ముక్తా సాల్వే: ‘తొలి దళిత రచయిత్రి’.. 14 ఏళ్ల వయసులోనే బ్రాహ్మణుల ఆధిపత్యానికి సవాల్

ముక్తా సాల్వె

ఫొటో సోర్స్, FLOWER MEMORIAL

ఫొటో క్యాప్షన్, జ్యోతిబా ఫూలే స్థాపించిన పాఠశాలలోనే ముక్తా సాల్వే చదువు మొదలైంది.
    • రచయిత, విద్య కులకర్ణి
    • హోదా, బీబీసీ కోసం

మహరాష్ట్రలోని పుణెలో మహాత్మా జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలేలు స్థాపించిన పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని ఆమె. చదవటం, రాయడం నేర్చుకుంటున్న ఆ విద్యార్థినికి తన మనసులో మెదిలిన భావాలను, ప్రశ్నలను అక్షరాలుగా మలచాలని అనిపించింది. అలా ఆమె మొదటి వ్యాసం రాసింది. ఆమె పేరు ముక్తా సాల్వే.

ముక్తా సాల్వే రాసిన చిన్న వ్యాసంలో ‘మహర్‌లు ఎదుర్కొంటున్న వ్యథ, న్యాయం’ గురించి ఉంది. కేవలం మహర్‌లు ఎదుర్కొంటున్న సమస్యల గురించే కాకుండా, వాటి వెనక ఉన్న కారణాలను కూడా ఆ వ్యాసంలో రాశారు. ఆ సమయంలో సామాజికంగా అంతరాలు నెలకొన్న పరిస్థితుల్లో, ముక్తా సాల్వే చేసిన ప్రయత్నం సాహసంతో కూడుకున్నది.

ఇది సుమారు 167 ఏళ్ల క్రితం 1855లో జరిగింది. ముక్తా సాల్వే రచనకు మద్దతు లభించింది. ఇప్పటికీ దళిత రచయిత్రుల గురించి ప్రస్తావన వచ్చిందంటే, తొలుత ఆమె పేరుతోనే ప్రారంభిస్తారు. ‘దళిత మహిళా సాహిత్యానికి ఆమె తొలి అడుగు’ వేసిందని చెప్తారు.

ముక్తా సాల్వె

ఫొటో సోర్స్, FLOWER MEMORIAL

ఫూలే స్థాపించిన పాఠశాలలో చదువుకుని..

1840లో పుణెలో జన్మించారు ముక్తా సాల్వే. ఆ కాలంలో సమాజంలో ‘అగ్రవర్ణాలు’గా చెప్పుకొనే కులాల ఆధిపత్యమే ఉండేది. కులాల వారీగా వర్గీకరణ చేసి, అగ్రకులాల వారే ఆధిపత్యాన్ని చెలాయించేవారు. మాతంగిల కులంలో జన్మించారు ముక్తా సాల్వే. ఆ సమయంలో మాతంగి కులానికి చెందిన వారిని అంటరానివారిగా పరిగణించేవారు.

కులవ్యవస్థలో చివరి మెట్టున ఉన్న మాతంగి కులానికి చెందిన వ్యక్తి కావడంతో చిన్నతనం నుంచే సమాజం నుంచి వివక్షను ఎదుర్కొన్నారు ముక్తా.

ఆ సమయంలో విద్య కూడా బ్రాహ్మణ కులానికి మాత్రమే పరిమితమైంది. మహిళలు, సమాజంలో అంటరానివాళ్లుగా పరిగణించే వారు చదుకోవడం నిషిద్ధం.

క్రమంగా దేశమంతటా బ్రిటిషర్ల పాలన మొదలై, మహారాష్ట్రలో పీష్వాల ఆధిపత్యం తగ్గడం ప్రారంభమైంది. అదే సమయంలో వర్ణ వివక్ష ప్రభావం కూడా తగ్గడం మొదలైంది. బ్రిటిషర్లు ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించారు. మిషనరీల ఆధ్వర్యంలో నడిచే పాఠశాలల్లో బాలికలు కూడా చదువుకునేందుకు వీలు కల్పించారు. అయితే, ఆ పాఠశాలల్లో వెళ్లేందుకు కూడా కొన్ని వర్గాలు ఉద్దేశపూర్వకంగా వీలు కల్పించలేదు. అలాంటి కారణాల రీత్యా 1851 వరకు ముక్తా పాఠశాలకు వెళ్లలేకపోయారు.

జ్యోతిబా, సావిత్రిబాయి ఫూలేలు పుణెలో బాలికా విద్య కోసం పాఠశాలలు ప్రారంభించారు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల ప్రారంభించిన తొలి భారతీయులుగా చరిత్రలో నిలిచారు. అన్ని వర్గాలకు చెందిన బాలికలకు ఆ పాఠశాలల్లో చదువుకునేందుకు అవకాశం కల్పించారు.

1848లో భిదేవాడలో తొలి పాఠశాలను ప్రారంభించారు. సామాజికంగా వ్యతిరేకత వచ్చినా వెనుకాడలేదు.

ఒక్క పాఠశాలను ప్రారంభించడమే అసాధ్యమైన తరుణంలో ఆ దంపతులు వెనక్కి తగ్గకుండా అందరికీ విద్యను అందించాలని, ఎక్కువ సంఖ్యలో పాఠశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. పుణెలో 1851-52 నుంచి ఒకదాని తర్వాత మరొక పాఠశాల పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుంటూ వెళ్లారు.

రెండో పాఠశాల చిప్లంకర్ వాడలో, మూడో పాఠశాల వెతల్ పెథ్‌లో ప్రారంభించారు. ఆ దంపతుల ఆదర్శ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన వారిలో లహూజీ సాల్వే ఒకరు. ఆమె మేనకోడలే ముక్తా సాల్వే.

11 ఏళ్ల వయసులో వెతల్ పేథ్‌లోని పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లారు. మాతంగి/మాంగ్ కులం నుంచి పాఠశాలకు వెళ్లిన తొలి బాలిక కూడా ముక్తా స్వాలేనే.

ముక్తా సాల్వే రాసిన తొలి వ్యాసం ‘మహర్‌ల వ్యథలు’ 1855లో వెలుగులోకి వచ్చింది. అప్పటికి ముక్తా పాఠశాల చదువు మొదలుపెట్టి మూడేళ్లు మాత్రమే అవుతున్నా, ఆమె పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోయింది.

14 ఏళ్ల వయసులో తొలి వ్యాసం రాసిన ముక్తా ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. అందుకే ఇప్పటికీ దళిత సాహిత్యంలో ఆమెకంటూ స్థానం ఉంది.

ముక్తా సాల్వె

ఫొటో సోర్స్, FLOWER MEMORIAL

ఫొటో క్యాప్షన్, జ్ఞానోదయ పత్రిక

‘మా మతమేదో చెప్పండి’

సామాజిక పరిస్థితులపై ముక్తా రాసిన వ్యాసం చాలా ప్రశ్నల్నే లేవనెత్తింది. ఆ వ్యాసంలో మహర్‌ల సమస్యల గురించి దేవుణ్ని ప్రశ్నించారు ముక్తా. తమను మత వ్యవస్థ నుంచి మినహాయించడం పట్ల దేవుడికి ఫిర్యాదు చేస్తున్నట్లుగా రాశారు.

మత వ్యవస్థను బ్రాహ్మణులు తమ చేతుల్లో పెట్టుకుని నియంత్రిస్తున్నారని, ఆ వ్యవస్థని ‘లదుఖౌ’గా చెప్తున్నారని ఆ వ్యాసంలో రాశారు.

“వేదాలే జ్ఞానానికి మూలం అని బ్రాహ్మణులు చెప్తుంటారు. వేదాలను చదివేందుకు వారికే అర్హత ఉందని కూడా బ్రాహ్మణులు అంటున్నారు. గమనిస్తే, మనకు (మహర్‌లకు) ఆ వ్యవస్థలో స్థానం లేదు. మరి, జ్ఞానానికి మూలమైన వేదాలను చదివేందుకు మనకు అర్హత లేనప్పుడు, ఆ వ్యవస్థలో మనకు స్థానం లేనప్పుడు మనకంటూ ఏ మతం లేనట్లేగా? అంతేనా?” అని రాశారు.

తాము ఏ మతానికి చెందిన వారం అంటూ లోకాన్ని నియంత్రించే వారిని ప్రశ్నించారు ముక్తా. అంతేకాకుండా మతం ఎలా ఉండాలో కూడా ఆమె అభిప్రాయాన్ని రాశారు.

“మరి, దేవుడా... మీ నుంచి వచ్చిన మతమేదో మాకు చెప్పండి. మేం కూడా దానిని అనుసరిస్తాం. అంతేకానీ, కేవలం ఒక్కరికి మాత్రమే అర్హత కల్పించే, స్థానం కల్పించే మతం, ఇతరులను అణచివేస్తూ, వివక్షచూపించే మతాన్ని మాత్రం నశించాలని కోరుకుంటాం. ఎందుకంటే, అలాంటి మతాన్ని చూసి గర్వపడాల్సి అవసరం లేదు” అని రాశారు.

మతం అనేది మానవత్వాన్ని, సమానత్వాన్ని పెంచేలా ఉండాలి కానీ, జన్మతోనే సామాజికపరంగా, కులం ఆధారంగా వివక్షను ప్రోత్సహించేలా ఉండకూడదని కూడా రాశారు.

అప్పటి పీష్వాల పాలన గురించి మరింత ఘాటుగా స్పందించారు ముక్తా సాల్వే.

“బ్రాహ్మణులు ఇతర కులాల వారిని చాలా తక్కువగా చూశారు. మమ్మల్ని జంతువుల కన్నా హీనంగా చూశారు. ఆవులు, గేదెల కన్నా మేం తక్కువ స్థాయి వాళ్లం అన్నట్లు వారు ప్రవర్తించారు. వినండి, బాజీరావ్ మీ హయాంలో మేం గాడిదలమా? ఇంకేమన్నానా?” అని ఘాటుగా రాశారు.

బహుజనుల పట్ల పీష్వాల కాలంలో తీవ్రమైన వివక్ష ఉందని ఆమె చెప్పారు.

ముక్తా సాల్వె

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముక్తా సాల్వే వ్యాసం గురించిన ప్రస్తావన

మూడు వేల మంది సమక్షంలో..

ముక్తా సాల్వే రాసిన ఆ వ్యాసం రెండు భాగాలుగా అప్పటి పత్రిక ‘జ్ఞానోదయ’లో ప్రచురితమై, ఎక్కువ మందికి చేరువైంది.

1855 ఫిబ్రవరి 15న మొదటి భాగం, మార్చి 1వ తేదీన రెండో భాగం ప్రచురితమైంది. ఆ వ్యాసానికి స్పందనగా వచ్చిన రెండు లేఖలను కూడా ఆ పత్రికలో ప్రచురించారు. అదే ఏడాది బాంబే స్టేట్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్‌లో కూడా ఆ వ్యాసాన్ని ప్రచురించారు.

అంతేకాకుండా, ఆ వ్యాసాన్ని అందరి ముందు చదివే అరుదైన అవకాశం ముక్తా సాల్వేకు లభించింది.

అప్పటి శిక్షాస్మృతి విభాగ అధిపతి, పూనా కళాశాల ప్రిన్సిపల్, ఫూలే విద్యావిధానానికి మద్దతుగా నిలిచిన మేజర్ కాండీ ఆధ్వర్యంలో విశ్రంభగ్వర‌లో జ్యోతిబా సన్మాన సభ నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి మూడు వేల మంది పైగా వచ్చారు. ఆ సభలో, అతిథుల సమక్షంలో తన వ్యాసాన్ని చదివారు ముక్తా సాల్వే. ఆమె వ్యాసానికి ముగ్ధుడైన కాండీ ఆమెను ప్రశంసించడమే కాక, బహుమతిగా చాక్లెట్‌ను ఇచ్చారు.

అందుకు ముక్తా, “సార్, నాకు చాక్లెట్ వద్దు. అందుకు బదులుగా గ్రంథాలయం కావాలి” అని అడిగారు.

ఆ సమయంలో దళితులకు విద్య అందని ద్రాక్ష. కానీ, ముక్తా ఏకంగా గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కోరడం ఆమెలోని విప్లవాత్మక ఆలోచనాధోరణికి నిదర్శనం.

సావిత్రి బాయి ఫూలే

ఫొటో సోర్స్, GOVERNMENT OF MAHARASHTRA

ఫొటో క్యాప్షన్, సావిత్రిబాయి ఫూలే

‘తొలి దళిత రచయిత్రి’

ముక్తా సాల్వే తన వ్యాసంలో లేవనెత్తిన అంశాలు, సమస్యల గురించి చర్చ అప్పటికే పరిమితం కాలేదు. సమాజంలో నెలకొన్న అంతరాలపై ఆమెకున్న అవగాహన, ఆమె ఆలోచనలు ఇప్పటికీ చర్చించుకునేవే.

1868లో మహాత్మా ఫూలే, బాబా పద్మాజీ, రెవరెండ్ ముర్రే మిచెల్‌ల స్నేహితుడు జోషి ప్రచురించిన ‘డిస్క్రిప్షన్ ఆఫ్ పుణె సిటీ’ పుస్తకంలో ముక్తా వ్యాసంలోని కొంత భాగాన్ని ప్రస్తావించారు.

అంతేకాకుండా, ముక్తా మరాఠీలో రాసిన వ్యాసానికి ఆంగ్ల అనువాదాన్ని 1991లో ‘విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా: 600 బీసీ టూ ప్రెజెంట్’ అనే పుస్తకంలో ప్రచురించారు రచయిత్రులు సూసీ తరు, కె.కె.లలిత.

ఇప్పటికీ ఆమె రాసిన వ్యాసానికి ఇంగ్లిష్, హిందీ అనువాదాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

14 ఏళ్ల వయసులో మాంగ్/మహర్‌ వ్యథల గురించి రాసిన ముక్తాసాల్వేను ‘తొలి దళిత రచయిత్రి’గా చెప్తారు.

ఆమె తరువాతి రచనలు, ఇతర సమాచారం ప్రస్తుతం అందుబాటులో లేవు. ఆమె జీవిత విశేషాలు, రచనల సమాచారం తొలగించినప్పటికీ, ఆమె రాసిన తొలి వ్యాసం ఇప్పటికీ అందుబాటులో ఉంది. ఆ ఒక్క రచనతోనే ఆమె స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

(ఈ వ్యాస రచయిత్రి ఫోటోగ్రాఫర్, ఫిల్మ్‌మేకర్, మహిళల సమస్యలపై పోరాడే కార్యకర్త. ఈ కథనంలోని అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతం.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)