తిలకం పెట్టుకున్న అబ్బాయితో బురఖా వేసుకున్న అమ్మాయి కనిపిస్తే దాడి చేసి కొట్టారు.. 9 మంది ముస్లిం యువకులపై పోలీస్ కేసు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషి
- హోదా, బీబీసీ కోసం, బెంగళూరు నుంచి
కర్ణాటకలోని బెలగావిలో ఒక సరస్సు ఒడ్డున కూర్చున్న వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరిపై జరిగిన దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
బాధితులిద్దరూ సమీప బంధువులు. దాడి తర్వాత వారిని ఆసుపత్రిలో చేర్చారు.
బాధితుల 20-24 సంవత్సరాల మధ్య ఉంటుంది. వారిద్దరూ కోట్ సరస్సు ఒడ్డున కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో వారి వద్దకు కొందరు వచ్చారు. తర్వాత ఖాళీ షెడ్డులోకి తీసుకెళ్లి వారిని కొట్టారు.
వీరిద్దరూ కర్ణాటక ఫారెస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద యువ నిధి అనే పథకానికి రిజిస్టర్ చేసుకునేందుకు వెళ్లారు. నిరుద్యోగుల కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం యువ నిధి. సర్వర్ డౌన్ కావడంతో సరస్సు వద్దకు వెళ్లి కూర్చొని ఎదురుచూస్తున్నారు.
అప్పుడే దాదాపు తొమ్మిది మంది యువకులు వారి వద్దకు వచ్చి షెడ్డుకు తీసుకెళ్లారు.
ఇద్దరూ ఎందుకు కలిసి ఉన్నారని మొదట వారిని ఆ యువకులు అడిగారు.
నిజానికి బాధిత యువకుని నుదుటిపై తిలకం ఉండగా, అతనితో ఉన్న యువతి తన తల బయటకు కనిపించకుండా కవర్ చేసుకొని ఉన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వారు అక్కడ ఎందుకు కూర్చున్నారో చెప్పిన తర్వాత వారిపై దాడికి పాల్పడ్డారు.
బెలగావి పోలిస్ కమిషనర్ సిద్ధరామప్ప ఈ కేసు గురించి బీబీసీ హిందీతో మాట్లాడారు.
“వారి (బాధితులు) బంధువు రిజర్వ్ పోలిస్ ఫోర్స్‌లో పని చేస్తున్నారు. వారు పెట్రోలింగ్ పోలీస్‌కు సమాచారం అందించడంతో ఈ ఘటన గురించి మాకు తెలిసింది. ఆ బంధువే వారిద్దరినీ ఆసుపత్రిలో చేర్చారు’’ అని చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధిత యువతీ యువకులు అక్కాచెల్లెళ్ల పిల్లలు.
ఇద్దరూ అక్కాతమ్ముడు అవుతారు. వారు లంబానీ వర్గానికి చెందిన వారు.
అయితే, బాధిత యువతి తల్లి ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు. యువతి తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు.
మత విశ్వాసాలకు చెందిన చిహ్నాలు సామాన్య ప్రజల చర్చల్లోకి వారి చర్యల్లోకి ఎలా వచ్చాయంటూ ఈ ఘటన తర్వాత సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
జాగృతి మహిళా ఒక్కుటా సంస్థకు చెందిన శ్రద్ధా గోపాల్ మాట్లాడుతూ, ‘‘ఒక మహిళ లేదా పురుషుడు తమ విశ్వాసాలకు అనుగుణంగా ఏదైనా ధరించడం తప్పా? ఎక్కడికైనా కలిసి వెళ్లడం తప్పా? ఒక సమాజంగా మనం ఏ వైపు నడుస్తున్నాం’’ అని ప్రశ్నించారు.

వీపుపై గాయాలు, పంటి నొప్పి
బాధిత యువకుడి (21 ఏళ్లు) వీపుపై గాయం గుర్తులు ఉండగా, బాధిత యువతి (24 ఏళ్లు) ముఖం మీద కొట్టడంతో పంటి నొప్పి ఏర్పడింది.
దాడి చేసిన యువకులందరినీ షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ (అట్రాసిటీ) చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం అరెస్టు చేశారు. నిందితులంతా ముస్లింలే.
దాడి చేసిన అందరినీ అరెస్టు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
ప్రస్తుతం వీరిద్దరిపై జరిగిన దాడి ఘటన 2021 అక్టోబర్‌లో జరిగిన మరో ఘటనను తలపిస్తోంది.
అప్పుడు ఒక ఆటోరిక్షాలో తిలకం ధరించిన ఒక పురుషుడు, బురఖా వేసుకున్న ఒక మహిళ ఇద్దరూ రుణం గురించి మాట్లాడుకుంటుండగా వారిపై ఒక పురుషుల సమూహం దాడి చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరూ ముస్లిం సముదాయానికి చెందినవారే.
గడిచిన కొన్ని ఏళ్లలో మంగళూరు చుట్టుపక్కల నగరాల్లో చాలా మోరల్ పోలీసింగ్ ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుల్లో చాలా వరకు హిందూ పురుషుల మీదే ఆరోపణలు వచ్చాయి.
వీళ్లు హిందూ అబ్బాయి లేదా అమ్మాయి ప్రైవేట్ బస్సులో సీటు పంచుకోవడం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ఐస్ క్రీం దుకాణం లేదా జూకి వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బెలగావిలో పరిస్థితి ఎలా ఉంటుంది?
రాణి చెన్నమ యూనివర్సిటీకి చెందిన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ కామాక్షి తదాపద్ మాట్లాడుతూ, “తీర ప్రాంత నగరాల్లో చూస్తే బెలగావి ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. అక్కడ హిందువులు, ముస్లింల మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. కర్ణాటక తీర ప్రాంతాలు రాజకీయంగా ప్రబలంగా ఉంటాయి’’ అని అన్నారు.
1992, 2002లో జరిగిన కొన్ని సంఘటనలు మినహా ఇక్కడ ఇరు వర్గాలు శాంతియుతంగా జీవిస్తున్నాయని సామాజిక కార్యకర్త అశోక్ చంద్రగీ చెప్పారు.
‘‘ఈ రెండు వర్గాల్లో ఒక చిన్న సెక్షన్ ఉంటుంది. అవకాశం దొరికితే వాతావరణాన్ని చెడగొట్టాలని ఆ సెక్షన్ ప్రయత్నిస్తుంటుంది. ఇటీవలి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఇది సమాజానికి మంచిది కాదు’’ అని ఆయన అన్నారు.
చిన్న చిన్న ఘటనలకు కూడా తప్పుడు రంగు పులుముతున్నారని కామాక్షి అభిప్రాయపడ్డారు. ధార్మిక బోధనలకు బదులుగా ప్రజలు ఇలాంటి అంశాలకు ప్రభావితం అవుతున్నట్లు కనిపిస్తున్నారని చెప్పారు.
మతపరమైన చిహ్నాలను ధరించడం వ్యక్తిగత నిర్ణయం అని, దాన్ని అవమానించకూడదని సామాజిక కార్యకర్త బృందా అడిగే అన్నారు.
‘‘మరొకరి మీద దాడి చేసే హక్కు తమకు ఉందని భావించే వ్యక్తిని, వ్యక్తుల సమూహాల మీద చట్టాన్ని అమలు చేసే సంస్థలు కఠిన చర్యలు తీసుకోవాలి. రాజకీయ, మత పెద్దల ప్రోద్బలంతో మతోన్మాదుల అహంకారం రోజురోజుకీ పెరుగుతోంది. హింసను, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనను అధికారులు పట్టించుకోవట్లేదు’’ అని బృందా అన్నారు.
‘‘ఇలాంటి చర్యల వల్ల తమ ధర్మాన్ని రక్షించుకోవచ్చని కొందరు భావిస్తున్నారు. ఇలాంటి చర్యలకు బదులుగా నిరుద్యోగం వంటి అంశాల మీద వారు దృష్టి సారిస్తే బాగుంటుంది.
కొన్ని వారాల క్రితం ఒక మహిళను వివస్త్రను చేసి కొట్టారు. ప్రేమించిన వ్యక్తితో ఉండటమే ఆమె చేసిన తప్పు. ప్రజలను కొడుతున్న ఈ వ్యక్తులంతా ఎవరు? ఇలాంటి చర్యలతో ధర్మాన్ని రక్షించలేరు’’ అని శారదా గోపాల్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
- సెర్న్ అబ్బాస్ జెయింట్: కొండ మీద భారీ నగ్న చిత్రం.. ఎవరిదో, ఎప్పటిదో కనిపెట్టేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






