జపాన్ భూకంపం: శిథిలాల కింద 5 రోజుల తర్వాత సజీవంగా దొరికిన 90 ఏళ్ల బామ్మ

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, విక్కీ వాంగ్
- హోదా, బీబీసీ న్యూస్
జపాన్‌లో విధ్వంసకర భూకంపం తరువాత అయిదు రోజులకు శిథిలాల కింద నుంచి 90 ఏళ్ల వృద్ధురాలు ప్రాణాలతో బయటపడ్డారు.
సుజు పట్టణంలోని ఒక రెండస్థుల భవనం శిథిలాల కింద ఆమెను సహాయక సిబ్బంది గుర్తించారు.
జపాన్ సముద్ర తీర ప్రాంతంలో సోమవారం 7.5 తీవ్రతతో భూకంపం రావడంతో నోటో ద్వీపకల్పంలోని పట్టణాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.
భూకంపం వల్ల 120 మంది చనిపోయినట్లు, 200 మంది కనిపించకుండా పోయినట్లు ధ్రువీకరించారు.
సుజు పట్టణంలో ఇద్దరు మహిళలు శిథిలాల కింద సజీవ సమాధి అయినట్లు తెలియడంతో అక్కడికి 100 మంది సహాయక సిబ్బందిని పంపించారని వార్తాపత్రిక యోమిరీ షింబున్ పేర్కొంది.
అందులో ఒక వృద్ధురాలు ప్రాణాలతో కనిపించారని, ఆమె హైపోథెర్మియాతో బాధపడుతున్నారని స్థానిక పోలీసు వర్గాలను ఉటంకిస్తూ యోమిరీ షింబున్ తెలిపింది.
సహాయక సిబ్బంది అదే ప్రాంతంలో 40వ పడిలో ఉన్న మరో మహిళను గుర్తించారని, అయితే ఆమె కార్డియోపల్మనరీ అరెస్ట్‌కు గురయ్యారని వెల్లడించింది.

ఫొటో సోర్స్, REUTERS
భూకంపం తర్వాత తొలి 72 గంటలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి సమయం గడిచినకొద్దీ ప్రజలు ప్రాణాలతో బయటపడే అవకాశాలు తగ్గిపోతాయి. ఈ 72 గంటల గడువు ముగిసి రోజుల గడిచిన తర్వాత ఈ ఇద్దరు మహిళల్ని సహాయక సిబ్బంది గుర్తించారు.
సహాయక చర్యల కోసం, రోడ్లు బ్లాక్ అయిన ప్రాంతాలకు వస్తువుల సరఫరా కోసం జపాన్ సహాయక బలగాలు హెలీకాప్టర్లను ఉపయోగిస్తున్నాయి.
30 వేల కంటే ఎక్కువ మంది ప్రభుత్వ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఇషికావాలో శనివారం వరకు 23,200 ఇళ్లకు విద్యుత్ సరఫరా, 66,400 ఇళ్లకు నీటి సరఫరా నిలిచిపోయింది.
రాష్ట్రం అత్యంత ఘోర పరిస్థితుల్లో ఉందని విపత్తు నిర్వాహక సమావేశంలో ఇషికావా గవర్నర్ హిరోషి అన్నారు.
ఎక్కువ సంఖ్యలో నీళ్ల పైపులు పగిలిపోవడంతో ఇళ్లకు నీటి సరఫరా పునరుద్ధరణకు చాలా సమయం పడుతుందని ఆయన హెచ్చరించారు.
వృద్ధుల బాగోగులు చూసే కొన్ని ఆసుపత్రులు, వసతులకు కూడా నీటి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ప్రపంచంలో ఎక్కువగా భూకంపాలు సంభవించే దేశాల్లో జపాన్ ఒకటి. 2020 చివరి నుంచి నోటో పరిసర ప్రాంతాల్లో భూకంప కేంద్రాలు చురుగ్గా మారడం పెరిగింది. గత మూడేళ్లలో చిన్న, మధ్య తరహా కలిపి మొత్తం 500కు పైగా భూకంపాలు సంభవించాయి.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర కొరియా: కిమ్ వారసత్వాన్ని ఎవరు దక్కించుకుంటారో తెలిసిందన్న సౌత్ కొరియా స్పై ఏజెన్సీ.. ఇంతకీ ఎవరా లీడర్?
- ఈడీ-సీబీఐ: బీజేపీలో చేరితే కేసులు ఉండవా, ప్రతిపక్షాల ఆరోపణ నిజమేనా?
- చిన్న వజ్రం కోసం వెతుకుతున్న నిరుపేద కుర్రాళ్లకు రూ. కోట్ల విలువైన డైమండ్ కనిపించింది...ఆ తర్వాత వారికి ఏమైంది?
- కెమెరాకు చిక్కిన సగం ఆడ, సగం మగ పక్షి ఇది....
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














