నెలసరి సెలవులు: మహిళలకు ఆ మూడు రోజులు లీవ్ ఎందుకు ఇవ్వకూడదు?

నెలసరి సెలవులు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నాసిరుద్దీన్
    • హోదా, బీబీసీ కోసం

నెలసరి సమయంలో మహిళలకు సెలవులు ఇవ్వాలా, వద్దా? అసలు ఈ విషయంపై ప్రస్తుతం ఎందుకు చర్చ జరుగుతోంది.

తాజాగా కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఈ అంశంపై స్పందించారు. నెలసరి సమయంలో మహిళలకు సెలవు అవసరంలేదని అన్నారు. ‘‘ఇదేమీ వ్యాధి లేదా వైకల్యం కాదు. ఈ సమయంలో మహిళలకు సెలవులు ఇచ్చే ప్రతిపాదనేమీ ప్రభుత్వం దగ్గర లేదు’’ అని ఆమె చెప్పారు.

నెలసరి అనేది వ్యాధి లేదా వైకల్యం కాదు. స్మృతీ ఇరానీ చెప్పినది నిజమే. ఇదొక సహజంగా జరిగే ప్రక్రియ. మహిళల జీవితాలతో దీనికి విడదీయరాని సంబంధం ఉంటుంది. ఒక మహిళ తన జీవితంలో చాలా రోజులు రుతుచక్రంలో గడుపుతుంది. అలాంటప్పుడు దీన్ని సాధారణంగానే చూడాలా?

చాలా మంది అమ్మాయిలకు లేదా మహిళలకు నెలసరి అనేది సాధారణ విషయం కాదు. ఎందుకంటే వారికి ఇది విపరీతమైన నొప్పిని మిగులుస్తుంది. నెలసరి సమయంలో, దానికి ముందు మహిళల అనుభవాలను వారు మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలరు.

‘‘నొప్పంటే తెలియని వారికి ఇతరుల నొప్పి అర్థం కాదు’’ అనే కోట్ ఇక్కడ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా ఆ నొప్పి అనుభవించకపోతే, మీకు దాని గురించి ఎలా తెలుస్తుంది?

నెలసరి సెలవులు

ఫొటో సోర్స్, Getty Images

నెలసరి సమయంలో ఏం జరుగుతుంది?

నెలసరి సమయంలో మహిళల శరీరంతోపాటు మెదడులోనూ చాలా మార్పులు చోటుచేసుకుంటాయని బీబీసీలో గతంలో ప్రచురించిన కథనంలో వివరించారు.

నెలసరి మొదలయ్యే ముందు.. అమ్మాయిలు, మహిళలకు చాలా సమస్యలు వస్తాయి. దీన్నే ‘ప్రీ మెన్‌స్ట్రువల్ ప్రాబ్లం’గా చెబుతారు. దీన్నే ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్ అంటే పీఎంఎస్‌ అని కూడా పిలుస్తారు.

ఈ సమయంలో దాదాపు 200 రకాల మార్పులు శరీరంలో చోటుచేసుకుంటాయని వైద్య శాస్త్రం చెబుతోంది. వీటిలో మూడ్ స్వింగ్స్ కూడా ఉంటాయి. చికాకు, విచారం లాంటి భావనలు కలుగుతాయి. కొంతమందికి అప్పుడప్పుడు నొప్పి తట్టుకోలేక ఏడ్వాలని కూడా అనిపిస్తుంది.

ఒత్తిడి, ఆందోళన కూడా పెరుగుతాయి. నిద్ర కూడా సరిగా పట్టదు. తలనొప్పి, నీరసం కూడా ఉంటాయి. శరీరంలో చాలా భాగాలతోపాటు కడుపులోనూ నొప్పి వస్తున్నట్లుగా అనిపిస్తుంది. వాంతులు కూడా కావొచ్చు. కొంతమందిలో సెక్స్ కోరికలు తగ్గుతాయని, మరికొందరిలో పెరుగుతాయి.

కడుపు కొంచెం పొంగినట్లుగా అనిపిస్తుంది. కడుపులో గ్యాస్ కూడా పెరుగుతుంది. కొందరికి కీళ్ల నొప్పులు, మలబద్ధకం కూడా రావచ్చు. చాలా మంది మహిళలు ఈ సమయంలో నిస్సహాయంగా మారుతారు.

మహిళలు తమ జీవితంలో చాలా భాగం ప్రతి నెలా ఇలాంటి పరిస్థితిని దాటుకొని రావాల్సి ఉంటుంది. కొంతమందికి ఈ సమస్యలు ఒకటి లేదా రెండు రోజులు ఉండొచ్చు. మరికొంతమందికి చాలా రోజులు ఉండొచ్చు. ప్రతి నెలా ఇలాంటి పరిస్థితిని వారు అనుభవించాల్సి ఉంటుంది.

నెలసరి సెలవులు

ఫొటో సోర్స్, Getty Images

మగవారికి వస్తే..

ఇప్పుడు ఇలాంటి అనారోగ్య పరిస్థితులన్నీ ప్రతి నెలలోనూ రెండు, మూడు రోజులు మగవారికి కూడా వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి.

ఆఫీసుల్లో పనిచేసే పురుషులనే ఉదాహరణగా తీసుకుందాం. వారికి ఇలాంటి నొప్పులు వచ్చినప్పుడు ఆఫీసులో రోజువారీ పనులను వారు సాధారణంగా నిర్వర్తించగలరా? ఇలాంటి శారీరక, మానసిక సమస్యలను పట్టించుకోకుండా వంద శాతం పనిపై దృష్టి పెట్టగలరా?

చెప్పండి.. పురుషులు నిజంగా వీటిని తట్టుకొని సాధారణంగా పనిచేయగలరా? నాకైతే సందేహమే. మగవారు ఏమీకానట్లు ప్రవర్తించడం చాలా కష్టం.

ఈ సమస్యకు పరిష్కారమే పీరియడ్స్ సమయంలో ప్రత్యేక సెలవులు ఇవ్వడం.

మహిళల జీవితాలు ఇలా..

మహిళల జీవితాల్లో ఇలాంటి నొప్పులను పట్టించుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఇవి తప్పించుకోలేని పరిస్థితులు. నెలసరి సమయంలో ఉద్యోగాలు చేసే మహిళలు నొప్పితోనే పనిచేయాల్సి ఉంటుంది. లేదా నొప్పి భరించలేక సెలవు పెట్టి ఇంటికి వెళ్లాలి. అయితే, ఇంటిలో పని కూడా ఆమెనే చేయాల్సి ఉంటుంది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి నెల ఇబ్బందులు ఎదుర్కొనే మహిళలకు ఎందుకు నెలసరి సెలవులు ఇవ్వకూడదు. వారికి ఎందుకు కాస్త ఉపశమనం కల్పించకూడదు?

నొప్పితో గడిచే ఆ రోజులకు ఆమెకు వేతనంతో కూడిన సెలవు అంటే ‘పెయిడ్ లీవ్’ ఎందుకు ఇవ్వకూడదు. ఇది ఆమెకు ఏదో సాయం చేస్తున్నట్లుగా అసలు భావించకూడదు. ఉద్యోగ కార్యాలయాల్లో పని వాతావరణం మెరుగు పరిచే చర్యగా దీన్ని చూడాలి.

నెలసరి సెలవులు

ఫొటో సోర్స్, Getty Images

బిహార్‌లో నెలసరి సెలవులు

అయితే, నెలసరి సమయంలో మహిళల పరిస్థితిని ఎవరూ పట్టించుకోలేదని చెప్పడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఈ దిశగా బిహార్ ప్రభుత్వం మూడు దశాబ్దాల క్రితమే భారీ ముందడుగు వేసింది.

రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే మహిళా ఉద్యోగులకు 1992 నుంచి ఇక్కడ ప్రతి నెలా రెండు రోజులు నెలసరి సెలవులు ఇస్తున్నారు. 45 ఏళ్లలోపు మహిళలు ఈ సెలవులు తీసుకోవచ్చు. చాలా రంగాల్లో వెనుకపడిన బిహార్ ఈ దిశగా మాత్రం ముందడుగు వేసింది.

అయితే, బిహార్‌ను స్ఫూర్తిగా తీసుకొని మరే రాష్ట్రం ఆ దిశగా అడుగులు వేయలేదు.

మన దేశంలో కొన్ని ప్రైవేటు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా తమ దగ్గర పనిచేసే మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఉపశమనం కల్పించే చర్యలు తీసుకుంటున్నాయి. కొన్ని చోట్ల నెలకు ఒక రోజు సెలవు ఇస్తుంటే, మరికొన్నిచోట్ల ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ చేసే అవకాశం కల్పిస్తున్నాయి.

జొమాటో, స్విగ్గీ, ఒరియెంట్ ఎలక్ట్రిక్ లాంటి సంస్థలు ఇలా వేతనంతో కూడిన సెలవులు ఇస్తున్న సంస్థల్లో ఉన్నాయి. అంటే నెలసరి సెలవులు కొత్తేమీ కాదనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.

స్పెయిన్‌లో మెనుస్ట్రువల్ లా

ఇలాంటి చర్చ కేవలం మన దేశంలో మాత్రమే జరుగుతుంది అనుకోవడానికీ వీల్లేదు. కేవలం ఇక్కడి మహిళలు, అమ్మాయిలే ఈ డిమాండ్ చేస్తున్నారని అనుకోకూడదు. ఇలాంటి సెలవులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి.

ఈ విషయంలో స్పెయిన్ తాజాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ నెలసరి సమయంలో నొప్పిని ఎదుర్కొనే మహిళలకు మూడు నుంచి ఐదు రోజుల సెలవు ఇచ్చేలా నిబంధనలు ఉన్నాయి.

అయితే, ఇలాంటి సెలవులు తీసుకునేందుకు వైద్యుల నుంచి ప్రిస్క్రిప్షన్‌ను తీసుకురావాల్సి ఉంటుంది.

ఇతర దేశాల్లో ఇలా..

ఫెమినిస్టు, కార్మిక ఉద్యమాల నుంచీ నెలసరి సెలవులపై చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని దేశాలు ఏళ్ల క్రితమే నెలసరి సెలవుల కోసం ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చాయి.

దాదాపు వందేళ్ల క్రితమే సోవియట్ యూనియన్ మహిళలకు నెలసరి సెలవులు ఇచ్చే ప్రక్రియలు మొదలుపెట్టింది. అప్పటి నుంచీ నెలకు రెండు నుంచి మూడు రోజులు ఈ సెలవులు ఇక్కడ ఇస్తున్నారు.

జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, తైవాన్, జాంబియా లాంటి దేశాల్లోనూ మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నారు. కాబట్టి భారత్‌లోని అమ్మాయిలు, మహిళల ఈ డిమాండ్‌ను వింతగా చూడటానికి వీల్లేదు.

నెలసరి సెలవులు

ఫొటో సోర్స్, Getty Images

వ్యతిరేకత ఎందుకు?

మహిళల జీవితాలను మెరుగుపరచడానికి కొత్త చట్టాలను తీసుకురావడానికి లేదా వారికి కొత్త హక్కుల కల్పించడానికి ఏదైనా చర్యలు తీసుకున్నప్పుడు చర్చలు జరగడం, వివాదాలు రేగడం సాధారణం.

ముఖ్యంగా ఉద్యోగాలు, కుటుంబంలో విధులపై ప్రభావం చూపేటప్పుడు మరింత చర్చ జరుగుతుంది. ఉదాహరణకు గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాలనే తీసుకోండి. ఉద్యోగ కార్యాలయాల్లో లైంగిక వేధింపులను అడ్డుకునే నిబంధనలు తీసుకునేటప్పుడూ ఇలానే జరిగింది.

ప్రస్తుతం నెలసరి సెలవుల సమయంలో అలానే కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.

నెలసరి సెలవులు ఇవ్వడంతో, మహిళలకు ఉద్యోగాలు దొరకడం కష్టం అవుతుందని చాలా మంది చెబుతున్నారు.

ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. ఇది ఎవరి సమస్య? మహిళలదా, లేదా ప్రభుత్వానిదా, లేదా ఉద్యోగ సంస్థలదా?

మహిళల జీవితాలను మెరుగుపరిచే చట్టాలతో మహిళల ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతే మనం ఆందోళన చెందాల్సిన అవసరముంది. ముఖ్యంగా ప్రభుత్వం అప్రమత్తం కావాలి. ఎలాంటి వివక్షకూ తావులేకుండా చర్యలు తీసుకోవాలి. ఈ సమస్యకు పరిష్కారంగా అసలు చట్టమే తీసుకురాకపోవడమనే పరిస్థితి ఉండకూడదు.

ప్రస్తుతం నెలసరి సమయంలో సెలవులు ఇచ్చే చాలా విధానాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని పరిశీలించిన అనంతరం మన పరిస్థితులకు సరిపోయే విధానాలను ఎంచుకోవాలి. ఎవరో అడ్డుచెబుతారని లేదా వ్యతిరేకత వ్యక్తం అవుతుందని ఈ సెలవులను ఇవ్వకుండా దాటవేయడం సరికాదు.

నెలసరి సెలవులు

సంకల్పమే ముఖ్యం

ఇలాంటి సెలవులతో ముఖ్యంగా పని వాతావరణంపై సానుకూల ప్రభావమే పడుతుంది. పని నాణ్యత కూడా పెరుగుతుంది. మన సమాజం, దేశం మరింత సెన్సిటివ్‌గా మారుతుంది. ఇది మన ప్రజలు, సమాజానికే మంచిది.

ఆఫీసుల్లో పనిచేసే మగవారు కూడా ఈ సెలవులను సమర్థించడంలో ప్రధాన పాత్ర పోషించాలి.

నెలసరి సమయంలో మహిళలకు ఇచ్చే సెలవులను వారు అర్థం చేసుకోవాలి. ఈ సెలవులకు అండగా నిలిస్తే, జీవిత భాగస్వామికి అండగా నిలిచినట్లుగా గుర్తించాలి.

బిహార్, స్పెయిన్‌, కొన్ని స్వచ్ఛంద సంస్థలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ విధానాన్ని ఎందుకు తీసుకురాకూడదు?

మిగతా కంపెనీలు కూడా నెలసరి సెలవులను ఎందుకు ఇవ్వకూడదు. ఈ విషయంలో కావాల్సింది కాసింత సంకల్ప బలం మాత్రమే. ఈ సంకల్ప బలంతో మహిళల జీవితాలు మెరుగుపరిచే ఒక పెద్ద అడుగు వేయొచ్చు.

వీడియో క్యాప్షన్, భారత వీల్‌చెయిర్ బాస్కెట్‌బాల్ జట్టులో గీతా సభ్యురాలు. పారాలింపిక్స్‌లో ఆడాలన్నది ఆమె కల.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)