న్యూస్‌క్లిక్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన కథనంపై 'న్యూయార్క్ టైమ్స్' బీబీసీతో ఏం చెప్పిందంటే...

న్యూస్‌క్లిక్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

జర్నలిస్టుల గొంతును అణిచివేసేందుకు ఏ ప్రభుత్వమైనా స్వతంత్ర జర్నలిజాన్ని ఉపయోగించుకోవడం ఆమోదయోగ్యం కాదని అమెరికాకు చెందిన ప్రముఖ వార్తాపత్రిక 'న్యూయార్క్ టైమ్స్' వ్యాఖ్యానించింది.

దిల్లీలో ‘న్యూస్‌క్లిక్‌’ వెబ్‌సైట్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు కొందరిని అరెస్ట్ చేశారు.

న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక ఈ ఏడాది ఆగస్టు 5 వ తేదీన ‘న్యూస్ క్లిక్’కు సంబంధించి ఒక కథనాన్ని ప్రచురించింది.

'న్యూస్‌క్లిక్'పై ప్రచురించిన నివేదికకు సంబంధించి 'న్యూయార్క్ టైమ్స్'ను బీబీసీ ప్రశ్నించింది. బీబీసీ అడిగిన కొన్ని ప్రశ్నలకు న్యూయార్క్ టైమ్స్ సమాధానాలు చెప్పింది.

చైనా ప్రచారాన్ని (ప్రొపగాండా) నిర్వహించడానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సన్నిహితుడైన ఒక అమెరికన్ కోటీశ్వరుడు, న్యూస్ క్లిక్ సంస్థకు నిధులు సమకూర్చినట్లు ఆ కథనంలో న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.

న్యూస్‌క్లిక్

ఫొటో సోర్స్, Getty Images

న్యూయార్క్ టైమ్స్ ఏం చెప్పింది?

బీబీసీ అడిగిన ప్రశ్నలకు న్యూయార్క్ టైమ్స్ ఇలా సమాధానం ఇచ్చింది. ‘‘ఇండిపెండెంట్ జర్నలిజం ఎప్పుడూ ఫ్యాక్ట్స్‌ను నమ్ముతుంది. మేం ఇంటర్నల్ డాక్యుమెంట్స్, కార్పొరేట్, నాన్‌ప్రాఫిట్ ట్యాక్స్ ఫైలింగ్స్‌లతోపాటు సింఘమ్‌తో సంబంధమున్న సంస్థలకు చెందిన రెండు డజన్ల మంది మాజీ ఉద్యోగుల ఇంటర్వ్యూల ఆధారంగా ఆ కథనాన్ని ప్రచురించాం.

మా దర్యాప్తులో చైనా ప్రభుత్వ మీడియా ప్రయోజనాల కోసం సింఘమ్ పనిచేస్తున్నట్లు తేలింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా చైనాకు ప్రయోజనం చేకూర్చే ప్రచారాలను నిర్వహించడానికి సంస్థలకు సింఘమ్ ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిసింది’’ అని బీబీసీకి న్యూయార్క్ టైమ్స్ తెలింది.

‘‘చైనా మీడియాతో సింఘమ్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వివరాలపై మా పరిశోధనలో కాస్త రుచించని విషయాలు వెలుగుచూసి ఉండొచ్చు. కానీ, జర్నలిస్టుల నోరు నొక్కేందుకు ఒక ప్రభుత్వం ఇలా స్వతంత్ర జర్నలిజాన్ని ఉపయోగించుకోవడం ఆమోదయోగ్యం కాదు. మా రిపోర్టింగ్‌కు మేం కట్టుబడి ఉన్నాం. అందులో ఎలాంటి తప్పులూ లేవు’’ అని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది.

దిల్లీ పోలీసులు మంగళవారం న్యూస్‌క్లిక్ వార్తా సంస్థతో సంబంధం ఉన్న జర్నలిస్టుల ఇళ్లపై సోదాలు చేశారు.

మంగళవారం తెల్లవారుజామున 30 మందికి పైగా జర్నలిస్టులను వారి ఇళ్ల నుంచి తీసుకెళ్లి విచారించారు. ఆ తర్వాత చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (ఉపా) కింద ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అయిన వారిలో న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో పాటు హ్యుమన్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ (హెచ్‌ఆర్) హెడ్ అమిత్ చక్రవర్తి ఉన్నారు.

నిషికాంత్ దూబే

ఫొటో సోర్స్, ANI

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపణలు

భారత్‌ పట్ల వ్యతిరేకత పెంచేందుకు కాంగ్రెస్ నేతలు, న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందాయని ఆగస్టు 7న లోక్‌సభలో న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ఉటంకిస్తూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఆరోపించారు.

‘‘రాహుల్ గాంధీ ‘ద్వేషపూరిత దుకాణం’లో చైనా సామాను ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూయార్క్ టైమ్స్ వార్తను ఉటంకిస్తూ, న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి రూ. 38 కోట్లు వచ్చినట్లు నిషికాంత్ దూబే పేర్కొన్నారు.

న్యూస్‌క్లిక్

ఫొటో సోర్స్, ANI

ఆరోపణల్ని ఖండించిన న్యూస్‌క్లిక్

లోక్‌సభలో నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యల తర్వాత, న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ మాట్లాడుతూ, చైనా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి న్యూస్‌క్లిక్‌పై వచ్చినవి తప్పుడు ఆరోపణలని అన్నారు.

దిల్లీ పోలీసుల సోదాల తర్వాత కూడా తమపై వచ్చిన ఆరోపణలన్నీ తప్పుడువే అనే మాటకే న్యూస్‌క్లిక్ కట్టుబడి ఉందన్నారు.

న్యూస్‌క్లిక్‌ ఇప్పటివరకు ప్రచురించిన వార్తలన్నీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా వాటిని చూడొచ్చని వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.

తమ వెబ్‌సైట్‌లో చైనాకు ప్రచారం కల్పిస్తున్నట్లుగా కనిపించే ఒక్క వార్త లేదా వీడియో గురించి దిల్లీ పోలీసులు ప్రస్తావించలేదని చెప్పింది.

చైనాకు అనుకూలంగా తాము ఎలాంటి ప్రచారం చేపట్టలేదని పేర్కొంది.

తమది ఒక స్వతంత్ర వార్తా వెబ్‌సైట్‌ అని న్యూస్‌క్లిక్ అభివర్ణించింది. పాత్రికేయానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తామని తెలిపింది.

"కోర్టులు, న్యాయ ప్రక్రియలపై మాకు పూర్తి నమ్మకం ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛతో కూడిన జర్నలిజం కోసం, మా జీవితాల కోసం మేం పోరాడుతాం’’ అని న్యూస్‌క్లిక్ చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)