ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్‌లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న లైబీరియా దేశపు నౌకను శుక్రవారం కొందరు కిడ్నాపర్లు హైజాక్ చేయగా, భారత నౌకాదళం ఒక ఆపరేషన్‌ను చేపట్టి దాన్ని విడిపించింది.
హైజాక్ సమయంలో ఎంవీ లీలా నార్‌ఫోక్ అనే ఈ నౌకలో 21 మంది సిబ్బంది ఉండగా వారిలో 15 మంది భారతీయులు.
ఆ ఆపరేషన్‌లో కిడ్నాపర్లు తప్పించుకున్నప్పటికీ, వారి కోసం అన్వేషిస్తున్నారు.
అయితే, భారత నౌకదళం చేపట్టిన ఆపరేషన్ గురించి చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతోంది.
భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్‌తో అరేబియా సముద్ర మార్గంలో భారత్ ఎంతటి వ్యూహాత్మక పాత్ర వహిస్తుందో తొలిసారిగా ప్రపంచానికి అర్థమైంది. అంతేకాకుండా, భారత్ తన సామర్థ్యాన్ని స్వయంగా నిరూపించుకున్నట్లయింది.
అరేబియా సముద్రంలో ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే, ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సన్నద్ధంగా ఉందన్నది స్పష్టమైంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ఎర్ర సముద్రంలో హూతీ రెబల్స్ వరుసగా చేస్తున్న దాడులను ఎదుర్కోవడంలో అమెరికా పూర్తిగా నిమగ్నమై ఉంది.
అదే సమయాన అరేబియా సముద్రంలో భారత నౌకాదళ వ్యూహాత్మక పాత్ర అంతకంతకూ పెరుగుతోంది.
అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో మారీటైమ్ పాలసీ ఇన్షియేటివ్ విభాగాధిపతి అభిజీత్ సింగ్ దీనిపై రాయిటర్స్ మీడియాతో మాట్లాడారు.
"గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుంచి మొదలుకొని ఎర్ర సముద్రం వరకు యాంటీ పైరసీ ఆపరేషన్లపైనే నౌకాదళాలు దృష్టి సారించడంతో అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు దాడులు పెరుగుతున్నాయి. వారు అరేబియా సముద్రాన్ని తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఓ అవకాశంగా ఎంచుకున్నారు" అని అన్నారు.
యూఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన రెడ్ సీ టాస్క్ ఫోర్స్‌లో భారత్ భాగం కాదు.

ఫొటో సోర్స్, ANI
అరేబియా సముద్రం ఎందుకంత కీలకం?
అరేబియా సముద్రం హిందూ మహాసముద్రానికి వాయువ్య భాగాన ఉంది.
ఎర్రసముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇది మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం సరిహద్దులుగా ఉన్న అరేబియా సముద్ర తీరాన, యెమెన్, ఒమన్, పాకిస్తాన్, ఇరాన్, భారత్, మాల్దీవులు ఉన్నాయి.
ఎక్కువ సంఖ్యలో నౌకాశ్రయాలు, పోర్టులను కలుపుతూ విస్తరించిన ఉన్న అరేబియా సముద్రం వాణిజ్యపరంగా కీలకమైన సముద్రమార్గం. అంతర్జాతీయ వ్యాపారాలకు ముఖ్యమైన రవాణామార్గంగా మారింది.
కేవలం రవాణా మార్గమే కాక, సహజ చమురు, వాయు నిక్షేపాలు కూడా విస్తారంగా ఉన్నాయి.
ఇరాన్, ఇండియా, అమెరికా దేశాలకు చెందిన నౌకాదళాలకు ఈ మార్గాన ఎక్కువ సంఖ్యలో బేస్‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి.
దేశ భద్రత, స్థిరత్వం, వాణిజ్య కార్యకాపాల దృష్ట్యా భారత్‌కు అరేబియా సముద్ర ప్రాంతం ఎంతో ముఖ్యమైనది.
అరేబియా సముద్రంలో ఎలాంటి ఉద్రిక్తతలు లేకపోతేనే ప్రపంచ దేశాలకు వాణిజ్య పరంగా ఇబ్బందులు ఎదురుకావు. అరేబియా సముద్రంలో స్థిరత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది.
ఎందుకంటే, ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాల్లోని కార్మికరంగం, ఉత్పాదక పరిశ్రమలు, ఆసియా దేశాలు, సహజ వనరులు సమృద్ధిగా ఉన్న దేశాల వాణిజ్య కార్యకాలాపాలు నిరంతరాయంగా జరగాలంటే అరేబియా సముద్ర రవాణా మార్గంలో ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకూడదు.

చైనా ఆధిపత్యం..
హిందూ మహాసముద్ర తీరాన ఉన్న దేశాలకు ఇటీవలి కాలంలో చైనా కీలక భాగస్వామిగా మారింది.
చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇన్షియేటివ్, ది మారిటైమ్ సిల్క్ రోడ్ ప్రాజెక్టులతో ఆయా దేశాల మధ్య ఆర్థిక, సైనిక అంశాల పరంగా పరస్పర సహకారం అందించుకునేందుకు వేదికగా మారాయి.
ఆ దేశాల్లో చైనాకు ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతున్న కారణంగా భారత్ మరింత దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది.
2017లో జిబౌతిలో తొలి మిలటరీ బేస్‌ను ఏర్పాటుచేసింది చైనా. ఇప్పటికే అక్కడ ఫ్రాన్స్, జపాన్, అమెరికా దేశాలు మిలటరీ బేస్‌లు ఏర్పాటుచేసుకున్నాయి.
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ చైనీస్ స్టడీస్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అరవింద్ యెల్లేరి దీనిపై స్పందించారు.
“చాలాసార్లు చైనా వాణిజ్య నౌకలను దాడుల నుంచి భారత్ రక్షించింది. భారత నౌకదళానికి తమదైన సామర్థ్యం, నైపుణ్యాలు ఉన్నాయని ఒప్పుకుని తీరాలి. అంతేకాకుండా, అరేబియా సముద్రంలో భారత నౌకాదళాన్ని సవాల్ చేయడం అంత సులభం కాదు” అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సముద్రపు దొంగల ముప్పు..
గత నెలలో అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల దాడికి గురైన మాల్టా నౌకను భారత నౌకాదళం రక్షించింది.
డిసెంబర్ 23వ తేదీన ఎంవీ కెమ్ ప్లుటో అనే పేరుగల లైబీరియా దేశానికి చెందిన వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. మంగుళూరుకు వస్తోన్న ఆ నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా వారిలో 21 మంది భారతీయులు.
ఈ దాడి తర్వాత ఎర్రసముద్రంలో గాబన్ దేశానికి చెందిన ఎంవీ సాయిబాబా ఆయిల్ ట్యాంకర్‌పై కూడా డ్రోన్ దాడి జరిగింది. ఆ సమయంలో అందులో 25 మంది భారతీయ సిబ్బంది ఉన్నారు.
ఈ ఘటనలన్ని ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ పరిధిలోనే చోటు చేసుకుంటున్నాయని భారత నౌకాదళం కూడా వెల్లడించింది.
ఈ కారణంగా దాడులను తిప్పికొట్టడం, దీటుగా దాడులకు సన్నద్ధం కావడం భారత్‌కు అనివార్యంగా మారింది. ఇప్పటికే ఐదు యుద్ధ నౌకలను అరేబియా సముద్రంలో మోహరించింది భారత్. అంతేకాక, సముద్ర మార్గంపై గస్తీ నిర్వహించేందుకు విమానాలు, డ్రోన్‌తో నిఘా పెంచింది.
దాడులు చేస్తే, సహించే పరిస్థితుల్లో తాము లేమని భారత్ తన చర్యలతో చెప్పకనే చెప్పింది. శుక్రవారం భారత నేవీ కమాండోలు నిర్వహించిన దాడులు అందుకు నిదర్శనం.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఎలాంటి సందేశమిచ్చింది?
అరవింద్ యెల్లేరి దీని గురించి మాట్లాడుతూ, “ఈ ఆపరేషన్ వాణిజ్యపరంగా భారత్‌కు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, అరేబియా సముద్రం గుండా వాణిజ్య నౌకలు అటు మధ్యధరా సముద్రం వైపు, సూయజ్ కాలువవైపు ప్రయాణం చేస్తాయి. సూయజ్ కెనాల్ ప్రపంచ దేశాలకు ఎంతటి కీలకమైన మార్గమో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఈ మార్గం గుండా యూరోపియన్ దేశాలకు, అమెరికాకు వాణిజ్యపరమైన రవాణా జరుగుతుంది.’’ అని వివరించారు.
ఈమధ్య కాలంలో హిందూ మహా సముద్రం, అరేబియా సముద్ర సరిహద్దున ఉన్న చిన్న చిన్న దేశాలన్ని చైనాకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, అటువైపే మొగ్గుచూపుతున్నాయి.
భారత్ ఆ దేశాలకు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు అయిందని విశ్లేషకులు అంటున్నారు.
“భారత్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని భావిస్తూ, చైనావైపు మొగ్గుచూపుతున్న దేశాలకు భారత్ సామర్థ్యం గురించి చెప్పకనే, ఓ సందేశాన్ని ఇచ్చినట్లే” అన్నారు అరవింద్ .
“భారత నౌకాదళ కమాండోలు చేపట్టిన ఈ ఆపరేషన్‌తో భారత్‌పై ఎవరేమనుకున్నా సరే, సముద్రమార్గాల నిర్వహణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను భారత్ ఎంత సమర్థవంతంగా నిర్వర్తిస్తుందో సందేశం ఇచ్చాం. సహాయం కోరినప్పుడు చైనా వెనక్కి తగ్గితే, భారత్ మాత్రం వెంటనే స్పందింస్తుంది అన్న సందేశం మరొక్కసారి ప్రపంచదేశాలకు తెలిసింది” అని అరవింద్ వెల్లడించారు.

ఫొటో సోర్స్, ANI
తిరుగులేని శక్తిగా భారత నౌకాదళం
గడిచిన పదేళ్లలో భారత నౌకాదళాన్ని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ అమలుచేస్తూ వస్తున్నారు. ఆ ఫలితం ఇప్పుడు కనిపించందని విశ్లేషకులు అంటున్నారు.
“అరేబియా సముద్రంలోని సోమాలియా తీరంలో భారత నౌకాదళం చేపట్టిన ఆపరేషన్ భారత నౌకాదళ సమర్థతకు సాక్ష్యం” అన్నారు సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్, ప్రముఖ స్ట్రాటజిక్ ఎక్స్‌పర్ట్ సి.ఉదయ్ భాస్కర్.
“భారత నౌకా దళంపై భారీ పెట్టుబడులు పెట్టారు. ఇలాంటప్పుడు కాకపోతే, ఇంకెప్పుడు భారత నౌకాదళ సామర్థ్యాన్ని చూపే వీలు కలుగుతుంది?” అని ఉదయ్ భాస్కర్ వివరించారు.
అరేబియా సముద్రంలో దాడులెందుకు పెరుగుతున్నాయి?
గతంలోనూ అరేబియా సముద్రంలో సముద్రపు దొంగలు దాడులు జరిగేవి. కానీ, ఈ స్థాయిలో ఇంతకుముందెన్నడూ జరగలేదు.
మిడిలీస్ట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయి. తిరుగుబాటుదారుల సంఖ్య పెరిగింది. వారికి డబ్బు కావాలి. అందుకోసం సముద్రమార్గాలను వారు ఎంచుకుంటున్నారు. ఎందుకంటే, సముద్రంలో దాడులు చేయడానికి భారీ ఆయుధాలు అవసరముండదు.
“ఆఫ్రికా, మిడిలీస్ట్ దేశాల్లో పెరుగుతోన్న అంతర్గత కల్లోలాలు సముద్రంలో నౌకలపై దాడులు పెరగడానికి కారణం అవుతున్నాయి. యెమెన్, సూడాన్‌లతోపాటు పలు మిడిలీస్ట్ దేశాలలో నెలకొన్న గందరగోళ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే బృందాలకు డబ్బు అవసరం. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, దాడులకు పాల్పడుతున్నారు. వాణిజ్య మార్గాలను ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా డబ్బు సంపాదించొచ్చని వారు భావిస్తున్నారు” అని అరవింద్ యెల్లేరి వివరించారు.
ఇవి కూడా చదవండి..
- సెర్న్ అబ్బాస్ జెయింట్: కొండ మీద భారీ నగ్న చిత్రం.. ఎవరిదో, ఎప్పటిదో కనిపెట్టేశారు
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
- జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














