పశ్చిమ బెంగాల్: వామపక్ష ర్యాలీకి భారీగా తరలివచ్చిన జనం... వీరంతా ఓట్లేస్తారా?

ఫొటో సోర్స్, DYFI FB
- రచయిత, ప్రభాకర్ మణి తివారి
- హోదా, కోల్‌కతా నుంచి బీబీసీ కోసం
పశ్చిమ బెంగాల్‌లో ప్రతిపక్షాల కూటమి 'ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్ - ఇండియా'లో భాగస్వాములైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సీపీఎంల మధ్య పోరు నడుస్తోంది.
ఈ పరిణామాల నడుమ, వామపక్ష పార్టీ అనుబంధ యువజన సంఘం డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఆదివారం కోల్‌కతాలోని బ్రిగేట్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన జస్టిస్ ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం హాజరయ్యారు.
అయితే, ఇక్కడ వామపక్ష కూటమి నేతలను వేధిస్తున్న ప్రశ్న ఏంటంటే, ర్యాలీకి హాజరైన జనంలో కొందరైనా పోలింగ్ స్టేషన్లకు వస్తారా?
2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌తో కలిసి వామపక్ష కూటమి ఇదే గ్రౌండ్‌లో నిర్వహించిన భారీ ర్యాలీతో మహానగరం స్తంభించిపోయింది.
కానీ, నెల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటూ రాలేదు. సీపీఎం నేత అభాస్ రాయ్ చౌధురి తన ప్రసంగంలో ఈ ర్యాలీకి వచ్చిన జనాన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా తీసుకురావాల్సి ఉంటుందనడానికి బహుశా ఇదే కారణం కావొచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఎన్నికల్లో ఒక్కసీటూ నెగ్గలేదు
ర్యాలీకి హాజరైన ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి కూడా అదే ప్రశ్న వినిపించింది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల సమయం దగ్గరపడింది, ఇంత తక్కువ సమయంలో ఎన్నికల్లో సీట్లు సాధించడం సాధ్యమవుతుందా? అనేది వారిలో మెదిలిన ప్రశ్న.
నిజానికి, డీవైఎఫ్ఐ చేపట్టిన ఇన్సాఫ్ యాత్ర రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల మీదుగా 50 రోజుల పాటు సాగింది. సుమారు 3 వేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో 12 లక్షల మంది పాల్గొన్నారు.
ఈ యాత్రలో పాల్గొన్న వారిలో కనీసం మూడో వంతు మంది అయినా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ర్యాలీకి వస్తే తమ పార్టీ బలపడినట్లేనని వామపక్ష పార్టీ నాయకత్వం భావించింది.
అయితే, ఆదివారం జరిగిన ర్యాలీకి అంత భారీగా జనం రావడంపై భిన్నమైన వాదనలు ఉన్నప్పటికీ, ర్యాలీకి జనం భారీగా హాజరయ్యారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

ఫొటో సోర్స్, DYFI FB
ఓట్లు వేయని జనం
రాష్ట్రంలో ఒక్క లోక్ సభ స్థానం, ఒక్క అసెంబ్లీ సీటూ లేకపోయినప్పటికీ వామపక్షాల ర్యాలీకి ఇంత పెద్దయెత్తున జనం తరలిరావడం చెప్పుకోదగ్గ పరిణామం.
ఈసారి ర్యాలీలో తొలిసారిగా గిరిజనులు భారీగా తరలిరావడం కనిపించింది. ఒకప్పుడు టీ తోటలు పెరిగే ప్రాంతాలకు చెందిన గిరిజనులు వామపక్ష కూటమికి బలమైన ఓటు బ్యాంకుగా ఉండేవారు.
ర్యాలీ సందర్భంగా బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఎరుపు రంగులోకి మారుతోంది, కానీ 2011లో బెంగాల్‌లో సీపీఎం అధికారం కోల్పోయిన తర్వాత ఎన్నికల వేళ పోలింగ్ ఏజెంట్‌ను కూడా పెట్టలేని పరిస్థితులు ఎందుకు వచ్చాయన్నదే పార్టీ వర్గాల్లో ఎక్కువ మంది నుంచి వ్యక్తమవుతున్న ప్రశ్న.
అందుకు ద్వితీయ స్థాయి నాయకత్వం, క్షేత్రస్థాయి కార్యకర్తలు క్రియాశీలకంగా పనిచేయలేకపోవడమే కారణంగా చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, కనీసం ఈ ర్యాలీ తర్వాత అయినా ఈ లోటును పూడ్చడం సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.
''ఇది టీ20 కాదు. మేం టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. అంటే, అన్నీ రాత్రికిరాత్రే మారిపోవు. రాజకీయాల్లో ఓపిక చాలా అవసరం'' అని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి మీనాక్షి ముఖర్జీ అన్నారు.
ర్యాలీ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీమ్ సహా ఆ పార్టీ నేతలు బీజేపీతో పాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని వారు ఆరోపించారు.
''2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి విపరీతంగా పెరిగింది. వాచ్‌మెనే దొంగైతే ఇంకెవరు పట్టుకోగలరు'' అని మహమ్మద్ సలీమ్ అన్నారు.
నిరుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటామని, అది ట్రైలర్ మాత్రమేనని ఆయన అన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో తెలుస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడమే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సరిపోతోందని ఆయన ఆరోపించారు.
పార్టీ క్షేత్రస్థాయిలో బలపడిందని, వచ్చే లోక్ సభ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనంగా నిలుస్తాయని సలీమ్ అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
వామపక్ష కూటమి ఓట్ల శాతం
''బ్రిగేడ్ ర్యాలీకి భారీగా జనం తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన జనం ఇంటికి వెళ్లిన తర్వాత, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తారు. అసలు ఈ ర్యాలీ వల్ల సీపీఎంకి కలిగే ప్రయోజనమేంటి?'' అని ప్రశ్నించారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
''2019 లోక్‌సభ ఎన్నికల్లో వామపక్షాలకు 6 శాతానికి పైగానే ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది ఐదు శాతానికి తగ్గింది. కానీ, బెంగాల్‌లో వామపక్ష ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ర్యాలీలకు జనం భారీగా హాజరవుతున్నారు. అందులో కొంతభాగమైనా ఓట్లుగా మారితే, రాజకీయ ముఖచిత్రం మారిపోతుంది. అయితే, అలా చేయడంలో పార్టీ విజయం సాధించగలదా? అనేదే పెద్ద ప్రశ్న'' అని రాజకీయ విశ్లేషకులు మైదుల్ ఇస్లాం అభిప్రాయపడ్డారు.
అదే ప్రశ్న కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతల నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకూ, అందరినీ ఇబ్బందిపెడుతోంది.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: రికార్డు మెజార్టీతో సీట్లు నెగ్గిన కమ్యూనిస్టు పార్టీల ప్రస్తుత పరిస్థితి ఏంటి వాటి ప్రాభవం ఎలా తగ్గుతూ వస్తోంది?
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- పశ్చిమ బెంగాల్ హింస: కేంద్ర బలగాలను భారీగా మోహరించినా పంచాయతీ ఎన్నికల్లో అంత మంది ఎందుకు చనిపోయారు?
- ఎంఫిల్ కోర్సు రద్దు: యూజీసీ ఆదేశంతో విద్యార్థులకు లాభమా, నష్టమా?
- పారిశుధ్య కార్మికుల సమ్మె: ‘మేం సీఎం సీట్లో కూర్చొని పనిచేస్తే బాగుంటుందా’ అని సిబ్బంది ఎందుకు ప్రశ్నిస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














