జపాన్ భూకంపం: 48కి చేరిన మృతుల సంఖ్య

ఫొటో సోర్స్, Getty Images
జపాన్‌లో 7.6 తీవ్రతతో సంభవించిన శక్తిమంతమైన భూకంపం కారణంగా చనిపోయినవారి సంఖ్య 48కి చేరింది.
ఇషికావా ప్రిఫెక్చర్‌లో భూకంప నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది. జపాన్ వాయువ్య తీరంలోని ఈ ప్రాంతంలోనే భూకంప కేంద్రం ఉంది.
సోమవారం భూకంపం వచ్చాక వేల మంది ప్రజల్ని తీర ప్రాంతం నుంచి అధికారులు సురక్షిత కేంద్రాలకు తరలించారు.
ఇళ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి సైన్యం ఆహారం, నీరు, దుప్పట్లు అందిస్తోంది.
జపాన్‌లోని నొటో ద్వీపకల్పంలో ప్రజలు ఆహారం, నీటి కోసం స్టోర్ల ముందు బారులు తీరారు. చాలా ప్రాంతాల్లో పెట్రోలు బంకుల దగ్గర కార్లు క్యూలలో కనిపిస్తున్నాయి.

ఫొటో సోర్స్, Emma Ward
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సాయం అందించేందుకు రెస్క్యూ సిబ్బంది వేగంగా కదులుతున్నారు.
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చేందుకు సహాయ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
కొన్ని ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోవడం కష్టంగా మారిందని, అయినప్పటికీ ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రధానమంత్రి ఫుమియో కిషిడా తెలిపారు.
భూకంప బాధితులకు అమెరికా అండగా ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.
సునామీ హెచ్చరిక ఉపసంహరణ
ప్రకంపనల నేపథ్యంలో తీర ప్రాంతాల్లోని వేల మంది సోమవారం రాత్రి పునరావాస కేంద్రాల్లోనే ఉండిపోయారు.
సోమవారం జారీచేసిన సునామీ ప్రమాద హెచ్చరికను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం హెచ్చరిక స్థాయిని అడ్వైజరీ స్థాయికి తగ్గించారు.
ప్రజలు భూకంపానికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో సోర్స్, Reuters
వేల ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్
జపాన్‌భూకంపానికి సంబంధించి బయటకు వచ్చిన ఫోటోలు, ఫుటేజిల్లో భూకంప తీవ్రత కనిపిస్తోంది.
రోడ్లపై భారీ చీలికలు, ధ్వంసమైన భవనాల శిథిలాలు ఫొటోల్లో కనిపిస్తున్నాయి.
మరోవైపు, ఇషికావా జిల్లాలోని దాదాపు 32,500 ఇళ్లకు విద్యుత్ నిలిచిపోయిందని స్థానిక ప్రభుత్వాలను ఉటంకిస్తూ క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది.
ఈ ప్రాంతంలోని చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపినట్లు క్యోడో పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters
మూడు గంటల్లో 30 సార్లు కంపించిన భూమి
సోమవారం సెంట్రల్ జపాన్‌లో మూడు గంటల్లో 3.6 నుంచి 7.6 స్థాయితో 30కి పైగా భూప్రకంపనలు వచ్చాయి.
ప్రభుత్వం భూకంపాలకు సంబంధించి దేశవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేసింది.
ఇషికావా, నిగాటా, నగానో, టొమాయా నగరాలను అప్రమత్తం చేసింది.

ఫొటో సోర్స్, Kyodo via Reuters
నోటో ద్వీపకల్పంలో రికార్డు తీవ్రతతో భూకంపం
ఇషికావా రాష్ట్రం నోటో ద్వీపకల్పంలో ఇంతకుముందెన్నడూ లేని తీవ్రతతో భూకంపం వచ్చినట్లు జపాన్ వాతావరణ ఏజెన్సీ చెప్పింది.
నోటోలో భూకంపం తీవ్రత 7.6గా రికార్డు అయింది.
1885లో రికార్డులు నమోదు చేయడం మొదలైనప్పటి నుంచి నమోదైన గరిష్ఠ తీవ్రత ఇదేనని వాతావరణ శాఖ వెల్లడించింది.
2011 మార్చి తర్వాత సునామీ హెచ్చరిక జారీ చేయడం ఇదే తొలిసారని ఏజెన్సీ అధికారి ఒకరు తెలిపారు.
కొండచరియలు విరిగిపడటం, మంటలు చెలరేగడం వంటివి తలెత్తే ప్రమాదం ఉందని చెప్పారు.

ఫొటో సోర్స్, Kyodo via Reuters

ఫొటో సోర్స్, Kyodo via Reuters
తీర ప్రాంత నగరంలో మంటలు
భూకంపం తర్వాత ఇషికావా రాష్ట్రం వజీమా ప్రాంతంలో భారీ మంటలు చెలరేగినట్లుగా ఏరియల్ ఫొటోలు చూపిస్తున్నాయి.
భూకంపం కారణంగా ధ్వంసమైన ఇళ్ల శిథిలాల కింద ప్రజలు ఇరుక్కుపోయిన కేసులు ఆరు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్: గంజాయి సాగు చేయకపోతే బతికేలా లేమని ఆ రైతులు ఎందుకు అంటున్నారు?
- ఆంధ్రప్రదేశ్: పుంజుది దక్షిణ అమెరికా.. పందెం గోదావరి జిల్లాలో
- ‘బతికున్నవారి కంటే శవాలే నయం’.. మృతదేహాలకు పోస్ట్మార్టం చేసే మహిళ
- కాళేశ్వరం ప్రాజెక్ట్: తెలంగాణ మంత్రుల పర్యటనతో తేలిందేమిటి... కుంగిన మేడిగడ్డ బరాజ్ పియర్లను ఏం చేస్తారు?
- 6 గ్యారెంటీలకు ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలి? రైతు భరోసా, ఉచిత కరెంటు, రూ.4,000 పింఛను పథకాలకు ఎవరు అర్హులు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















