సుచనా సేథ్: 'నాలుగేళ్ళ కొడుకును చంపి, బ్యాగులో కుక్కి, రహస్యంగా కారులో తీసుకెళుతున్న ఈ తల్లి’ ఎలా దొరికిపోయారంటే....

ఫొటో సోర్స్, X/SUCHANA SETH
నాలుగేళ్ళ కుమారుడిని హత్యచేసిన అభియోగంపై 39 ఏళ్ళ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె ఓ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కంపెనీ సీఈఓగా ఉన్నారు.
నిందితురాలిని సుచనాసేథ్‌గా గుర్తించారు. ఆమె బ్యాగ్‌లో పిల్లాడి శవాన్ని గుర్తించారు.
పోలీసుల కథనం ప్రకారం సుచనాసేథ్ తన కొడుకుని గోవాలో హత్య చేసింది. ఆపైన ఓ బ్యాగ్‌లో శవాన్ని కుక్కి అద్దె వాహనంలో బెంగళూరుకు బయల్దేరింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఆమె ప్రయాణిస్తున్న టాక్సీ డ్రైవర్‌ను కాంటాక్ట్ చేసి, మార్గమధ్యంలోని పోలీసుస్టేషన్‌కు వాహనాన్ని మళ్ళించాల్సిందిగా ఆదేశించారు. తరువాత పోలీసులు సుచినాసేథ్‌ను అరెస్ట్ చేసి, ఆమె బ్యాగ్‌లో ఉన్న నాలుగేళ్ళ కొడుకు శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సుచనాసేథ్ చేసిన పనిపై సామాజిక మాధ్యమాలలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, ANI
పోలీసులకు ఎలా తెలిసింది?
వివిధ వార్తా సంస్థలు ప్రచురించిన పోలీసు కథనాల మేరకు.. సుచనాసేథ్ తన నాలుగేళ్ళ కొడుకును తీసుకుని జనవరి 6న గోవాలో ఓ సర్వీస్ అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు.
ఇక్కడ రెండు రోజులు ఉన్న తరువాత అపార్ట్‌మెంట్ సిబ్బందిని పిలిచి తాను బెంగళూరుకు వెళ్ళేందుకు ఓ వాహనాన్ని సమకూర్చాల్సిందిగా కోరారు.
జనవరి 8న ఆమె బెంగళూరకు బయల్దేరారు.
బెంగళూరుకు టాక్సీలో కాకుండా విమానంలో వెళ్ళడం బెటరని అపార్ట్‌మెంట్ సిబ్బంది చెప్పినా ఆమె తిరస్కరించారు.
ఈమె బెంగళూరకు బయల్దేరాకా, అపార్ట్‌మెంట్ సిబ్బంది ఆమె బసచేసిన గదిని శుభ్రం చేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.
పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. తరువాత సుచనాను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించి విఫలమవడంతో, ఆమె ప్రయాణిస్తున్న కారు డ్రైవర్‌ను కాంటాక్ట్ చేశారు.
మీ కొడుకు ఎక్కడున్నాడని డ్రైవర్ ఫోన్‌కు కాల్ చేసి ఆమెను అడిగారు. తన కొడుకును స్నేహితురాలి ఇంటివద్ద వదిలినట్టు ఆమె తెలిపింది.
ఆమె స్నేహితురాలి అడ్రస్ కూడా చెప్పింది. గోవా పోలీసులు వెంటనే ఈ అడ్రస్ గురించి వాకబు చేయగా అది ఫేక్ అడ్రస్ అని తేలింది.
దీంతో వెంటనే పోలీసులు కాబ్ డ్రైవర్‌కు ఫోన్ చేసి, కారును దగ్గరలోని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. డ్రైవర్ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పోలీసుల వద్దకు కారును మళ్ళించాడు.
ఈ విషయాలను గోవా పోలీసు సూపరింటెండెంట్ నితిన్ వాల్సన్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
స్టేషన్‌కు చేరుకున్న కారును పోలీసులు చెక్ చేయగా, సుచనా బ్యాగ్‌లో పిల్లాడి శవం కనిపించింది.
గోవా అపార్ట్‌మెంట్ సూపర్‌వైజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లాడి శవానికి పోస్టు మార్టం నిర్వహించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, ANI
కారణం ఏమిటి?
నిందితురాలు సుచనాకు తన భర్తతో గొడవలు ఉన్నాయి. వీరి విడాకుల వ్యవహారం కోర్టులో చివరి దశకు చేరుకుంది.
విడాకుల ప్రొసిడింగ్స్‌లో భాగంగా ఇటీవల కోర్టు ఇచ్చిన ఓ ఆదేశం నిందుతురాలిని ఒత్తిడికి గురిచేసింది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని తాము ఇంకా చూడలేదని పోలీసులు చెప్పారు.
ఈ హత్య ఎందుకు చేసిందనే విషయంపై నిందితురాలు స్పష్టమైన కారణం చెప్పడం లేదన్నారు.
హత్యకు ఏ ఆయుదాన్ని వాడిందనే సమాచారం కూడా తెలియాల్సి ఉందన్నారు.
పోలీసుల తెలిపిన సమాచారం ప్రకారం నిందితురాలి భర్త కేరళకు చెందినవారు. ఈయన ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. విషయాన్ని ఆయనకు తెలియజేసి తమ ముందు హాజరు కావాల్సిందిగా చెప్పామని పోలీసులు తెలిపారు.
కృత్రిమ మేథలో నిపుణురాలు
సుచనాసేథ్ పశ్చిమబెంగాల్‌కు చెందిన మహిళ. ఈమె కొద్దికాలంగా బెంగళూరులో స్థిరపడినట్టు గోవా పోలీసు సూపరింటెండెంట్ నిథిన్ వల్సన్ చెప్పారు.
ఆమెకు సొంతంగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఉంది. ఆమెకు లింక్‌డిన్ ఎకౌంట్‌తోపాటు, ఎక్స్ ఖాతా కూడా ఉంది. ఆమె లింక్‌డిన్ ఖాతాలో వృత్తిపరమైన విషయాలు ఉన్నాయి.
ఈమె ఏఐ ఎథిక్స్ లిస్ట్ ఆఫ్ 100 బ్రిలియంట్ ఉమెన్ జాబితాలోనూ ఉన్నారు.
ఈమె కోల్‌కతా యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ ఫిజిక్స్ డిగ్రీ చదివారు. అలాగే భవానీపుర్‌లో బిఎస్సీ డిగ్రీ చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన బెర్క్‌మాన్ క్లెన్ సెంటర్‌లో ఫెలోగానూ, రామన్ రీసెర్చ్ యూనివర్సిటీలో పరిశోధకురాలిగా, డేటా అండ్ సైన్స్‌లో మోజిల్లా ఫెలోగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్: ‘మహిళను గర్భవతిని చేస్తే రూ.5 లక్ష లు ఇస్తాం’ అంటూ సాగే ఈ స్కామ్‌లో బాధితులు ఎలా చిక్కుకుంటున్నారంటే...
- బిల్కిస్ బానో న్యాయ పోరాటానికి అండగా నిలిచిన ముగ్గురు మహిళలు
- ‘మా ఆయనకు తీరిక లేదు, నేను వేరే మగాళ్లతో చాట్ చేస్తాను!'
- లక్షద్వీప్: మోదీ చెప్పిన ఈ దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలి, ఎంత ఖర్చవుతుంది? అక్కడ ఏమేం చేయొచ్చు?
- కుక్క మాంసాన్ని నిషేధించిన దక్షిణ కొరియా... ఎందుకీ నిర్ణయం?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















