వీగన్‌గా మారాలంటే ఇండియాను మించిన దేశం లేనే లేదా? భారతీయుల ఆహార విధానాలు ఎందుకంత ప్రత్యేకం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, చారుకేశి రమాదురై
- హోదా, బీబీసీ న్యూస్
పాశ్చాత్య దేశాల్లో కొొందరు ఈ నెల(జనవరి)లో శుద్ధ శాకాహారులుగా మారుతారు.
ఈ భూమిపై ఉండే మరో జీవికి హాని కలిగించే ప్రతిదీ ఈ నెలలో వదిలేస్తారు.
2500 ఏళ్ల నాటి ఈ సంప్రదాయం గురించి కొద్ది మందికే తెలుసు.
బ్రిటన్‌కు చెందిన జంతు హక్కుల కార్యకర్త డోనాల్డ్ వాట్సాన్ సుమారు 80 ఏళ్ల కిందటే ‘వీగన్’ అనే పదాన్ని కనిపెట్టినప్పటికీ గత కొన్ని దశాబ్దాలుగా మాత్రమే ప్రజలు తమంతట తాము వీగన్లుగా మారుతున్నారు.
కొత్త ఏడాది ప్రారంభమైన తొలి నెలను వీగనవరి అని పిలుస్తారు.
మాంసాహారులు కూడా చాలామంది ఈ నెలలో పూర్తిగా శాకాహారానికే పరిమితమవుతారు. ఇంకొందరైతే అసలు జంతు సంబంధిత ఉత్పత్తులేవీ ఆహారంలో లేకుండా వీగన్ లైఫ్ స్టైల్ పాటిస్తారు ఈ నెలలో.
ఏటా అనేక దేశాలలో ఈ నెల రోజులు వీగన్ డైట్ పాటిస్తారు చాలామంది.
ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.
క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి 7వ శతాబ్దం మధ్యలో ఉత్తర భారతదేశంలో పుట్టిన జైన మతాన్ని ఆచరించేవారు కూడా జంతు సంబంధిత పదార్థాలను అసలు పుచ్చుకునేవారు కాదు.
వారు ఆచరించే ఈ శాకాహార విధానం ఆధునిక రోజుల్లో చాలామంది పాటిస్తున్న వీగన్ సిద్దాంతాలకు దగ్గరగా ఉంది.
‘‘జైనులందరికీ అహింస అనేది వారి జీవన విధానంలో ప్రధాన సూత్రంగా ఉండేది’’ అని రాజస్థాన్ యూనివర్సిటీలో పదవీ విరమణ పొందిన తత్వశాస్త్ర ప్రొఫెసర్ కుసుం జైన్ చెప్పారు.
ఈ అంశంపై విస్తృతమైన పరిశోధనలు చేసిన కుసుం జైన్.. దీనిపై పీహెచ్‌డీ విద్యార్థులకు పలు సూచనలు కూడా చేశారు.
‘‘ఇది అన్ని జీవులకు సంబంధించినది. కేవలం మానవులకు మాత్రమే కాదు. పశువులు, జంతువులు, కీటకాలు, మొక్కలు, నీటిలో లేదా భూమి ఉపరితలం కింద నివసించే ప్రాణులన్నింటికీ చెందినది. ఏ జీవినైనా, ఏ రూపంలోనైనా బాధపెట్టడం లేదా హానికలిగించడాన్ని జైనులు హింసగా భావిస్తారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతా కర్మ ఫలితంగా భావించే జైనులు తప్పుడు ఆలోచనలు, చెడు మాటలను అసలు తమ మనసులోకి రానివ్వరు. 24 తీర్థంకరుల (ఆధ్యాత్మిక గురువులు) ప్రవచనాల నుంచే ఈ సిద్ధాంతాలు వచ్చాయని వారు నమ్ముతారు.
జైనుల చివరి తీర్థంకరుడు వర్థమాన మహావీరుడు.
‘తీర్థంకరులు కూడా మనుషులే. వారి సత్ప్రవర్తన, విధానాల వల్ల వారు సాధువులుగా మారారు. వారికి జ్ఞానోదయం, నిర్వాణ కలిగినప్పటి నుంచి.. విమోచన, స్వేచ్ఛ దిశగా మనకు మార్గాన్ని చూపించారు’’ అని వివరించారు.
2011 జనగణన ప్రకారం భారత జనాభాలో జైనులు స్వల్పంగా 0.4 శాతమే ఉన్నప్పటికీ, జైనిజం దేశంలో వృద్ధి చెందుతున్న మతమన్నది వాస్తవం. దేశవ్యాప్తంగా జైనులను మనం చూడొచ్చు.
గుజరాత్, రాజస్థాన్ వంటి పశ్చిమ రాష్ట్రాల్లో వీరు ఎక్కువగా ఉంటారు. రణక్‌పుర్, దిల్‌వాడా వంటి పలు ప్రముఖ జైన ఆలయాలు దేశంలో ఉన్నాయి.
భారత్‌లో అత్యంత సంపన్న వర్గాలలో జైనులు ఒకరు.
ఉత్తరాదిలో కొన్ని రెస్టారెంట్లు సైతం ప్రత్యేకంగా జైనుల కోసం వంటకాలు అందుబాటులో ఉంచుతాయి.
జైనులలో చాలామంది ఇప్పటికీ కేవలం మృదువైన, కుట్లు లేని దుస్తులు ధరించడమే కాకుండా నోటిని కూడా మాస్క్‌తో కప్పేసుకుంటారు.
ఎందుకంటే, తాము శ్వాస తీసుకునేటప్పుడు కూడా ఎలాంటి కీటకాలు ముక్కులోకి వెళ్లకూడదని భావిస్తారు.
చాలా మంది జైనులు వారి ఆహారపు అలవాట్లు, పద్ధతుల విషయంలో చాలా కఠినంగా ఉంటారు.
సాధారణంగా వారు శాకాహార భోజనమే చేస్తారు. మాంసాన్ని, సముద్రపు ఆహారాన్ని, కోడి గుడ్లను అసలు తీసుకోరు.
భూమి లోపల పెరిగే దుంపలు వంటివీ తినరు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్లు, అల్లం వంటివి వారి ఆహారంలో ఉండవు.
ఉల్లిపాయలు, అల్లానికి బదులు వారు, తమ ఆహారంలో ఇంగువను వేసుకుంటారు.
మాస్టర్ చెఫ్ ఇండియాలో ఫైనల్‌కు చేరుకున్న చెఫ్ అరుణా విజయ్ జైనుల అనుసరించే ఆహార విధానాలను వివరించారు. తాను కూడా జైనుల విధానాన్ని పాటిస్తారు.
‘‘చతుర్మాసం సమయంలో అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకుండే నాలుగు నెలల పాటు ఆకుకూరగాయలు మెంతులు, కొత్తిమీర, కొయ్య తోటకూర, పాలకూరకు దూరంగా ఉంటాం. రుతుపవనాల సమయంలో వచ్చే నెలల్లో భూమి లోపల ఎన్నో కీటకాలు వృద్ధి చెందుతాయి. తరిగేటప్పుడు తెలియకుండా తాము చిన్న చిన్న కీటకాలను చంపుకుని తింటామనే భావనతో అసలు ఆకుకూరలను కూడా ముట్టుకోం’’ అని అరుణ విజయ్ చెప్పారు.
వర్షాకాలంలో కొద్ది రోజులు కూరగాయలు, పండ్లు తినడాన్ని కూడా మానేస్తామని చెప్పారు. కేవలం ఆ సమయంలో పప్పుధాన్యాలు, చిరుధాన్యాలను మాత్రమే తింటామన్నారు.

ఫొటో సోర్స్, Raphael GAILLARDE/Gamma-Rapho via Getty Images
అహింసా, దయా హృదయం వంటి సిద్ధాంతాలను అనుసరించి జైనులు తమ ఆహారపు అలవాట్లను పాటిస్తున్నప్పటికీ.. పాల పదార్థాలను తీసుకుంటూనే ఉంటారు.
‘‘నెయ్యిని వారు అత్యంత శుద్ధమైన ఆహారంగా భావిస్తారు’’ అని ప్రొఫెసర్ జైన్ చెప్పారు.
సంప్రదాయ పాల ఉత్పత్తి నైతికంగా ఉంటుందని, పశువుల విషయంలో తాము దయాహృదయం కలిగి ఉంటామని అరుణ విజయ్ చెప్పారు.
‘‘నా చిన్నతనంలో మా ఇంట్లో ఆవులు ఉండేవి. అవే మా ఇంటికి కావాల్సిన పాలు, పెరుగు, నెయ్యి, వెన్న వంటి అవసరాలను తీర్చేవి. మా ఇంటి అవసరాల కోసం పాలను పిండుకునే ముందు మేం తొలుత దాని దూడకు పాలను పట్టించి పిండుతాం’’ అని తెలిపారు.
గ్రామాల్లో ఇప్పటికీ పాలు పితకడంలో అదే రకమైన పద్ధతి పాటిస్తారు.
ఫుడ్ రైటర్ సోనాల్ వేద్ 2021లో విడుదల చేసిన ‘‘హూస్ సమోసా ఈజ్ ఇట్ ఎనీవే?’’ అనే పుస్తకంలో జైనుల ఆహారపు అలవాట్లు, వారి సిద్ధాంతాల గురించి ప్రస్తావించారు. జైనుల ఆహారపు సిద్ధాంతాలు అహింసా, మాంసాహారం తినడం వల్ల కలిగే పరిణామాలకు అనుగుణంగా ఉన్నాయని సోనాల్ వేద్ తెలిపారు.
‘‘జైనుల, వీగన్ల డైట్ వేరువేరు అయినప్పటికీ, ఎలాంటి క్రూరత్వం లేకుండా(క్రూర రహిత) ఆహారాన్ని తీసుకోవడమనేది ఇద్దరిలో కామన్ పాయింట్’’ అని చెప్పారు.
దేశవ్యాప్తంగా ఉన్న ఆహారపు అలవాట్లపై విస్తృతమైన సమాచారాన్ని కనుక తీసుకుంటే.. భారతీయ వంటకాల్లో చాలా వరకు సహజంగానే వీగన్ అయి ఉంటాయనేది ఆశ్చర్యకరమైన విషయం.
సోనాల్ వేద్ తాజాగా నవంబర్ 2023లో ‘ది ఇండియన్ వీగన్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. తన పుస్తకాల కోసం పరిశోధన చేస్తున్న సమయంలో, ప్రాంతీయ భారతీయ ఆహారం ఎలా వీగన్‌గా మారిందో ఆమె వివరించారు. ‘‘భారతదేశ అరేబియా సముద్ర తీరం నుంచి మాల్వాని వంటకం ఎలా పుట్టిందనే విషయం నుంచి తూర్పున బెంగాలీ ఆహారం వరకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకున్నా’’ అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Frédéric Soltan/Corbis via Getty Images
దక్షిణ భారతదేశ భోజనంలో పెరుగు తప్ప బియ్యం, సాంబార్, రసం వంటివన్నీ కూడా వీగన్ ఆహారం కిందకే వస్తాయి’’ అని విజయ్ చెప్పారు.
ఉడికించిన ఆహారంతో పాటు కూరగాయలు, పప్పు కూరలతో సంప్రదాయ ప్లేట్లలో వడ్డిస్తారని తెలిపారు.
భారత్‌లో వీగన్‌గా మారడం చాలా తేలిక అని అభిప్రాయపడ్డారు. భారత్‌లో, ఇతర ప్రాంతాల్లోజీవించే చాలా మంది యువతరం ఈ జీవనశైలిని అలవాటు చేసుకోవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదన్నారు.
కాగా చాలా మంది జైనులు ప్రస్తుతం పాల పదార్థాలను కూడా తీసుకోకుండా, పూర్తిగా వీగన్‌గా మారేందుకు మొగ్గు చూపుతున్నారు.
‘‘ భారతీయుల ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ముఖ్యంగా కోవిడ్ తర్వాత చాలా మార్పులు వచ్చాయి’’ అని విజయ్ చెప్పారు.
భారతీయ వీగన్ ఫుడ్ మార్కెట్ విలువ 2022లో సుమారు 1100 కోట్ల రూపాయలు ఉంది. ఇది ముందముందు మరింత పెరుగుతుందని అంచనా.
వీగనిజం కేవలం ఫ్యాషన్ కాదు, ఇది ప్రజల జీవన విధానమని దీనిబట్టి స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
వేద్ ఈ విధానానికి స్వాగతం చెప్పారు. ‘‘వీగనిజం తప్పనిసరిగా మన జీవనవిధానానికి సరిపోతుంది. వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావాలు కూడా తగ్గుముఖం పడతాయి’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- సాయంత్రం 4 నుంచి 7 గంటల మధ్య ఆకలైతే ఏం తినాలి? బిస్కెట్లు, మరమరాలు మంచివికావా
- జెఫ్రీ ఎప్స్టీన్: ‘బాలికలను సెక్స్ ఊబిలో దించడానికి చైన్ రిక్రూట్మెంట్ పద్ధతిని వాడారు’
- ఆదిత్య L1: తుది కక్ష్యలోకి చేరిన ఇస్రో మిషన్.. సూర్యుడికి, భూమికి మధ్య ఇప్పుడేం చేయనుంది?
- జుట్టు రాలకూడదంటే మీరు తినే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి
- చనిపోతే త్వరగా మరో జన్మ ఎత్తొచ్చన్న బోధనలతో పాస్టర్ సహా ఏడుగురి ఆత్మహత్య.. ఇదెలా బయటపడింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














