మాల్దీవులకు వెళ్లే టూరిస్ట్‌లలో అత్యధికులు భారతీయులే.. మాల్దీవులు, లక్షదీవుల మధ్య తేడా ఏమిటి

ఫొటో సోర్స్, Getty Images
భారత ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మొదలైన చర్చ మాల్దీవులకు చేరుకుంది.
ప్రధాని మోదీపై, భారత్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమ మంత్రులపై మాల్దీవుల ప్రభుత్వం వేటు వేసింది.
మాల్దీవుల నేతల వ్యాఖ్యల వల్ల అక్కడి పర్యాటక రంగానికి నష్టం వాటిల్లుతుందని కూడా పలువురు చెబుతున్నారు.
అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, సచిన్ తెందూల్కర్ వంటి భారత ప్రముఖులు కూడా భారత తీరాలు, ద్వీపాల ప్రాధాన్యంపై మాట్లాడారు.
ఈ చర్చ మొత్తం ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో మొదలైంది.
మోదీ లక్షద్వీప్ పర్యటన చిత్రాలను చూసిన తర్వాత సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు ఇక సెలవులకు మాల్దీవులకు బదులుగా లక్షద్వీప్‌కు వెళ్లండని చెప్పడం ప్రారంభించారు.

ఫొటో సోర్స్, @NARENDRAMODI
అయితే, ఇలాంటి ట్వీట్లకు మాల్దీవుల మంత్రులు రిప్లై ఇస్తూ మాల్దీవులను లక్షద్వీప్‌తో పోల్చడం సరికాదంటూ అనుచిత పదాలు వాడారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో లక్షద్వీప్, మాల్దీవుల అంశాలు తెరపైకి వచ్చాయి.
ఈ నేపథ్యంలో మాల్దీవులు, లక్షద్వీప్‌ల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
భారతదేశం నుంచి మాల్దీవులకు చేరుకోవడం చాలా సులభం, తక్కువ సమయంలో చేయవచ్చు.
మాల్దీవుల వీసా ఉచితం.
భారత్ నుంచి మాల్దీవులకు చాలా విమానాలు అందుబాటులో ఉన్నాయి.
అయితే లక్షద్వీప్‌కు విమానాల సంఖ్య తక్కువగా ఉంటుంది.

ఫొటో సోర్స్, ALDIVES GOV
మలయాళ పదం నుంచే మాల్దీవుల పేరు
మాల్దీవుల్లోని 'మాల్' అనే పదం మలయాళ పదం 'మాల' నుంచి వచ్చింది. మాల్దీవులలో 'మాల్' అంటే దండ. దీవ్ అంటే ద్వీపం.
1965లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తరువాత, ఇక్కడ మొదట్లో రాచరికం ఉంది. అయితే, 1968 నవంబర్లో రిపబ్లిక్‌గా మారింది.
మాల్దీవులు భారతదేశానికి నైరుతిలో ఉంది. కొచ్చి నగరం నుంచి మాల్దీవులకు దాదాపు వెయ్యి కిలోమీటర్ల దూరం.
మాల్దీవులు 1,200 ద్వీపాల సమూహం. అందులో చాలా ద్వీపాలలో జనావాసాలు లేవు. మాల్దీవుల వైశాల్యం 300 చదరపు కిలోమీటర్లు. అంటే పరిమాణంలో దిల్లీ కంటే దాదాపు ఐదు రెట్లు చిన్నది.
మాల్దీవుల జనాభా దాదాపు 4 లక్షలు.
మాల్దీవులలో ధివేహి, ఇంగ్లిష్ మాట్లాడుతారు.
మాల్దీవుల దీవుల్లో ఏదీ సముద్ర మట్టానికి ఆరు అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో లేదు. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న సముద్ర మట్టాల కారణంగా మాల్దీవులు ప్రమాదంలో ఉన్నాయి.
ఈ దేశ ఆర్థిక వ్యవస్థ టూరిజంపై ఆధారపడి ఉంది. ఇక్కడి దీవుల ఆర్థిక వ్యవస్థ కూడా పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇండియన్ టూరిస్ట్‌లే అత్యధికం
మాల్దీవుల ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువగా పర్యాటకం నుంచే వస్తుంది.
2019 వరకు ప్రతి సంవత్సరం మాల్దీవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య దాదాపు 20 లక్షలుగా ఉండేది. అయితే, కరోనా కాలంలో ఈ సంఖ్య చాలా తగ్గిపోయింది.
మాల్దీవులకు వెళ్లేవారిలో అత్యధికులు భారతీయులే. గతేడాది భారత్ నుంచి దాదాపు 2 లక్షల మంది మాల్దీవులకు వెళ్లారు.
2021లో ఈ సంఖ్య దాదాపు 3 లక్షలు కాగా, 2022లో ఈ సంఖ్య దాదాపు రెండున్నర లక్షలుగా ఉంది.
మాల్దీవుల మీడియా సంస్థ ఏవీఏఎస్ ప్రకారం, మాల్దీవులకు వచ్చే పర్యాటకుల్లో అత్యధికులు భారతీయులే.
ఇక్కడ నీలం రంగులో సముద్రం.. చుట్టూ తెల్లటి ఇసుక తీరాలతో ఉన్న ద్వీపాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఏ దేశం నుంచి ఎంత మంది మాల్దీవులకు వస్తున్నారు?
- భారత్: 2 లక్షల 5 వేలు
- రష్యా: 2 లక్షల 3 వేలు
- చైనా: 1 లక్ష 85 వేలు
- యూకే: 1 లక్ష 52 వేలు
- జర్మనీ: 1 లక్ష 32 వేలు
- ఇటలీ: 1 లక్ష 11 వేలు
- అమెరికా: 73 వేలు
మాల్దీవులలో సందర్శించదగిన ప్రదేశాలేంటి?
ఉదాహరణకు జనవరి 26న భారత్‌లోని కొచ్చి నుంచి మాల్దీవులకు వెళ్లాలనుకుంటే విమాన టికెట్ ధర దాదాపు రూ.10 వేలు. ప్రయాణ సమయం దాదాపు రెండు గంటలు.
మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రకారం మాల్దీవుల్లో 175 రిసార్ట్‌లు, 14 హోటళ్లు, 865 అతిథి గృహాలు, 156 క్రూయిజ్ షిప్‌లు, 280 డైవ్ సెంటర్లు, 763 ట్రావెల్ ఏజెన్సీలు, ఐదు టూర్ గైడ్‌లు ఉన్నాయి.
మాల్దీవుల్లో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి.
- సన్ ఐలాండ్
- గ్లోయింగ్ బీచ్
- ఫిహలాహోహి ద్వీపం
- మాలె సిటీ
- మాఫుషి
- ఆర్టిఫిషియల్ బీచ్
- మామిగిలి
అనేక ట్రావెల్ వెబ్‌సైట్‌ల ప్రకారం, జనవరి నుంచి ఏప్రిల్ వరకు మాల్దీవులను సందర్శించడానికి ఉత్తమ సమయం.
మే నుంచి సెప్టెంబర్ వరకు మాల్దీవులలో పర్యాటకుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఒక రోజుకు త్రీ స్టార్ హోటల్ ధర దాదాపు రూ.5 వేల నుంచి మొదలవుతుంది.

ఫొటో సోర్స్, LAKSHADWEEP.GOV.IN
లక్షద్వీప్ స్వరూపం ఏంటి?
- కవరత్తి ద్వీపం
- లైట్ హౌస్
- జెట్టీ సైట్, మసీదు
- అగట్టి
- కద్మత్
- బంగారం ద్వీపం
- తిన్నకర
మాల్దీవుల మాదిరిగానే లక్షద్వీప్‌లో కూడా తెల్లటి ఇసుక బీచ్‌లు ఉన్నాయి. మే నుంచి సెప్టెంబర్ మధ్యకాలం ఇక్కడకు వెళ్లడానికి ఉత్తమ సమయం.
ఇక్కడ ఉష్ణోగ్రత 22 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. డిసెంబర్, ఫిబ్రవరి మధ్య ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
కానీ లక్షద్వీప్‌కు వెళ్లాలంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి పొందాలి. ఇక్కడ అనేక ద్వీపాలకు ప్రవేశం పరిమితం, ప్రభుత్వ అనుమతి అవసరం.
లక్షద్వీప్ పేరు కథ కూడా ఆసక్తికరంగా ఉంది. లక్షద్వీప్ అంటే మలయాళం, సంస్కృతంలో లక్ష దీవులు అని అర్థం.

ఫొటో సోర్స్, ANI
లక్షద్వీప్ ఎలా వార్తల్లోకి వచ్చింది?
ఇటీవల లక్షద్వీప్‌లో పర్యటించిన ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు.
2020లో లక్షద్వీప్‌లో రాబోయే 1,000 రోజుల్లో వేగవంతమైన ఇంటర్నెట్ ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. ఆప్టికల్ ఫైబర్ ప్రాజెక్ట్ మీకు 100 రెట్లు వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని అందిస్తుందని తెలిపారు.
ప్రఫుల్ పటేల్ 2020 నుంచి లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నారు.
గోమాంసంపై నిషేధం, కొన్ని సార్లు శుక్రవారం సెలవును ఆదివారానికి మార్చడం వంటి విషయాల్లో లక్షద్వీప్‌లో వివాదం నెలకొంది.
లక్షద్వీప్ సున్నితత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్ట్ ఏర్పాటుచేశారు.
ఇది కాకుండా ఐఎన్ఎస్ ద్వీపరక్షక్ నేవల్ బేస్ కూడా నిర్మించారు. లక్షద్వీప్ ఎంపీ మహ్మద్ ఫైసల్ అభ్యర్థిత్వం గతేడాది రద్దయింది.
2023 జనవరి 11న లక్షద్వీప్ కోర్టు ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్‌కు హత్యాయత్నం కేసులో పదేళ్ల జైలు శిక్ష విధించింది.
రెండు రోజుల తర్వాత ఆయన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, 2023 జనవరి 25న కేరళ హైకోర్టు శిక్షను నిలిపివేసింది.
ఇక మాల్దీవుల విషయానికొస్తే ప్రెసిడెంట్ అయిన తర్వాత మొహమ్మద్ ముయిజ్జూ 'ఇండియా అవుట్' అనే ఎన్నికల నినాదాన్ని ఆచరణలోకి తెస్తూ భారతదేశం తన దళాలను ఉపసంహరించుకోవాలని కోరారు.
లక్షద్వీప్, మాల్దీవులు రెండూ భారతదేశ భద్రతకు చాలా ముఖ్యమైనవి. మాల్దీవులలో భారత్ ఉనికి బలహీనపడితే చైనా చాలా దగ్గరగా వస్తుంది.
లక్షద్వీప్‌లో భద్రతకు సంబంధించి ఏదైనా లోపం ఏర్పడితే, అప్పుడు ఉగ్రమూకల చొరబాట్లకు అవకాశం పెరుగుతుంది. కేరళ తీరాల భద్రత దృష్ట్యా లక్షద్వీప్ కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
ఇవి కూడా చదవండి:
- ఇండియన్ నేవీ: నౌకల హైజాకింగ్‌ను అడ్డుకునే ఆపరేషన్లతో ప్రపంచానికి భారత్ ఇస్తున్న మెసేజ్ ఏంటి?
- ఛత్తీస్‌గఢ్: 'గిరిజన జంటకు విడాకులు ఎలా ఇవ్వమంటారో మీరే చెప్పండి’ అని న్యాయవాదినే అడిగిన హైకోర్టు.. అసలేం జరిగింది?
- ఆపరేషన్ కాక్టస్: 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. మోదీకి, భారత పర్యటకానికి మద్దతుగా స్పందిస్తున్న సినీ, క్రీడా ప్రముఖులు
- సెర్న్ అబ్బాస్ జెయింట్: కొండ మీద భారీ నగ్న చిత్రం.. ఎవరిదో, ఎప్పటిదో కనిపెట్టేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














