ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?

గిరిజన తెగలు

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL

ఫొటో క్యాప్షన్, గిరిజన జంట విడాకుల విషయమై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.
    • రచయిత, అలోక్ ప్రకాష్ పుతుల్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

ఒక కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు వేసిన ప్రశ్నతో గిరిజన జంటల విడాకుల అంశం మరోసారి చర్చలోకి వచ్చింది.

వివాహం అనంతరం భర్త వేధింపులకు గురి చేస్తున్నాడని, తమకు విడాకులు మంజూరు చేయాలంటూ గిరిజన మహిళ వేసిన కేసులో పిటిషనర్ తరపున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. ‘‘దేనిని అనుసరించి, గిరిజన దంపతులకు విడాకులను మంజూరు చేయాలో చెప్పండి’’ అని అడిగింది.

ఈ కేసు విషయమై బీబీసీతో పిటిషనర్ తరపు న్యాయవాది జయదీప్ సింగ్ యాదవ్ మాట్లాడుతూ- “గిరిజనులకు హిందూ వివాహ చట్టం వర్తించదు. అలాగని ప్రత్యేక వివాహ చట్టం కూడా వర్తించదు. అలాంటి సందర్భంలో విడాకులు మంజూరు చేయడానికి ఆ చట్టాలేవీ వర్తించవు. అందుకని, గిరిజన తెగల్లో విడాకుల ప్రక్రియ ఎలా ఉంటుందో సమాచారం ఇవ్వాలని న్యాయస్థానం మమ్మల్ని ఆదేశించింది” అని చెప్పారు.

న్యాయస్థానం అదేశాల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి ఉమ్మడి పౌర స్మృతి(యూనిఫాం సివిల్ కోడ్), సర్నా కోడ్‌ల గురించిన చర్చ తెర మీదకు వచ్చింది.

ఛత్తీస్‌గఢ్ హైకోర్టు

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL

గిరిజనులకు ఏ చట్టాలు వర్తించవు?

భారతదేశంలో అమలులో ఉన్న హిందూ వివాహ చట్టం, బహుభార్యత్వం, దత్తత, వారసత్వం.. వంటి చట్టాలు గిరిజనులకు వర్తించవని సర్వ్ ఆదివాసీ సమాజ్ నేత, మాజీ కేంద్ర మంత్రి అర్వింద్ నేతం అన్నారు.

“గిరిజన తెగల్లోని ఆచారాలు, సంప్రదాయాలన్ని దాదాపుగా సంప్రదాయ చట్టాల పర్యవేక్షణలో ఉంటాయి. అవే గిరిజనులకు గుర్తింపు. ఈ ప్రత్యేకత మూలంగానే కుల, మత వర్గాల నుంచి గిరిజనులు వేరుగా ఉంటారు. అలాంటప్పుడు ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) వంటి నిబంధనల పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండటం అవసరం. ఝార్ఖండ్‌లో సర్నా కోడ్ అమలు కోసం పట్టుబట్టినట్లే, గిరిజనుల కోసం దేశమంతటా ప్రత్యేకమైన చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది” అని ఆయన చెప్పారు.

అదే సమయంలో గిరిజనుల సంప్రదాయాలు, ఆచారాల్లో జోక్యం అనవసరమని సామాజిక కార్యకర్త ఇందు నేతం అభిప్రాయపడ్డారు. అయితే, కొన్ని అంశాల్లో మాత్రం మార్పులు అవసరమన్నారు.

“ఎవరు ఎలాంటి సంప్రదాయాన్ని పాటించినా గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే, రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కుకు ఎలాంటి భంగం వాటిల్లకూడదు. ముఖ్యంగా మహిళల అంశంలో అది కచ్చితంగా అనుసరించాలి. కానీ, అన్నిచోట్లా అది అమలు కావడం లేదు. అందుకు అనుగుణమైన మార్పులు అవసరం” అని ఆయన చెప్పారు.

గిరిజన తెగలకు ప్రత్యేక గుర్తింపు

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL

చట్టం ఏం చెప్తోంది?

ఛత్తీస్‌గఢ్‌లో గిరిజనులు 31 శాతం ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 41 గిరిజన తెగలున్నాయి. చాలా తెగల్లో సామాజిక, సాంస్కృతిక, మతపరమైన ఆచారాలు భిన్నంగా ఉన్నాయి. జననం, మరణం, వివాహం.. ఇలా ఒక్కో సందర్భంలో వారు పాటించే ఆచారాలు వేర్వేరుగా ఉన్నాయి.

హైకోర్టుకు చేరిన కేసు విషయంలో పిటిషనర్ కోర్భా జిల్లాకు చెందినవారు.

భరియా గిరిజన తెగకు చెందిన ఆ వివాహిత మొదట జిల్లాలోని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త నుంచి వేధింపులు ఎదురవుతున్నాయని అందులో పేర్కొన్నారు. కానీ, న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది. అనంతరం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం గిరిజన తెగల్లో అవలంబిస్తున్న విడాకుల ప్రక్రియ గురించి పిటిషనర్ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది.

ఛత్తీస్‌గఢ్ హైకోర్ట్ అడ్వకేట్ రజనీ సొరేన్ మాట్లాడుతూ, “హిందూ వివాహ చట్టం సెక్షన్ 2లోని సబ్ సెక్షన్ (2)లో పేర్కొన్న దాని ప్రకారం ఈ చట్టం గిరిజన తెగలకు చెందిన వ్యక్తులకు వర్తించదని తెలిపారు. కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా గెజిట్‌లో పేర్కొంటే తప్ప వర్తించదని చెప్పారు.

2001లో డా. సూరజ్‌మణి స్టెల్లా కుజూర్ వర్సెస్ దుర్గా చరణ్ హన్స్‌దా, ఇతరుల కేసులో సుప్రీం కోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం, ‘‘పార్టీలు (కేసులోని వ్యక్తులు) వారి సంప్రదాయం లేదా ఆచారాన్ని అనుసరిస్తే వారి మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా వారికి సంప్రదాయ చట్టం వర్తిస్తుంది. అది మాత్రమే వర్తిస్తుంది.’’

నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్‌ తరపు న్యాయవాది రజినీ సొరేన్ మాట్లాడుతూ, “విడాకులతోపాటు చాలా వివాదాలను ఆ తెగకు సంబంధించిన పంచాయతీలోనే పరిష్కారం చేస్తారు. హిందూ వివాహ చట్టం, వారసత్వం చట్టం, దత్తత…వంటి చట్టాలేవీ గిరిజనులకు వర్తించవు. ఆ గిరిజన కుటుంబం ఎలాంటి సంప్రదాయాన్ని అనుసరిస్తోందో, అందుకు అనుగుణంగానే న్యాయస్థానం కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది” అన్నారు.

గిరిజన తెగల్లో విడాకులు సాధారణమైన అంశమేమీ కాదు. కొన్ని తెగల్లో భార్యను ఇంటి నుంచి బయటకు పంపేస్తారు. అదే సమయంలో కొన్ని తెగల్లో భార్యకు కొంత మొత్తం ఇచ్చి ఆ భర్త విడాకులను పొందే వీలుంది. రెండో పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి, మొదటి భార్యకు కొంత మొత్తం ఇచ్చి, రెండో వివాహం చేసుకోవచ్చు.

ఆ అంశాలన్ని కూడా ఆయా తెగలోని పంచాయతీ నిర్ణయాలను అనుసరించే ఉంటాయి.

సర్నా చట్టం

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

పంచాయతీలో పురుషులదే ఆధిపత్యం

కొన్ని తెగల్లో మాతృస్వామ్య వ్యవస్థ మనుగడలో ఉంది. కానీ నిర్ణయాలు తీసుకునే ఆయా పంచాయతీ సభ్యుల్లో మాత్రం పురుషుల ఆధిపత్యమే ఎక్కువ ఉంటుంది.

అందువల్ల ఎక్కువ సందర్భాల్లో మహిళలే నష్టపోయే పరిస్థితి ఉంటుంది. తమ తండ్రి లేదా భర్త ఆస్తిలో వాటా పొందే హక్కును కూడా మహిళలు కోల్పోతారు.

కంకేర్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. తన కోడలు తను చెప్పిన మాట వినడం లేదని, తన కొడుక్కు విడాకులు ఇప్పించాలని అక్కడి 25 గ్రామాలకు సంబంధించిన పంచాయతీని ఆశ్రయించారు ఆమె మామ.

పంచాయతీ ఆయనకే అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. కోడలికి పరిహారంగా రూ.35 వేలు, ఆమెకు పుట్టిన బిడ్డ కోసం రూ.25 వేలు జీవన భృతిగా ఇవ్వాలని చెప్పింది. అంతేకాకుండా పంచాయతీకి రూ.45 వేలు ఇవ్వాలని ఆదేశించింది.

గిరిజన సామాజిక కార్యకర్త ఒకరు దీనిపై మాట్లాడుతూ, “అక్కడ పంచాయతీ విషయమే తీసుకోండి. ఆ వివాహిత జీవితం గురించి ఏం ఆలోచించారు? ఆమె జీవితాన్ని పంచాయతీ నిర్ణయించి, అందుకోసం రూ.45 వేలు తమకు ఇవ్వాలని ఆదేశించింది. కానీ, ఆ మహిళ జీవించడానికి రూ.35 వేలు, బిడ్డ కోసం రూ.25 వేలు ఇవ్వాలని చెప్పింది. అంత చిన్న మొత్తంతో ఆ బిడ్డ ఆలనాపాలనా చూడటం సాధ్యమేనా? ఆ బిడ్డను పెంచి పెద్దచేయడానికి ఆ డబ్బు సరిపోతుందా” అని ప్రశ్నించారు.

ఆ వివాదంలో ఆ గిరిజన జంట జిల్లా గిరిజన పంచాయతీని ఆశ్రయించింది. చివరికి భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించేలా పంచాయతీ పెద్దలు సర్దిచెప్పారు.

కొన్ని సందర్భాల్లో పంచాయతీలను ఆశ్రయించే వారిపైనే ఎక్కువ భారం పడుతుంది. సంప్రదాయాలు, ఆచారాల ముసుగులో పంచాయతీలకే ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

అదే కంకేర్ జిల్లాలో గిరిజిన వైద్యుడొకరు తన భార్యను విడిచిపెట్టి, మరో మహిళను వివాహం చేసుకోవాలని అనుకున్నారు.

తమ తెగలో బహు భార్యత్వానికి అనుమతి ఉందని, రెండో వివాహం చేసుకున్నాక, ఇద్దరు భార్యలతో కలిసి ఉండొచ్చని పంచాయతీలో ఆ వైద్యుడు చెప్పారు.

కానీ, పంచాయతీ అందుకు అంగీకరించలేదు. చివరికి ఆయన రెండో వివాహం చేసుకోవాలనుకుంటే ప్రతి నెలా ఆయనకు వచ్చే వేతనంలో సగభాగం మొదటి భార్యకు చెల్లించాల్సి ఉంటుందని పంచాయతీ తీర్పు ఇచ్చింది.

ఆ నిర్ణయంతో ఆ వైద్యుడు వెనక్కు తగ్గారు. రెండో వివాహ ప్రతిపాదనను వాయిదా వేసుకున్నారు.

గిరిజన సామాజిక పంచాయతీల అవసరం ఉందని సామాజిక కార్యకర్త ఇందు నేతం అన్నారు. అయితే, మహిళల పట్ల వివక్ష చూపే కాలం చెల్లిన ఆచారాలను పక్కకు పెట్టాలని చెప్పారు.

“దేశంలో ఉమ్మడి పౌర స్మృతి గురించి చర్చ మొదలైనప్పుడు, మా గిరిజన తెగలన్నీ వ్యతిరేకించాయి. మా సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించుకోవడం మా బాధ్యత. అదే సమయంలో భారత రాజ్యాంగం కల్పించిన పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాసే పద్ధతులను త్యజించాలి. అలా జరక్కపోతే, ఉమ్మడి పౌర స్మృతి మా గిరిజన తెగల్లోకి ప్రవేశించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది” అన్నారు.

గిరిజన తెగలకు సంబంధించిన సామాజిక, మూస ధోరణులపై చర్చలను సరికొత్త మార్గంలో సాగేలా చేయగల ఛత్తీస్‌‌గఢ్ హైకోర్టు నిర్ణయం కోసం ప్రస్తుతం అందరూ ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)