అలెగ్జాండర్ పట్టాభిషేకం జరిగిన అగాయ్ ప్యాలస్‌ను తిరిగి తెరిచిన గ్రీస్

అగాయ్ ప్యాలస్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, కాత్రిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
    • హోదా, బీబీసీ న్యూస్

రాజుగా అలెగ్జాండర్‌ పట్టాభిషేకం జరిగిన అగాయ్ ప్యాలస్‌ను 16 ఏళ్ల పునరుద్ధరణ పనుల తర్వాత గ్రీస్ మళ్లీ తెరిచింది.

చాలా ముఖ్యమైన పురాతన కట్టడాల్లో ఒకటిగా ఈ ప్యాలస్‌ను పరిగణిస్తారు.

గ్రీస్ తీర ప్రాంత నగరమైన థెస్సలోనికి సమీపంలో 2,300 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు. దీని పేరు ‘‘అగాయ్ ప్యాలస్’’

తర్వాతి కాలంలో రోమన్లు ఈ ప్యాలస్‌ను ధ్వంసం చేశారు. 19వ శతాబ్దం తొలినాళ్లలో జరిగిన తవ్వకాల్లో ఇది బయటపడింది.

అగాయ్ ప్యాలెస్ పునరుద్ధరణకు రూ. 211 కోట్లకు పైగా (20 మిలియన్ పౌండ్లు) ఖర్చు చేశారు. యూరోపియన్ యూనియన్ ఈ పనులకు ఆర్థిక సహకారం అందించింది.

అగాయ్ ప్యాలెస్

ఫొటో సోర్స్, ACHILLEAS CHIRAS/EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, అగాయ్ ప్యాలెస్‌ను క్రీ.పూ148లో రోమన్లు ధ్వంసం చేశారు. 19వ శతాబ్ధంలో తవ్వకాల పని మొదలైంది

శుక్రవారం జరిగిన పున:ప్రారంభ కార్యక్రమానికి హాజరైన గ్రీక్ ప్రధానమంత్రి కైరియోకాస్ మిట్సోటాకిస్ మాట్లాడుతూ, ‘‘ఇదొక ప్రపంచ ప్రాముఖ్యం కలిగిన స్మారక చిహ్నం. ఇలాంటి స్మారకాలు ప్రపంచానికి వారసత్వ సంపదగా మారుతాయి’’ అని అన్నారు.

ఈ స్మారకాలకు ప్రచారం కల్పించడంతో పాటు వాటిని హైలైట్ చేయాలని ఆయన కోరారు.

గ్రీస్

ఫొటో సోర్స్, ACHILLEAS CHIRAS/EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, అగాయ్ ప్యాలస్ ప్రదేశాన్ని శుక్రవారం గ్రీక్ ప్రధాని కైరియోకాస్ మిట్సోటాకిస్ సందర్శించారు.

ప్యాలస్‌లో పునరుద్ధరించిన వాటిలో భారీ స్తంభాలు కూడా ఉన్నాయి.

ఆదివారం ఈ సైట్‌లోకి ప్రజలను అనుమతిస్తారు.

అగాయ్ ప్యాలస్‌ను అలెగ్జాండర్ తండ్రి ఫిలిఫ్ 2 నిర్మించారు. శక్తిమంతమైన మేసిడోనియా రాజ్యాన్ని ఫిలిప్ 2 పాలించారు.

అగాయ్ ప్యాలెస్

ఫొటో సోర్స్, ACHILLEAS CHIRAS/EPA-EFE/REX/SHUTTERSTOCK

ఫొటో క్యాప్షన్, ప్యాలస్‌లోని నేల మీద ఉన్న కొన్ని మొజాయిక్‌లను పాడవ్వకుండా కాపాడారు

తండ్రి హత్య తర్వాత 336 బీసీలో పట్టాభిషేకం

అగాయ్‌కు సమీపంలో నేడు పట్టణంగా ఉన్న వెర్జీనా ఒకప్పుడు మేసిడోనియా రాజధాని.

గ్రీస్‌లో ఒకప్పుడు అగాయ్ ప్యాలస్ అతిపెద్ద భవనం. ఇది 15 వేల చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో భారీ విందుశాలలు, ప్రార్థనా మందిరాలు, ప్రాంగణాలు ఉంటాయి.

తండ్రి హత్య అనంతరం 336 బీసీలో అలెగ్జాండర్, మేసిడోనియా రాజ్యానికి రాజుగా ఈ భవనంలోనే పట్టాభిషిక్తుడు అయ్యాడు. ఆ తర్వాత ఆసియా, మధ్యప్రాచ్యంలో ఆయన తన సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు.

ఈ ప్యాలస్‌తో పాటు దీనికి సమీపంలో ఉన్న ఫిలిప్ సమాధి, ఇతర మేసిడోనియన్ రాజుల సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)