సెర్న్ అబ్బాస్ జెయింట్: కొండ మీద భారీ నగ్న చిత్రం.. ఎవరిదో, ఎప్పటిదో కనిపెట్టేశారు

శతాబ్దాల కిందటి రహస్యాన్ని ఛేదించామని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్తున్నారు. వీరు ఛేదించామంటున్న రహస్యం ఇంగ్లండ్‌లోని డోర్‌సెట్ ప్రాంతంలో సెర్న్ అబ్బాస్ గ్రామానికి సమీపంలోని ఓ లోయ ప్రాంతంలో నిటారుగా ఉన్న కొండ రాయిపై ఉన్న భారీ నగ్న చిత్రానికి సంబంధించినది.
ఈ రాతి చిత్రం వెస్ట్ శాక్సన్ సైన్యాలు చేరిన ప్రాంతానికి చిహ్నంగా చెక్కిన హెర్క్యులస్ చిత్రమని ఆక్స్‌ఫర్డ్ పరిశోధకుల తాజా అధ్యయనం చెప్తోంది.
ఈ చిత్రం చరిత్రకు పూర్వకాలం నాటిదని చాలామంది ఇంతకాలం విశ్వసిస్తూ వచ్చారు. అయితే, తాజా అధ్యయనంలో ఈ ప్రాచీన చిత్రాన్ని 11వ శతాబ్దంలో అప్పటి సన్యాసులు దీన్ని పునర్నిర్వచించారని చెప్పారు.

నేషనల్ ట్రస్ట్ అధీనంలో ఉన్న ఈ ప్రదేశంలో 2021లో కొన్ని పరీక్షలు చేపట్టారు. ఆ పరీక్షల్లో ఈ చిత్రం ఆంగ్లో శాక్సన్ కాలం నాటిదని తేల్చారు.
అంతేకానీ, చరిత్రకు పూర్వం నాటిదో లేదంటే ఆధునిక కాలానికి చెందినదో కాదని స్పష్టం చేశారు.
ఇంతకీ ఈ చిత్రాన్ని ఎందుకు చెక్కారనేది కనుగొనేందుకు డాక్టర్ హెలెన్ గిటోస్, థామస్ మోర్కామ్‌లు అధ్యయనం చేస్తున్నారు.
హెర్య్క్యులస్ మధ్య యుగంలో బాగా ప్రసిద్ధి పొందాడని, 9వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతం వైకింగ్‌ల దాడులకు గురైన సమయంలో హెర్క్యులస్‌పై ఇక్కడి ప్రజల్లో బాగా ఆసక్తి ఉండేదని వారు వివరించారు.

ఫొటో సోర్స్, JOHN CAIRNS
ఎత్తైన కొండవాలు నుంచి ప్రధాన మార్గానికి దారి తీసే చోట ఉన్న ఈ భారీ రాతి చెక్కడం ఉన్న ప్రదేశం నీరు, ఆహార వనరులకు చేరువలో ఉంది.
అందుకే వెస్ట్ శాక్సన్ సైన్యాలు దీన్ని వారు జమయ్యే ప్రదేశంగా మలచుకుని ఉంటారని వీరు విశ్లేషించారు.
మధ్య యుగ తొలినాళ్ల చరిత్రకు సంబంధించిన అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ హెలెన్ మాట్లాడుతూ.. ‘9, 10 శతాబ్దాల కాలంలో ఈ ప్రాంతమంతా వెస్ట్ శాక్సన్ రాచ కుటుంబ యాజమాన్యంలో ఉండేది. దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. ఈ రాతిచెక్కడం ప్రాంతంలో సైనిక మార్గం ఉండేదని, ఇది సమావేశ స్థలంగా ఉండేదని ఆ ఆధారాలు వివరిస్తున్నాయి’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, BRITISH LIBRARY
బ్రిటిష్ లైబ్రరీలో ఉన్న 11వ శతాబ్దానికి చెందిన ప్రతులలోనూ ఈ భారీ రాతి చెక్కడం ప్రస్తావన ఉంది.
అప్పటి సెయింట్ ఈడ్‌వడ్ తన సిబ్బందితో కలిసి ఇక్కడ ఆవాసం చేసుకున్నట్లు ఆ ప్రతులు సూచిస్తున్నాయి.
సెర్న్ అబేలోని సన్యాసులు సెయింట్ ఈడ్‌వడ్ రూపంలో ఈ చెక్కడాన్ని మార్చే ప్రయత్నం చేశారన్న భావన ఒకటి ఉంది.

ఫొటో సోర్స్, DR THOMAS MORCOM
ఓస్లో యూనివర్సిటీకి చెందిన డాక్టర్ మోర్కోమ్ దీనిపై మాట్లాడుతూ.. ‘నగ్నంగా ఉన్న ఒక పెద్ద బొమ్మ మీ ఇంటి గుమ్మంలో ఉంటే ఏం చేస్తారు..? ఈ సన్యాసులు కూడా అసౌకర్యంగా ఫీలై ఆ చిత్రాన్ని తమ పోషకుడైన సెయింట్ ఈడ్‌వడ్‌ని తలపించేలా మార్పులు చేశారు’ అని చెప్పారు.
డాక్టర్ గిటోస్, మోర్కోమ్ కనుగొన్న విషయాలు ‘మెడియవల్ అకాడమీ ఆఫ్ అమెరికా’ స్పెక్యులమ్ జర్నల్‌లో ప్రచురితమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- కల్పనా సోరెన్: సీఎం భార్య కోసమే ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ చేశారా?
- యాపిల్ ఐఫోన్ కంపెనీని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా, వాషింగ్టన్ పోస్ట్ కథనంలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















