోబయోటా పాత్ర కీలకం అవుతుంది. మైక్రోబయోటా అంటే మన జీర్ణవ్యవస్థలో నివసించే సూక్ష్మజీవుల సమూహాలు.
మైక్రోబయాటాకు మన ఆరోగ్యం, వ్యాధులకు సంబంధం ఉంటుంది. మనం తీసుకునే పోషకాలతో మైక్రోబయోటా పరస్పర చర్య జరుపుతుంది.
తినే ఆహారాన్ని బట్టి మన శరీరంలోని మైక్రోబయోటా భిన్నంగా ఉంటుంది.
మన జీవక్రియ, పోషకాలను శరీరం శోషించడం అనేది మైక్రోబయోటా సంఖ్యపై ఆధారపడి ఉంటుంది. వీటి సంఖ్య ఆధారంగానే శరీరంలో వివిధ రసాయన, జీవక్రియ సంకేతాలు ఉత్పత్తి అవుతాయి.
ఇవి ఒత్తిడిని ఎదుర్కోవడంలో కూడా సహాయపడగలవు.
మన ఆహారం వైవిధ్యంగా ఉంటే, పేగుల్లో బ్యాక్టీరియా కూడా అదే విధంగా తయారవుతుంది.
కాబట్టి యోగర్ట్, కెఫిర్‌తో పాటు ఇతర పులియబెట్టిన ఆహారాలు వంటి ప్రోబయాటిక్స్ తీసుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
ఇవి పాటిస్తే జుట్టు క్షేమంగా ఉంటుంది.
సాన్ జార్జ్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ పీడీఐ ఫ్యాకల్టీ పిలర్ అర్జెంటో అరిజాన్.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














