కిమ్ జాంగ్ ఉన్: ఉత్తర కొరియా పాలకుడి 5 మిస్టరీలు

ఫొటో సోర్స్, Reauters
ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్ 40 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. నిజంగా ఆయన వయస్సు 40 ఏళ్లేనా?
జనవరి 8వ తేదీని కిమ్ పుట్టినరోజుగా అందరూ భావిస్తారు. కానీ, ఆయన అసలైన పుట్టిన తేదీ మీద ఏకాభిప్రాయం లేదు.
కిమ్ గురించి ఇదొక్కటే కాదు తెలియని విషయాలు ఇంకా ఉన్నాయి. వాటిలో 5 మిస్టరీల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1. కిమ్ ఎప్పుడు పుట్టారు?
దీని గురించి నిజంగా మనకు తెలియదు. ఆయన పుట్టినరోజు గురించి చాలా పెద్ద చర్చ ఉంది.
‘‘ఆయన పుట్టిన ఏడాది 1982, 1983,1984 అంటూ పెద్ద చర్చ ఉంది’’ అని బీబీసీతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పాలిటిక్స్ లెక్చరర్ డాక్టర్ ఎడ్వర్డ్ హోవెల్ అన్నారు.
ఆయన పుట్టినరోజుగా చెలామణిలో ఉన్న జనవరి 8వ తేదీని ఒక సాధారణ రోజుగానే భావిస్తారు.
ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ పుట్టినరోజు అయిన ఫిబ్రవరి 16ను ఏటా ‘‘డే ఆఫ్ ద షైనింగ్ స్టార్’’గా జరుపుకుంటారు.
ఆయన తాత కిమ్ ఇల్ సుంగ్ పుట్టినరోజైన ఏప్రిల్ 15ను ‘‘డే ఆఫ్ ద సన్’’గా పరిగణిస్తారు.
కిమ్ జాంగ్ ఉన్ కుటుంబానికి సంబంధించిన చాలా వివరాలు మిస్టరీగానే ఉన్నాయి.
కిమ్‌కు సవతి సోదరులు ఉన్నారని, వారిలో ఒకరైన కిమ్ జోంగ్ నమ్ 2017లో మలేసియాలో హత్యకు గురయ్యారని ఉత్తర కొరియా వ్యవహారాల నిపుణుడు డాక్టర్ ఎడ్వర్డ్ హోవెల్ చెప్పారు.
కిమ్ జాంగ్ ఉన్ తండ్రికి నలుగురు జీవిత భాగస్వాములు ఉన్నట్లుగా చెబుతారు. కానీ, ఆయన తన సంబంధాలను ఎక్కువగా రహస్యంగానే ఉంచారు.
జపాన్‌లో జన్మించిన ఆయన తల్లి కో యంగ్ హుయి ఒక డ్యాన్సర్‌గా పనిచేయడం కోసం 1960లలో ఉత్తర కొరియాకు వచ్చినట్లుగా భావిస్తారు.
కిమ్ జోంగ్ ఇల్ భార్యలందరిలో ఆమెను ఫేవరెట్‌గా చెబుతారు.
కో యంగ్ హుయి 1973లో జపాన్‌ను సందర్శించినప్పుడు తీసిన ఫోటోలు 2018లో బయటకు వచ్చాయి.
కో యంగ్ నేపథ్యం డ్యాన్స్, జపాన్‌తో ముడిపడి ఉండటంతో ఉత్తర కొరియా ఆమెకు పెద్దగా ప్రాచుర్యం కల్పించలేదని ‘ద కొరియా టైమ్స్’ పేర్కొంది.
‘‘రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కొరియన్ ద్వీపకల్పాన్ని ఆక్రమించిన జపాన్‌లో పుట్టిన వారిని సాధారణంగా నిమ్న వర్గంగా భావిస్తారు. కిమ్ జోంగ్ ఇల్‌ను పెళ్లి చేసుకున్నందున కో యంగ్ హుయి విలాసవంతమైన జీవితాన్ని గడిపారు’’ అని డాక్టర్ హావెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2. కిమ్ భార్య ఎవరు?
దీనికి కూడా కచ్చితమైన సమాధానం తెలియదు. ఆయనకు ఒక భార్య ఉన్నట్లు, ఆమె పేరు రి సోల్ జు అని మాత్రమే తెలుసు. కానీ, వారిద్దరికీ ఎప్పుడు పెళ్లి జరిగిందో తెలియదు. వారి పెళ్లి 2009లో జరిగి ఉండొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.
కామ్రేడ్ రి సోల్ జు గురించి పెద్దగా తెలియదు. ఒక ప్రదర్శనలో కిమ్ దృష్టిని ఆకర్షించిన గాయని ఆమేనా?
ఇదే పేరుతో ఉత్తర కొరియాలో ఒక కళాకారిణి ఉన్నారు. కానీ, ఈ ఇద్దరూ ఒకరే అని అధికారికంగా ధ్రువీకృతం కాలేదు.
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం 2005లో దక్షిణ కొరియాను సందర్శించిన చీర్‌లీడర్ బృందంలో రి సోల్ జు సభ్యురాలు అని ఇంటెలిజెన్స్ అధికారులను ఉటంకిస్తూ ఒక చట్టసభ సభ్యుడు చెప్పారు. చైనాలో ఆమె పాడటం నేర్చుకున్నారని తెలిపారు.
ఆమె కిమ్ భార్య అని చెప్పడం తప్ప అంతకుమించి ఆమెకు సంబంధించి ఎలాంటి సమాచారాన్ని ఉత్తర కొరియా బయటపెట్టలేదు.

ఫొటో సోర్స్, Reuters
3. కిమ్‌కు పిల్లలు ఎంత మంది?
కిమ్ కుటుంబానికి సంబంధించి మరికొంత సమాచారం ఉంది. కానీ, దాన్ని ధ్రువీకరించడం కష్టం.
2016లో రి సోల్ జు గర్భవతి అని ఊహాగానాలు ఉన్నాయి. కానీ, వీటిని అధికారికంగా ధ్రువీకరించలేదు.
దీనికంటే ముందు 2010, 2013లో జన్మించిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు నమ్ముతారు. కానీ, వారిలో అబ్బాయి ఉన్నాడా లేదా అనే సంగతి కూడా తెలియదు. నిజానికి ఆ పిల్లల గురించి పెద్దగా ఏమీ బయటకు రాలేదు.
అందరికీ ఆయన కూతురిగా బాగా తెలిసిన బాలిక వయస్సు దాదాపు 10 ఏళ్లు ఉంటుంది. 2023లో ఆమె అయిదుసార్లు బయట అందరికీ కనిపించారు. కిమ్ రెండో సంతానంగా భావిస్తున్న ఆమె పేరు కిమ్ జు యే.
‘‘ఆయన పిల్లల గురించి ఎవరికీ ఏమీ తెలియదు. వారి అమ్మ ఎవరో కూడా తెలీదు’’ అని డాక్టర్ హావెల్ అన్నారు.
తదుపరి నాయకురాలిగా కిమ్ జు యేను పెంచుతున్నారని చాలా మంది విశ్లేషకులు భావించారు. కానీ, అలా జరగట్లేదని డాక్టర్ ఎడ్వర్డ్ హోవెల్ అభిప్రాయపడ్డారు.
ఆమె ఇంకా చాలా చిన్నపిల్ల. కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్‌కు అనుభవంతో పాటు ఉన్నత వర్గాలతో మెరుగైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి తదుపరి నాయకురాలిగా కిమ్ జాంగ్ ఉన్ సోదరి పోటీలో ఉండొచ్చు.

ఫొటో సోర్స్, reuters
4. కిమ్‌కు విలాసవంతమైన జీవితం ఎలా సాధ్యం?
అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేస్తున్నారనే కారణంతో ఉత్తర కొరియా, కిమ్ జాంగ్ ఉన్ మీద ఐక్యరాజ్యసమితి, పశ్చిమ దేశాలు అనేక కఠిన ఆంక్షలు విధించాయి.
ఆంక్షల్ని తప్పించుకోవడానికి చేయాల్సిందంతా కిమ్ జాంగ్ ఉన్ చేస్తున్నారని డాక్టర్ హోవెల్ అన్నారు.
‘‘దేశాన్ని నడపటానికి ప్రభుత్వం వద్ద ప్రత్యేక నిధులు ఉంటాయి. తనతో పాటు తన కుటుంబానికి విలాసవంతమైన జీవితాన్ని అందించడం కోసం కిమ్ ఈ నిధుల్ని కొనసాగిస్తున్నారు’’ అని ఆయన తెలిపారు.
ఉత్తర కొరియాకు డబ్బును అందించడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు సిద్ధంగా ఉన్నాయని హోవెల్ నమ్ముతున్నారు. ఇతర మార్గాల ద్వారా కూడా ఉత్తర కొరియాకు నిధులు అందుతాయనే ఆరోపణలు ఉన్నాయి.
‘‘ఉత్తర కొరియా ఇంటర్నెట్ సదుపాయం లేని ఒంటరి దేశం అని అందరూ అనుకుంటారు. కానీ, ప్రభుత్వ అధీనంలో నడిచే ఇంటర్నెట్ అక్కడ ఉంది. సైబర్ వార్‌ఫేర్ ఒక ముఖ్య వ్యూహంగా మారింది. కిమ్ ప్రభుత్వం ఇతర దేశాల కంప్యూటర్ వ్యవస్థలను హ్యాక్ చేసి డబ్బును దొంగిలిస్తుంది. వాటితో దేశ ఆర్థిక వ్యవస్థను, అణ్వాయుధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది’’ అని డాక్టర్ హోవెల్ చెప్పారు.

ఫొటో సోర్స్, KCNA
5. కిమ్ కన్నీళ్లు ఎందుకు పెట్టుకున్నారు?
2020 మిలిటరీ పరేడ్ సందర్భంగా ఇచ్చిన ప్రసంగం కిమ్‌లోని ఇంకో కోణాన్ని చూపించింది.
కరోనావైరస్ మహమ్మారి, ప్రకృతి విపత్తుల సమయంలో తమ బలగాలు చూపించిన చొరవ, తెగువకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలోని ఇబ్బందుల గురించి మాట్లాడుతూ ఒక దశలో కన్నీరు పెట్టుకున్నారు. ఇలా కిమ్ జాంగ్ ఉన్ తన ఉద్వేగాలను బయటపెట్టడం చాలా అరుదైన విషయం.
కిమ్ వినమ్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని కొందరు పరిశీలకులు అప్పట్లో అభిప్రాయపడ్డారు.
కానీ, కిమ్ అనుసరించే విలాసవంతమైన జీవనశైలి ఇందుకు విరుద్ధంగా ఉంది.
సుదూర ప్రాంతాలకు విలాసవంతమైన రైళ్లలో ప్రయాణించే ఒక సంప్రదాయాన్ని కిమ్ ఇంకా కొనసాగిస్తున్నారు. ఆయన తాత కిమ్ ఇల్ సంగ్ ఈ సంప్రదాయాన్ని మొదలుపెట్టారు.
ఉత్తర కొరియా ప్రజలు పేదరికంలో చితికిపోతుండగా ప్రయాణాల కోసం ప్రైవేట్ విమానాలు వంటి విలాస వాహనాలను కిమ్ వాడతారు.
ఆహార కొరత తీవ్రంగా ఉందని తమ పొరుగువారు ఆకలితో చనిపోయారని బీబీసీతో ఉత్తర కొరియా ప్రజలు చెప్పారు.
1990ల తర్వాత నుంచి అక్కడి పరిస్థితి దారుణంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- యూపీఐ పేమెంట్స్: పొరపాటున వేరే అకౌంట్‌కు డబ్బులు పంపినా, 4 గంటల్లో తిరిగి పొందొచ్చా?
- అయోధ్య: రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్ళడం వల్ల కాంగ్రెస్‌కు లాభమా, నష్టమా?
- ‘హిట్ అండ్ రన్’ చట్టాన్ని డ్రైవర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పాత చట్టానికి, కొత్త చట్టానికి తేడా ఏమిటి?
- కల్పనా సోరెన్: సీఎం భార్య కోసమే ఆ ఎమ్మెల్యే సీటు ఖాళీ చేశారా?
- యాపిల్ ఐఫోన్ కంపెనీని మోదీ ప్రభుత్వం టార్గెట్ చేసిందా, వాషింగ్టన్ పోస్ట్ కథనంలో ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










